జ్ఞాన త్రిపుతీ! భగవద్గీత Bhagavad Gita Chapter 18


జ్ఞాన త్రిపుతీ!
మనిషి చేసే కర్మలను ప్రేరేపించే వీటి గురించి ఏమని చెప్పబడింది?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (17 – 21 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 17 నుండి 21 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/yrDn7Si7oPk ]


జ్ఞానము, కర్మ, మరియు కర్త.. ప్రకృతి త్రి-గుణముల పరముగా ఉండే వ్యత్యాసాలు ఏంటో చూద్దాం..

00:49 - యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే ।
హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హంతి న నిబధ్యతే ।। 17 ।।

కర్తృత్వ అహంకార భావమును, అంటే, చేసేది నేనే అన్న భావమును విడిచి పెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు. వారు కర్మ బంధనములకు లోనుకారు.

అయితే, శ్రీ కృష్ణుడు గత శ్లోకంలో మూఢ బుద్ధిని వివరించారు. ఇప్పుడు స్వచ్ఛమైన బుద్ధిని వివరిస్తున్నాడు. పవిత్రమైన బుద్ధి కలవారు, చేసేది తామే అన్న అహంకారమును విడిచి పెట్టి ఉంటారు. తమ కర్మ యొక్క ఫలములను భోగించాలనే కోరికతో కూడా ఉండరు. ఆ విధంగా వారు, తాము చేసిన పనుల యొక్క కర్మ బంధనములలో చిక్కుకోరు. కర్మఫలాసక్తిని విడిచిపెట్టిన వారు, పాపముచే కళంకితులు కారు. భౌతిక దృక్పథం పరంగా, వారు పనిచేస్తున్నట్లే ఉంటారు కానీ, ఆధ్యాత్మిక కోణంలో, వారు స్వార్ధ ప్రయోజనాలకు అతీతంగా ఉంటారు. కాబట్టే వారు కర్మఫలములకు బందీలు కారు. మనం సాధించిన వాటన్నిటికీ, కేవలం మనమొక్కళ్ళమే కారణమన్న భావన విడిచి పెడితే, అది మనలను కర్తృత్వ అహంకార భావన నుండి విముక్తి చేస్తుంది.

02:08 - జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ।। 18 ।।

జ్ఞానము, జ్ఞేయము అంటే జ్ఞాన విషయము, జ్ఞానమును ఎఱింగినవాడు - ఇవి మూడూ కర్మను ప్రేరేపించును. కర్మ యొక్క ఉపకరణం, క్రియ, కర్త - ఈ మూడూ కర్మ యొక్క అంగములు.

కర్మ శాస్త్రం విషయంపై ఒక చక్కటి పద్ధతి ప్రకారం ఉన్న తన విశ్లేషణలో, శ్రీ కృష్ణుడు దాని యొక్క అంగములను వివరించి ఉన్నాడు. చేసే పనుల యొక్క కర్మ ప్రతి ఫలములను కూడా వివరించాడు. అలాగే, కర్మ ప్రతిచర్యల నుండి ఎలా విముక్తి అవ్వవచ్చో కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు, కర్మను ప్రేరేపించే మూడు రకముల కారకములను వివరిస్తున్నాడు. అవి, జ్ఞానము, జ్ఞేయము అనగా జ్ఞాన విషయము, మరియు జ్ఞాత  అంటే జ్ఞానమును తెలిసినవాడు. ఈ మూడింటినీ కలిపి, 'జ్ఞాన త్రిపుతీ' అని అంటారు. ‘జ్ఞానము’ అనేది, కర్మకు ప్రధానమైన ప్రేరణను ఇచ్చేది; అది ‘జ్ఞాత’కు, ‘జ్ఞేయము’ను గూర్చి అవగాహన కల్పిస్తుంది. ఈ మూడూ కలిపి కర్మను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు, పనిచేసే సంస్థ ఇచ్చే జీతం యొక్క జ్ఞానమే, ఉద్యోగులకు పనిచేసే ప్రేరణ ఇస్తుంది; ప్రపంచంలో ఎన్నో చోట్ల బంగారం లభిస్తున్నదనే సమాచారమే, ఎంతో మంది కూలీలు ఆయా ప్రాంతాలకు వలస పోయేటట్లు చేస్తుంది; ఒలింపిక్స్ లో పతకం గెలవటం యొక్క ప్రాముఖ్యత తెలియటం వలననే, ఎంతో మంది ఆటగాళ్ళు సంవత్సరాల తరబడి అభ్యాసం చేసేందుకు, ప్రేరణను కలిగిస్తుంది. పని యొక్క నైపుణ్యం పై కూడా, ఈ జ్ఞాన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి, ప్రముఖ విద్యాసంస్థ నుండి పొందిన పట్టాకి, ఉద్యోగ వేటలో ఎక్కువ విలువ ఉంటుంది. ఉన్నత స్థాయి జ్ఞానం కలవారు, పనిని చక్కగా చేస్తారని, పారిశ్రామిక సంస్థలు అభిప్రాయపడతాయి. అందుకే, ప్రఖ్యాత సంస్థలు, తమ ఉద్యోగుల జ్ఞాన అభ్యున్నతికి బాగా ఖర్చు పెడతాయి. రెండవ సమూహాన్ని, 'కర్మ త్రిపుతీ' అని అంటారు. దానిలో ఉండేవి - కర్త అంటే చేసేవాడు, కారణము అంటే కర్మ యొక్క ఉపకరణము, మరియు కర్మ అంటే ఆ పని. ఈ మూడూ కలిపి కర్మ అంగములని అనుకోవచ్చు. 'కర్త' అనేవాడు, 'కారణము' ను ఉపయోగించుకుని, 'కర్మ' ను చేస్తాడు.

04:35 - జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ।। 19 ।।

జ్ఞానము, కర్మ, మరియు కర్త - ఇవి ప్రకృతి త్రి-గుణముల పరముగా, ఒక్కోక్కటీ మూడు రకాలుగా ఉంటాయని, సాంఖ్య శాస్త్రం పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెబుతాను వినుము.

శ్రీ కృష్ణుడు ప్రకృతి త్రిగుణముల ప్రకారముగా, జ్ఞానము, కర్మ, మరియు కర్తలను వివరించబోతున్నాడు. భారత తత్త్వశాస్త్రాలలో ఉన్న ఆరింటిలో, సాంఖ్య శాస్త్రం ఒకటి. ఈ శాస్త్రాన్ని పురుష ప్రకృతి వాదము అంటారు. అది ఆత్మను పురుషుడిగా, అంటే, ప్రభువుగా పరిగణిస్తుంది. కాబట్టి, చాలా మంది పురుషులున్నట్టు నిర్ధారిస్తుంది. ప్రకృతి అంటే భౌతిక శక్తి. దానిచే తయారు చేయబడిన అన్ని వస్తువులూ, అందులోకే వస్తాయి. సాంఖ్య శాస్త్రము ప్రకారము, పురుషునికి ప్రకృతిని భోగించాలనే కోరికయే, దుఖానికి మూల కారణం. ఈ భోగలాలస తగ్గిపోయినప్పుడు, పురుషుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క బంధనముల నుండి విముక్తి చేయబడి, నిత్య శాశ్వత పరమానందమును పొందుతాడు. సాంఖ్య శాస్త్రము, పరమ పురుషుడూ, లేదా పరమాత్మ యొక్క అస్థిత్వమును ఒప్పుకోదు. అందుకే అది ‘పరమ సత్యము’ను తెలుసుకోవటానికి సరిపోదు. అయినా కానీ, భౌతిక ప్రకృతి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటానికి మాత్రం, ఇదే మనకు ప్రమాణం.

06:06 - సర్వ భూతేశు యేనైకం భావమవ్యయమీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం ।। 20 ।।

ఏ జ్ఞానముచేనైతే, సమస్త విభిన్నమైన జీవరాశులలో, ఒకే, అవిభక్తమైన, అనశ్వరమైన అస్థిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో, ఆ జ్ఞానము సత్త్వ గుణములో ఉన్నట్టు.

ఈ సృష్టి మనకు విభిన్నమైన, రకరకాల జీవరాశుల, భౌతిక వస్తువుల సమూహముగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ, ఈ మొత్తం కనిపించే భిన్నత్వానికి వెనుక ఉన్న పదార్థము, ఆ పరమేశ్వరుడే. ఎలాగైతే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, అన్ని విద్యుత్ ఉపకరణములలో ప్రవహించేది ఒకే విద్యుత్తని ఏ విధంగా గమనిస్తాడో; ఒక కంసాలి, అన్ని ఆభరణములలో ఉండేది ఒకే బంగారమని ఎలాగైతే తెలుసుకుంటాడో, ఈ జ్ఞాన దృష్టి కలవారు, ఈ సృష్టిలో ఉన్న భిన్నత్వం వెనుక, ఏకత్వమును చూస్తారు. నాలుగు సూత్రముల ఆధారంగా, భగవంతుడిని శ్రీ కృష్ణ రూపంలో, అద్వయ జ్ఞాన తత్త్వముగా పరిగణించవచ్చు.

1. సజాతీయ భేద శూన్యము, అంటే, సజాతీయమైన వాటికంటే వెరైనది కాదు: రాముడు, శివుడు, విష్ణువు వంటి వేరే ఇతర అన్ని భగవత్ స్వరూపములకూ, శ్రీ క్రిష్ణుడు అబేధము. ఎందుకంటే వీరందరూ ఒకే భగవంతుని యొక్క భిన్నమైన వ్యక్తములు. శ్రీ కృష్ణుడు, ఆత్మలకు కూడా అభేదమే. అవి ఆయన యొక్క అణు అంశలే. ఎలాగైతే అగ్ని జ్వాలలు, అగ్ని యొక్క చిన్న చిన్న భాగాలో.. అంశ అనేది, దాని యొక్క పరిపూర్ణ భాగమునకు అభేదము.

2. విజాతీయ భేద శూన్యము, అంటే, విజాతీయమైన వాటి కంటే భేదము లేని వాడు: భగవంతునికి విజాతీయమైనది, మాయ; అది జడమైనది, భగవంతుడు, చైతన్యవంతుడు. కానీ, మాయ కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపమే. ఎలాగైతే అగ్ని యొక్క శక్తులైన వేడిమి, వెలుగు, దాని కంటే అభేదమో, శక్తి మరియు శక్తి మంతుడు కూడా, అభేదములే.

3. స్వగత భేద శూన్యము, అంటే, తన యొక్క వేర్వేరు అంగములు ఆయనకు అభేదము: భగవంతుని శరీరము యొక్క మహాద్భుతమైన లక్షణమేమిటంటే, దానిలో అన్ని అంగములూ, మిగతా అన్ని అంగముల పనీ చేస్తాయి.

బ్రహ్మ సంహిత ఇలా పేర్కోన్నది. తన శరీరము యొక్క అన్ని అంగములతో భగవంతుడు చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, వాసన చూడగలడు, తినగలడు, మరియు ఆలోచించగలడు. అందుకే భగవంతుని యొక్క అన్ని అంగములూ, ఆయనకు అభేదములే.

4. స్వయం సిద్ధము, అంటే, తనకు వేరే ఏ ఇతరమైన వాటి ఆధారమూ అవసరం లేదు: మాయ, మరియు ఆత్మ, రెండూ కూడా తమ అస్థిత్వం కోసం, భగవంతుని పైనే ఆధారపడి ఉన్నాయి. ఆయనే గనక వాటిని శక్తివంతము చేయకపోతే, వాటికి అస్థిత్వం లేదు. అదే సమయంలో, భగవంతుడు సర్వ స్వతంత్రుడు, మరియు తన మనుగడ కోసం ఏ ఇతరమైన వాటి ఆధారమూ, ఆయనకు అవసరం లేదు. సర్వోన్నతుడైన శ్రీ కృష్ణ ప్రరమాత్మ, ఈ పై నాలుగు లక్షణములనూ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన, అద్వయ జ్ఞాన తత్త్వము.. వేరే మాటల్లో చెప్పాలంటే, సృష్టిలో ఉండే ప్రతిదీ ఆయనే. ఈ అవగాహనతో, సమస్త సృష్టినీ ఆయనతో ఏకత్వముతో చూస్తే, అది సాత్త్విక జ్ఞానమవుతుంది.

09:35 - పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసమ్ ।। 21 ।।

ఏ జ్ఞానము చేతనయితే, భిన్నభిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడతాయో, ఆ జ్ఞానము రాజసికమని, అనగా రజోగుణములో ఉన్న జ్ఞానమని గ్రహించుము.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, రాజసిక జ్ఞానమును వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జగత్తు భగవత్ సంబంధముగా చూడబడదో, ప్రాణులు వేర్వేరుగా, తమతమ జాతి, తెగ, కులము, వర్గము, జాతీయత వంటి వాటిచే భిన్నముగా గ్రహించబడతాయో, ఆ జ్ఞానము రజోగుణ జ్ఞానమని చెప్పబడుతుంది. అటువంటి జ్ఞానము, ఒకే మానవ జాతిని ఎన్నో రకాలుగా విభజిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానము అందరినీ దగ్గరికి తెస్తుందో, ఐక్యతగా ఉంచుతుందో, ఆ జ్ఞానము, సత్త్వగుణ ప్రధానమైనది. విభజించే జ్ఞానము, రజోగుణ ప్రధానమయినది.

10:39 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి జ్ఞానము, ‘తామసిక’ జ్ఞానమని చెప్పబడుతుందో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home