Did Lakshman kill his son-in-law? #ramayana | లక్ష్మణుడు తన అల్లుడిని చంపాడా?


లక్ష్మణుడు తన అల్లుడిని చంపాడా?
‘సమాధి కళ’ను పొందిన ఇంద్రజిత్తు మరణ రహస్యం ఏంటి?

రామాయణం ప్రకారం, రావణ మండోదరిలకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు, మేఘనాథుడు. మేఘనాథుడు, శైవ యాగం చేసి శివుని మెప్పించి, ‘సమాధి కళ’ను పొందాడు. దీని వల్ల అతడు అందరిలో ఉన్నా, ఎవరికీ కనిపించడు. అతనికి మాత్రం, అందరూ కనిపిస్తారు. అమోఘమైన శక్తులను పొందిన మేఘనాధుడు, ఇంద్రజిత్తుగా ఎలా మారాడు? లక్ష్మణుడి చేతిలో ఎలా వధింపబడ్డాడు? ఇంద్రజిత్తుకు తన మరణం గురించి ముందే తెలుసా? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_xD_6-POHho ]


మేఘనాధుడు ఇంద్రుణ్ణి జయించడం వల్ల, ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. రావణుడు ఒకనాడు దేవలోకంపై దండెత్తాడు. రాక్షస సేన దేవలోకాన్ని చుట్టుముట్టింది. ఇంద్రుడు రావణుడితో తలపడ్డాడు. మేఘనాథుడు, శివుడు తనకు వరంగా ఇచ్చిన మాయా రూపంలో, ఇంద్రుని కుమారుడు జయంతుని, అస్త్రాలతో ముంచెత్తగా, అతడు పడిపోయాడు. ఇంద్రుడి తండ్రి పులోముడు, జయంతుడిని తీసుకుని వెళ్ళి, సముద్రంలో దాచాడు. ఈ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన ఇంద్రుడు, వజ్రాయుధంతో రావణుని దెబ్బతీశాడు. దాంతో రావణుడు క్రింద పడగా, ఇంద్రజిత్తు మాయా రూపంలో ఇంద్రుని రథమెక్కి, అతన్ని ఓడించి, బంధించాడు. అప్పుడు రావణుడు కుమారునితో కలసి, ఇంద్రుని లంకానగరానికి బందీగా తీసుకువెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్న దేవతలందరూ, బ్రహ్మను శరణు కోరారు.

అప్పుడు బ్రహ్మ లంకకు చేరి, "రావణా! నీ కొడుకు తండ్రిని మించిన తనయుడని ప్రశస్తి పొందాడు. అతని శౌర్య పరాక్రమములు నిరుపమానములు. నీ కుమారుడి వలన దిక్పాలకులను జయించాలనే నీ మనోరధం, సఫలమయ్యింది. అసమాన ధైర్య సాహసాలతో, యుద్ధనైపుణ్యాన్ని ప్రదర్శించి, సర్గలోకాధిపతి ఇంద్రుని జయించి, బంధించాడు. నేటి నుండి మేఘనాథుడు, "ఇంద్రజిత్‌" అను పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. ఇంద్రుని బంధ విముక్తుణ్ణి చేయి. అందుకు ప్రతిఫలం ఏంకావాలో కోరుకో” అన్నాడు బ్రహ్మ. అందుకు ఇంద్రజిత్తు అమరత్వాన్ని కోరుకోగా, భూ మండలంలో ఏ ప్రాణికీ అమరత్వం లేదని, బ్రహ్మ తిరస్కరించాడు. అప్పుడు ఇంద్రజిత్తు మళ్ళీ ఈ విధంగా కోరుకున్నాడు. "బ్రహ్మ దేవా, యుద్ధానికి సిద్ధమవడానికి ముందే, నేను మంత్ర యుక్తంగా హవిస్సును అర్పించి, అగ్నిని సంతృప్తుడిని చేస్తాను. అగ్ని కుండం నుండి ఒక దివ్య రథం ఆవిర్భవించాలి. ఆ రథంలో నిలచి యుద్ధం చేస్తున్నంత వరకు, నేను అవధ్యుని అయ్యేటట్లు వరాన్ని ప్రసాదించు. నా పూజ పూర్తికాక మునుపే నేను యుద్దానికి సిద్దమయితే, నాకు మరణం ప్రాప్తించవచ్చు" అని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మ సమ్మతించి, ఇంద్రజిత్తు కోరిన వరాన్ని ప్రసాదించాడు. మేఘనాథుడు ఇంద్రుని బంధ విముక్తుడిని కావించి, ఇంద్రజిత్తుగా స్థిరపడ్డాడు.

ఇంద్రజిత్తు, రామ రావణుల మధ్య జరిగిన మహాయుద్ధంలో, వీరోచిత పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధంలో, రామలక్ష్మణులను నాగపాశంతో బంధించాడు. అయితే, గరుడుడు వారిని నాగాపాశంనుండి విడిపించాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు 'శక్తి' అస్త్రాన్ని ప్రయోగించగా, లక్ష్మణుడు మూర్ఛబోయాడు. లక్ష్మణుడు మరణించాడనుకుని, రావణ సైన్యం విజయం తమదేనని ఆనందించింది. యుద్ధ సమయం ముగుస్తుండగా, ఇంద్రజిత్తు విజయ గర్వంతో రాజ్యానికి వెళ్ళిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మణుడు, సంజీవని సహాయంతో కళ్ళు తెరచాడు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు, యజ్ఞము చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞమహిమ వలన, అతడిని యుద్ధంలో ఓడించటం ఎవరివల్లా సాధ్యం అయ్యేది కాదు. ఆ యజ్ఞాన్ని భంగ పరచి ఇంద్రజిత్తును చంపితేనే, రావణ యుద్ధం ముగుస్తుందని భావించాడు లక్ష్మణుడు.

విభీషణుడి సహయంతో లక్ష్మణుడు, ఇంద్రజిత్తు హోమం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి, ఇంద్రజిత్తు హోమం చెయ్యడం కోసం సిద్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు. అప్పుడు విభీషణుడు, "లక్ష్మణా! నువ్వు ఒక పక్క నుండి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి. అప్పుడు ఇంద్రజిత్తు కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి, రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే, వాడు ఇక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి, రథం ఎక్కుతాడు. అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి" అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది. వారు పక్కకు తప్పుకోగానే, ఇంద్రజిత్తు కూర్చుని ఉన్న మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరివీరభయంకరుడై, రాక్షసుల పని పట్టాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షన సైన్యం నిలబడలేక, పెద్దగా హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్తు హోమాన్ని ఆపి, "ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను" అని ఆగ్రహావేశాలతో రథాన్ని అధిరోహించాడు.

ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని, ఇంద్రజిత్తు ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా, లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. దాంతో ఇంద్రజిత్తు లక్ష్మణుడి వైపు చూశాడు. అప్పుడు లక్ష్మణుడు, "మాయావీ, హనుమతో యుద్ధం ఎందుకు? నీతో యుద్ధం చేయడానికే నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి" అని అన్నాడు. "ఇంతకు ముందు నిన్ను పడగొట్టాను. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు. చూడు నీకు ఎటువంటి గతి పట్టిస్తానో" అంటూ ఇంద్రజిత్తు తొడలు చరిచాడు. వాళ్ళిద్దరి మధ్యా భీకర యుద్ధం మొదలయ్యింది. ఇద్దరూ ఒకరినొకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకు ఇంద్రజిత్తు ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్తు బాణాలతో, లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు.

విభీషణుడు రాక్షసుల మీద బాణాలు వేసి, వాళ్ళను సంహరించాడు. ఇంద్రజిత్తుకీ, లక్ష్మణుడికీ, 3 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఆఖరికి ఇంద్రజిత్తు రథ సారధిని లక్ష్మణుడు పడగొట్టాడు. అప్పుడు ఇంద్రజిత్తు ఒక చేతితో సారధ్యం చేస్తూ, లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలను క్రిందికి లాగి, రథాన్ని కూలద్రోశారు. అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి వింటినారికి తొడిగి, "మా అన్న రాముడే గనుక ధర్మాత్ముడూ, సత్యసంధుడూ, దశరథ తనయుడూ, పౌరుషంగల వాడయితే, నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది ఇంద్రజిత్తు నిగ్రహింపబడుగాక" అని బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్తు కంఠానికి తగలగానే, అతడి శిరస్సు శరీరం నుండి వెరై క్రింద పడిపోయింది. అంతటితో ఇంద్రజిత్తు మరణించాడు.

అయితే, ఇంద్రజిత్తుకు తన మరణం లక్ష్మణుడి చేతనే అని ముందుగానే తెలుసు. అసురుడైన మేఘనాధుడు, గతంలో ఓ రుషిని పీడిస్తూ, ఆయన నుండి ఓ శాపాన్ని పొందాడు. అ శాప ప్రభావంగా ఇంద్రజిత్తు, పాముల వల్ల గానీ, పాముల ప్రభువు వల్ల గానీ మరణిస్తాడు. తన అద్భుత పరాక్రమం వల్ల, పాములు తనను చంపలేవని విశ్వసించిన మేఘనాథుడు, రాక్షస గురువు సలహాను కోరాడు. శేషనాగు అంశ ఈ భూలోకంలో లక్ష్మణుడిగా అవతరిస్తుందనీ, అతనే నిన్ను హతమార్చే ప్రమాదముందనీ, గురువు సూచన ప్రాయంగా చెప్పాడు. దీనిని తప్పించుకోవటానికి మేఘనాథుడు, సర్పలోక రాజు ఆదిశేషువుకు తెలియకుండా, అతడి కూతురు సులోచనను పెళ్లి చేసుకున్నాడు.

లక్ష్మణుడు సాక్షాత్తూ ఆదిశేషువు అవతారం కావడం వలన, కూతురిని పెళ్లి చేసుకున్న కారణంగా అల్లుడిని చంపబోడని అపోహపడ్డాడు. ఆ భావనతోనే మేఘనాథుడు, రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడికి ప్రాణాపాయం లేకుండా ఉండేలా, అస్త్రాన్ని తక్కువ మోతాదులో ప్రయోగించాడని అంటారు. శక్తివంతమైన అస్త్రంతో మరణించవలసిన లక్ష్మణుడు కేవలం మూర్చపోయి, తిరిగి సంజీవని ప్రభావంతో లేచి, ఇంద్రజిత్తును అంజలికాస్త్రంతో సంహరించాడు. అరివీరపరాక్రమాలు కలిగిన ఇంద్రజిత్తు, రామ రావణ యుద్ధ ఘట్టంలో ప్రముఖ పాత్రను పోషించాడనటంలో అతిశయోక్తి లేదు.

ఎవరెన్ని మాయోపాయాలు చేసినా, అంతిమంగా చెడుపై మంచి విజయం సాధించడం తధ్యం..

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home