శంభలలో ఉన్న దివ్య మణి! A Truly Powerful Gem - The Chintamani Stone


శంభలలో ఉన్న ఆ దివ్య మణి రహస్యం మీకు తెలుసా?
దుర్బుద్ధితో ఆ మణిని చేజిక్కించుకోవాలనుకున్న వారు ఏమైపోయారు?

శంభల.. ఆ పేరు తలచుకుంటేనే, ఏదో తెలియని పులకింత కలుగుతుంది. బాహ్య ప్రపంచానికి తెలియని మహా నగరమది. ఎందుకంటే, అది అన్ని ఇతర ప్రాంతాల తీరులో, సాధారణమైన నగరం కాదు. అక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. దేవతలు సంచారం చేసే దైవభూమి అది. ఆ ప్రాంతాన్ని చేరుకోవాలంటే, శారీరక, మానసిక ధైర్యంతో పాటు, యోగం కూడా ఉండాలని, హిందూ, బౌద్ధ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. బౌద్ధులు ఆ ప్రదేశాన్ని స్తుతిస్తూ, "ఓం శ్రీ మణిపద్మేహుం" అని స్మరిస్తారు. మహిమాన్విత వ్యక్తులు జీవించే, మహోన్నతులకు మాత్రమే కనిపించే ఆ అత్యద్భుత ప్రదేశంలో దాగి ఉన్న రహస్యాలేంటి? ఆ నిగూఢ నగరం ఎలా ఉంటుంది? శంభల నగరానికి వెళ్ళి, సజీవంగా తిరిగివచ్చిన వారెవరైనా ఉన్నారా - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QMlIeuhRDak ]


"స్వరవ్యయం స్వర్గ నాక త్రిదివత్రి దశాలయః
సురలోకో ద్యోదివౌద్వే త్రివిష్టపం"

శంభల నగరానికి మరోపేరు త్రివిష్టపం. మన పురాణాలలో దీనిని స్వర్గంగా పేర్కోన్నారు. సత్యం, అహింస, ధర్మం పాటించే పుణ్యమూర్తులకు మాత్రమే, అందులోకి ప్రవేశం ఉంటుంది. యోగ సాధన ద్వారా సుషుమ్న నాడిని వశపరుచుకున్న సాధకులు మాత్రమే, అందులోకి ప్రవేశించగలరు. పూర్వ పుణ్య ఫలము, భగవంతునికి అర్పించిన మనస్సు, అకుంఠిత తపః ఫలము, మరియూ సడలని పట్టుదల కలిగిన వారికి తప్ప, సామాన్యులకు ‘శంభల’ దర్శనము అలభ్యము. సాక్షాత్తు పరమ శివుడు కొలువుండే కైలాసము, మానస సరోవరము, శంభల, కలాప, ఇవన్నీ ఒకదానికొకటి సమీపంగానే ఉంటాయి. హిమాలయ పర్వత శ్రేణులలోని కైలాస పర్వతం, మానస సరోవరం పరిసర ప్రాంతాలలో, ఆ అద్భుత రహస్య నగరం ఉంది. మన పురాణాల ప్రకారం, శంభల ప్రాంతమంతా, అద్భుతమైన ప్రాకృతిక సంపద పరచుకుని ఉంటుంది. అక్కడి వృక్షాలు నిరంతరం, సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అక్కడి ప్రజల ఆయువు, సాధారణ ప్రజల ఆయువు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ నగరం వయస్సు, 60 లక్షల సంవత్సరాలకు పైబడి ఉంటుందని, అంచనా. అక్కడి ప్రజల పొడవు, సగటున 12 అడుగులుంటుందని చెప్పబడింది. యోగ సాధన ద్వారా శంభలలో ఉండే ప్రజలు, లోకంలో ఎక్కడున్న వారితో అయినా సంభాషించే సామర్థ్యం కలిగి ఉంటారు.

శంభల ప్రాంతంలో మార్కండేయుడు, వశిష్ఠుడు, జాబాలి, జమదగ్ని, అగస్త్యాది మహర్షులు తపములాచరించారని, మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే మహావతార్ బాబాజీ, దేవరహా బాబా, ఇంకా చాలా మంది సిద్ధులూ, జ్ఞానులు కూడా, శంభల ప్రాంతాలలో తపమాచరించినట్లు చెబుతారు. ప్రపంచంలో ఎక్కడ జరిగే అభివృద్ధి అయినా, విధ్వంసమైనా, అక్కడి వారికి క్షణాలలో తెలిసిపోతుంది. లోకంలో అధర్మం పెచ్చుమీరి, కలి ప్రభావం కట్టడి చెయ్యలేనంతగా పెరిగినప్పుడు, శంభలలో ఉండే పుణ్యపురుషులూ, యోగులూ, లోక పరిపాలనను తమ చేతులలోకి తీసుకుంటారని, కొన్ని గ్రంధాల ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు కల్కిగా, శంభలలోనే జన్మించబోతున్నాడనే సంగతి, మనలో చాలామందికి తెలిసిన విషయమే. రాబోయే కాలంలో శ్రీ హారి జన్మించబోయే శంభల ప్రాంత నిర్మాణం, అత్యద్భుతంగా ఉంటుంది. హిందూ, బౌద్ధ పురాణాలలో, ఆ నగర నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయి.

ఆ వివరాల ప్రకారం, శంభల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో, పర్వతాలు గొలుసుకట్టుగా ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్ర ఆకృతిలో ఉన్న భవనం మధ్యలో, భూగ్రహాన్ని పోలిన నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్ళేందుకు సొరంగ మార్గాలు ఉంటాయి. అంతేకాదు, అందులో ఉన్న మరో ఆశ్చర్యం ఏమిటంటే, సృష్టి ఆరంభం నుంచీ, మహర్షులు రాసిన గ్రంథాలన్నీ అక్కడ భద్రపరచబడి ఉన్నాయట. మొత్తం 18 సంపుటాలుగా వీటిని విభజించి ఉంచినట్లు చెబుతారు. బౌద్ధ సన్యాసులు కూడా ఆ నగరాన్ని పవిత్ర ప్రదేశంగా చెబుతారు. వారి సంప్రదాయం ప్రకారం, శంభలలో ఉండే చింతామణి కి సంబంధించిన మంత్రాన్ని ఉపాసన చేస్తారు. మన భారతీయ గ్రంధాల ప్రకారం కూడా, చింతామణికి చాలా ప్రాశస్త్యం ఉంది.

కోటి సూర్య ప్రభా సమానమైన ఆకుపచ్చని రంగులో ఉన్న "చింతామణి" అన్న మహామణి గురించి, లలితా సహస్రనామంలో, ‘చింతామణి గృహాంతఃస్థా’ అంటే, చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉండేది, అని వివరించబడింది. కోటి సూర్యుల కాంతితో వెలిగే ఆ దివ్యమైన చింతామణి, శంభలలో ఉంది. పాదరసం గడ్డకట్టినట్లు, పనసకాయంత పరిమాణంలో, ఆ మణి ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఆ మణికి, అర్ధచంద్రాకారంలో ముఖం ఉంటుంది. పెదవులు తెరచినట్లుండే ఒక ద్వారం ఉంటుంది. సిద్ధులైన యోగులూ, యుగయుగాలుగా జీవిస్తున్న సప్త చిరంజీవులూ, నిత్యం ఆ మణికి పూజలు చేస్తుంటారని ప్రతీతి. ఆ మణి కోరిన వరాలను ఇస్తుందంటారు. శంభలలో ఉండే వారు, ఆ మణి ఆధారంగానే వారి కోరికలను తీర్చుకుంటూ జీవిస్తుంటారని అంటారు.

కొంతమంది దుర్బుద్ధి కలిగిన వారు, ఆ మణిని చేజిక్కించుకోవాలని ఆశపడి, అగాధంలో కలిసిపోయారు. ఎంతో పవిత్రమైన ఆ మణిని, కల్కి అవతారంలో వచ్చిన శ్రీహరి ధరిస్తాడని, పురాణాల ద్వారా అవగతమవుతోంది. అంతటి మహిమాన్వితమైన, పవిత్రమైన ఆ నగరాన్ని చూడాలంటే, ఆషామాషీ విషయం కాదు. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంభల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని, పురాణాలలో పేర్కొనబడి ఉంది. వాటిలో ప్రస్తావించబడినట్లే, కొందరు సాధారణ వ్యక్తులు శంభల నగర ప్రజలను చూసి రావడం గమనార్హం. వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. శంభల ప్రాంతంలో ఉండే కాల ప్రమాణాలు, సాధారణ కాల ప్రమాణానికి భిన్నంగా ఉంటాయి. ఆ నగరాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ప్రయత్నించిన ఓ బృందానికి, విచిత్రమైన అనుభవం ఎదురైంది.

ఆ ప్రాంతంలో 12 గంటలు గడిపితే, బయటి ప్రపంచంలో రెండు వారాలు గడిపితే పెరిగినంత ప్రమాణంలో, గోళ్ళు, వెంట్రుకలు పెరిగాయట. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆ బృంద సభ్యులకు ఆకస్మాత్తుగా వయస్సు పెరగటం ప్రారంభమైంది. రోజుల వ్యవధిలోనే దశాబ్దాల వయస్సు పెరగటంతో, వారు భయపడి వెనక్కు తిరిగి వచ్చేశారు. వారు వెనక్కు వచ్చిన తర్వాత, కొన్ని రోజులలో, 100 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వచ్చే వ్యాధులకు గురై, వారంతా మరణించారు. 1889లో జన్మించిన ఆనందమయి, హిమాలయాలలో, సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తు గల మనుషులను చూశానని చెప్పడం, గమనార్హం. వారంతా 5 వేల ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు.

రష్యాకు చెందిన హెలీనా, హిమాలయలలోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా, శంభలకు చేరుకున్నది. ఆనందమయి చెప్పినట్లే, ఆమె కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం, గమనార్హం. వారితో ఉన్న కొన్ని ఫొటోలను కూడా ఆమె రాసిన పుస్తకంలో ప్రచురించింది. తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా, శంభల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. శంభల నగరాన్ని చూసిన వ్యక్తులలో మరొకరు, వడ్డిపర్తి పద్మాకర్ గారు. 1980లలో, ఆయన హిమాలయాలలోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు, విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందనీ, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో, సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తనను పట్టుకుని, జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడనీ, ఆయన స్వీయ అనుభవాలలో తెలియజేశారు.

ఫ్రాన్స్‌కు చెందిన చారిత్రక పరిశోధకురాలూ, రచయిత్రి, అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, శంభలకు సంబంధించి కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తన 56 ఏళ్ల వయసులో, ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి, లామాలను కలుసుకున్నారు. వారి ద్వారా శంభల వెళ్లి, అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లే, ఆమె 101 ఏళ్లు బతికారని చెబుతారు. అయితే, ఇప్పటివరకు శంభలను చూడడానికి వెళ్ళిన వ్యక్తులు, కేవలం శంభల నగరంలోని మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం, ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాలేదు. హిమాలయ పర్వత పంక్తుల మధ్య నిక్షిప్తమైన ఆ రహస్య నగరాన్ని చేరుకోవాలంటే, ముందుగా కైలాస పర్వతాన్ని దాటాలని అంటారు. సామాన్య చర్మ చక్షువులకు కనిపించని రీతిగా దానిని ఒక మాయావరణం ఆవరించి ఉంటుందని, సిద్ధ పురుషులూ, జ్ఞానులూ చెబుతారు. అటువంటి శంభలను చేరుకోవాలంటే, భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించి, కైలాస పర్వతాన్ని చేరుకున్న వారు మాత్రమే అక్కడి వరకూ చేరుకోగలరని, భారతీయ, బౌద్ధ గ్రంధాలతో పాటు, ఎన్నో విదేశీ రచనలలో సైతం పేర్కొనబడి ఉంది.

ధర్మో రక్షతి రక్షితః!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home