బేతాళుడు! బేతాళుని పూర్వ జన్మ వృత్తాంతం! Past Life of Betala (Vikramarka Betala)


బేతాళుడు! బేతాళుని పూర్వ జన్మ వృత్తాంతం!

మనం చిన్నప్పటి నుండి చాలా కథలు విని ఉంటాము. కానీ, వాటిలో ప్రత్యేకతను సంతరించుకున్న కథలు అంటే, విక్రమార్క బేతాళ కథలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి రాబోయే తరాలకు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన కథలే అయినా, అవన్నీ నేటికీ ఆచరణీయమే. విక్రమార్క – బేతాళుల గురించి, మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, అసలు బేతాళుడు ఎవరు? సకల విద్యా పారంగతుడూ, దిక్‍దిగంతాలకూ వ్యాపించిన ఖ్యాతిని పొందినవాడూ, సుగుణ వంతుడూ అయిన విక్రమార్కుడంతటి వాడిని పరీక్షపెట్టేటంతటి శక్తి బేతాళుడికి ఎక్కడిది? విక్రమార్క-బేతాళ కథల మూలం, స్మశానమా, అరణ్యమా? బేతాళుడి గత జన్మ చరిత్ర ఏంటి? అనేటటువంటి ఉత్సుకతను కలిగించే, వ్యాస భగవానుడు రచించిన ‘భవిష్య పురాణం’లోని అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/c3qWnvxsmtI ]


గోదావరీ నదీ తీరాన, ప్రతిష్టానపురానికి రాజైన విక్రమార్కుడికి ఒక భిక్షువు, రోజూ ఒక పండు లోపల రత్నాన్ని పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు. ఆ విషయం తెలిసిన రోజున, విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి, కారణం చెబితేగానీ పండును తీసుకోనని అన్నాడు. దానికి భిక్షువు, తను ఒక మంత్రాన్ని సాధించ దలచాననీ, అందుకు ఓ వీరుడి సహాయం కావాలనీ చెప్పి, విక్రమార్కుని నుంచి తాను ఆ సహాయాన్ని కోరుతున్నానని అన్నాడు. అందుకు విక్రమార్కుడు అంగీకరించడంతో, రాబోయే కృష్ణ చతుర్దశి నాడు చీకటి పడగానే, మహా స్మశానానికి రమ్మని అన్నాడు భిక్షువు. అలా స్మశానానికి వెళ్ళిన విక్రమార్కుడితో, శింశుపా వృక్షం మీద వ్రేలాడుతున్న పురుషుని శవాన్ని తీసుకురమ్మని చెప్పాడు. విక్రమార్కుడందుకోసం చెట్టు మీదకు వెళ్ళి, బేతాళుడిని భుజం మీద వెసుకుని రావడం, బేతాళుడు కథలు చెప్పి, ప్రశ్నలు అడగడం, దానికి విక్రమార్కుడు సమాధానాలు చెప్పడం, మనలో చాలా మందికి తెలిసిన విషయమే.

అయితే, భవిష్య మహాపురాణంలోని ప్రతిసర్గ పర్వం, తృతీయ ఖండంలో, బేతాళుడి గురించిన గాధ మరొకటి ఉంది. విక్రమాదిత్యుడు తన చిన్నతనంలో, తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు. అక్కడ డంబావతి అనే ఊరిలో, ద్వాత్రింశన్మూర్తులు, అంటే, 32 సాలభంజికలుగల దివ్య సింహాసనాన్ని చూశాడు. అది శివానుగ్రహ పూరితమైనది. ఆ సింహాసనానికి రక్షణగా, బేతాళుడిని పంపించింది పార్వతీ మాత. ఎంతో మహిమాన్వితమైన, మణిభూషితములతో, నానాద్రుమలతాకీరణము, పుష్పవల్లీ సముల్లసితముగా ఉన్న ఆ దివ్య సింహసనాన్ని పొందే క్రమంలో, బేతాళుడు విక్రమాదిత్యుని మేధోశక్తిని పరీక్షించడానికి, 24 కథలను వివరించాడు. ఆ కథలే, బేతాళ కథలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. విక్రమాదిత్యుడు ఎంత ప్రఖ్యాతి గాంచాడో, బేతాళుడు కూడా అంత ప్రసిద్ధుడు.

బేతాళుడికి సంబంధించిన పూర్వజన్మను గురించి చూసుకున్నట్లుయితే, అతడొక రాజు. పూర్వం గంగా యమునా సంగమ స్థానంలో, బిల్వతి అనే ఊరిలో, క్షత్ర సింహుడనే రాజే, నేటి బేతాళుడు. అతని ఆస్థానంలో, వేదవేదాంగ పారంగతుడైన శివ భక్తుడు, శంభుదత్తుడు కొలువుదీరి ఉన్నాడు. శంభుదత్తుడికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు లీలాధరుడు, విష్ణు భక్తుడు, బలశాలి. రెండవ వాడు, శాక్తుడు. అతడి పేరు మోహనుడు. అయితే, ఒకనాడు రాజైన క్షత్రసింహుడు ప్రజల శ్రేయస్సుకొరకు, యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ కార్యం నిర్వహించడానికి శంభుదత్తుడిని ఆహ్వనించాడు. శివభక్తి పరాయణుడైన శంభుదత్తుడు, చక్కగా మండపాన్ని సిద్ధం చేసి, కార్య సిద్ధి కొరకు కలశ స్థాపన చేసి, మన వేదాలలో చెప్పబడినట్లుగా, సకల మంత్రాలతో, హవ్యములతో, హోమాన్ని జరిపించాడు. అయితే, లీలాధరుడు ఆ యజ్ఞంలో మరణోన్ముఖమైన మేకను చూసి చింతించాడు.

అప్పుడు తన తండ్రితో లీలాధరుడు, "ఈ జీవ హింసచే దారుణ నరకం కలుగుతుంది. భగవంతుడు, సర్వేశ్వరుడైన విష్ణువు హింసాయజ్ఞమును మెచ్చడు." అని బదులిచ్చాడు. అది విన్న శంభుదత్తుడి రెండవ కొడుకైన మోహనుడు గట్టిగా నవ్వి, తరువాత అన్నకు ఇలా బదులిచ్చాడు. "అన్నా! గతంలో, సత్యయుగంలో జీవించిన బ్రాహ్మణులందరూ, యజ్ఞపరులు. అప్పుడజ మేధం చేసి తీరాలనేటటువంటి శ్రుతి ఉన్నది. వారు తిలాదులే అజముగా, తిలాదులనే హోమద్రవ్యముగా ఉపయోగించేవారు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ హెమగుండంలో నిలచి, ‘నీ మతము నిష్ఫలము. అజమనగా, భాగమని వేదములు తెలియజేస్తున్నాయి. కాబట్టి, దానితోనే యజ్ఞమును ఆచరించ’మని ఆదేశించారు. ఆ మాటలు విన్న మునులందరూ ఆశ్చర్యపోయారు. ఈలోగా అక్కడకు పితృసమానుడైన మహర్షి  పుష్పక విమానంలో రాగా, మునులందరూ వారి సంశయాన్ని బయటపెట్టారు.

అందుకా మహర్షి, నిర్భయంగా ఛాగమేథమునే ఆచరించమని సెలివిచ్చాడు. దాంతో ఆ మునులందరూ, ఆ విధంగానే యాగాన్ని పరిసమాప్తిజేసి, శుభాలను పొందారు. కాబట్టి, ‘అన్నా, మాతో కలసి యజ్ఞమును పరిసమాప్తి చేయి." అని బదులిచ్చాడు. దానికి లీలాధరుడు, "త్రేతాయుగంలో యజ్ఞము రజోగుణంతో నడిచింది. కానీ, కతృయుగంలో మాత్రం, కేవలం హింసా రహితంగానే జరిగింది. అప్పుడు ధర్మము నాలుగు పాదముల నడచింది. అప్పుడు రక్త మాంసాదులచే కాక, కేవలం హవ్య మాత్రముచే దేవతలు తృప్తి పొందారు’ అని సమాధానమిచ్చాడు. అందుకు క్షత్ర సింహుడు, భయభ్రాంతమై ఉన్న మేకను వదిలివేసి, పండ్లు మొదలైన వాటితో పూర్ణాహుతిని సమర్పించాడు.

తరువాతి కాలంలో, శంభుదత్తుడు మహామాయా ప్రభావంచే, దేహమును వదలి స్వర్గానికి వెళ్ళాడు. లీలాధరుడు పది మంది కుమారులను పోషించుకుంటూ, వేదాధ్యయనాలను నేర్పుతూ, కాలం గడపసాగాడు. అయితే, ఒకనాడు క్షత్ర సింహుడు మోహనుడి దగ్గరకు వెళ్ళి, దేవమాత అనుగ్రహాన్ని లభింపజేయమని అడిగాడు. అందుకు మోహనుడు, బ్రహ్మ బీజ మంత్ర జపంతో, బ్రాహ్మీ శక్తి వస్తుందని చెప్పగా, క్షత్ర సింహుడు తపస్సు నాచరించాడు. అయితే, ఈ గాధను విక్రమాదిత్య చక్రవర్తికి చెప్పి, ‘సనాతనియైన దుర్గను నీవు పూజించు. నేను శివాజ్ఞచే నీ సమీపానికి వచ్చాను. ప్రశ్నోత్తరములతో నిన్ను పరీక్షించాను. నీ భుజములందధిష్ఠించి నేనుంటాను. సర్వ శత్రువులనూ సంహరింపుము. సర్వ పురములూ, వివిధ క్షేత్రములూ, చోరులతో నష్టమై ఉన్నాయి. శాస్త్రాధారముగా, మరల స్థాపన చేయి. సర్వ తీర్థములనూ పునరుద్ధరించు. నీ రాజ్యం కలకాలం వర్ధిలుతుంది’ అని సెలవిచ్చాడు. విక్రమాదిత్య చక్రవర్తిని పరీక్షించి, బేతాళుడు వెళ్లిపోలేదు. అదృశ్య రూపంలో, తన దగ్గరే ఉన్నాడు. విక్రమాదిత్య చక్రవర్తి, అఖండ రాజ్యాలను జయించడానికి తోడుగా, శక్తిగా నిలిచాడు.

ధర్మొ రక్షతి రక్షితః

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home