వశీకరణ విద్య! ఈ విద్య ఇప్పటికీ ఉందా? Vashikarana
వశీకరణ విద్య! ఈ విద్య ఇప్పటికీ ఉందా?
ఒక వ్యక్తిని తమ చెప్పు చేతల్లో నడిపించుకోవడానికి ఉపయోగించే విద్యే ‘వశీకరణం’. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా ఉపయోగించే వాళ్లు. ఎక్కువ సందర్భాలలో వశీకరణ విద్యను, ప్రేమ, జీవితంలో ఎదగడానికీ, పనులలో ఆటంకాలు లేకుండా పూర్తవడానికీ ఉపయోగించారు. తమకు కావాల్సినట్టు, తమకు అనుకూలంగా ఉండేలా పని పూర్తి చేసుకోవడానికి, ఈ వశీకరణ మంత్రాలు సహాయ పడతాయి. అయితే ఇదంతా నిజమేనా? వశీకరణం ఈ మోడ్రన్ యుగంలో ఉపయోగించవచ్చా? వశీకరణ మంత్రాలు నిజంగానే పనిచేస్తాయా? వశీకరణం అనేది, మంచి మార్గమా? చెడు మార్గమా? అనేటటువంటి ప్రశ్నలకు సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/NL8QPIrBwOA ]
గమనిక:
ఈ వీడియో ద్వారా వశీకరణ శక్తిని సమర్ధించడం గానీ, మూఢనమ్మకాలను ప్రోత్సహించడం గానీ నా ఉద్దేశ్యం కాదు. కేవలం అతీంద్రయ శక్తి అయినటువంటి వశీకరణం గురించి, సమాచారాన్ని అందించడం మాత్రమే నా ప్రయత్నం. వశీకరణం ఆమోద యోగ్యమే కానీ, చెడు పద్ధతిలో దీనిని ఆచరించడం శాస్త్ర నిషిద్ధమని, ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
చీకటి-వెలుతురూ, మంచి-చెడు, ధర్మం-అధర్మం, ఎలా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయో, అలాగే, ఈ ప్రపంచంలో దైవీ శక్తీ, క్షుద్ర శక్తీ, రెండూ ఉంటాయి. ఒక మనిషి మనని ఆకర్షిస్తూ ఉన్నాడంటే, కచ్చితంగా అతనిలో వశీకరణ శక్తి ఉందని అర్థం. పూర్వం ఋషులూ, మహర్షులూ, ఎక్కువగా అడవి ప్రాంతాలలో ఉండేవారు. అరణ్యాలలో వన్యమృగాలు ఎక్కువగా ఉంటాయి. తమను తాము కాపాడుకోవడానికి, వారు కొన్ని వశీకరణ శక్తులను ఉపయోగించి, ఆ మృగాలు దాడి చేయకుండా, వాటితో కలసి, ఆ ప్రాంతాలలో నిర్భయంగా ఉండేవారు. మంత్ర విధానం, కాల క్రమంలో తంత్ర విధానంగా మారింది. అది నేడు, యంత్ర విధానంగా రూపాంతరం చెందింది.
నిజానికి వశీకరణం అంటే ఒక స్త్రీని గానీ, ఒక పురుషుడిని గానీ లోబరచుకోవడం కాదు. ఒక వ్యక్తి యొక్క ఇష్ట కామ్యాలను సిద్ధింపజేసుకోవడం. తమ కోరికలను నెరవేర్చుకోవడానికి కామ్య ప్రయోగం చెయాలంటే, వశీకరణ తంత్రాన్ని ఉపయోగిస్తారు. అప్పట్లో సిద్ధులూ, మునులూ ఎంతో కఠోర తపస్సు చేసి, కామ క్రోధ మద మాత్సర్యాలను జయించడం కోసం, మంత్ర సాధన చేసేవారు. తరువాత తంత్రం వచ్చింది. దీనికి ఎటువంటి నియమాలూ లేవు. మద్య మాంసాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఉపవాసాలు చేసి, శుచీ, మడీ పాటించాల్సిన పని లేదు. తంత్రంలో ముఖ్యమైనది, కేవలం మంత్రాన్ని అనుష్టానం చేడమే. దృష్టి వశీకరణం, తిలక వశీకరణం, కాటుకను మంత్రించి వశీకరణం అనేటటువంటి తంత్ర పద్ధతులు, ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు దాదాపు కనుమరుగయై పోయాయని చెప్పవచ్చు.
ఇక ఇప్పుడు మంత్రాలూ, తంత్రాలూ రెండూ పోయి, యంత్రాలు వచ్చాయి. అంటే, ఒక యంత్రంలో మంత్ర రూపకంగా, తంత్ర రూపకంగా శక్తిని ఆవహన చేసి, అందులో నిక్షిప్తం చేస్తారు. యంత్రంలోకి సంఖ్యా శాస్త్ర పరంగా, మంత్ర శాస్త్ర పరంగా, బీజాక్షరాలను నిక్షిప్తం చేసి, ప్రాణ శక్తిని ఆవాహన చేస్తారు. ఆ విధంగా మంత్రాన్ని ఆవాహన చేసి, దానికి శక్తిని ఆపాదించిన యంత్ర రేకును ఎవరయితే దగ్గర పెట్టుకుంటారో, వారికి వశీకరణ శక్తి వస్తుంది. ఇక వ్యక్తి స్వయంగా విద్యను నేర్చుకుని ప్రయోగించాల్సిన అవసరం లేదు. కన్ను ద్రిష్టి యంత్రాలూ, వ్యాపారాభివృద్ధి యంత్రాలూ, సంపదనిచ్చే లక్ష్మీ కుబేర యంత్రాలని మనం చూస్తూనే ఉంటాం. అవి ఈ కోవకు చెందినవే. ధనాకర్షణ, ప్రజాకర్షణను కలిగించే యంత్ర వశీకరణకు సంబంధించినవి.
మన కోరికలకు సంబంధించిన యంత్రాలను తెచ్చి, మన గృహాలలో, వ్యాపార ప్రాంతాలలో పెట్టుకున్నట్లయితే, పరిస్థితులు అనుకూలిస్తాయని చాలామంది నమ్మకం. అయితే, ఈ వశీకరణం అనేది, మంచి చేయడం కొరకు మాత్రమే. దీని వలన ప్రాణ హాని కలిగే అవకాశాలు తక్కువ. వశీకరణాన్ని చెడు పద్ధతిలో ప్రయోగించే వారు, ప్రస్తుత కాలంలో చాలా అరుదుగా ఉన్నారు. సైన్స్ పరంగా చూసుకుంటే, సైకాలజీ ప్రకారం ఏ వ్యక్తినైనా మనం మోటివేట్ చేయొచ్చని, సైకాలజిస్టులు చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి కళ్లలో ఏదో తెలియని శక్తనేది ఉంటుంది. ఆ శక్తికి, వశీకరణ విద్య ద్వారా మరింత శక్తి ఆపాదించబడుతుంది. దాంతో మనుషులను మాత్రమే కాకుండా, జంతువులను కూడా వశీకరణ చేయొచ్చు. దీనిని పక్కన పెడితే, కొన్ని మూలికలను తెచ్చి, మనం చెప్పిన మాటలు వినని వారికి, తినే ఆహారంలో కానీ, తాగే నీటిలో కానీ కలిపి ఇస్తే, వశీకరణం జరుగుతుంది. ఇందులో వశీకరణ అనేది వేరుగా ఉంటుంది. అలాగే, ఆకర్షణ కూడా మరోలా ఉంటుంది.
మనం ఎవరివైపైనా ఆకర్షితులమయ్యామంటే, వారిలో వశీకరణ చేసే శక్తి ఉండబట్టే, ఆకర్షితులమవుతాము. వశీకరణ శక్తనేది, స్వాభావిక శక్తి. ఇలా కాకుండా, గుప్త విద్యతో అంటే, మంత్ర విద్యతో వశీకరణ చేస్తారు. పూర్వకాలంలో దేవతలకు వశీకరణ శక్తి ఉండేది. మనుష్యులు జనాకర్షణ, జన వశీకరణ విద్య, ఆకర్షణ విద్య, వశీకరణం అనే విద్యలను, కఠోర దీక్షతో సాధించగలుగుతారు. ఇది ఎక్కువగా పూర్వకాలంలోనే ఉండేది. కానీ, ప్రస్తుత కాలంలో ఇటువంటి వశీకరణ చేసే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మనుషులలో స్త్రీ పురుషులు ఎలా ఉంటారో, మూలికలలో కూడా స్త్రీలను మరియు పురుషులను ఆకర్షించి వశీకరణ చేసే మూలికలు వేరు వేరుగా ఉంటాయి.
ఒక వ్యక్తి మెదడునూ, ఆలోచనలనూ కంట్రోల్ చేయాలంటే, neuroreceptors అవసరం. ఇది మెదడు పనితీరుకి సహాయపడుతుంది. మంత్రాలు స్మరించడం వల్లా, వాటి శక్తివల్లా, ఒక వ్యక్తిపై మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. రెగ్యులర్ గా కొన్ని మంత్రాలను వినడం వల్ల, ఒక వ్యక్తి మానసిక చర్యపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సులపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సుపైనా, శరీరంపైనా, వారికి ఆధీనం తప్పింపజేయడమే, హిప్నాటిజం. అలా ఆధీనం తప్పిన వ్యక్తులు, నిద్రావస్థలోకి వెళ్ళి, తమకు తెలియకుండానే, హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్ధతిని కూడా, మనం చూడవచ్చు. దీనిని 'మెస్మరిజం' అని కూడా అంటారు.
19వ శతాబ్దంలో రోగులను హిప్నటైజ్ చేసి, వారికి ఏ మాత్రం నొప్పి కలగని విధంగా, అనేక శస్త్ర చికిత్సలు చేసిన సంఘటనలను, మన భారత దేశంలో చూడవచ్చు. మత్తు మందిచ్చి రోగులకు ఆపరేషన్ చేసే విధానాన్ని ఇంకా కనిపెట్టని కాలంలో, మన పూర్వీకులు హిప్నోటిజం వంటి వశీకరణ విద్య ద్వారా, శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. రోగులకు ఎటువంటి నొప్పీ తెలియకుండానే, చికిత్సను పూర్తి చేసేవారు. అయితే, ఈ వశీకరణ పద్ధతి ద్వారా హిప్నటైజ్ చేసే వ్యక్తి నేరాలు చేయదలచుకుంటే, తన వశీకరణకు లోబడిన వారిని, దీర్ఘసుషుప్తిలోకి తీసుకెళ్ళి, తన ఇష్టం వచ్చినట్లు చేసిన సంఘటనలు, కొన్ని మనకు తారసపడతాయి. అందుకే మన దేశంలో వశీకరణం అనే విషయాన్ని, ప్రజలు ఎంత ప్రమాదకరంగా భావిస్తారో, విదేశాలలో కూడా హిప్నోటిజం నేరమే. వశీకరణ చేయబడిన వ్యక్తులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.
వశీకరణ చేయబడిన వారి మెదడు పలు విధాలుగా ఆలోచించదు. ఒకే విధంగా ఆలోచిస్తుంది. ఎవరయితే వశీకరణం చేస్తారో వారిపై ఎటువంటి కోపమూ రాదు. అతను చెడు చేస్తున్నా, వారికి మంచిగానే కనపడుతుంది. వేరే వ్యక్తులు చెడు అని చెప్పినా కూడా, వారికి మంచిగానే అనిపిస్తుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వశీకరణం చెందినవారిలో ముఖ్యమైన లక్షణం, రాత్రిపూట నిద్రపోకుండా, పగలు మొత్తం నిద్రపోతూ ఉంటారు. ఎంత మంచి భోజనం తిన్నా, శక్తి లేనట్లు బలహీనంగా తయారవుతారు. వారిలో చాలా మంకుతనం ఉంటుంది. వశీకరణం అయిన వారికి, ముఖంలో దైవ లక్షణం పోయి, ప్రేత లక్షణం ఉంటుంది. ముఖంలో తేజస్సు పడిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనబడిన వారికి వశీకరణం జరిగినట్టే గ్రహించవచ్చని, ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వశీకరణం అనేది, మంత్ర తంత్రం అయితే కాదు. ఇందులో కూడా సైన్స్ ఉంటుందని మనం గ్రహించాలి. వశీకరణం పేరుతో భయాందోళనలకు గురి చేసే వారిని, అస్సలు నమ్మవద్దు.
సనాతనధర్మాన్ని మించిన ధర్మం లేదు..
Comments
Post a Comment