మనిషిని దుఃఖపూరితంగా, చికాకు పరిచేలా చేసేవి ఏమిటి? భగవద్గీత Bhagavad Gita Chapter 17
మనిషిని దుఃఖపూరితంగా, చికాకు పరిచేలా చేసేవి ఏమిటి?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (27 – 31 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 27 నుండి 31 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/rHBlo2Ia35g ]
ఎటువంటి కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడతాడో చూద్దాము..
00:46 - రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః ।
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ।। 27 ।।
కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమౌతూ ఉండే కర్త, రజోగుణములో ఉన్నట్లు పరిగణించబడతాడు.
రాజసిక కర్తలు ఇక్కడ వివరించబడుతున్నారు. సాత్త్విక కర్తలు, ఆధ్యాత్మిక పురోగతిచే ప్రేరణ పొందితే, రాజసిక కర్తలు భౌతిక వస్తు విషయ సంపాదన కొరకు, అత్యంత ఆసక్తితో ఉంటారు. ఇక్కడున్న ప్రతిదీ తాత్కాలికమైనదే అనీ, మరియు అన్నింటినీ ఇక్కడ ఎదో ఒకరోజు వదిలి వేయాలనీ అర్థంచేసుకోరు. మితిమీరిన రాగముతో, భావోద్వేగానికి లోనవుతూ, వారు ఆలోచనలో పవిత్రత కలిగి ఉండరు. వారు కోరుకునే ఆనందము, ఈ ప్రాపంచిక వస్తువులలో ఉన్నదన్న నమ్మికతో ఉంటారు. అందుకే వారికి అందిన దానితో తృప్తి చెందక, 'లుబ్దః' అంటే, ఇంకా కావాలనే దురాశతో ఉంటారు. ఇతరులు తమకన్నా ఎక్కువ సాధిస్తూ, లేదా ఎక్కువ భోగిస్తూ ఉంటే, వారు హింసాత్మకముగా మారతారు. వారి ప్రయోజనం సిద్ధించటానికి, ఒక్కోసారి నైతికతను విడిచిపెట్టటం వలన, అశుచిః అంటే, అపవిత్రముగా అయిపోతారు. వారి కోరికలు తీరినప్పుడు, అతిగా సంతోష పడతారు. అవి తీరకపోతే, నిరాశ చెందుతారు. ఈ విధంగా వారి జీవితాలు, హర్షము, శోకముల మిళితముగా ఉంటాయి.
02:21 - అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః ।
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ।। 28 ।।
క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు, మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసే కర్తలను, తమోగుణ కర్తలు అంటారు.
శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, తామసిక కర్తలను గురించి వివరిస్తున్నాడు. వారి మనస్సు చెడు భావములలో నిమగ్నమై పోవటం వలన, వారు అయుక్త, అంటే, క్రమశిక్షణ తప్పి ఉంటారు. ఏది సరియైనదో, ఏది చెడుమార్గమో చెప్పే ఉపదేశాలను, శాస్త్రములు మనకు అందిస్తాయి. కానీ, తమోగుణ పనివారు, 'స్తబ్ధః' అంటే, మూర్ఖ చిత్తులు. వారు తమ చెవులను, మరియు మనస్సునూ, సరియైన తర్కబద్ధ విషయములను గ్రహించటానికి, సిద్దముగా ఉంచరు. అందుకే వారు తరచుగా, శఠః అంటే, మోసప్రవృత్తి కలవారై, మరియు నైష్కృతిక అంటే, నిజాయితీ లేని నీచ ప్రవృత్తి కలవారై ఉంటారు. వారు ప్రాకృతః అంటే, అసభ్యకరంగా ఉంటారు. ఎందుకంటే, వారు తమ పశు-బుద్ధిని నియత్రించుకోవటం యొక్క అవసరాన్ని గ్రహించలేరు. వారు చేయవలసిన కర్తవ్యములు ఉన్నా, ఆ పరిశ్రమను కష్టతరమైనదిగా, మరియు దుఃఖకరమైనదిగా పరిగణిస్తారు. అందుకే వారు సోమరితనంతో, మరియు కాలయాపన చేసే వారుగా కొనసాగుతారు. వారి యొక్క తుచ్ఛమైన నీచ ఆలోచనలు, అందరికన్నా వారినే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి; అవి వారిని దుఃఖపూరితంగా, మరియు చికాకు పరిచేలా చేస్తాయి.
04:05 - బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ।
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ।। 29 ।।
ఇక వినుము ఓ అర్జునా.. ప్రకృతి త్రిగుణముల ప్రకారం, బుద్ధి మరియు ధృతుల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను.
గత తొమ్మిది శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు కర్మ యొక్క అంగములను వివరించివున్నాడు. ఈ మూడు అంగములూ, ఒక్కోటి మూడు రకాలుగా ఉంటాయని చెప్పివున్నాడు. ఇక ఇప్పుడు, ఈ కర్మ యొక్క శ్రేష్ఠత, మరియు పరిమాణములను ప్రభావితం చేసే రెండు విషయములను వివరిస్తున్నాడు. అవి కర్మను ప్రేరేపించటమే కాక, దానిని నియంత్రిస్తూ, దిశానిర్దేశం కూడా చేస్తాయి. ఇవే బుద్ధి మరియు ధృతి. బుద్ధి అంటే, ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల విచక్షణా సామర్ధ్యం. ధృతి అంటే - తీసుకున్న పనిని, కష్టాలు, అవరోధాలు ఉన్నా, ఎట్టి పరిస్థితిలోనైనా సాధించాలనే అంతర్లీనంగా ఉండే సంకల్ప బలం. ఈ రెండూ కూడా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా, మూడు రకాలుగా ఉంటాయి.
05:14 - ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ।। 30 ।।
ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకమని అర్థమైనప్పుడు, బుద్ధి సత్త్వగుణములో ఉన్నదని చెప్పబడును.
మనం నిరంతరం మన స్వేచ్ఛా చిత్తమును ఉపయోగించుకుని, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. మన ఈ నిర్ణయముల ఎంపికే, మనం జీవితంలో ఎటువెళతామో నిర్ణయిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, ఒక అభివృద్ధి చెందిన ఉన్నతమైన విచక్షణా సామర్థ్యము అవసరం. అర్జునుడికి సరైన విచక్షణా జ్ఞానమును అందిచటానికే, భగవద్గీత అతనికి ఉపదేశించబడినది. మొదట్లో అర్జునుడు తన కర్తవ్యము పట్ల అయోమయంలో ఉన్నాడు. తన బంధువుల పట్ల విపరీతమైన మమకారాసక్తి, అతనిని ఏది సరైన పనో, ఏది కాదో అన్న నిర్ణయంపట్ల అయోమయానికి గురి చేసింది. బలహీనతతో మరియు భయంతో, తీవ్ర అయోమయంలో ఆయన, భగవంతునికి శరణాగతి చేసి, ఆయనను తన కర్తవ్యము పట్ల జ్ఞానోపదేశం చేయమని, వేడుకున్నాడు. భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణ భగవానుడు, అర్జునుడికి విచక్షణా జ్ఞానమును పెంపొందించుకోవటానికి దోహద పడ్డాడు. సత్త్వ గుణము, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింపచేస్తుంది. అది వస్తువులూ, పనులూ, మరియు భావాలలో, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలిగే విచక్షణను పెంపొందింప చేస్తుంది. ఏ రకమైన కర్మ చేయాలి, ఏ రకమైన పని విడిచిపెట్టాలి; దేనికి భయపడాలి, దేనిని పట్టించుకోవలసిన అవసరం లేదు - అన్న జ్ఞానాన్ని, మనకు సత్త్వ గుణ బుద్ధిః ఎఱుకలోకి తెస్తుంది. అది మన వ్యక్తిత్వంలోని లోపాల యొక్క కారణాన్నీ, మరియు వాటికి పరిష్కారాన్నీ తెలియచేస్తుంది.
07:16 - యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ।
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ।। 31 ।।
ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము, ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన, ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో, అప్పుడా బుద్ధి రజోగుణములో ఉన్నట్టు.
వ్యక్తిగత మమకారాసక్తుల వలన, రాజసిక బుద్ధి మిశ్రితమైపోతుంది. కొన్ని కొన్ని సార్లు స్పష్టంగా చూడగలుగుతుంది. కానీ, స్వార్థ ప్రయోజనం కలగాలనుకున్నప్పుడు, అది కళంకితమై, అయోమయంలో పడిపోతుంది. ఉదాహరణకి, కొంతమంది వారి వృత్తులలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారు కానీ, కుంటుంబపర సంబంధాలలో పరిణితి లేని ప్రవర్తనతో ఉంటారు. వారు వృత్తి వ్యాపారాలలో ఏంతో విజయం సాధిస్తారు కానీ, కుటుంబ వ్యవహారాలలో ఘోర వైఫల్యం చెందుతారు. ఇది ఎందుకంటే, వారి యొక్క మమకారాసక్తియే, వారిని సరైన దృక్పథం, మరియు నడవడికతో ప్రవర్తించకుండా చేస్తుంది. రాజసిక బుద్ధి, రాగద్వేషములూ, ఇష్టాఇష్టములచే ప్రభావితమై, ఏది మంచి, ఏది చెడు అన్న విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేదు. ఏది ముఖ్యము, ఏది అనావశ్యకము, ఏది నిత్యము, ఏది తాత్కాలికము, ఏది విలువైనది, మరియు ఏది అల్పమైనదన్న విషయంలో, అది అయోమయంలో ఉంటుంది.
08:44 - ఇక మన తదుపరి వీడియోలో, చీకటితో ఆవృత్తమై ఉండే తమోగుణ బుద్ధి ఏ విధంగా ఉంటుందో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment