గరుడపురాణం ప్రకారం యమలోకంలోని నగరాలు! 16 cities on the way to Yamaloka - Garuda Puranam


గరుడపురాణం ప్రకారం యమలోకంలోని నగరాలు!
పాపాలు చేసినవారు ‘యమలోకానికి’ ఈ నగరాలను దాటి వెళ్ళాలా?

మన పురాణ ఇతిహాసాల ప్రకారం, పాపపు కర్మలు చేసి మరణించిన ప్రతీ ఆత్మ, నరకానికి వెళుతుంది. అక్కడున్న వైతరణీ నదిని దాటి, యముడి చేత తీర్పుపొంది, యమలోకంలో శిక్షలు అనుభవిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ, యమలోకంలో అనేక నగరాలున్నాయి. వాటిని దాటుకుంటూ, అక్కడ వివిధ రకాల యాతనలను అనుభవించిన తరువాతే, యమలోకానికి చేరుకుని శిక్షలు పొందడం జరుగుతుంది. గరుడ పురాణంలో, యమలోకంలో దక్షిణ ద్వారం గుండా ఉన్న 16 నగరాల గురించిన వివరణ ఉంది. శ్రీహరి చెప్పిన ఆ 16 నగరాలు ఏంటి? ప్రేతాత్మ ఏ ఏ నగరాలలో ఎటువంటి హింసలను పొంద వలసి ఉంటుంది? అసలు వైతరణీ నది ఎలా ఉంటుంది? దానిని దాటడానికి గల మార్గం ఏంటి – అనేటటువంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/M4qpRO8wrtw ]


శరీరం వదిలిన ప్రేతాత్మ యమలోకానికి చేరే క్రమంలో, కొన్ని హింసలను భరించాల్సి ఉంటుంది. కొంతమంది పాపాత్ములను యమభటులు అంకుశాలతో గుచ్చుతూ, వీపు మీద పొడుస్తూ, తాళ్ళుకట్టి ఈడుస్తూ లాక్కు పోతారు.  మరికొంత మందిని ముక్కు చివర త్రాళ్ళు కట్టీ, కొందరిని చెవులకు తాళ్ళు కట్టీ, యమపాశాలతో బంధించి ఇంకొందరినీ, ఈడ్చుకు పోతారు. యమభటులు కొందరు దుర్మార్గులను, కంఠానికీ, చేతులకూ, పాదాలకూ సంకెళ్ళు వేసి ఈడ్చుకు పోతారు. కొంతమంది యమదూతలు పాపాత్ములను ముద్గరం అనే ఆయుధంతో కొట్టి, నోటినుంచి రక్తం కక్కుకునేలా చేసి, తిరిగి ఆ రక్తాన్నే వారిచేత త్రాగిస్తారు. ప్రాణులందరూ తాముచేసిన పాపకర్మలను తలుచుకుంటూ, ఏడుస్తు, ఎన్నో యాతనలు పడి, యమలోకానికి వెళతారు. ఈ విధంగా జీవుడు యమ మార్గంలో ప్రయాణం చేస్తూ, ఎన్నో బాధలు పడి దుఃఖిస్తూ, తన పూర్వజన్మలో చేసిన పాపాలను తలచుకుని, వాటిని గురించే ఆలోచిస్తూ, వేగంగా ముందుకు వెళతాడు. ఇలా పదిహేడు రోజులు ప్రయాణించి, పద్దెనిమిదవ రోజు నాటికి, గరుడపురాణంలో చెప్పబడిన పదహారు పట్టణాలలో మొదటి పట్టణమైన సౌమ్యానికి చేరుకుంటాడు.

1. సౌమ్యనగరం: ఆ నగరం చంద్ర సంబంధమైనది. అక్కడ ఎంతో మంది ప్రేతాత్మల సమూహాలుంటాయి. పుష్పభద్ర అనే నది అక్కడ ప్రవహిస్తుంది. దాని పరిసరాలలో, విశాలమైన మర్రి చెట్లు ఉంటాయి. యమలోకానికి జీవులను తీసుకుపోయే యమభటులు, ఆ నగరంలో వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనిస్తారు. అప్పుడా ప్రేత శరీరుడు ఇంకా మోహాన్ని విడవకుండా, "అయ్యో! నేను మరణించాక నా భార్య ఎలా ఉందో? నా పిల్లలు ఏంచేస్తున్నారో? నేను సంపాదించిన ధనం క్షేమంగానే ఉన్నదా?” వంటి విషయాలు ఆలోచిస్తూ, దుఃఖిస్తూ ఉంటాడు. అదే సమయంలో యమభటులు వచ్చి, ‘మూర్ఖులారా! మీ భార్యా బిడ్డలు ఎక్కడున్నారు? ఎందుకలా విలపిస్తున్నారు. వాళ్ళకీ మీకూ సంబంధం ఎప్పుడో తెగిపోయింది. విశ్రమించింది చాలు.. ఇక బయలుదేరండి’ అని కసిరి కొడతారు. ప్రేత శరీరులు, తమ పుత్రులు, లేక మనమలు శ్రద్ధగా 'మాసికం' చేసి సమర్పించిన పిండాన్ని ఆ సౌమ్యనగరంలోనే భుజించి, అక్కణ్ణుంచి బయలుదేరి, సౌరి అనే నగరానికి వెళతారు.

2. సౌరి నగరం: అది సూర్యసంబంధమైనది. అక్కడ యమధర్మరాజుతో సమానుడైన 'జంగముడు' అనే పేరుగల రాజు ఉంటాడు. అతడిని చూడగానే, ప్రేత జీవుడికి ఎంతో భయం వేస్తుంది. అక్కడ కొద్దికాలం విశ్రాంతి తీసుకుని, నెలరోజులకు పైన, నలభై అయిదురోజుల లోపు చేసే త్రైపాక్షిక శ్రాద్ధంలో పెట్టిన పిండాలను భుజించి, అక్కణ్ణుంచి లేచి బయలుదేరుతాడు. దారిలో అతడికి భయంకరమైన వనాలు ఎదురౌతాయి.

3. నరేంద్ర భవనం: కొండల మీద ఉండే ఈ నగరాన్ని చేరుకున్న ప్రేత శరీరుడు అక్కడే కొద్ది సేపు విశ్రమిస్తాడు. రెండు నెలల తరువాత ఆ నగరానికి చేరిన ప్రేతుడు, రెండవ నెల మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాలను ఆరగించి, సంతోషంగా ఉంటాడు. అంతలోనే తిరిగి యమ భటులు అతడిని పాశాలతో బంధించి, ముందుకు తీసుకుపోతారు.

4. గంధర్వ శైలం: నరేంద్ర భవనం నుంచి బయలుదేరిన ప్రేతుడు, యమభటుల ద్వారా తీసుకు రాబడి, గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ మూడవ మాసికంలో తనకు ఇవ్వబడిన పిండాలను స్వీకరించి, తిరిగి నడవటం మొదలుపెడతాడు.

5. శైలాగమం: నాలుగవ మాసం నాటికి, ప్రేతుడు శైలాగమం అనే నగరానికి చేరుకుంటాడు. అక్కడ నాలుగవ మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాలనూ, జలాన్నీ గ్రహించి, ఐదవ మాసం వచ్చేసరికి, క్రౌంచ పట్టణానికి చేరుకుంటాడు.

6. క్రౌంచం: క్రౌంచపట్టణం కొంగలకు నిలయం. ఆ పట్టణానికి చేరుకున్న ప్రేతుడు, అయిదవ 'మాసికంలో' తన పుత్రులు పెట్టిన పిండాన్ని ఆరగిస్తాడు. కొద్దికాలం అక్కడ గడిపి, క్రూర పురం అనే పట్టణానికి వెళతాడు.

7. క్రూర పురం: క్రూరపురానికి చేరిన ప్రేతుడు, ఐదు నెలల పదిహేను రోజులు గడిచాక, ‘ఊన షాణ్మాసికం’ అనే శ్రాద్ధ క్రియలో ఇవ్వబడిన పిండాలనూ, జలాన్నీ స్వీకరించి సంతృప్తి చెందుతాడు. అక్కడ కొన్ని ఘడియలు విశ్రాంతి తీసుకుని, తరువాత యమ భటులు లాక్కుపోగా, ఎంతగానో విలపిస్తూ, యమధర్మరాజు సోదరుడైన విచిత్రుడు పాలించే చిత్ర భవనానికి చేరుకుంటాడు.

8. చిత్రపురి-వైతరణీ నది: ప్రేతుడు చిత్రపురిని చేరగానే, మహాభయంకరంగా వున్న విచిత్రుడు దర్శనమిస్తాడు. ఆయనను చూసి భయపడి పారిపోవటానికి ప్రయత్నించే ప్రేతుడితో, అక్కడున్న కొందరు పల్లెవాళ్ళు, "ప్రేతుడా! ఇది చిత్రపురి. ఇదిగో ఇక్కడ వైతరణీనది ప్రవహిస్తోంది. దీనిని నీవు దాటి ముందుకు సాగాలి. అదిగో అక్కడొక ఓడ ఉంది. అది పుణ్యాత్ములకు మాత్రమే. నీవేదైనా పుణ్యం చేసి ఉంటే, నిన్నా ఓడ ఎక్కిస్తాం. లేదంటే, నీవీ నదిని ఈదుకుంటూ వెళ్ళాల్సిందే” అని చెబుతారు. తత్త్వాన్ని గ్రహించిన మునీశ్వరులు, దానం చేయటాన్ని 'వితరణ' అని వ్యవహరించారు. అలాంటి వితరణ చేసిన వాళ్ళే, ఈ వైతరణీ నదిని దాటటానికి సమర్ధులు. అందుకే ఈ నదికి 'వైతరణీ' అనే పేరు వచ్చింది.

ఆ వైతరణీ నది, యమలోకానికి చేరే మార్గంలో అడ్డంగా ప్రవహిస్తుంది. అది ఎంతో లోతైనదీ, భయంకరమైనదీ. దానిపేరు వింటేనే భయం కలుగుతుంది. ఇక దానిని చూస్తే చెప్పేదేముంది! ఆ వైతరణీనది వంద ఆమడల వెడల్పుతో, చీము నెత్తురు ప్రవాహంతో, మాంసపు బురదతో, ఎముకల గుట్టలతో అత్యంత జుగుప్సాకరంగా వుండి, భయాన్ని కలిగిస్తుంది. ఎంతో లోతైన ఆ నది, దాటటానికి అలవి కాకుండా ఉంటుంది. ఆ నదిలో అసంఖ్యాకమైన వెంట్రుకలు నాచులా ఉంటాయి. అందులో భయంకరమైన మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. అలాంటి వైతరణీనది పాపాత్ములు తన దగ్గరకి రాగానే మంటలతో, పొగతో ముందుకు దూసుకొస్తుంది. ఆ నదీ తీరంలో, సూదిమొనలాంటి ముక్కుతో, పొడిచి చంపే కాకులూ, గ్రద్దలూ విహరిస్తూ ఉంటాయి. అలాగే, జీవులను చీల్చి చెండాడే ఎన్నో నీటి జంతువులు ఆ నదిలో సంచరిస్తూ ఉంటాయి. ఎంతో ఘోరమైన పాపాలు చేసినవారు వైతరణీనదిలో పడి, అమ్మో! అయ్యో! తండ్రీ! నాకెంత కష్టం వచ్చింది! నేనెలా తట్టుకోగలను? నావల్ల కావటంలేదు.. అని దారుణంగా విలపిస్తారు. వైతరణీ నదిని చూడగానే, పాపాత్ములు మూర్ఛ వచ్చి పడిపోతారు. ఆకలి బాధకి తట్టుకోలేక, ఆనదిలో ప్రవహించే రక్తాన్నే త్రాగుతారు. ఆ నది తేళ్ళతో, నల్లటి సర్పాలతో వ్యాపించి ఉంటుంది. ఆ నదిలో పడ్డవాళ్ళను ఎవరూ రక్షించలేరు. పాపాత్ములు వైతరణిలో పడి, అందులోని సుడిగుండాలలో చిక్కి పాతాళం దాకా వెళ్ళి, మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ విధంగా ఎన్నో కష్టాలూ, బాధలూ పడుతూ, ఎలాగో వైతరణిని దాటుకుంటూ, పాపాత్ములు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ, యమలోకానికి వెళతారు.

చిత్రపురికి వెళ్ళిన ప్రేతాత్మలతో అక్కడి పల్లెవాళ్ళు,  "జీవుడా! పోనీ నీవు జీవించి ఉన్నప్పుడు, కనీసం ఒక్క గోవునైనా దానం చేశావా? చేసి ఉంటే, ఈ ఓడ మీద నిన్నెక్కించుకుని నది దాటిస్తాము. అదీ చేయకపోతే, నీకు ఓడ ఎక్కే అర్హత ఉండదు" అని అంటారు. అప్పుడా జీవుడు, ‘అయ్యో! నేనెంత అవివేకిని? కనీసం దానం కూడా చేయ లేదే! అందుకే కదా నాకీ దుఃస్థితి కలిగింది” అని విలపిస్తాడు. పాపాత్ముడైన ప్రేతుడు ఇలా విలపిస్తున్నప్పటికీ, యమకింకరులు జాలిచూపించకుండా, అతడిని ఎత్తి వైతరణిలో పడవేస్తారు. అలా నదిలో పడ్డ ప్రేతుడి ముఖానికి, గొలుసుతో ఉన్న ఒక ఇనుప కొక్కేన్ని గుచ్చి, చేపను లాక్కెళ్ళినట్టు అవతలి ఒడ్డుకు లాక్కెళతారు. నది అవతలి తీరానికి చేరాక ప్రేతుడు, పుత్రులు సమర్పించిన 'షాణ్మాసిక పిండాన్ని' తిని ఆకలి తీర్చుకుంటాడు.

9. బహ్వాపదం: వైతరణిని దాటి వచ్చిన ప్రేతుడు, బహ్వాపద పట్టణాన్ని చేరుకుని, అక్కడ కొద్ది ఘడియలు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ నగరంలో ఉన్నప్పుడు, తన పుత్రులు ఏడవ మాసికంలో సమర్పించిన పిండాలను భక్షిస్తాడు. అలా ఆ పట్టణం నుంచి బయలుదేరి, ఏడుస్తూ, ఆకాశ మార్గంలో ‘దుఃఖం’ అనే నగరానికి చేరుకుంటాడు.

10. దుఃఖ పురం: దుఃఖపురంలోకి ప్రవేశించిన ప్రేతుడు, ఎనిమిదవ మాసికంలో తన వారసులు అందించిన పిండాలను తిని కడుపు నింపుకుంటాడు. తిరిగి తొమ్మిదవ మాసం నాటికి, ఆక్రందన పురానికి చేరతాడు.

11. ఆక్రందన పురం: ఇది ఎందరో ప్రేతాల ఆక్రందనలతో, హాహాకారాలతో నిండి ఉంటుంది. ఎంతోమంది దారుణంగా అలా విలపిస్తుంటే చూసి, మతిచెడిన ప్రేతుడు, తాను కూడా దిక్కు తోచక, వారితో పాటు హాహాకారాలు చేస్తాడు. అక్కడ తొమ్మిదవ మాసికంలో పెట్టిన పిండాలను భక్షించి, ఎంతో కష్టంగా, సుతప్తం అనే నగరానికి వెళతాడు.

12. సుతప్తం: ఈ నగరం, పేరుకు తగ్గట్టే వేడిగా, శరీరాన్ని కాల్చేసేలా ఉంటుంది. ఆ నగరాన్ని చేరిన ప్రేతుడు, శరీరమంతా వేడెక్కిపోయి, ఎంతో వేదన పడతాడు. పదవ మాసంలో తనవారిచ్చిన పిండాన్ని భక్షించి, ఆకలి తీర్చుకుంటాడు. అక్కడ వేడిని భరించి, చేసేదేమీ లేక, తిరిగి బయలుదేరి, రౌద్ర పురానికి వెళతాడు.

13. రౌద్ర పురం: పేరుకు తగ్గట్టే, ఆ పురం ఎంతో భయానకంగా ఉంటుంది. అక్కడికి పదకొండవ మాసానికి, ప్రేత జీవుడు చేరుకుంటాడు. ఆ పట్టణంలో ఎన్నో భయంకరమైన సంఘటనలను చూసి, తీవ్రమైన దుఃఖాన్ని పొందుతాడు. అక్కడున్నప్పుడు ప్రేతుడు, తన పుత్రులు 'పదకొండవ మాసికంలో' పెట్టిన పిండాలను భుజించి, మరో పదిహేను రోజులకు, పయోవర్షం అనే నగరానికి చేరుకుంటాడు.

14. పయోవర్ష పురం: ఆ పురంలో, ధారాపాతంగా వర్షం కురుస్తూనే వుంటుంది. ఆ నగరాన్ని చేరిన ప్రేతుడు, ఆ వర్షంలోనే తడుస్తూ, ఎన్నో బాధలు అనుభవిస్తాడు. అక్కడుండగా తన వారు, సంవత్సరం పూర్తికాకుండా చేసే ‘న్యూనాబ్దికం' అనే శ్రాద్ధం ద్వారా ఇచ్చిన పిండాన్ని భక్షిస్తాడు. ఆ తరువాత సంవత్సరం పూర్తి కాగానే, శీతాఢ్యం అనే నగరానికి చేరుకుంటాడు.

15. శీతాఢ్య పురం: అది అత్యంత చల్లదనం కలిగిన ప్రదేశం. అక్కడ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. భయంకరమైన ఆ చలిలోకి ప్రవేశించిన ప్రేతుడు, తీవ్రమైన చలి బాధలు అనుభవిస్తూ, దారుణంగా విలపిస్తాడు. ఆ నగరంలో జీవుడలా బాధలు అనుభవిస్తూ, సంవత్సరం పూర్తయిన తరువాత, పుత్రుడు సమర్పించే ఆబ్దిక పిండాన్ని భుజించి, కొద్దిగా బలాన్ని పుంజుకుంటాడు.

16. మహాభీతి పురం: సంవత్సరీక శ్రాద్ధం ద్వారా కొంచెం శక్తిని పొందిన ప్రేత జీవుడు, యముడి పట్టణానికి దగ్గరలో వున్న మహాభీతి పురానికి చేరుకుంటాడు. ఆ నగరంలో, తనకు సంక్రమించిన ప్రేత శరీరాన్ని విడిచి పెట్టేస్తాడు. ఆ తరువాత, బొటన వ్రేలంత పరిమాణంతో, వాయువుతో సహా పదిహేడు తత్త్వాలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని, జీవుడు పొందుతాడు. అయితే, దానితో పాటు పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించటానికి, ఒక యాతనా శరీరాన్ని కూడా పొంది, యమభటులతో కలసి, ఆకాశమార్గంలో తిరుగుతుంటాడు.

ఈ వివరాలన్నీ చెప్పిన తరువాత, ‘అత్యంత భయంకరమైన యమపురికి నాలుగు ద్వారాలుంటాయి. ఇప్పటి దాకా నేను నీకు చెప్పినది దక్షిణ మార్గం గురించి మాత్రమే. ఈ విధంగా పాపాత్ములు యమ మార్గంలో ఎన్నో రకాల కష్టాలూ, బాధలూ అనుభవిస్తార’ని, శ్రీ హరి గరుత్మంతుడికి వివరించాడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home