Weird Marriages in Hinduism | సనాతనధర్మంలో ‘వింత పెళ్ళిళ్ళు’!
సనాతనధర్మంలో ‘వింత పెళ్ళిళ్ళు’!
ఈ విచిత్ర వివాహ గాధలలో మీకు తెలిసినవి ఎన్ని?
వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జీలు ఉండాలంటారు. అందుకే, పెళ్ళి నిశ్చయించుకునే ముందు అటు ఏడు, ఇటు ఏడు తరాలు చూస్తారు. వధూవరులు ఇద్దరూ దాదాపుగా ఒకే రకమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వాతావరణంలో పెరిగినవారైతే.. ఇబ్బందులు తలెత్తవన్నది ఇక్కడి నమ్మకం. ఇదో సహజీవన కొలమానం! ఆ లెక్క తప్పితే, కలహాల కాపురమే అవుతుంది. ఆ తీవ్ర పరిణామాలను కళ్లకు కట్టేదే కుండలకేశి గాధ..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/zhGGu7MpdtE ]
కుండలకేశి!
ఓ ధనిక వ్యాపారి కూతురు, కుండలకేశి. ఒక నేరస్తుణ్ని ఉరిశిక్ష వేయడానికి తీసుకువెళ్తుంటే చూసింది. అతనితో ప్రేమలో పడింది. అతణ్ని తప్ప వేరెవ్వరినీ పెళ్ళి చేసుకోనని మొండికేసింది. చివరికి తన మాటే నెగ్గించుకుంది. అయితే, కొన్నేళ్ళు గడిచిన తర్వాత, కుండలకేశి దాంపత్య జీవితంలో, ప్రేమ తగ్గిపోయింది. కలహాలు మొదలయ్యాయి. తగవులు నిత్యకృత్యంగా మారిపోయాయి. భర్త నేరమయ జీవితాన్ని, కుండలకేశి ఎత్తిపొడిచేది. దాంతో ఆవేశానికి గురైన భర్త, ఆమెను చంపబోయాడు. కానీ, విధివశాత్తూ అతనే ఆమె చేతిలో మరణించాడు. దాంతో కుండలకేశి సన్యాసినిగా మారింది. కోరికలే దుఃఖానికి మూలం అన్న బుద్ధుడి బోధనల్లో, సాంత్వన పొందింది.
రురువు - ప్రియంవద!
సావిత్రీ, సత్యవంతుల గాధ, మనలో చాలామందికి తెలిసిందే. యముణ్ని అడ్డుకుని, పతి ప్రాణాలను దక్కించుకున్న స్త్రీమూర్తి, సతీ సావిత్రి. సాధారణంగా ఇలాంటి విషయంలో, మహిళల గాధలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, పురుషులు కూడా భార్యల ప్రాణాల కోసం, యముణ్ని ప్రార్థించిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. అలాంటిదే, మహాభారతంలోని రురువు, ప్రియంవదల గాధ. రురువు అనే రాజు భార్య పేరు ప్రియంవద. ఆమె అతి సౌందర్యవతి. ప్రియంవద చిన్న వయస్సులోనే మరణించింది. తన భార్యను బ్రతికించమని, మృత్యుదేవుడైన యముణ్ని ప్రార్థించాడు రురువు. ప్రియంవదకు తన జీవితంలో సగం కాలాన్ని ఇవ్వగలిగితే, ఆమెను బతికిస్తానన్నాడు, యముడు. రురువు ఒప్పుకోవడంతో, ప్రియంవద తిరిగి బ్రతికింది. అలా తాము మరణించేవరకూ, రురువు, ప్రియంవదలు జీవితాన్ని హాయిగా సాగించారు.
శశిరేఖ – అభిమన్యుడు!
ఉత్తర భారతదేశంలో మేనరికం పెళ్ళిళ్ళు తక్కువ. ఈ సంప్రదాయం, దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉంది. పాండవుల అరణ్యవాసం సమయంలో, వారి పిల్లలు కృష్ణుడి వద్ద ఆశ్రయం పొందారు. వారిలో సుభద్రా, అర్జునుడి సంతానం అభిమన్యుడు కూడా ఉన్నాడు. మేనమామల ఇంట్లో, అభిమన్యుడు పెద్దమామ బలరాముడి కూతురు శశిరేఖతో ప్రేమలో పడ్డాడు. బలరాముడు మాత్రం, తన కూతురిని దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడికి ఇద్దామని అనుకున్నాడు. అయితే, అన్న నిర్ణయాన్ని కాదనలేని కృష్ణుడు, ఓ మాయోపాయం తలపెట్టి, ఘటోత్కచుడిని కామరూప విద్య సహాయంతో శశిరేఖగా మార్చి, వివాహన్ని ఆపాడు. అభిమన్యుడి కోసం శశిరేఖ తన ఇంటిని వదిలి రాగా, వారిరువురూ అరణ్యంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆనాటి కాలంలోనే ప్రేమ వివాహం కోసం, ఎన్నో సమస్యలను ఎదురించి, మాయోపాయాలతో ఒక్కటైన ఈ జంట గాథ, నేటి కాలంలో కూడా శశిరేఖా పరిణయంగా, అద్భుత కావ్యంగా భాసిల్లుతోంది.
రుక్మిణీ కృష్ణుల కల్యాణం!
విదర్భ రాకుమారి రుక్మిణిని, ఛేది పాలకుడు శిశుపాలుడికిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు. రుక్మిణి మనస్సు మాత్రం, కృష్ణుడిపైనే లగ్నమయ్యింది. తన కోరికను వెల్లడించాలని, ఓ పురోహితుణ్ని కృష్ణుడి దగ్గరకు రాయబారం కూడా పంపించింది. బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణీ దేవి మనస్సూ, అంద చందాల గురించి తెలుసుకున్న కృష్ణుడు, శిశుపాలుడితో పెళ్ళి జరిగే సమయానికి వచ్చి, ఆమెను రథంలో ఎక్కించుకుని, ద్వారకకు పయనమయ్యాడు. ఆ సమయంలో తనను అడ్డగించబోయిన రుక్మిణి సోదరుడైన రుక్మినీ, అతని సైన్యాన్నీ ఓడించి, రుక్మిణీ దేవిని తన రాజ్యానికి తీసుకుని వచ్చి, వివాహం చేసుకున్నాడు. అయితే, ధర్మశాస్త్రాలు శ్రేష్ఠమైనవిగా చెప్పిన పద్ధతిలో, రుక్మిణీ కృష్ణుల వివాహం జరగకపోవడం, గమనార్హం. ఇది జరిగిన పద్ధతి, ధర్మశాస్త్రాల్లోని రాక్షస వివాహం. పెళ్ళికుమార్తెను ఎత్తుకెళ్లడం, గాంధర్వ వివాహం, అమ్మాయి, అబ్బాయి పరస్పర ఇష్టంతో జరిగే వివాహాల కోవలోకి వస్తుంది.
ఏకలింగ వివాహాలు!
సోమవంతుడు, సుమేధుడనే వారిద్దరూ స్నేహితులు. సీమంతిని అనే రాణి, పెళ్లయిన జంటలకు ఆవులను దానంగా ఇవ్వడానికి నిశ్చయించుకుంది. దాంతో సోమవంతుడు భార్యగా, సుమేధుడు భర్తగా, రాణి దగ్గర పరిచయం చేసుకున్నారు. ఆవులను ఇస్తూ, సీమంతిని ఆ ఇద్దరినీ భార్యభర్తలుగా వర్ధిల్లమని, ఆశీర్వదించింది. ఆమె వాక్శుద్ధి కారణంగా, సోమవంతుడు నిజంగానే స్త్రీలా, సోమవతిగా మారిపోయాడు. అలా ఒకప్పుడు మిత్రులుగా ఉన్న యువకులు, భార్యాభర్తలుగా మారిపోయారు.
తీజా- బీజాల పెళ్ళి!
పిల్లలు కడుపున పడింది మొదలు, దగ్గరి బంధువుల పిల్లలకు ఇస్తామని అనుకునేవాళ్లు, ఇప్పటికీ తారస పడతారు. కడుపులో ఉన్నప్పుడే, పిల్లలకు పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకునే వాళ్లూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో, ఇద్దరు పిల్లలూ ఆడగానీ, మగగానీ అయితే, ఇబ్బంది తలెత్తుతుంది. అలాంటి సరదా కథే ఈ తీజా - బీజా వివాహం. ఇది రాజస్థాన్ జానపదుల్లో ప్రాచుర్యంలో ఉన్న హస్య కథ. వేర్వేరు ఊళ్లలో ఉండే ఇద్దరు స్నేహితుల భార్యలు గర్భంతో ఉన్నప్పుడు, రెండు జంటలూ ఓ వేడుకలో కలుసుకుంటారు. తమకు పుట్టబోయే సంతానానికి పెళ్ళి చేయాలని అనుకుంటారు. జ్యోతిష్కులూ, దానిని సమర్థిస్తారు. అయితే, ఇద్దరికీ ఆడ శిశువులే జన్మిస్తారు. ఊళ్లు దూరం కావడంతో, ఒకరికి ఆడపిల్ల కాబట్టి మరోజంటకు మగ పిల్లవాడు పుట్టి ఉంటాడని అనుకుంటారు. అలా జన్మించిన ఇద్దరు బాలికలు, తీజా – బీజా, ఒకరికొకరు తమ భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఒకరోజు బీజా అనుకోకుండా మాయా బావిలో పడిపోయింది. అందులో పడితే, ఆడవాళ్లు మగవాళ్లు అవుతారు. అలా బీజా మగవాడిగా మారిపోయింది. దాంతో బీజా తండ్రి, తన కూతురు అబ్బాయిగా మారిందని, తన స్నేహితుడికి వర్తమానం పంపించాడు. అయితే, తనకు అసలు కొడుకులే లేరనీ, ఉన్నది కూతురే అనీ, తీజా తండ్రి బదులిచ్చాడు. ఇన్నిరోజులు అల్లుడి కోసమే ఎదురు చూస్తున్నాననీ, బీజాను వెంటనే పంపించమనీ కబురు పెట్టాడు, తీజా తండ్రి. చివరికి జ్యోతిష్కుల మాటలు నిజమై, తీజా - బీజా ఒక్కటయ్యారు.
ప్రపంచ దేశాలతో పొలిస్తే, మన భారతదేశంలో మాత్రమే, విడాకుల శాతం తక్కువ. అందుకు కారణం, మనం చిన్నప్పటి నుంచీ ఎదో ఒక సందర్భంలో, వివాహ బంధం గొప్పదనాన్ని చూస్తూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి నాగరిక సమాజంలో కూడా భర్తకు భార్య విధేయురాలిగా, భార్యకు భర్త విధేయుడిగా ఉన్నారంటే అందుకు ముఖ్య కారణం, పురాణాలూ, ఇతిహాసాల నుండి మనం ఇనుమడింపజేసుకున్న వివాహ వ్యవస్థ సూత్రాలు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివాహాలలో కూడా, ఏదో ఒక కోణంలో మనువు విభజించిన ఎనిమిది రకాల వివాహాల పొలికలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. వివాహం అంటే, ఒక్క జీవితం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, నూరు సంవత్సరాలు.
వివాహ మహోత్సవ ఆహ్వానం అని అందరికీ పంపుతుంటాము. కానీ, వివాహం ఉత్సవం కాదు. అది మానవుని వికాసానికి ఏర్పరచిన షోడశ సంస్కారాలలో ప్రధాన మైనదని, మనకు తెలియదు. సాన పెట్టటం వలన వజ్రం ప్రకాశించి నట్లు, సంస్కారాల వల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. జీవితం సార్థకం, సుఖవంతం, ఆనందమయం అవుతుంది. వివాహం లోని మంత్రాల అర్థం, పరమార్థం తెలియక, ఒక్కోసారి ఏదో విధంగా త్వరగా పూర్తి చేయండని, పురోహితుని తొందర పెడుతూ ఉంటాం. దాని వల్ల మనమే నష్ట పోతామని గ్రహించము. ఫోటోలు, వీడియోలు, విందులకు ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యమైన సంస్కారాన్ని విడిచిపెడుతున్నాము. తరువాత ఫలితం బాగోలేదని, బాధపదుతుంటాము.
పరస్పర తపస్సంప త్ఫలాయిత పరస్పరౌ |
ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయావతీ స్తుమః ||
పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. వారి దాంపత్యము, తపస్సంపద యొక్క ఫలితము. ప్రపంచానికి తల్లితండ్రులైన ఆ ఆది దంపతులకు నమస్కారములు.
Comments
Post a Comment