కర్మ ఫల త్యాగి - భగవద్గీత | Bhagavad Gita - Karma Phala Tyagi
కర్మఫలత్యాగి!
శరీరధారులకు పూర్తిగా ఎటువంటి కర్మలూ చేయకుండా ఉండటం సాధ్యమా?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (11 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 11 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7ccCqvQVC90 ]
నిజమైన త్యాగి వేటిని త్యజించాలో చూద్దాం..
00:45 - న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ।। 11 ।।
దేహమును కలిగీ ఉన్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే తన కర్మ ఫలములను త్యజించినవాడే, నిజమైన త్యాగి అని చెప్పబడును.
కర్మ ఫలములను త్యజించటం కన్నా, అసలు కర్మలనే పూర్తిగా త్యజించటమే మేలు కదా! అని కొందరు వాదించవచ్చు. దానితో ఇక ధ్యానమునకూ, మరియు ఆధ్యాత్మిక చింతనకూ ఎలాంటి అవరోధమూ ఉండదని అనుకోవచ్చు. శ్రీ కృష్ణుడు అది ఆచరణకు సాధ్యంకానిదని తిరస్కరిస్తున్నాడు. ఎందుకంటే, శరీరధారులకు పూర్తిగా ఎటువంటి కర్మలూ చేయకుండా ఉండటం సాధ్యం కాదు. శరీర నిర్వహణకు అవసరమయ్యే పనులు, అంటే, భుజించటం, నిద్రపోవటం, స్నానం చేయటం, మొదలైనవి అందరూ చేయవలసినదే. అంతేకాక, నిల్చోవటం, కూర్చోవటం, ఆలోచించటం, నడవటం, మాట్లాడటం వంటి పనులు కూడా చేయకుండా ఉండలేము. ఒకవేళ మనం సన్న్యాసము, అంటే, బాహ్యమైన పనులు విడిచిపెట్టటమని అనుకుంటే, నిజంగా సన్యసించిన వారెవరూ ఉండరు.
02:01 - అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ।। 12 ।।
స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి, మరణించిన పిదప కూడా, సుఖము, దుఃఖము, మరియు ఈ రెండింటి మిశ్రమమూ, ఈ మూడు విధములుగా కర్మ ప్రతి ఫలములుండును. కానీ, కర్మఫల త్యాగము చేసిన వారికి, అటువంటి ఫలములు, ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఉండవు.
మరణించిన పిదప, ఆత్మ మూడు రకముల ఫలములను అనుభవిస్తుంది. అవి, 1) ఇష్టం అంటే, స్వర్గ లోకాలలో ఆనందకర అనుభవాలు, 2) అయిష్టం, అంటే నరక లోకాలలో బాధాకర అనుభవాలు. మరియు 3) మిశ్రమం, అంటే మానవ రూపంలో, భూలోకంలో మిశ్రమమైన అనుభవాలు. పుణ్య కర్మలు చేసినవారికి, స్వర్గాది లోకములు ప్రసాదించబడతాయి; పాప కర్మలు చేసినవారికి, నిమ్న లోకాలలో జన్మ ఇవ్వబడుతుంది; అలాగే, పుణ్య-పాప కర్మలు రెండింటినీ చేసినవారికి, మానవ జన్మ ఇవ్వబడుతుంది. కానీ, కర్మలను ఫలాపేక్షతో చేసినవారికే, ఇది వర్తిస్తుంది. ఇటువంటి ఫలాపేక్షను విడిచి, కేవలం భగవంతుని పట్ల విధిగా మాత్రమే చేస్తే, మన కర్మలకు ఎటువంటి ఫలమూ అంటదు.
03:20 - పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ।
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ।। 13 ।।
ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా, వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి, సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో, ఇప్పుడు చెబుతాను వినుము. అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది.
కర్మలను పుట్టించే హేతువులు ఏమిటి? అనే విషయాలను, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి ప్రకటించబోతున్నాడు. ఎందుకంటే, ఈ జ్ఞాన విషయము, కర్మ ఫలముల పట్ల అనాసక్తి పెంపొందించుకోవటానికి దోహదపడుతుంది. అదే సమయంలో, ఈ కర్మ యొక్క ఐదు అంగముల వివరణ, కొత్త విశ్లేషణ కాదు. ఇది ఇంతకు పూర్వమే, సాంఖ్య శాస్త్రములో కూడా చెప్పబడినదని వివరిస్తున్నాడు. ‘సాంఖ్య’ అనేది మహర్షి కపిలుడు ప్రతిపాదించిన తత్త్వ శాస్త్రము. అది శరీరములోని, మరియు ప్రపంచములోని వివిధ అంగముల విశ్లేషణ ద్వారా, ఆత్మ జ్ఞానమును పెంపొందిస్తుంది. కర్మ యొక్క వివిధ అంగముల విశ్లేషణ ద్వారా, కారణము మరియు దాని ప్రభావముల స్వభావములను కూడా, నిర్ధారణ చేస్తుంది.
04:34 - అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ।। 14 ।।
శరీరము, జీవాత్మ, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము - ఇవే కర్మ యొక్క ఐదు అంగములు.
ఈ శ్లోకంలో అధిష్టానం అంటే, ‘నివసించే స్థానము’ అని.. అంటే, శరీరమన్నమాట. ఆత్మ శరీరములో ఉన్నపుడే, కర్మలు చేయటానికి సాధ్యమవుతుంది. 'కర్తా' అంటే 'చేసేవాడు'. అంటే, 'జీవాత్మ' అన్నమాట. ఆత్మ తనంతట తానే కర్మలు చేయకపోయినా, అది శరీర-మనో-బుద్ధుల వ్యవస్థను, జీవప్రాణముతో కర్మలు చేయటానికి ఉత్తేజింప చేస్తుంది. అంతేకాక, అహంకార ప్రభావం వల్ల, ఆ కర్మలు చేసేది తానే అని అనుకుంటుంది. అందుకే, శరీరముచే చేయబడిన పనులకు, అది బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే, ఆత్మ 'తెలిసినవాడు' మరియు 'చేసేవాడు' అని పరిగణించ బడుతుంది. చూసేది, స్పృశించేది, వినేది, అనుభవించేది, రుచి చూసేది, ఆలోచించేది, మరియు అర్థంచేసుకునేదీ, ఆత్మయే. అందుకే ఆత్మను, కర్మలను 'తెలిసినది' మరియు 'చేసేది' అని పరిగణించాలి. కర్మలు చేయటంలో ఇంద్రియములు ఉపకరణములలా సహకరిస్తాయి. ఇంద్రియములు లేకుండా, ఆత్మ - రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దము వంటి వాటిని అనుభవించలేదు. వాటితోపాటుగా, ఐదు కర్మేంద్రియములు కూడా ఉన్నాయి - చేతులు, కాళ్ళు, వాక్కు, జననేంద్రియములు, మరియు గుదము. వీటన్నిటి సహకారం తోటే, ఆత్మ వివిధ రకాల పనులను చేస్తుంటుంది. అందుకే, కార్యములను సాధించటానికి, ఇంద్రియములు కూడా కారకములుగా పేర్కొనబడ్డాయి. కర్మ కొరకు అన్ని ఉపకరణములూ ఉన్నా, వ్యక్తి తను ప్రయత్నం చేయకపోతే, ఏ పనీ అవ్వదు. భగవంతుడు ప్రాణుల శరీరములో సాక్షిగా స్థితమై ఉంటాడు. వాటి వాటి పూర్వ కర్మానుసారం, వివిధ జనులకు కర్మలు చేయటానికి, భిన్నభిన్న సామర్ధ్యములను ఇస్తుంటాడు. దీనినే మనము దైవానుగ్రహము అనవచ్చు.
06:49 - శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ।। 15 ।।
06:59 - తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః ।
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ।। 16 ।।
శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కార్యము జరిగినా, అది మంచయినా లేదా చెడయినా, ఈ ఐదూ దానికి కారకములు. ఇది అర్థంకాని వారు, ఆత్మయే నిజమైన కర్త అని అనుకుంటారు. మలిన బుద్ధితో ఉన్న అటువంటి వారు, యథార్థమును గ్రహింప లేరు.
మూడు రకములైన కర్మలు ఏమిటంటే - కాయిక అంటే, శరీరముచే చేయబడినవి, వాచిక అంటే, మాటలచే చేయబడినవి, మరియు మానసిక అంటే, మనస్సుచే చేయబడినవి. వీటిలో ప్రతి ఒక్క వర్గంలో కూడా, పుణ్య కర్మలు చేసినా, లేదా పాప కర్మలు చేసినా, ఐదు కారకములే బాధ్యులు. అహంకారము చేత మనమే ఈ పనులు చేసేది అనుకుంటాము. ఈ జ్ఞాన విషయం తెలియచేయటంలో శ్రీ కృష్ణుడి ఉద్దేశం ఏమిటంటే, ఆత్మ యొక్క కర్తృత్వ-అహంకారమును నాశనం చేయటమే. ఈ విధంగా, కేవలం ఆత్మ మాత్రమే కర్మలను చేసేదని అనుకునేవారు, యధార్థమును చూడలేనట్టే. ఒకవేళ భగవంతుడు ఆత్మకు శరీరమును ఇవ్వకపోతే, అది ఏమీ చేసి ఉండగలిగేది కాదు. అంతేకాక, భగవంతుడు శరీరమును, ప్రాణముతో శక్తివంతము చేయకపోతే, అది కూడా ఏమీ చేసి ఉండగలిగేది కాదు. కర్మలు చేయటంలో జీవాత్మకు ప్రమేయం లేదని అర్థం కాదు. ఆత్మ శరీరమనోబుద్ధులను నియంత్రిస్తుంది. కానీ, చేనేది తానే అన్న భావమును అది కలిగి ఉండ రాదు. ఒకవేళ మనమే, కర్మకు ఉన్న ఒకే ఒక కారణం అనుకుంటే, మనమే ఆ కర్మల ప్రతిఫలమును అనుభవించాలని అనుకుంటాము. కానీ, కర్తృత్వ భావనను నిర్మూలించుకుని, ఇదంతా భగవంతుని కృప వలెనే, ఆయన ఇచ్చిన ఉపకరణముల వలననే సాధ్యమయినదని భావిస్తే, మనం మన కర్మ ఫలములకు భోక్తలము కామనీ, మరియు అన్ని పనులూ ఆయన ప్రీతికోసమే ఉన్నాయనీ, తెలుసుకుంటాము.
09:05 - ఇక మన తదుపరి వీడియోలో, జ్ఞానము, కర్మ, మరియు కర్త, ప్రకృతి త్రి-గుణముల పరంగా ఉండే వ్యత్యాసాల గురించి తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment