దానాలు – ఓంకారం! భగవద్గీత Bhagavad Gita
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
దానాలు – ఓంకారం!
ఎటువంటి దానాన్ని రజోగుణ దానమని చెప్పాడు శ్రీకృష్ణుడు?
'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (21 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 21 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/GJw5wFkmEcs ]
తామసిక దానముగా ఏది పరిగణించబడుతుందో ఇప్పుడు చూద్దాము..
00:47 - యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ।
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ।। 21 ।।
కానీ, అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఎదో తిరిగి వస్తుందనే ఆశతో, లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము, రజో గుణములో ఉన్నదని చెప్పబడినది.
అడగక ముందే ఇవ్వటమే, దానము చేయుటకు అతిశ్రేష్ఠమైన పద్దతి. అలా చేయకపోతే, ద్వితీయ శ్రేణి శ్రేష్ఠ పద్దతి ఏమిటంటే, అడిగినప్పుడు సంతోషముగా ఇవ్వటం. మూడవ స్థాయి దానం చేసే స్వభావం ఏమిటంటే, అడిగినప్పుడు అయిష్టముగా ఇవ్వటం, లేదా ఇచ్చిన తరువాత, ‘అంత ఎందుకు ఇచ్చానా? కొంచం తక్కువ ఇస్తే సరిపోయేది’ అని విచారించటం. శ్రీ కృష్ణుడు ఇటువంటి దానమును, రజోగుణ దానమని పేర్కొంటున్నాడు.
01:38 - అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే ।
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ।। 22 ।।
అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హతలేని వారికి, మర్యాద చూపకుండా, లేదా చులకనగా ఇవ్వబడిన దానము, తామసిక దానముగా పరిగణించబడుతుంది.
మనం చేసే దానాన్ని, అర్హత లేని వారికి ఇవ్వడం, సందర్భం కాని సమయంలో దానం ఇవ్వడం, అవతలి వారిని చులకనగా భావిస్తూ, విరిగి పోయినవీ, పగిలి పోయినవీ, చినిగి పోయినవీ, ఎవరికీ దానం చేయకూడదు. మనం చేసే దానం, అవతలి వ్యక్తులకు ఉపయోగ పడాలే తప్ప, మన స్థాయిని చూపించుకోవడానికి, అహంకార ధోరణితో దానం చేయకూడాదు. ఇది తమోగుణ దానము. దానివల్ల ఎటువంటి ప్రయోజనమూ కలుగదు. ఒక పాడైపోయిన, చిల్లులు పడిన గొడుగును దానం చేయడం వలన ఉపయోగం ఏముటుంది? అలాగే, తాగుబోతుకు మద్యం సేవించడానికి ధన సహాయం చేయడం వలన, ప్రయోజనమేమిటి?
కాబట్టి దానం చేసేటప్పుడు, ఆలోచించి దానం చేయాలి. అది అపాత్ర దానం కాకూడదు. అలాగే, అహంకార పూరిత దానం కాకూడదు.
02:50 - ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః ।
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ।। 23 ।।
‘ఓం తత్ సత్’ అన్న పదములు, సృష్టి మొదలు నుండి, పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులూ, శాస్త్రములూ, మరియు యజ్ఞములూ ఏర్పడినవి.
ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు ప్రకృతి త్రిగుణముల పరంగా, మూడు విధములైన యజ్ఞములూ, తపస్సులూ, మరియు దానముల గురించి వివరించి ఉన్నాడు. ఈ మూడు గుణములలో, తమో గుణమనేది, ఆత్మను అజ్ఞానము, నిర్లక్ష్యము, మరియు సోమరితనపు స్థితికి దిగజారుస్తుంది. రజో గుణమనేది, జీవులను ఉద్వేగపరచి, దానిని అసంఖ్యాకమైన కోరికలతో బంధించివేస్తుంది. సత్త్వ-గుణము ప్రశాంతమైనది, ప్రకాశవంతమయినది, మరియు సద్గుణములు పెంపొందించుకోవటానికి దోహదపడుతుంది. అయినా సరే, సత్త్వ గుణము కూడా మాయా పరిధిలోనే ఉంటుంది. దాని పట్ల మనము మమకారాసక్తితో ఉండకూడదు; బదులుగా, సత్త్వగుణమును ఒక మెట్టుగా ఉపయోగించుకుని, అలౌకిక స్థాయిని చేరుకోవాలి. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఈ మూడు గుణములకూ అతీతంగా వెళుతున్నాడు; అలాగే, పరమ సత్యము యొక్క వివిధ స్వరూపాలను సూచించే ‘ఓం తత్ సత్’ అన్న పదాలను వివరిస్తున్నాడు.
04:13 - తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః ।
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ।। 24 ।।
కాబట్టి, యజ్ఞములు చేసేటప్పుడూ, దానము చేసేటప్పుడూ, లేదా తపస్సులు ఆచరించటంలో - వేద విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్ఛరిస్తూ ప్రారంభిస్తారు.
‘ఓం’ అనే శబ్దము, భగవానుని నిరాకార అస్థిత్వమునకు సూచిక. అదే నిరాకార బ్రహ్మమునకు పేరని కూడా చెప్పబడుతుంది. అది ఈ విశ్వమంతా వ్యాప్తించి ఉన్న సనాతన శబ్దము. దాని యొక్క సరియైన ఉచ్చారణ ఏమిటంటే: ‘ఆ..’ అంటూ నోరు పెద్దదిగా అని, ‘ఓ...’ అని పెదవులు ముడుస్తూ, "మ్.." అని పెదవులు దగ్గరగా మూసి అనటం. ఈ ‘ఓం’ కారమును, వేద మంత్రముల ప్రారంభంలో, బీజ మంత్రముగా, మంగళకరమైనదిగా ఉపయోగిస్తారు.
05:10 - ఇక మన తదుపరి వీడియోలో, ఓం తత్ సత్ అనే పదాలకు అర్థాలను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment