అశ్వత్థ వృక్షం! Significance of Ashvattha (Peepal) Tree

అశ్వత్థ వృక్షం!

మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ!
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!!

అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపమే కాకుండా, సర్వదేవతా స్వరూపం.

ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చు. అమావాస్య  నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలదీ అంటే, 21, 108 ప్రదక్షిణలు చేసి పూజిస్తే, సర్వాభీష్ట సిద్ధి కలుగుతు౦ది. విష్ణు సహస్ర నామం పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు.  మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తు౦ది.

ఉదక కుంభం (నీళ్ళ చెంబు) తీసుకుని గర్భిణీ స్త్రీలా మ౦దగతితో ప్రదక్షిణ చేస్తే, అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తు౦ది.

రావి చెట్టును పూజించటం వలన కలిగే ఫలితములు:

అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వివరించాడు. అశ్వత్ధమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క 'మూలము – బ్రహ్మ', 'మధ్య భాగం – విష్ణువు', 'చివరి భాగము – శివుడు' కనుక, దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కున ఉన్న కొమ్మలలో, ఇంద్రాది దేవతలో, సప్త సముద్రాలో, అన్ని పుణ్య నదులూ ఉంటాయి. దాని వేర్లలో మహర్షులో, గో బ్రాహ్మలో, నాలుగు వేదాలూ ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులూ, ఏకాదశ రుద్రులూ, ద్వాదశాధిపతులూ, దిక్పాలకులూ ఎల్లప్పుడూ ఉంటారు.

అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అది ఇచ్చే పళ్ళలో ‘మ’ కారము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే. అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్ప వృక్షము.

ప్రదక్షణ మరియు పూజించే విధానము:

ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి, దానిని చేతితో తాకి (శనివారం మాత్రమే తాకాలి) ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి..

అశ్వత్ధవృక్ష స్తోత్రం:

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ వృక్షరాజయతే నమః

అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ, చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు, శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణ పక్షంలో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు. ఆది, సోమ, శుక్ర వారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాలలో, నిషిద్ధ సమయాలలో, రాత్రి భోజనము చేసి, ఈ వృక్షాన్ని సేవించరాదు.

మౌనంగా లేదా గురు నామము లేదా విష్ణు సహస్ర నామమును చదువుతూ, నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు, అలాగే చివర, అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.

అశ్వత్ధ వృక్ష పూజా ఫలము..

అశ్వత్ధ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షణాలు చేస్తే, సర్వ పాపాలూ నశించి, నాలుగు పురుషార్ధాలు సిద్ధిస్తాయి.

బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే, తప్పక కలుగుతారు.

శనివారం నాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి, మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే, మృత్యు భయం పోతుంది. అలాగే, శనివారం నాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి, ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించడం వలన, శనిదోషం తొలగిపోతుంది.

అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం..

కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః
శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిలా దేవ సంస్తుతః

గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున, అశ్వత్ధ వృక్షం క్రింద వేద విప్రునికి భోజనము పెడితే, కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.

గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున, అశ్వత్ధ వృక్షనీడలో స్నానమాచరించిన, మహా పాపములు తొలగుతాయి.

అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రీ మంత్ర జపం, నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే, నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది.

లోకా సమస్తా సుఖినో భవంతు!

ఇంకా ఎన్నో మంచి విషయాలకోసం: https://www.youtube.com/@mplanetleaf/videos

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home