వైదిక కర్మలు! Vaidika Karma భగవద్గీత Bhagavad Gita


వైదిక కర్మలు!
స్వంత మనోబుద్ధుల ఆధారంగా నమ్మకం ఉండకూడదంటూ ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (25 – 28 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 25 నుండి 28 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/flwDZn97klA ]


ఓం తత్ సత్ అనే పదాలకు అర్థాలను ఇప్పుడు చూద్దాం..

00:46 - తదిత్యనభిసంధాయ ఫలం యఙ్ఞతపఃక్రియాః ।
దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ।। 25 ।।

ప్రతిఫలములను ఆశించని వారు కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారూ, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు, ‘తత్’ అన్న పదమును ఉచ్ఛరిస్తారు.

సమస్త కర్మల ప్రతిఫలములూ, ఆ భగవంతునికే చెందుతాయి. కాబట్టి, ఏ యజ్ఞమయినా, తపస్సయినా, లేదా దానమైనా, ఆ పరమేశ్వరుని ప్రీతికోసమే అర్పించి, పవిత్రం చేయబడాలి. ఇక ఇప్పుడు శ్రీ కృష్ణుడు, బ్రహ్మమును సూచించే ‘తత్’ అన్న పద శబ్దము యొక్క విశిష్టతను వివరిస్తున్నాడు. యజ్ఞము, తపస్సు మరియు దానము చేసేటప్పుడు, ‘తత్’ అన్న పదమును ఉచ్ఛరించటం - అది భౌతిక ప్రతిఫలం కోసము కాకుండా, భగవత్ ప్రాప్తి ద్వారా ఆత్మ యొక్క శాశ్వత సంక్షేమం కోసమని సూచిస్తోంది.

01:43 - సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే ।
ప్రశస్తే కర్మణి తథా సఛ్చబ్దః పార్థ యుజ్యతే ।। 26 ।।

01:53 - యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే ।
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ।। 27 ।।

‘సత్’ అన్న పదానికి అర్థం - సనాతనమైన అస్థిత్వము, మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా, ఈ ‘సత్’ అన్న పదము వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పనయినా, ‘సత్’ అనబడుతుంది.

ఇక ఇప్పుడు ‘సత్’ అన్న పదము యొక్క మంగళప్రద గుణము, శ్రీకృష్ణుడిచే కీర్తించబడుతున్నది. ‘సత్’ అన్న పదమునకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ రెండు పై శ్లోకాలూ, వాటిలో కొన్నింటిని వివరిస్తున్నాయి. ‘సత్’ అన్న శబ్దము, నిత్య సనాతన శుభమునూ, మరియు మంగళదాయకమునూ సూచించటానికి ఉపయోగించబడుతుంది. దానితో పాటుగా, శుభకరమైన యజ్ఞము, తపస్సు, మరియు దానము చేయుట కూడా, ‘సత్’ అని సూచించ బడుతుంది. "సత్" అంటే, ఎల్లప్పుడూ, నిత్యముగా ఉండేది. అంటే, సనాతన సత్యమని కూడా చెప్పబడుతుంది. శ్రీమద్ భాగవతములో ఇలా పేర్కొనబడింది: ఓ ఈశ్వరా, నీ సంకల్పం సత్యము. నీవే పరమ సత్యము. సమస్త జగత్తు యొక్క మూడు స్థితులలో - సృష్టి, స్థితి, మరియు లయములలో, నీవే పరమ సత్యము. నీవే సమస్త సత్యమునకూ మూలము, మరియు అంతము. నీవే సమస్త సత్యమునకూ సారము. నీవే సత్యమును చూపగలిగే నేత్రములుగా ఉన్నావు. కాబట్టి, మేము నీకు శరణాగతి చేస్తున్నాము.. ‘సత్’ సర్వోన్నత పరమ సత్యమా.. దయచేసి మాకు అభయమివ్వు. అంటూ, భగవంతుడిని ఏ విధంగా శరణాగతి చేయాలో, ఇది తెలియజేస్తుంది.

03:48 - అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ ।
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ।। 28 ।।

ఓ పార్థ, అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కానీ, దానములు కానీ, లేక తపస్సులు కానీ, ‘అసత్’ అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ, లేదా పరలోకమున కానీ, ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చవు.

సమస్త వైదిక కర్మలూ, శ్రద్ధావిశ్వాసములతో చేయబడాలన్న ఉపదేశమును స్థిరపరచటానికి, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, అది లేకుండా చేయబడే వైదిక కర్మలు ఎంత వ్యర్ధమో చెబుతున్నాడు. శాస్త్రముల పట్ల విశ్వాసము లేకుండా కార్యములు చేసేవారు, ఈ లోకంలో మంచి ఫలితాలు పొందరు. ఎందుకంటే, వారి కర్మలు సక్రమ పద్ధతిలో చేసినవి అయిఉండవు. అంతేకాక, వేద శాస్త్రముల నియమముల అనుసారం చేయలేదు కాబట్టి, వారికి తదుపరి జన్మలలో కూడా మంచి ఫలములు లభించవు. ఈ విధంగా, మన స్వంత మనోబుద్ధుల ఆధారంగా, నమ్మకం ఉండకూడదు. బదులుగా మన శ్రద్ధావిశ్వాసములు, నిర్వివాదమైన వైదిక శాస్త్రములూ మరియు గురూపదేశం ఆధారంగానే ఉండాలని, ఈ ఆధ్యాయంలో శ్రీ కృష్ణుడు ఉపదేశించాడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, శ్రద్ధా త్రయ విభాగ యోగో నామ, సప్తదశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పదిహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగంలోని, 28 శ్లోకాలూ సంపూర్ణం.

05:25 - ఇక మన తదుపరి వీడియోలో, భగవద్గీతలోని ఆఖరి అధ్యాయం అయిన పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగంలో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home