సన్యాసం – త్యాగం! భగవద్గీత Bhagavad Gita Chapter 18
సన్యాసం – త్యాగం!
మనో-ఇంద్రియములను నియంత్రణ లోకి తెచ్చుకోవటం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/DDbEuJl80CU ]
నిత్యసనాతనమైన సూత్రములనూ, మరియు శాశ్వత సత్యమునూ గూర్చిన వివరణను చూద్దాము..
00:47 - అర్జున ఉవాచ ।
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ।। 1 ।।
అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మహా బాహువులు గల కృష్ణా.. 'సన్యాసము', కర్మలను త్యజించటము, 'త్యాగము', మరియు కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటము యొక్క స్వభావాన్ని, తెలుసుకో గోరుతున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది ఓ కేశినిషూదనా..
అర్జునుడు శ్రీ కృష్ణుడిని, ‘కేశి-నిషూదనా’ అని సంబోధించాడు. అంటే, ‘కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా’ అని అర్థం. ఒక భయంకరమైన గుఱ్ఱం రూపంలో వచ్చి, వ్రజ భూమిలో ఉత్పాతం సృష్టించిన కేశి అనే రాక్షసుడిని, తన భూలోక దివ్య లీలలతో శ్రీ కృష్ణుడు సంహరించాడు. సంశయమనేది కూడా మనస్సులో ఉరకలు వేస్తూ, భక్తి అనే తోటను నాశనం చేసే ఒక అడవి గుఱ్ఱము వంటిది. ఏ విధంగా అయితే కేశి అనే రాక్షసుడిని సంహరించావో, దయచేసి నా మనస్సులో ఉన్న సంశయమును కూడా హరించివేయమని, అర్జునుడు అడుగుతున్నాడు. అతని ప్రశ్న చాలా నిశితమైనది, మరియు తీక్షణమైనది. అతను సన్యాసము యొక్క స్వభావమును తెలుసుకోగోరుతున్నాడు. అంటే, ‘కర్మలను త్యజించటము’ అనే దానిని గురించన్నమాట. ఆయన ‘త్యాగము’ యొక్క స్వభావాన్ని కూడా తెలుసుకో గోరుతున్నాడు. అంటే, ‘కర్మ ఫలములను భోగించాలనే కోరికను వదిలి వేయటం’ అన్నమాట. అంతేకాక, ‘పృథక్’ అన్న పదాన్ని కూడా వాడుతున్నాడు. అంటే ‘బేధము / తేడా’ అని అర్థం; అర్జునుడు ఈ రెండు పదముల అర్థం యొక్క తేడాను కూడా తెలుసుకో గోరుతున్నాడు. అర్జునుడు శ్రీ కృష్ణుడిని హృషీకేశా అని కూడా సంబోధిస్తున్నాడు. అంటే, ‘ఇంద్రియములకు అధిపతి’ అని అర్థం. అర్జునుడి లక్ష్యం, అత్యున్నత విజయం సాధించటమే. అదే, మనో-ఇంద్రియములను నియంత్రణ లోనికి తెచ్చుకోవటం. ఈ విజయమే పరిపూర్ణ శాంతిని ప్రసాదించగలుగుతుంది. సర్వోన్నత భగవానుడైన శ్రీ కృష్ణ పరమాత్మ, ఇంద్రియములకు అధిపతిగా, తానే ఆ పరిపూర్ణ సిద్ధికి ఉదాహరణ. ఈ విషయం ఇంతకు పూర్వం అధ్యాయాలలో కూడా వివరించబడింది. శ్రీ కృష్ణుడు సన్యాసం గురించి, గత అధ్యాయాలలో వివరించాడు కానీ, ఇక్కడ ఈ విషయమును ఇంకొక కోణంలో నుండి వివరిస్తున్నాడు. ఒకే సత్యము, తాను చాలా దృక్కోణముల నుండి వివరింపబడటానికి వెసులుబాటు ఇస్తుంది. అలాగే, ప్రతి ఒక్క కోణమూ, తనదైన ప్రత్యేక వివరణను మనకు అందిస్తుంది. ప్రతిఒక్క అధ్యాయమూ, ఒక ప్రత్యేక యోగంగా చెప్పబడింది. అదే సమయంలో, పద్దెనిమిదవ అధ్యాయం, వీటన్నింటి సారాంశంగా పరిగణించబడుతుంది. ఈ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు, పూర్వపు పదిహేడు అధ్యాయాలలో చెప్పబడిన నిత్యసనాతనమైన సూత్రములనూ, మరియు శాశ్వత సత్యమునూ క్లుప్తంగా సంగ్రహించి చెప్పి, వాటన్నింటి యొక్క క్రోడీకరించిన సంగ్రహమును ధృవీకరిస్తున్నాడు.
03:55 - శ్రీ భగవానువాచ ।
కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ।। 2 ।।
శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసమని, జ్ఞానసంపన్నులన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే, పండితులు త్యాగమని అన్నారు.
కవయః అంటే, పండితులూ, జ్ఞానసంపన్నులూ.. సన్యాసము అంటే, కర్మలను విడిచిపెట్టడముగా పండితులు పేర్కొంటారని, శ్రీ కృష్ణుడంటున్నాడు. భౌతిక భోగముల కోసం పనులు చేయటం విడిచిపెట్టి, సన్యాసాశ్రమంలోకి ప్రవేశించిన వారిని, కర్మ సన్యాసులంటారు. వారు కొన్ని ‘నిత్య కర్మలు’ అంటే, శరీర పోషణ కోసం కొన్ని రోజువారీ పనులు చేస్తూనే ఉంటారు. కానీ, కామ్య కర్మలైన సంపద, సంతానము, హోదా, పదవి, అధికారం వంటి వాటి కోసం చేసే కర్మలను విడిచిపెడతారు. ఇటువంటి కామ్య కర్మలు, జీవాత్మను కర్మ చక్రంలో మరింతగా బంధించివేస్తాయి. అలాగే, ఈ జనన-మరణ సంసారములో పదేపదే పునర్జన్మకు కారణమౌతాయి. వేద విహిత కర్మలను త్యజించకుండా, వాటి వలన వచ్చే ఫలములను భోగించాలనే కోరికను త్యజించాలి. కాబట్టి, కర్మ ఫలముల పట్ల ఆసక్తిని విడిచిపెట్టే దృక్పథాన్నే, త్యాగమని అంటారు. అదే సమయంలో, పనులను త్యజించటాన్ని సన్యాసమని అంటారు. జ్ఞానోదయ భగవత్ ప్రాప్తి కోసం, సన్యాసము మరియు త్యాగము, రెండూ కూడా చక్కటి పద్ధుతులే.
05:34 - త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః ।
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ।। 3 ।।
కొంతమంది విద్వాంసులు కర్మలన్నియూ దోషభూయిష్టమైనవనీ, వాటిని విడిచిపెట్టాలనీ అంటారు. అదే సమయంలో మరికొంతమంది, యజ్ఞములూ, దానములూ, మరియు తపస్సులను ఎన్నడూ విడిచిపెట్టవద్దని అంటారు.
సాంఖ్య సిద్ధాంతమునకు చెందిన వారు, ప్రాపంచిక జీవితాన్ని ఎంత త్వరగా అయితే, అంత త్వరగా త్యజించాలని అంటారు. కోరికలచే ఉత్పన్నమైనవి కాబట్టి, అన్ని కర్మలూ విడిచిపెట్టబడాలి. ఎందుకంటే, అవి జీవుని జనన-మరణ చక్రంలో మరింతగా బంధించివేస్తాయనే అభిప్రాయంతో ఉంటారు. అన్ని కర్మలూ, పరోక్ష హింస వంటి వాటిచే ఎంతోకొంత దోషయుక్తంగా ఉంటాయని వాదిస్తారు. ఇతర తత్త్వవేత్తలు, ఉదాహరణకు, మీమాంస శాస్త్రమునకు చెందినవారు, వేదవిహిత కర్మలను ఎన్నటికీ త్యజించరాదని అంటారు. ఎక్కడెక్కడైతే వేదాలలో రెండు విరుద్ధమైన ఉపదేశాలు ఉంటాయో, ఒక ప్రత్యేకమైన ఉపదేశం ప్రముఖంగా ఉంటే, అది సామాన్యమైన ఉపదేశాన్ని కొట్టివేస్తుందని వాదిస్తారు. ఉదాహరణకు, వేదములు ‘మా హింస్యాత్ సర్వ భూతాని’ అంటే, ‘ఏ ప్రాణి పట్ల కూడా హింసకు పాల్పడరాద’ని చెప్పాయి. ఇది సామాన్యంగా వర్తించే సూత్రము. అవే వేదములు, మనలను అగ్నితో యజ్ఞములను చేయమని కూడా చెబుతాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఆదేశము. ఈ యజ్ఞాచరణలో కొన్ని రకాల ప్రాణులు అనుకోకుండా అగ్నిలో పడి చనిపోవచ్చు. కానీ మీమాంసకులు, ఈ యొక్క యజ్ఞమును చేయమనే ప్రత్యేకమైన ఉపదేశమే ఉన్నతమైనది. అది 'హింసకు పాల్పడవద్ద'నే సామాన్య ఉపదేశమునకు విరుద్ధంగా ఉన్నాసరే, దానిని పాటించాలని వాదిస్తారు. కాబట్టి, మేలు కలిగించే కార్యములైన యజ్ఞము, దానము, మరియు తపస్సులను మనము ఎప్పుడూ త్యజించకూడదని, మీమాంసకులంటారు.
07:36 - నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ ।
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ।। 4 ।।
ఓ పురుషవ్యాఘ్రమా, ‘త్యాగము’ అన్న విషయముపై ఇక ఇప్పుడు, నా తుది నిర్ణయమును వినుము. త్యాగమనేది మూడు రకాలుగా ఉంటుందని చెప్పబడినది.
త్యాగమనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, అది ఉన్నతమైన జీవనానికి నాంది. నీచ స్థాయి కోరికలను త్యజించటం ద్వారా మాత్రమే, మనం ఉన్నతమైన ఆశయాలను పెంపొందించుకోగలం. అదే విధంగా, క్రింది స్థాయి పనులను విడిచిపెట్టడం ద్వారానే, మనం ఉన్నతమైన విధులనూ, కార్యకలాపముల పట్ల అంకితమూ, మరియు జ్ఞానోదయ దిశగానూ ముందుకెళ్ళవచ్చు. అయితే, ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు యదార్థముగా, సన్యాసమంటే ఏమిటన్న విషయము పై, భిన్నమైన అభిప్రాయలున్నాయని, తెలియచేశాడు. రెండు విరుద్ధమైన దృక్కోణాలను పేర్కొన్న పిదప, శ్రీ కృష్ణుడిక తన యొక్క అభిప్రాయాన్ని చెబుతున్నాడు. ఇదే ఈ విషయంపై అంతిమ తీర్పని అంటున్నాడు.
08:43 - యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ ।
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ।। 5 ।।
యజ్ఞము, దానము, మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు; అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము, మరియు తపస్సనేవి, బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి.
మనం ఎప్పుడూ, మనలను ఉద్ధరించే, మరియు మానవ జాతికి హితకరమైన కర్మలను త్యజించకూడదని, శ్రీ కృష్ణుడిక్కడ ప్రకటిస్తున్నాడు. ఇటువంటి పనులను సరియైన దృక్పథంలో చేసినప్పుడు, అవి మనలను బంధించి వేయవు. పైగా, అవి మనలను ఉన్నత స్థితికి ఉద్ధరిస్తాయి. ఒక గొంగళి పురుగు ఉదాహరణను తీసుకోండి. తనను తాను రూపాంతరం చేసుకోవటానికి, అది తన చుట్టూ తన పరిణామం కోసం, ఒక గూడు కట్టుకుంటుంది. తనను తాను దానిలో బంధించుకుంటుంది. అది ఒకసారి సీతాకోక చిలుకగా మారిపోయినప్పుడు, ఆ గూడును చీల్చుకుని, ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఈ జగత్తులో మన పరిస్థితి కూడా, ఈ విధంగానే ఉంటుంది. ఆ వికృతమైన గొంగళి పురుగులా, మనం ప్రస్తుతం ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తులమై, సద్గుణ రహితంగా ఉన్నాము. మనం కోరుకునే అంతర్గత పరిణామం కోసం, స్వీయ-సాధన, మరియు స్వీయ-శిక్షణలో భాగంగా, మనం కర్మలను చేయవలసి ఉంటుంది. యజ్ఞము, దానము, మరియు తపస్సనేవి, మన ఆధ్యాత్మిక ఉన్నతికీ, వికాసానికీ దోహదపడే పనులు. ఒక్కోసారి ఇవి కూడా బంధన కారకాలే అని అనిపిస్తాయి. కానీ, అవి గొంగళి పురుగు యొక్క గూడు వంటివి. అవి మన మలినములను హరిస్తాయి, అంతర్గతముగా మనలను అందంగా చేస్తాయి, మరియు ఈ భౌతిక అస్థిత్వపు సంకెళ్లను ఛేదించటానికి, సహకరిస్తాయి. కాబట్టి, ఇటువంటి పవిత్రమైన కార్యములను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు.
10:40 - ఇక మన తదుపరి వీడియోలో, భగవంతుడి ఖచ్చితమైన, మరియు సర్వోత్కృష్ట తీర్పు ఏంటో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment