మంగళసూత్రం!!! Mangal Sutra


మంగళసూత్రం!!!

క్షీర సాగర మధన సందర్భంలో మాంగళ్యవివరణ.. “మ్రింగెడివాడు విభుండని, మ్రింగెడిదియు గరళమ్మనియు, మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మదినమ్మినదో!

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే, అది ఆయన గొప్ప కాదట.. అమ్మ పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట..

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా ।
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం ।।

'ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి, నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు.. అంటే, పుణ్యస్త్రీగా, ముత్తయిదువగా, సకల సౌభాగ్యాలతో జీవించు' అని స్పష్టముగా తెలుస్తున్నది.

పూర్వం భారత దేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు, ఎటువంటి ఆచారాలూ కట్టుబాట్లూ ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

భారతావనిలో పిండారీలు, థగ్గుల వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకుపోయేవారు. 

మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు, ఏ హానీ చేయకుండా విడిచి పెట్టేసేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్య లహరి పుస్తకంలో కూడా మంగళ సూత్రానికి విశిష్టతను కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకూ, అన్యోన్య దాంపత్యములకూ కారకుడు.. శారీరకంగా నేత్రములూ, క్రొవ్వు, గ్రంథులూ, సిరలూ, ధమనులూ, స్తనములూ, స్త్రీల గుహ్యావయములూ, నరములూ, ఇంద్రియములూ, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతి కోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పర దూషణ, కామ వాంఛలు, దీర్ఘ సౌమాంగల్యము, దృష్టి దోషము ఇత్యాదులు, మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములూ మొదలగునవి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యానికి మించిన విలువైనది లేనే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించమని మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు), తెలుపు (చంద్రుడు) స్వీకరించి, స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములనూ ఉత్తేజ పరచి, శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు, స్త్రీలలో వచ్చే నష్టాలనూ, దోషాలనూ తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.

కనుక చంద్ర కుజుల కలయిక, ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో, అలాగే ముత్యం, పగడం రెండూ కలిపిన మంగళసూత్రం, స్త్రీకి అత్యంత శుభ ఫలితాలను సమకూరుస్తుంది.

పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా, తిరిగి మన ధర్మం వైపుకు తీసుకు వద్దాము. దీని విశిష్టతను ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేంత వరకూ తెలియ పరుద్దాము..

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home