‘ధర్మ ద్వేషులు’ ఎటువంటి వారైనా అంతమొందక తప్పదు! Mahabharatam


‘ధర్మ ద్వేషులు’ ఎటువంటి వారైనా అంతమొందక తప్పదు!
భీముడి కొడుకు మరణించినప్పుడు శ్రీ కృష్ణుడు ఎందుకు ఆనందించాడు?

మహాభారతంలో ఎందరో వీరులూ, యోధానుయోధులూ ఉన్నారు. వారితోపాటు ఈ ఇతిహాసంలో ఎందరో వీర వనితల ప్రస్తావన కూడా మనకు కనిపిస్తుంది. శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రాన్ని ఓడించిన ఆ స్త్రీ ఎవరు? శ్రీ కృష్ణుడితో ఆమె యుద్ధం చేయడానికి గల కారణం ఏంటి? భీముడి కొడుకు మరణించినప్పుడు, కృష్ణ భాగవానుడు ఎందుకు నృత్యం చేస్తూ ఆనందించాడు?  శ్రీ కృష్ణుడు ఆ రాక్షస స్త్రీని ఎలా శాంతింపజేశాడు? అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Q48XqOWYIr4?si=TFzLUaVcqP-EK4qZ ]


లక్క గృహం దహనమైన తరువాత, దాని నుండి బయటపడిన పాండవులందరూ అరణ్యంలో అలసిపోగా, భీముడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరినీ విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్లి నీరు తీసుకుని వచ్చాడు. అందరూ అలిసిపోవటం చేత, ఓ చెట్టుకింద విశ్రమించారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. అయితే, పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా, హిడింబుడనే రాక్షసుడున్నాడు. నర వాసన వాడి ముక్కు పుటాలకు సోకింది. చెల్లెలు హిడింబను పిలిచి, “హిడింబా, మన ఆవాసానికి నరులు వచ్చారు. నోరు చవి చెడి ఉన్నది. ఆ నరులను చంపి, నాకు వండి పెట్టు” అని చెప్పాడు. అన్న ఆనతి మేరకు, హిడింబ పాండవుల దగ్గరకు వెళ్ళింది. పడుకుని ఉన్న పాండవులనూ, కాపలాగా ఉన్న భీముడినీ, చెట్టు చాటున నిలబడి చూసింది. భీముని మీద మనసు పడింది. వెంటనే, మానవకాంత రూపం ధరించి, అన్న చెప్పిన మాటలు మరచి పోయింది.

అన్నలకు కాపలాగా ఉన్న భీముడు, తన దగ్గరకు వస్తున్న హిడింబను చూశాడు. “ఎవరు నువ్వు? ఇక్కడకు ఎందుకు వచ్చావు?” అని అడిగాడు. “మహాభాగా, నా పేరు హిడింబ. నేను హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలిని. నిన్ను మోహించాను. నువ్వు నాకు భర్తవయితే, నా అన్న నీకు హాని చెయ్యడు. కాబట్టి నన్ను వివాహమాడు. మా అన్న సంగతి నీకు తెలియదు. అతను ఎవరినీ లెక్కపెట్టడు. ఇది నా అన్న హిడింబాసురిడి వనము. అతను చూసిన, మిమ్ములను బతుకనీయడు. నాతో రమ్ము, నిన్ను కోరిన చోటికి తీసుకుని పోతాను. మనం సుఖాలు అనుభవిస్తాము” అని బలవంతం చేసింది, హిడింబ. దానికి భీముడు, “వీరు నా తల్లి, తమ్ములు. ఒక స్త్రీ కోసం వీళ్ళను ఎలా వదలమంటావు?” అని అన్నాడు. “ఐతే వీరిని నిద్రలేపు. అందరం వెళ్లిపోదాము” అన్నది హిడింబ. “అదేమిటి అలా అంటావు. ఎవరో రాక్షసుడు వస్తున్నాడని, సుఖంగా నిద్రిస్తున్న తల్లీ, సోదరుల నిద్ర చెడగొట్టమంటావా?” అన్నాడు భీముడు.

ఈలోగా హిడింబాసురుడు తన చెల్లెలు ఎంతకూ రాకపోయేసరికి, తానే అక్కడకు వెళ్ళాడు. అతనిని చూసి హిడింబ, భీముని చాటుకు వెళ్లి దాక్కుంది. “రాక్షసా, నిన్ను వధించి, ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను” అని హిడింబాసురుడి మీదికి ఉరికాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. వారు చేస్తున్న గర్జనలకు, కుంతీ దేవీ, మిగిలిన పాండవులూ నిద్రలేచారు. హిడింబను చూశారు. “అమ్మా! నువ్వు ఎవరు?” అని అడిగింది కుంతి. “తల్లీ! నేను ఈ రాక్షసుడు హిడింబాసురుని చెల్లెలిని. నా పేరు హిడింబ. నీ కుమారుని భర్తగా వరించాను. నా అన్నయ్య, మీ కుమారుడు, భీకరంగా యుద్ధం చేస్తున్నారు” అని చెప్పింది. ఇంతలో అర్జనుడు యుద్ధం జరిగే చోటికి వెళ్ళాడు. “భీమా, తూర్పు అరుణంగా మారుతోంది. ఇది దుష్ట రాక్షసులకు అనుకూల సమయం. వెంటనే ఈ రాక్షసుడిని చంపు” అని అరిచాడు. ఆ మాటలు విని భీముడు విజృంభించి, హిడింబుని ఎత్తి గిర గిరా తిప్పి, నేలమీద పడేశాడు. హిడుంబుడి నడుము విరిగి నేలమీద పడి, ప్రాణాలు విడిచాడు. హిడింబకు ఆశ్చర్యం వేసింది.

భీముడు హిడింబను చూసి, “నువ్వు రాక్షస కాంతావు. మేము నిన్ను నమ్మము. నువ్వు మా వెంట రావద్దు” అని అన్నాడు. అప్పుడు హిడింబ కుంతీదేవిని చూసి, “అమ్మా, సర్వ ప్రాణులకూ కామ సంబంధమైన కోరికలు సామాన్యంగా ఉంటాయి. కానీ, స్త్రీలలో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను భీముని మీద మనసు పడ్డాను. అతని కొరకు అందరినీ వదులుకున్నాను. నా కోరిక తీరకపోతే, నేనే ప్రాణాలు విడుస్తాను. మీరు నన్ను స్వీకరిస్తే, మీకు ఎంతో సహాయంగా ఉంటాను. నాకు జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసు. మీకు జరగబోయే దానిని చెపుతాను వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో, శాలిహోత్రుడనే మహాముని ఆశ్రమము ఉంది. అక్కడ ఉన్న కొలనులోని నీరు త్రాగితే, ఆకలి దప్పులు ఉండవు. మీరు అక్కడ ఉండండి. కృష్ణద్వైపాయనుడు వచ్చి, మీకు హితోపదేశం చేస్తాడు” అని చెప్పింది. ఇది విని కుంతీదేవి ఎంతో సంతోషించింది.

భీముని చూసి, “భీమసేనా, నా మాట, నీ అన్నగారైన ధర్మజు మాటగా వినుము. హిడింబ ఉత్తమకాంత. ఈమెను పెళ్లి చేసుకో. నీకు మంచి జరుగుతుంది” అని చెప్పింది. భీముడు తల్లి మాట ప్రకారం, హిడింబను పెళ్లి చేసుకున్నాడు. తరువాత అందరూ శాలిహోత్రుని ఆశ్రమములో కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబ గర్భం ధరించింది. ఆమెకు ఘటోత్కచుడు జన్మించాడు. అతడు తండ్రి మాదిరిగానే, అమిత బలవంతుడు. తల్లి వద్దనుండి రాక్షస శక్తులను పొందిన మహా శక్తివంతుడు. కొంతకాలం తరువాత పాండవులు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళబోతున్న సమయంలో, ఘటోత్కచుడినీ, హిండిబినీ తనతో రమ్మని అడుగగా, అందుకు వారు నిరాకరించారు. హిండిబి తన కుమారుడితో కలిసి ఆ వనంలోనే ఉంటానని చెప్పి, వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఘటోత్కచుడు వారి ముందుకు వస్తాడని మాట ఇచ్చి, వారిని పంపించింది.

ధర్మరాజు ఇంద్ర ప్రస్థను పాలిస్తున్న కాలంలో, సభలో అందరూ కొలువుదీరి ఉన్న సమయంలో, ఘటోత్కచుడి వివాహ విషయం సంభాషణకు రాగా, అక్కడే ఉన్న శ్రీ కృష్ణుడు, కామాఖ్య అడవులలో ఉన్న రాక్షస జాతికి చెందిన స్త్రీ మౌర్వి, ఘటోత్కచుడికి సరైన వధువు అంటూ, ఆమె గురించి వివరించాడు. మౌర్వి పూర్వజన్మలో, అహిలావతి అనే గొప్ప నాగ కన్య. ఆమె తండ్రి నాగలోకాధిపతి అయిన వాసుకి. ఆమె గొప్ప శివభక్తురాలు. అహిలావతి కైలాసంలో పార్వతిదేవికి ఇష్టమైన సేవకురాలిగా ఉండేది. శివుని పూజ నిమిత్తం, పార్వతి దేవికి నిత్యం పూలను అందించేది. అయితే, ఒకనాడు అనుకోకుండా వాడిన పూలను శివుని పూజకు సిద్ధం చేయగా, పార్వతి దేవి ఆగ్రహించింది. ‘నువ్వు రాక్షస జాతిలో జన్మించి, రాక్షస రాణిగా పెరిగి, ఒక భయంకరమైన రాక్షసుణ్ణి వివాహం చేసుకుని బాధలు పడతావు’ అంటూ పార్వతీ దేవి శపించింది. అందుకు అహిలావతి, పార్వతి మాతను క్షమించమని అడిగి, తనను శాప విముక్తిరాలిని చేయమని అడిగింది.

దానిని వెనకకు తీసుకునే అవకాశం లేదు. కానీ, ఇంతకాలం నువ్వు చేసిన సేవలకు గాను, ఎటువంటి కష్టం నీకు రాకుండా కాపాడతానంటూ, అభయమిచ్చింది. ఆ విధంగా నాగకన్య అయిన అహిలావతి, పార్వతీదేవి శాపంతో, భూలోకంలో మురాసురుని కుమార్తెగా జన్మించింది. తన తండ్రి నరకాసురునికి సేనాధిపతి, మంచి స్నేహితుడు. మురాసురుడికి మౌర్వితో పాటు, ఏడుగురు కుమారులు కూడా జన్మించారు. నరకాసుర వధ సమయంలో, మురాసురునికీ, శ్రీ కృష్ణుడికి ఘోర యుద్ధం జరిగింది. తన ఏడుగురు కుమారులతో కలిసి మురాసురుడు రణరంగంలో పోరాడగా, వారిని శ్రీ కృష్ణుడు సంహరించాడు. తన తండ్రినీ, సోదరులనూ కోల్పొయి, మౌర్వి ఒంటరిగా మిగిలిపోయింది. శ్రీ కృష్ణుడి పై పగను పెంచుకుని, తనతో యుద్ధం చేసేందుకు సకల విద్యలను నేర్చుకుంది మౌర్వి.

ఒకనాడు మౌర్వి శ్రీ కృష్ణుడిపై యుద్ధాన్ని ప్రకటించింది. వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. మౌర్విని సంహరించేందుకు, శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కానీ, అది మౌర్విని గాయపరచకుండా, తిరిగి శ్రీ కృష్ణుడి వద్దకు చేరుకుంది. అందుకు కారణం, మౌర్వికి ఎటువంటి ఆపద రాకుండా ఎల్లప్పుడు కాపాడతానని, పార్వతి మాత వాగ్దానం చేయడమే. ఆ కారణంగా, సుదర్శన చక్రం మౌర్విని ఏమీ చేయలేకపోయింది. దాంతో శ్రీ కృష్ణుడు, పగతో రగిలిపోతున్న మౌర్వికి, తన పూర్వజన్మ స్మృతులనూ, పార్వతీదేవి శాపాన్ని గుర్తు చేసి, ఆమెను శాంతింపజేశాడు.

ఆ తరువాత మౌర్వి, పార్వతిదేవి రూపమైన కామాఖ్య దేవిని పూజిస్తూ, అడవులలో జీవించసాగింది. ఈ విషయాలన్నింటినీ వివరించి, ఘటోత్కచుడికి మౌర్వి సరి అయిన జోడి అని చెప్పి, వారికి వివాహం జరిగేలా చేశాడు శ్రీ కృష్ణుడు. ఘటోత్కచుడికీ, మౌర్వికీ ముగ్గురు కుమారులు. వారిలో అత్యంత శక్తివంతుడు, మహాభారత యుద్ధం ఆసాంతం వీక్షించిన బర్బరీకుడు. ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గోని, గొప్ప వీరుడిగా పేరుగడించాడు. తన మాయోపాయ శక్తులతో, కౌరవ సేనలను ఇరకాటంలోకి నెట్టాడు. కర్ణుడు తన దగ్గర ఉన్న అతీంద్రియ బాణంతో, ఘటోత్కచుడిని సంహరించాడు. ఘటోత్కచుడి మరణ వార్త విన్న పాండవులు, కన్నీరు మున్నీరుగా విలపించారు. భీమసేనుడి దుఃఖానికి అంతు లేదు. కానీ, కృష్ణుడు రధం మీద నిలబడి, నాట్యమాడసాగాడు. కేరింతలు కొట్టి, సింహనాదం చేసి, ఆనందంతో పాంచజన్యం పూరించారు.

కృష్ణుడి ఈ విపరీత ప్రవర్తన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ, "కృష్ణా! ఏమిటిది? మేమంతా ఘటోత్కచుడి మరణానికి విలపిస్తుంటే, నీవు ఆనందంతో గంతులు వేస్తున్నావు. ఏమిటి నీ ఆంతర్యం" అన్నాడు. కానీ, కృష్ణుడు తన ఆనంద హేల ఆపక, అలా పాడుతూ, ఆనందంతో గెంతుతూనే ఉన్నాడు. అంతలో అర్జునుడు తెలివి తెచ్చుకుని కృష్ణునితో, "కృష్ణా! నీవు అన్నీ తెలిసిన వాడివి. మహానుభావుడివి. నీ వింత ప్రవర్తనకు ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటది?" అని అనునయంగా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, "అర్జునా! నీ తండ్రి నీ క్షేమము కోరి, కర్ణుడి వద్ద నుండి కవచకుండలములు దానంగా పరిగ్రహించాడు. ఆ సమయంలో, కర్ణుడికి ప్రతిగా ఒక మహత్తర శక్తిని కానుకగా ఇచ్చాడు. అది ఒక సారి ప్రయోగిస్తే, ఒకరిని మాత్రమే చంపి, తిరిగి ఇంద్రుని చేరగలదు. దానిని కర్ణుడు నిన్ను చంపడానికి మాత్రమే దాచి ఉంచాడు.

ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితులలో, దానిని కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. కనుక ఇక కర్ణుడు నిన్ను ఏమీ చేయ లేడు. అర్జునా! కర్ణుడు దైవాంశ సంభూతుడు, అసామాన్యుడు. అతడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఉన్నంత వరకు, నా సుదర్శన చక్రము కానీ, నీ గాండీవం కానీ, ఏమి చేయలేదు. నీ తండ్రి కర్ణుడి కవచ కుండలములు పరగ్రహించకున్న, అతడిని నీవే కాదు, ముల్లోకాలలో ఎవరూ ఏమీ చేయ లేరు. అతడిప్పుడు సాధారణ మానవుడయ్యాడు కనుక, అతడిని ఇక నీవు సులభంగా జయించవచ్చు. ఇది నాకు సంతోషం కాదా!" అని అన్నాడు. ఇక ఘటోత్కచుడు ఎంత భీముడి కుమారుడైనా, రాక్షస వంశ సంజాతుడు. ధర్మద్వేషము, హరిద్వేషము అతడి నరనరాలలో జీర్ణించుకుని ఉంది. అతడు బ్రతికి ఉంటే, ఎప్పటికైనా నా మీదా, ధర్మం మీదా తిరగబడగలడు. అప్పుడు నేను చేయవలసిన పని, ఇప్పుడు కర్ణుడు పూర్తి చేసాడు. అని వివరించాడు. ఘటోత్కచుడి మరణం తరువాత, మౌర్వి శాప విమోచనం పొంది, అహిలావతిగా కైలాసానికి చేరుకుంది.

శుభం భూయాత్!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home