శివుడు గొప్పా - విష్ణువు గొప్పా? Who is the Supreme Lord?


శివుడు గొప్పా - విష్ణువు గొప్పా?
శైవులకూ వైష్ణవులకూ మధ్య వైరం ఎందుకు ఏర్పడింది?

అద్వైతం అంటే రెండుగా లేకపోవడం. విశిష్టాద్వైతం అంటే ఒక్కటిగా ఉండేందుకు ప్రకృతిని ఉపాయంగా చేసుకోవడం. ఆదిశంకారాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని పాటించారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. మన పురాణాలను చూసుకున్నట్లయితే, ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని ఎక్కడా వివరించబడిలేదు. ‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అంటే, శివుడు, విష్ణువు, ఒక్కటే అని అర్థం. విష్ణు స్వరూపమైన కృష్ణుడు, సంతానాన్ని పొందడానికి పరమశివునికై తపస్సు చేశాడు. సతీ దేవిని కోల్పోయి విరాగిగా మారిన శివుడికి సహాయం చేసింది, విష్ణువు. మన పురాణాలలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. కానీ, నేటి సమాజంలో శివుడు గొప్పా, విష్ణవు గొప్పా అనే మీమాంసలో జీవిస్తున్నాము. కొన్ని శతాబ్దాల క్రితం శివ భక్తులకూ, విష్ణు భక్తులకూ మధ్య వైరం ప్రజ్వరిల్లింది. ఈ ఆహుతిలో రామానుజాచార్యుల వారు కూడా బలయ్యారు. శైవ రాజులు ఎంతో మంది, వైష్ణవులను నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. వైష్ణవ రాజులు కూడా శివ భక్తులతో కఠినంగా వ్యవహిరించారు. అసలు ఈ గొడవకూ, రామానుజాచార్యుల వారికీ సంబంధం ఏమిటి? రామానాజాచార్యుల వారు, శ్రీ రంగాన్ని వదిలి పారిపోవడానికి కారణమేమిటి? అసలు శైవులకూ - వైష్ణవులకూ మధ్య వైరానికి నాంది ఎలా పడింది? అనేటటువంటి రోమాంఛిత విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QEwUHp43AmU ]


మహా విష్ణువును ఆరాధించే వారిని వైష్ణవులనీ, పరమ శివుడిని పూజించే వారిని శైవులనీ పిలుస్తారు. వైష్ణవుల గురించి చెప్పాలంటే, ముందుగా రామానుజాచార్యుల వారి గురించి చెప్పుకోవాలి. రామానుజాచార్యుల వారు, 11వ శతాబ్దంలో జన్మించారు. ఆయన పరమ విష్ణు భక్తుడు. విశిష్టాద్వైతాన్ని నలుచెరగులా వ్యాపింప చేసిన తత్త్వవేత్త. రామానుజాచార్యుల వారి బోధనల వలన, ప్రజలు వైష్ణవం వైపు మొగ్గు చూపేవారు. అది శైవులకు నచ్చేది కాదు. రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంత వ్యాప్తిలో భాగంగా, బౌద్ధాయన ధర్మ సూత్రాలకు అసలైన భాష్యాన్ని నిర్వచించాలనుకున్నారు. అయితే, ఆ బ్రహ్మ సూత్రాల గ్రంధం, కాశ్మీరం లోని శారదా పీఠంలో ఉంది. ఆ సూత్రాలపై రామానుజాచార్యుల వారు తన ఉద్దేశ్యాన్ని రచించేందుకు, కంచి నుండి కాశ్మీరానికి కాలినడకన బయలుదేరారు.

రామానుజులతో పాటు ఆయన ప్రియ శిష్యులైన కూరేశుల వారు కూడా ఉన్నారు. వీరిరువురూ మార్గమధ్యంలో ఎన్నో రాజ్యాలలోని పండితులను తమ చర్చతో ఓడించి, అక్కడి వారిని వైష్ణవంలోకి మార్చారు. అలా చివరకు కాశ్మీర రాజ్యంలోకి అడుగుపెట్టారు. అప్పటి కాశ్మీర రాజు రామానుజాచార్యుల వారిని సాదరంగా ఆహ్వనించి, సన్మానించాడు. కాశ్మీర రాజు పరమ శివభక్తుడు కావడంతో, రామానుజుల వారిని తన ఆస్థానంలోని శైవ పండితులతో అష్టావధాన చర్చకు ఆహ్వనించాడు. అందుకు సమ్మతించిన రామానుజాచార్యులు, తన శిష్యుడు కూరేశితో కలసి, చర్చలో పాల్గోన్నారు. శైవం తరుపున కాశ్మీర పండితులందరూ ఉండగా, వైష్ణవం తరుపున కేవలం రామానుజాచార్యులూ, కూరేశి మాత్రమే ఉన్నారు.

ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఆ చర్చకు, ఆ రాజ్య ప్రజలందరూ తరలి వచ్చారు. కాశ్మీర పండింతులు అడిగిన ప్రతీ ప్రశ్నకూ, రామానుజాచార్యుల వారు అవలీలగా సమాధానాలను ఇచ్చారు. చివరకు కాశ్మీర పండితుల చర్చలో కూడా, రామానుజాచార్యుల వారే గెలిచారు. రామానుజుల వారి ప్రజ్ఞా పాటవాలకు అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. రామానుజాచార్యుల వారు తమ చర్చను ముగించిన తరువాత, తన ఉద్దేశ్యాన్ని రచించేందుకు బౌద్ధాయన ధర్మ సూత్రాల గ్రంథాన్ని ఇవ్వమని, అక్కడి పండితులను అడిగారు. మహా జ్ఞానులైన రామానుజాచార్యుల వారికి ఆ గ్రంథాన్ని ఇచ్చినట్లయితే, బ్రహ్మ సూత్రాలలోని లోపాలను ఎత్తి చూపించి, తన వ్యాఖ్యలు రచిస్తే,  శైవ మత నాశనం జరుగుతుందని వారు భావించారు. ఆ పండితులు రామానుజాచార్యుల వారితో, ఆ గ్రంథం పూర్తిగా చెదలు పట్టి పాడైపోయిందని చెప్పారు. దాంతో రామానుజాచార్యులు నిరాశతో వెనుదిరిగారు.

మార్గమధ్యంలో సాక్షాత్తూ శారదా మాత ప్రత్యక్షమై, ఆ మహా గ్రంథాన్ని ఆయనకు అందించి, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. దాంతో ఎంతో ఆనందించిన రామానుజులు శారదామాతకు నమస్కరించి, ఆమె చెప్పినట్లుగా అక్కడినుండి పయనమయ్యారు. ఇంతలో కాశ్మీర పండితులకు శారదా పీఠంలో ఆ ధర్మసూత్రాల గ్రంథం కనిపించక పోయేసరికి ఆశ్చర్యపోయి, ఆ సంగతిని వారు రాజుకు తెలియజేశారు. దానిని రామానుజాచార్యుల వారే సంగ్రహించారని భావించి, ఆ గ్రంధాన్ని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని తన భటులను ఆదేశించాడు. కాలి మార్గన వెళుతున్న రామానుజాచార్యుల వారినీ, కూరేశుల వారినీ, అశ్వాలపై వచ్చిన భటులు ముట్టడించారు. వారి వద్దనున్న బౌద్ధాయన ధర్మ సూత్రాల గ్రంధాన్ని లాక్కుని వెళ్ళిపోయారు. ఇక చేసేదేమీ లేక, రామానుజాచార్యులు దు:ఖంతో శ్రీరంగం చేరుకున్నారు.

అయితే, కొన్ని రోజుల తరువాత తన శిష్యుడైన కూరేశి ఒక పుస్తకాన్ని తీసుకుని వచ్చి, రామానుజాచార్యుల వారికి ఇచ్చారు. ఏమిటా పుస్తకమని చూడగా, అది బౌద్ధాయన ధర్మసూత్రాలను పొందుపరచిన నకలు పుస్తకం. అందులో ఒక్క అక్షరం పొల్లు పోకుండా వ్రాయబడి ఉంది. అది చూసి ఆశ్చర్యపోయిన రామానుజుల వారు, అది ఎలా సాధ్యపడిందని శిష్యుడిని అడిగాడు. భటులు వచ్చేలోగా ఆ గ్రంథంలోని మొత్తం సారాంశాన్ని ఆకళింపు చేసుకున్నాను. గురువుగా మీ సంకల్పాన్ని సిద్ధింపజేసే తపాత్రయంతో, ఈ నకలు పుస్తకాన్ని రాశానని బదులిచ్చాడు. తన్మయత్వంతో రామానుజాచార్యుల వారు తన శిష్యుడిని ఆశీర్వదించారు. తరువాత బ్రహ్మ సూత్రాలను పూర్తిగా అర్ధం చేసుకుని, శ్రీ భాష్యాన్ని రాశారు రామానుజాచార్యుల వారు.

మరోవైపు కాశ్మీరీ పండితులను ఓడించిన రామానుజాచార్యుల వారి పేరు ప్రఖ్యాతులు, దేశ వ్యాప్తంగా మార్మోగిపోయాయి. అనేక మంది శ్రీ మహా విష్ణువే అసలైన ప్రభువని, వైష్ణవం లోకి చేరడం మొదలు పెట్టారు. అయితే, ఈ విషయం తమిళనాడులోని గంగైకొండ చోళపురం, అంటే, ఇప్పటి చిదంబరానికి రాజైన క్రిమికంఠుడికి మింగుడు పడని విషయంగా మారింది. పరమ శివ భక్తుడైన క్రిమికంఠుడు, శివతత్త్వం తప్ప మరే తత్త్వాన్నీ పూజించకూడదనీ, అందరూ శివుణ్ణి మాత్రమే ఆరాధించాలనీ ఆదేశించాడు. అయితే, కొంతమంది ప్రజలు రాజదండనకు భయపడి శైవాన్ని స్వీకరించారు. మరికొంత మంది, రాజుకు తెలియకుండా మహా విష్ణువుని ఆరాధించేవారు. తన శాసనాన్ని కాదని కొంతమంది విష్ణువును పూజిస్తున్నారని తెలుసుకున్నాడు క్రిమకంఠుడు. చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయించాడు. అందులోని స్వామి వారి విగ్రహాన్ని సముద్రంలో పారవేయించాడు.

ఆ తరువాత క్రిమికంఠుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆలయాలను ధ్వంసం చేయడమే కాదు. ప్రజల మనస్సులలో నుండి విష్ణువును సమూలంగా తొలగించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా, శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల వారినీ, ఆయన శిష్యులనూ బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. భటులు వస్తున్న విషయం ముందుగా తెలుసుకున్న కూరేశి, గురువు గారి వస్త్రాలను ధరించి, రామానుజుల వారి స్థానంలో భటులకు చిక్కాడు. భటులు కూరేశీతో పాటు, రామానుజుల గురువును కూడా ఆస్థానానికి తీసుకువెళ్ళారు. అస్థానంలోని పండితులతో జరిపిన చర్చల్లో కూరేశి గెలిచాడు. దాంతో ఆగ్రహించిన రాజు, శివుడు తప్ప మరెవరూ దేవుడు కాదు అని వ్రాసి ఉన్న ఒక లేఖను తెప్పించి, బహింరంగంగా చదవమన్నాడు.

అందులో ‘శివాత్పరతరం నాస్తి’ అంటే ఈశ్వరుని కన్నా ఎవరూ గొప్పవారు కాదని రాసి ఉంది. ఆ లేఖలో మరొక వాక్యాన్ని కలిపి చదివాడు కూరేశి. ‘శివాత్పరతరం నాస్తి. ద్రోణం అష్టితత: పరం’ అని పలికాడు. అంటే, అందరికంటే ఈశ్వరుడు గొప్పవాడు. విష్ణువు ఆయనకంటే గొప్పవాడని అర్థం. అది విన్న క్రిమికంఠుడు పట్టరాని కోపంతో కూరేశి కళ్ళను పీకించేశాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా వైష్ణవులు, రామానుజాచార్యుల వారిని అడవి మార్గం ద్వారా తిరు నారాయణ పురానికి పంపించేశారు. అదే ఇప్పటి మేల్కోటే. ఇది మైసూరుకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడే 12 సంవత్సరాల పాటు వైష్ణవం ఉన్నతికి కృషి చేశారు, రామానుజాచార్యుల వారు. తరువాత క్రిమికంఠుడు ఆనారోగ్యంతో చనిపోగా, రామానుజాచార్యుల వారు తిరిగి శ్రీరంగానికి చేరుకున్నారు. శ్రీరంగం రంగనాధ స్వామి ఆలయంలో ఆయన ఐక్యమై, మోక్షాన్ని పొందారు. రామానుజాచార్యుల వారు అతి గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని రాజ గోపురంపై నిలబడి, బహిరంగంగా అందరికీ తెలియజేశారు. దళితులను గుడి లోపలికి తీసుకు వెళ్లి, ప్రతి మనషీ దేవుడి దృష్టిలో సమానమే అని చాటి చెప్పిన మహోన్నతుడు.

ఇక దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే, ఆది శంకరుని రూపంలో అవతరించాడని, శివరహస్యమనే గ్రంధంలో పేర్కొనబడినది. ఆదిశంకారాచార్యుల వారు శివ పంచాక్షరీ స్తోత్రంతో పాటు, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, పాండురంగాష్టకం, భజగోవిందం, సౌందర్యలహరి, కనకథారా స్తోత్రం వంటి రచనలు అనేకం చేశారు. భగవద్గీతకు భాష్యాన్ని రచించారు. శైవుడయిన ఆదిశంకరాచార్యుల వారు వీటన్నింటినీ రచించి, హిందూ మత వ్యాప్తి కోసం పాటుపడ్డారు. ఈయన హిందూత్వాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. మన దేశం మీద ఎన్ని దండయాత్రలు జరిగినా, నేటికీ మన సనాతన ధర్మాన్ని సుస్థిరంగా నిలిపింది, ఇటువంటి మహానీయులే. కులం, వర్గం, శైవం, వైష్ణం అంటూ పోట్లాటలు పెడుతూ, మన మధ్యే ఉంటూ, సనాతనమైన మన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని ఎంతో మంది చదువుకున్న కుహానా మేధావులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికైనా మేలుకుని..

ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌

అని మనుస్మృతిలో చెప్పబడింది. దీని ప్రకారం ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం.

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home