క్రతవే నమః Kratave Namaha
'క్రతవే నమః' - ఈ నామ జపంతో ఏం జరుగుతుంది?
అది సద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కుంభకోణం విజయం చేసిన సమయం. తంజావూరు జిల్లా మొత్తం కరవు కాటకాలతో బాధ పడుతున్నది. ఒక పుష్కరకాలంగా సకాలంలో వానలు లేక, ప్రజలంతా ఆకలి దప్పులతో కటకటలాడుతున్నారని, స్థానికులు రాఘవేంద్ర స్వామికి విన్నవించుకున్నారు. అప్పుడు తంజావూరును పాలిస్తున్న చోళ రాజు, రాఘవేంద్రస్వామి మహిమలు విని, రాఘవేంద్ర స్వామి వారిని శరణు వేడాడు. 'స్వామీ, ఒకప్పుడు ఈ చోళనాడు అన్నదాతగా ప్రసిద్ధి గాంచింది. అటువంటి సశ్యశ్యామలమైన ఈ ప్రాంతం, యిప్పుడు కరవుతో కటకటలాడి పోతున్నది. మా ప్రజలను మీరే కాపాడాలి' అని వేడుకున్నాడు.
ఆనాటి తంజావూరు ప్రజల ప్రవర్తన, నడవడికను గమనించిన రాఘ వేంద్రస్వామి, "రాజా! భగవంతుని ప్రీత్యర్ధం, ప్రజలు నిత్యమూ ఐదు రకాల యాగాలు నిర్వర్తించాలి. వాటికి పంచ మహా యజ్ఞాలని పేరు. అవి..
1. బ్రహ్మ యజ్ఞం... నిత్యం వేదాల నుండి ఒక భాగాన్ని పారాయణం చేయాలి.
2. దేవ యజ్ఞం... అగ్నిహోత్రం, ఔపోసన మొదలైన వైదిక కర్మలతో, దేవతలను తృప్తి పరచే ఆరాధన చేయాలి.
3. పితృయజ్ఞం... పితృదేవతలకి చేయ వలసిన తర్పణలు, కర్మలు యధా విధిగా చేయాలి.
4. మనుష్య యజ్ఞం... ఇంటికి వచ్చిన అతిధులకూ, పేదవారికీ భోజనం పెట్టాలి.
5. భూత యజ్ఞం... పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టాలి.
ఈ ఐదు విధాలైన యాగాలతో పాటు, వైదిక కర్మలన్నింటినీ శాస్త్రోక్తంగా అనుష్టించి, శ్రీ మహావిష్ణువును సంతోష పరిస్తే, సమృధ్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండుతాయి. ప్రకృతి పచ్చదనాలతో కళకళలాడుతుంది. మీ రాజ్య ప్రజలు తమ వైదిక కర్తవ్యాలు విస్మరించినందు వలన, ఈ రాజ్యంలో క్షామం తాండవిస్తున్నది.." అని చెప్పారు. ''ఇక్కడ వెంటనే 'కార్యేష్టి' అనే యాగాన్ని 21 రోజులపాటు శాస్త్రోక్తంగా చేయండి. వర్షాలు కురుస్తాయి, సుభిక్షమౌతుంది'' అని విశద పరిచారు.
మహారాజు ఆ విధంగానే యాగాలకు ఏర్పాటు చేశాడు. పండిత పురోహితుల ద్వారా యాగాలు చేయించి, మహా విష్ణువును సంతుష్టి పరచి, వానలు పడేటట్టు చేశారు గురు రాఘవేంద్రులు. కరుణామయుడైన మహా విష్ణువు, 12 ఏళ్ళ కరవు తీర్చాడు. రాఘవేంద్రుల
మహిమకు ముగ్ధుడైన తంజావూరు మహరాజు, స్వామికి ఒక బంగారు హారాన్ని కానుకగా ఇచ్చాడు. భోగ భాగ్యాల మీద ఆసక్తి లేని రాఘవేంద్ర స్వామి, తనకు ఉన్నదంతా ఆ శ్రీ మహావిష్ణువుకే సమర్పిస్తారు. అందుకే మహారాజు ఇచ్చిన బంగారు హారాన్ని యాగ గుండంలో వేసి, నారాయణార్పణం చేశారు.
తను కానుకగా యిచ్చిన బంగారు గొలుసును అగ్ని గుండంలో వేయడం చూసిన మహారాజుకు కోపం వచ్చింది. మహారాజు ముఖ కవళికలూ, మనో భావాలనూ పసి గట్టిన రాఘవేంద్ర స్వామి, హృదయ పూర్వకంగా యివ్వని ఆ గొలుసును భగవంతునికి సమర్పించ కూడదని భావించి, తన చేతిని అగ్ని గుండంలో పెట్టి, ఆ గొలుసును మరల బయటకు తీసి, మహారాజుకే యిచ్చి వేశారు. రాఘవేంద్రుల చేతులకు గానీ, ఆ నగకు గానీ, అగ్ని తాకిడి చిహ్నాలు ఏవీ కనిపించ లేదు. అది చూసిన మహారాజు విస్మయంతో, తన ప్రవర్తనకు పశ్చాత్తపం చేందాడు. తరువాతి కాలంలో మహారాజు, రాఘవేంద్ర స్వామి వారి భక్తుడిగా మారినట్లు చారిత్రక కధనం.
పంచ యజ్ఞాలతో నారాయణుని ఆరాధిస్తారు.. ఈ యజ్ఞాలతో నారాయణుని హృదయం ఆనందంతో కరిగి, అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఈ పంచ యజ్ఞాలకు 'క్రతువుల'ని పేరు. నారాయణుని క్రతువులతో ఆరాధిస్తున్నందు వలన, నారాయణుడు 'క్రతుః' అని పిలువ బడుతున్నాడు. ఈ నామము, సహస్ర నామాలలో 449వ నామము.
'క్రతవే నమః' అని అనునిత్యం జపించే భక్తుల జీవితాలలో, ఆ శ్రీమన్నారాయణుడు సదా సుఖ సంతోషాలను అనుగ్రహిస్తాడు...
ఓం సద్గురు శ్రీ మంత్రాలయ రాఘవేంద్రాయ నమః
Comments
Post a Comment