శ్రీ కృష్ణుడు – హిజ్రాలు! Why did Lord Krishna become a woman for one night?
శ్రీ కృష్ణుడు – హిజ్రాలు!
శ్రీ కృష్ణుడి గురించి చాలామందికి తెలియని వాస్తవాలు!
శ్రీ కృష్ణ భగవానుడు చేసిన మాయలూ, లీలలూ అనంతం. వాటిలో కొన్ని మనకు తెలుసు. రాక్షసులను సంహరించడం, అష్ట భార్యలను వివాహం చేసుకోవడం, గోపికలతో బృందావన రాస లీలలూ, వీటన్నింటి గురించీ మన హిందువులకు తెలుసు. కృష్ణుడి గురించిన సంఘటనలు చెప్పుకుంటూ పోతే, కోకొల్లలు. వాటిలో కొన్ని... అనునిత్యం కృష్ణ నామ స్మరణలోనే ఉండీ, ఆయన అనుగ్రహానికి ఆ భక్తుడు ఎందుకు నోచుకోలేదు? శ్రీ కృష్ణుడి తలనొప్పిని, గోపికలు ఎలా తగ్గించగలిగారు? శ్రీ కృష్ణుడు స్త్రీగా మారి ఎవరిని వివాహం చేసుకున్నాడు? శ్రీ కృష్ణుడికీ, హిజ్రాల వివాహానికీ, ఒక్క రోజులో వైధవ్యానికీ సంబంధం ఏమిటి - వంటి ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ukbzIKYaO1Y ]
ఒక రోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. ఎంతో సంతోషంతో, సత్యభామ ఆయనకు వడ్డిస్తోంది. అయితే, భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి, చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరుగెత్తాడు. సత్యభామ నిర్ఘాంతపోయింది. ఆదేమిటని అడుగగా అందుకు కృష్ణుడు, తాను వెంటనే వెళ్లాలంటూ ముఖ ద్వారం వైపు కదిలాడు. కానీ ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు. అప్పుడు సత్యభామ ఏం జరిగిందని అడుగగా కృష్ణుడు, ‘నా భక్తుడొకడు అడవిలో కూర్చుని ఉన్నాడు. అతని జీవనంలో ప్రతి శ్వాసా, "కృష్ణ, కృష్ణ" గా మారిపోయింది. అతనివైపు ఆకలిగొన్న ఒక పులి రావడం చూసి, పరుగెత్తాను. అతడు పులి మీదకు విసరడానికి ఒక రాయిని తీసుకోవడం చూసి, తిరిగి వచ్చేశాను’ అని బదులిచ్చాడు. దీనిని బట్టి మనం తెలుసుకోవలసింది, శ్రద్ధ, భక్తి, నమ్మకం కొరవడిన చోట, దైవం ఉండదు.
ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు, సంగీతం, నాట్యం, బాణాసంచాలతో, పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు చేశారు. చాలామంది జనం వచ్చారు. కానీ, కృష్ణుడు మాత్రం, సంబరాలలో పాల్గొనడానికి ఇష్టపడక, ఇంట్లోనే ఉండిపోయాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా, నలుగురితో చేరడానికి, కృష్ణుడు ముందుంటాడు. కానీ, ఆ రోజు మాత్రం, ఎందుకో ఆయన ఇష్టపడలేదు. రుక్మిణి ఎందుకని అడుగగా, తనకు తల నొప్పిగా ఉందని అన్నాడు కృష్ణుడు. ఆ జగన్నాటక సూత్రధారికి నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు కానీ, ఆయన నటించడంలో కూడా సమర్ధుడు. వైద్యులను పిలిపించమన్నది రుక్మిణి. వైద్యులు వచ్చి, కృష్ణుడికి ఆ మందు, ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. అవన్నీ తనకు పనిచేయవని అన్నాడు కృష్ణుడు. ఏం చేయాలో పాలుపోక, అయోమయంలో పడిపోయారు చుట్టూ ఉన్నవారు. ఆసరికి చాలా మంది జనం వచ్చిచేరారు. సత్యభామ, నారదుడూ వచ్చారు. కృష్ణుడి తలనొప్పికి ఏం చేయాలో తోచక, తర్జన భర్జన పడ్డారు.
"నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళెవరైనా, మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళిని తీసి, నా తలమీద రుద్దండి. నొప్పి తగ్గిపోతుంది" అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ, "ఏమిటా అర్థం లేని మాటలు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టటం మాత్రం చేయలేను. అలాంటివి చేయ తగని పనులు" అని అన్నది. ఇక రుక్మిణి కూడా "ఆ పని ఎలా చేయగలం? అది మహా పాపం.. అటువంటి పని నేను చేయలేను" అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా "నేను కూడా ఇలాంటి పని చేయ దలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తూ భగవంతుడివి. దీనిలో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగివున్న కుట్ర ఏంటో అస్సలు తెలియదు. నా పాదాల దగ్గర మట్టి తీసి నీ తల మీద పెడితే, నేను నరకంలో పడి, మాడి మసైపోతాను" అని నారదుడు వెనుదిరిగాడు. ఈ విషయం, అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. "మేము అలాంటి పని చేయలేము. ఆయనంటే ప్రేమే గానీ, అలాంటి పని చేసి నరకానికి పోలేము" అని వాపోయారు.
ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురుచూస్తోంది. కానీ, ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చుండిపోయాడు. ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది. రాధ తన పవిటచెంగు తీసి, నేల మీద పరచింది. గోపికలందరూ దానిమీద తీవ్రంగా నృత్యం చేశారు. తరువాత వాళ్లు దానిని తీసి నారదుడికి ఇచ్చి, "దీనిని తీసుకెళ్లి, కృష్ణుడి తలచుట్టూ కట్టండి" అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి, కృష్ణుడి తలచుట్టూ కట్టగానే, ఆయన తలనొప్పి మటుమాయమైంది! కృష్ణుడు ఎప్పుడూ, తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తాడో స్పష్టం చేసేవాడు. రాజులతో పాటు తిరిగినా, రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా, ఆయన అవి తృణప్రాయంగా భావించేవాడు. కానీ, భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం, ఆయనకు ఎంతో ప్రియమైనది.
ఇక మరో విశేషం, కృష్ణుడి వివాహం కారణంగా, హిజ్రాలు ఒక పండుగను నేటికీ ఆచరిస్తారు. సభ్యసమాజంలో నిరాదరణకు గురయ్యే హిజ్రాలు, ఏడాది పొడవునా ఎదురుచూసే ఆ పండుగ చాలా ప్రత్యేకం. తాము జీవితంలో పొందలేని వేడుకైన పెళ్లి, తాళి కోసం, సంవత్సరమంతా ఆతృతగా ఎదురుచూస్తారు. ఆ పండుగ తెచ్చే సంబరమే, కూతాండవర్ ఆలయ ఉత్సవం. తమిళనాడులోని విల్లుపురం జిల్లా, 'కూవాగం'లో ఉన్న'కూతాండవర్', హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏటా చైత్రమాసంలో వచ్చే ఈ ఉత్సవంలో, వారు ఆ దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలా వాళ్లు పెళ్లిచేసుకున్న మర్నాడే, కూతాండవర్ మరణిస్తాడు. వారంతా రోదిస్తూ గాజులు పగులగొట్టుకుని, పూవులు తీసివేసి, అక్కడి కొలనులో స్నానాలుచేసి, వైధవ్యానికి చిహ్నమైన తెల్లచీరలను ధరిస్తారు. అయితే, హిజ్రాల కథనం ప్రకారం, కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే, ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలి. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తించిన శ్రీకృష్ణుడు, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక, ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాడు. అప్పుడు అర్జునుడికీ, నాగకన్య ఉలూచికీ జన్మించిన ఇరావంతుడిని, ఆ మహత్కార్యానికి ఎంచుకున్నాడు, శ్రీకృష్ణుడు.
అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి, బలిదానానికి ఒప్పించాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెట్టాడు, ఇరావంతుడు. ఒక్క రోజులో వైధవ్యాన్ని పొందడానికి ఎవరూ ఇష్టపడరు గనుక, కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడు. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే, తమ దైవమనీ భావిస్తారు హిజ్రాలు. ఇంచుమించు 5 వెల ఏళ్ల నాడు జరిగిన ఇరావంతుడూ, మోహినిల పరిణయానికి సూచికగా.. నేటికీ ప్రతి ఏటా హిజ్రాలు, తమ ఇష్టదైవమైన ఇరావంతుడిని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే, కూతాండవర్ ఆలయ ఉత్సవం. ఈ ఉత్సవంలో అతిముఖ్యమైన ఘట్టం, కల్యాణోత్సవం. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని, నవవధువుల్లా ముస్తాబవుతారు హిజ్రాలు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి, పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు.
ఆలయ నియమానుసారం, మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చు. అందుకే సమీప గ్రామాలలోని చాలామంది పురుషులు, ఆ వేడుకలో పాలుపంచుకుంటారు. వింత ఆసక్తికొద్దీ, ఆడవేషం ధరించాలనుకునే మగవాళ్లూ, అందులో భారీగా పాల్గొంటారు. దేశం నలుమూలలనుంచీ వేల సంఖ్యలో అక్కడకు చేరిన హిజ్రాలు, చేతికి గాజులూ, మెడలో మల్లెపూలూ ధరించి వెళ్లి, తాళి కట్టించుకుంటారు. తాళి బొట్లు ధరించిన హిజ్రాలు, రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు. చెక్కతో చేసిన ఇరావంతుని విగ్రహాన్ని వూరంతా ఊరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచికగా, తెల్లవారు జామున విగ్రహం తలను తీసివేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు, ఇరావంతుని బలి తర్వాత రోదిస్తూ, వైధవ్యాన్ని స్వీకరించి, మౌనంగా అక్కడినుండి బయలుదేరి తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో జరిగిన ఇరావంతుడూ, మోహినిల వివాహానికి గుర్తుగా, నేటికీ హిజ్రాలు ఆ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ, ఆ నాటి గాధను స్మరించుకుంటారు. ఆ వేడుక వారికి ఎంతో మేలుచేస్తుందని వారి నమ్మకం.
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment