కర్తవ్య కర్మలు! Regulated Action భగవద్గీత Bhagavad Gita


కర్తవ్య కర్మలు!
సన్న్యాసమంటే బాహ్యమైన కర్మలను త్యజిస్తే సరిపోతుందా?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

భగవంతుడి ఖచ్చితమైన, మరియు సర్వోత్కృష్ట తీర్పు ఏంటో చూద్దాం..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qLSH6cHlzmQ ]


00:47 - ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ ।
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ।। 6 ।।

ఓ అర్జునా, ఫలములపై మమకారాసక్తి లేకుండా, మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు.

యజ్ఞము, దానము, మరియు తపస్సులు, పరమేశ్వరుని పట్ల భక్తియుక్త భావముతో చేయబడాలి. ఆ దృక్పథం ఇంకా రానప్పుడు, వాటిని తప్పకుండా, అవి తన కర్తవ్యమన్న భావనతో, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ఒక తల్లి తన స్వార్థ సుఖాలను త్యజించి, బిడ్డ పట్ల తన విధిని నిర్వర్తిస్తుంది. తన స్తనములోని పాలను బిడ్డకు ఇచ్చి, బిడ్డను పోషిస్తుంది. బిడ్డకు ఇవ్వటం వలన ఆమెకు పోయేదేమీ లేదు. పైగా, తన మాతృత్వమును చాటుకుంటుంది. అదే విధంగా, ఒక ఆవు రోజంతా గడ్డి మేసి, తన పొదుగులో పాలను దూడకు ఇస్తుంది. తన విధిని నిర్వర్తించటం ద్వారా, ఆ ఆవు ఏమీ తరిగిపోదు; పైగా జనులు దానిని ఎంతో గౌరవిస్తారు. ఈ పనులన్నీ నిస్వార్థముగా చేయబడినవి కాబట్టి, అవి పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. వివేకవంతులు, పవిత్రమైన, మరియు సంక్షేమ కార్యములను అదే నిస్వార్థ చిత్తముతో చేయాలని, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.

02:14 - నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే ।
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ।। 7 ।।

విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము, తామసిక త్యాగమని చెప్పబడును.

నిషిద్ధ కర్మలను, మరియు అనైతిక పనులను త్యజించటం సరియైనదే; కర్మ ఫలాపేక్షను త్యజించటం కూడా, సరియైనదే; కానీ, చేయవలసిన కర్మలు విడిచిపెట్టటం ఎన్నటికీ సరియైనది కాదు. విహిత కర్మలు, మనస్సును పరిశుద్ధి చేసుకోవటానికి ఉపయోగపడతాయి. అలాగే, అవి మనలను తమోగుణము నుండి రజో గుణమునకూ, దానినుండి సత్త్వ గుణమునకూ ఉద్దరించుకోవటానికి దోహదపడతాయి. వాటిని త్యజించటం అనేది, అవివేకమును ప్రదర్శించుకోవటమే అవుతుంది. సన్యాసము పేరుతో విహితకర్మలను విడిచిపెట్టటం అనేది, తామసిక సన్న్యాసమవుతుంది. ఈ లోకంలోకి వచ్చిన తరువాత, మనందరికీ కర్తవ్య విధులు ఉంటాయి. వాటిని నిర్వర్తించటం ద్వారా, వ్యక్తిలో ఎన్నో గుణములు వృద్ధి చెందుతాయి. బాధ్యత తీసుకోవటం, మనోఇంద్రియముల క్రమశిక్షణ, బాధలనూ-కష్టాలనూ సహించటం మొదలైనవి. అజ్ఞానముతో వీటిని త్యజించటం, ఆత్మ పతనానికి దారి తీస్తుంది. ఈ కర్తవ్య కర్మలు, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయిని బట్టి, మారతాయి. ఒక సామాన్య వ్యక్తికి, డబ్బు సంపాదించటం, కుటుంబాన్ని పోషించటం, స్నానం చేయటం, భుజించటం మొదలైన దైనందిన పనులన్నీ, కర్తవ్య విధులే. వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగిన కొద్దీ, ఈ కర్తవ్య కర్మలు మారుతాయి. మాహాత్ములకి, యజ్ఞము, దానము మరియు తపస్సనేవి, కర్తవ్య విధులు.

04:04 - దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్యజేత్ ।
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ।। 8 ।।

విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను, అవి కష్టముగా ఉన్నాయని, లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయనీ తలచి, వాటిని విడిచిపెట్టటాన్ని, రజో గుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము, ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు, మరియు మన ఉన్నతికి దోహదపడదు.

జీవితంలో పురోగతి అంటే, మన బాధ్యతలను విస్మరించటం కాదు. పైగా, మన బాధ్యతలను పెంచుకోవటం అవసరమౌతుంది. కొత్తగా ఆధ్యాత్మిక పథంలోకి వచ్చిన వారు, ఈ నిజాన్ని అర్థంచేసుకోరు. కష్టాన్ని తప్పించుకోవాలని, మరియు పరిస్థితుల నుండి పారిపోయే దృక్పథంతో, ఆధ్యాత్మిక ఆశయాలను ఒక కారణం లాగా చూపి, వారి యొక్క కర్తవ్య విధులను విడిచి పెడతారు. కానీ, జీవితం అంటే ఎటువంటి కష్టాలూ లేకుండా ఉండదు. ఉన్నతమైన సాధకులు అంటే, ఏమీ చేయకపోవటం వలన, నిశ్చలంగా ఉన్నవారు కాదు. పైగా, ఎంతో పెద్ద బాధ్యతను భుజాలపై మోస్తున్నా, వారు వారి యొక్క ప్రశాంతతను కాపాడుకుంటారు. అవి కష్టతరంగా ఉన్నాయని తమ విధులను త్యజించటమనేది, రజోగుణ త్యాగమని, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో పేర్కొన్నాడు. అర్జునుడు తన కర్తవ్యమును అప్రియమైనదిగా, మరియు చికాకైనదిగా భావించాడు. అందుకే యుద్ధభూమి నుండి పారిపోవాలని అనుకున్నాడు. శ్రీ కృష్ణుడు దీనిని అజ్ఞానము, మరియు బలహీనతగా అభివర్ణించాడు. అర్జునుడికది కష్టతరంగా అనిపించినా సరే, తన కర్తవ్యాన్ని కొనసాగించమనే చెప్పాడు. అదే సమయంలో, ఒక అంతర్గత మార్పును చేసుకోమన్నాడు. దీనికోసం, అర్జునుడికి ఆధ్యాత్మిక జ్ఞానన్ని బోధించి, జ్ఞాన నేత్రములు పెంపొందేలా సహకరించాడు.

05:59 - కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున ।
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ।। 9 ।।

అర్జునా, కర్తవ్యమునకు అనుగుణంగా ఎప్పుడైతే కర్మలు చేయబడతాయో, మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో, దానిని సత్త్వగుణ త్యాగమని అంటారు.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, అత్యున్నత రకమైన త్యాగమును వివరిసున్నాడు; దీనిలో మన విహిత కర్మలనన్నింటినీ చేస్తూనే ఉంటాము. కానీ, కర్మ ఫలముల పట్ల ఆసక్తిని విడిచి పెడతాము. సత్త్వగుణములో స్థితమై ఉన్న దీనిని, అత్యున్నత త్యాగంగా శ్రీ కృష్ణుడు అభివర్ణిస్తున్నాడు. సన్న్యాసమనేది, ఆద్ధ్యాత్మిక పురోగతికి ఖచ్చితంగా అవసరమయ్యేదే. ఇక్కడ సమస్య ఏమిటంటే, జనులకు సన్న్యాసమంటే ఏమిటో సరిగ్గా తెలియదు. సన్న్యాసమంటే, బాహ్యమైన కర్మలను త్యజించటమని అనుకుంటారు. ఇటువంటి త్యాగము, ఒక అయోమయ, కపట స్థితికి దారి తీస్తుంది. అంటే, ఎదో బయటికి కాషాయ బట్టలు కట్టుకున్నా, అంతర్గతంగా వ్యక్తి ఇంద్రియ వస్తువిషయముల పట్లే చింతన చేస్తుంటాడు. భారత దేశంలో ఎంతో మంది సాధువులు, ఈ రకమైన కోవకే చెందుతారు. వారు భగవత్ ప్రాప్తి కోసమనే సదుద్దేశంతోనే ప్రపంచాన్ని విడిచిపెడతారు. కానీ, వారి మనస్సు ఇంకా ఇంద్రియ వస్తువిషయముల నుండి విడివడకపోవటం చేత, వారి సన్యాసము ఆశించిన ఫలితములను ఇవ్వలేదు. అందుచేత, వారు చేసిన పని వారిని ఉన్నతమైన, ఆధ్యాత్మిక జీవన స్థాయికి తీసుకుపోలేదు. ఇక్కడ లోపం, వారు చేసిన పనుల యొక్క క్రమంలో ఉంది - మొదట వారు బాహ్యమైన సన్యాసమునకై ప్రయత్నించారు. తరువాత అంతర్గత సన్యాసముకై ప్రయత్నించారు. ఈ శ్లోకం యొక్క ఉపదేశం, ఆ క్రమమును త్రిప్పివేయమని. మొదట అంతర్గత వైరాగ్యమును పెంచుకుని, ఆ తరువాత బాహ్యంగా సన్యసించవచ్చు.

08:00 - న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ।। 10 ।।

నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా, లేదా ఇష్టమైన / అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు, నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు, మరియు వారు కర్మ స్వభావం గురించి ఎటువంటి సంశయములూ లేనివారు.

సత్త్వగుణ త్యాగములో ఉండేవారు, ప్రతికూల పరిస్థితులలో కృంగిపోరు, లేదా అనుకూల పరిస్థితులయందు ఆసక్తితో ఉండరు. వారు అన్ని పరిస్థితులలో, కేవలం తమ కర్తవ్యమును చేస్తూ పోతుంటారు; అంతా బాగున్నప్పుడు అత్యుత్సాహ పడరు, లేదా జీవన గమనం కష్టమైనప్పుడు, నిరాశ చెందరు. వారు ఎండుటాకులా, వీచే ప్రతి పిల్లగాలికీ అక్కడిక్కడికీ విసిరివేయబడరు. యధార్ధంగా వారు సముద్ర రెల్లు మొక్కల వంటివారు. వారి సమత్వ నిశ్చలత్వమును పోగొట్టుకోకుండా, క్రోధమునకు, దురాశకు, ఈర్షకు, లేదా మమకారాసక్తికీ వశపడకుండా, పడిలేచే ప్రతి అలతో, దానికనుగుణముగా వ్యవహారమును కుదుర్చుకుంటారు. తమ చుట్టూ పడి లేచే పరిస్థితుల అలలకు, సాక్షిగా నిలిచిపోతారు.

09:18 - ఇక మన తదుపరి వీడియోలో, నిజమైన త్యాగి వేటిని త్యజించాలో శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home