Story of a Pious Woman | 'పుణ్యాత్మురాలు' - బేతాళ కథలు!


'పుణ్యాత్మురాలు' - బేతాళ కథలు!
భర్తకు ‘మళ్ళీ పెళ్లి’ చేసిన స్త్రీ పుణ్యాత్మురాలెలా అయ్యింది?

బేతాళ పంచవింశతి కథల మూలాలు, అత్యంత ప్రాచీనమైనవి. సా.శ.పూ. 1 వ శతాబ్దానికి చెందిన ఈ కథలు, తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో, ఒక భాగంగా చోటుచేసుకున్నాయి. మొట్టమొదట పైశాచి భాషలో రాయబడిన ఈ కథలు, తరువాతి కాలంలో సంస్కృత భాషలోకి అనువదించబడ్డాయి. అయితే, పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో, సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి. సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీ మాతకు చెప్పినట్టుగా పేర్కొనే ఆ కథలు, మనలను సన్మార్గంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కథ పంచవింశతి కథలలో ఒకటాకాదా అనే విషయాన్ని పక్కనబెట్టి, కథలోని నీతిని గురించి మీరేమనుకుంటున్నారో, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథ విషయానికి వస్తే, ఒక స్త్రీ తన కుంటుంబాన్ని ఎలా తీర్చుదిద్దుకున్నది? తన భర్తకు రెండవ వివాహం ఎందుకు చేసింది? అందరు అత్తలలాగానే కోడలితో కఠినంగా వ్యవహరించినా కూడా, పుణ్యాత్మురాలిగా ఆ స్త్రీమూర్తి బేతాళ కథలలో స్థానం ఎలా సంపాదించుకోగలిగింది? వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/13ULBoqeFOQ ]


పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు ఇలా చెప్పానారంభించాడు. పురాణపురం అనే ఊరిలో విద్యానాథుడనే పండితుండేవాడు. ఆయన భార్య భారతి, పుణ్యాత్మురాలని పేరు పొందినది. ఆ దంపతులకు భార్గవుడు, శుక్రుడు అని ఇద్దరు కొడుకులూ, సుచిత్ర అనే కుమార్తె ఉన్నారు. సుచిత్రకు వివాహమై, కాపురానికి వెళ్లి భర్తతో హాయిగా ఉంది. కొడుకుల్లో పెద్దవాడు భార్గవుడు, పాండిత్యంలో తండ్రంతటివాడని పేరు తెచ్చుకున్నాడు. అతడి భార్య రేవతి, భర్తకి అనుకూలవతిగా ఉంటూ, ఇంట్లో అందరికీ తలలో నాలుకగా ఉండేది. ఆ దంపతులకు సమీరుడు, ఒక్కగానొక్క కొడుకు. మనుమడంటే భారతికి ప్రాణం. చిన్నవాడు శుక్రుడికి కూడా, పాండిత్యంలో ప్రతిభావంతుడని పేరొచ్చింది. ఆ ఊరి జమీందారు, వాడిని తన ఆస్థానపండితుల్లో ఒకడిగా చేరమని కోరాడు. కానీ, తను నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉన్నదన్న భావనతో, శుక్రుడు తటపటాయించాడు.

ఇలాంటి వచ్చని నంసారంలో ఉన్నట్టుండి, వరుసగా చిక్కు సమస్యలు మొదలయ్యాయి. పట్నంలో గురుకులం నడుపుతున్న జ్ఞానానందుడు, తనకు వయసైపోయిందని, గురుకులాధివతి పదవినుంచి తప్పుకోవాలనుకున్నాడు. ఆ పదవికి భార్గవుడే తగినవాడని భావించి, గురుకులానికి రావలసిందిగా, భార్గవుడికి కబురు పంపాడు. భార్గవుడికి ఆ గురుకులానికి అధిపతి కావడం ఇష్టమే. ఎందుకంటే, అక్కడున్న ఉద్దండపండితుల సాహచర్యంలో, తన శాస్త్రజ్ఞానం మరింతగా వికసిస్తుంది. ఆ గురుకులంలో శిష్యులుగా చేరేవారు కూడా, సామాన్యులుకారు. తమ సందేహాలతో గురువు ప్రతిభనే, సవాలుచెయ్యగల సమర్థులు. అక్కడ విద్య నేర్చుకున్నా, నేర్పినా, జ్ఞానవృద్ధి కలుగుతుందని చెప్పుకుంటారు. భార్గవుడు తండ్రికి తన అభీష్టం చెప్పి, ఆయనను కూడా తనతో పట్నం వచ్చెయ్యమన్నాడు. కానీ, విద్యానాథుడు అందుకు ఒప్పుకోలేదు. "మనకు వారసత్వంగా వచ్చిన ఆస్తితో, కొన్ని తరాలు సుఖంగా జీవించవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ, ఈ ఊరు వదిలి రాను" అన్నాడు నిష్కర్షగా.

భార్గవుడి భార్య రేవతి కూడా, "నాకిక్కడ అందరితో కలిసి ఉండడం బాగుంది. నేను ఈ ఊరు విడచి రాను. మనం ఇక్కడే ఉందాము" అన్నది భర్తతో. భార్గవుడు తన గోడు తల్లికి చెప్పుకున్నాడు. భర్తను వ్యతిరేకించలేక, కొడుకుకు అనుకూలంగా మాట్లాడలేక, మనస్సులో సతమతమయ్యింది భారతి. అయినా, కోడలి మనస్సులో ఏముందో తెలుసుకోవాలని, ఆమెను పక్కకు పిలిచి అడిగితే, "అత్త మామలను పెద్ద వయస్సులో విడిచి ఎలా వెడతాను? ఇప్పుడే కదా, మీకు మా సేవలు అవసరం" అన్నది రేవతి. ఇదిలా ఉంటే, శుక్రుడు ఆ ఊరిలోనే, తార అనే పిల్లను ప్రేమించాడు. కానీ, తార జాతకం ప్రకారం, పెళ్ళి జరిగిన వెంటనే ఆమె అత్తమామల్లో ఒకరు చనిపోతారని ఉంది. అందుకని విద్యానాథుడు ఆ పె‌ళ్ళికి ఒప్పుకోలేదు. తనకు జాతకాలమీద ఏమాత్రం నమ్మకం లేదని, శుక్రుడు వాదించాడు. ఇక సుచిత్రకు కూడా ఒక నమస్య వచ్చింది. ఆమె ఇంటి పురోహితుడు ఆమె భర్తతో, "నీ భార్య జాతకం గొప్పది. వచ్చే పున్నమిలోగా, మీ ఇంట్లోని లక్ష్మీదేవి విగ్రహానికి, నూరుకాసులహారాన్ని ధరింపజేసి, నీ భార్యచేత నూరు రోజులు పూజ చేయిస్తే, నీ కుటుంబం కలకాలం అష్టైశ్వర్యాలతో వర్థిల్లుతుంది. హారం మీ స్వంతమై ఉండాలి" అని చెప్పాడు.

ఐతే సుచిత్రకు కొన్ని నగలున్నాయి కానీ, నూరుకాసులహారం లేదు. అంత ఖరీదైన హారం చేయించడం, భర్తకు ఇప్పట్లో సాధ్యం కాదు. ఆమె తల్లి భారతికి నూరుకాసులహారం ఉంది. ఆమె తదనంతరం, అది కూతురికే చెందుతుంది. కూతురికి ఆ హారాన్ని ఇప్పుడే ఇచ్చేద్దామని, భారతి అనుకుంటోంది. కానీ, ఎట్టి పరిస్థితులలోనూ, తల్లి బ్రతికుండగా ఆ హారాన్ని ఆమెనుంచి తీసుకోవడం, సుచిత్రకు ఇష్టం లేదు. వూజ ప్రారంభించడానికి పది రోజులే గడువుందని, ఆమె భర్త బెంగ పెట్టుకున్నాడు. విద్యానాథుడిది ఇంకా విచిత్రమైన సమస్య. ఓ రోజు వాణి అనే కవయిత్రి ఆయనవద్దకు వచ్చి, కొన్ని నందేహాలను అడిగి తీర్చుకుంది. అప్పుడామెకు ఆయనపై మోహం పుట్టింది. "నేను మీకు రెండవ భార్యగా ఉంటాను. నన్ను పెళ్ళిచేసుకోండి" అన్నది. "నేను ఏకపత్నీ వ్రతుణ్ణి. వయస్సులో నీకంటే బాగా పెద్దవాణ్ణి. నిన్ను పెళ్ళిచేసుకోలేను" అని ఆయన అన్నాడు. కానీ, వాణి తన పట్టు వీడలేదు.

ఆమె చాలా అందగత్తె కావడంవల్ల - అటు చిత్తచాంచల్యాన్ని జయించలేక, ఇటు ఆదర్శాలు వదలలేక, తికమక పడ్డాడు విద్యానాథుడు. ఈ సంగతి తెలిసిన భారతి భర్తతో, "మీరు పండితులు. వాణి కవయిత్రి. మీరిద్దరూ వివాహం చేసుకుంటే, నాకూ ఇష్టమే" అని చెప్పింది. అయినా విద్యానాథుడు ససేమిరా అన్నాడు. తన అత్తగారు, మామగారిని రెండవ పెళ్ళికి ప్రోత్సహిస్తోందని తెలిసిన రేవతి, "ముసలి తనంలో ప్రతి పురుషుడూ పడుచుపిల్లను రెండవ పెళ్ళి చేసుకుంటే, ముసలిదైన భార్యకు రక్షణ ఉండదు. ఈ పెళ్ళి జరిగితే, మేమంతా తక్షణం ఇల్లు వదిలి వెళ్ళి పోతాము" అని అత్తగారిని హెచ్చరించింది.

అందుకు భారతి, "నీ బెదిరింపులు నా మేలుకోసమే తప్ప, నీ స్వార్థంకోసం కాదని నాకు బాగా తెలుసు. నేను నీకు మీ అమ్మకంటే కూడా ఎక్కువైనదాన్ని. ఊరికే కబుర్లు చెబుతావుగానీ, ముసలిదాన్నవుతున్న నన్ను వదిలి, నువ్వు ఎక్కడికీ వెళ్లవని నాకు గట్టి నమ్మకం" అని తేలికగా నవ్వేసింది. కానీ, తన కుటుంబంలో తలెత్తిన సమస్యలు, భారతి మనస్సును బాగా కలవరపరిచాయి. బాగా ఆలోచించగా, వాటన్నింటికీ పరిష్కారం తన చావులోనే ఉందని తోచింది. "ఇన్నాళ్లూ సుఖసంతోషాలతో బ్రతికాను. నాకు జీవితంలో మరి ఏ ఇతర కోరికాలేదు. తొందరలోనే నా భర్త చేతిలో, పుణ్య స్త్రీగా కన్నుమూసేలా అనుగ్రహించండి" అని సమస్త దేవతలనూ ప్రార్థించసాగింది. అప్పటినుంచీ భారతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అది మిగతావారు గమనించలేదుగానీ, పసివాడైన సమీరుడు పసికట్టాడు. వాడు భారతితో, "బామ్మా! మనింట్లో ఎవరు ఎక్కడ ఉన్నా, నేనుమాత్రం నీ దగ్గరే ఉంటాను" అని ముద్దుగా చెప్పాడు. భారతి వాణ్ణి దగ్గరగా తీసుకుని, "నాకూ ఓ బామ్మ ఉంది. తన దగ్గరకు వెళ్లాలని నాకూ ఉంటుందిగా. అలాంటప్పుడు, నువ్వు నన్ను ఆపకూడదు.. నాతో వస్తాననకూడదు" అని అన్నది. ఆమె మాటలకు అర్థం తెలియని సమీరుడు బుద్ధిగా తల ఊపి, "అలాగే కానీ, ఎక్కడికెళ్లినా ఎక్కువ రోజులు ఉండకూడదు" అని షరతు పెట్టాడు.

ఇదిలా ఉండగా, ఆ ఊరికి భావిదర్శనుడనే యోగి వచ్చాడు. ఆయన మనిషి ముఖంచూసి, భూత భవిష్యద్వర్తమానాలు చెప్పగల దిట్ట. రోజూ ఊరంతా తిరిగి, ఒకరి ఇంట భిక్ష స్వీకరించేవాడు. అలా ఒకరోజున, విద్యానాథుడి వంతు వచ్చింది. ఆయన ఆ ఇంట్లో తృప్తిగా భోజనం చేశాక, "ఈ కుటుంబంలో ప్రతిఒక్కరికీ ఒక్కో తరహా సమస్య వచ్చినట్లు, నా దివ్యదృష్టికి గోచరిస్తోంది. అన్ని సమస్యలకూ పరిష్కారం, ఈ ఇంటి ఇల్లాలు భారతి చేతిలో ఉంది. నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడ దలిచాను" అని అన్నాడు. ఏకాంతంలో భావిదర్శనుడు భారతితో, "అమ్మా! నీ వంటి పుణ్యాత్మురాలి దర్శనంతో, నా జన్మ ధన్యమైంది. నీ మంచి తనం వర్ణించడం, యోగినైన నాకూ సాధ్యం కాదు. అలాంటి నీ ఇంట్లో, అందరికీ సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి, నువ్వు నీ మరణాన్ని కోరుకుంట్న్నావు కదూ! అది అపూర్వం. నీ ప్రార్థన దేవతలు విన్నారు. నేను వారి పనుపున ఓ దేవ రహస్యం చెప్పడానికి వచ్చాను. నేటికి సరిగ్గా మూడురోజులలో, నీకు దేవుడి పిలుపు వస్తుంది. ఏ అనారోగ్యం లేకుండా, శరీర బాధకు గురి కాకుండా, అనాయాసంగా ప్రాణాలు విడుస్తావు.

ఐతే, కేవలం తమ స్వార్థం గురించే ఆలోచించే నీ వాళ్లకోసం, నిస్వార్థమైన నీ జీవితాన్ని త్యాగం చెయ్యడం సబబుకాదని నీకు అనిపిస్తే కనుక, నీవు మరిన్ని సంవత్సరాలు సుఖ జీవనం చేస్తావు. ఇది ఆలోచించుకోవడానికే, నీకు మూడు రోజుల గడువు లభిస్తోంది" అని అన్నాడు. భారతి ఆయనకు భక్తితో నమస్కరించి, "యోగివర్యా! నా వాళ్లు చెడ్డ వాళ్లు కారు. చిత్తచాపల్యంతో మనస్సు కాస్త బలహీనమై, వాళ్లలో కొన్ని కోరికలు పుట్టినా, వారిలో ఏ ఒక్కరూ, నా చావును కోరుకోరు. నాకు జీవితం ఎంతో సంతృప్తిగా గడిచింది. పుట్టిన ప్రతి జీవికీ ఏదో ఒకనాడు చావు తప్పదు. చావు వల్ల కూడా ప్రయోజనం సాధిస్తే, అంతకు మించిన సంతృప్తి ఏముంది? అందుకే నా వాళ్ల సంతోషం కోసం జీవితాన్ని త్యాగం చెయ్యాలనిపించినా, ఆత్మహత్య మహా పాతకమని ఆగాను. దేవుడే చావును ఇస్తే, అది నాకు గొప్ప వరం. నా చావుకు లభించిన ఈ మూడు రోజుల గడువు, నా అదృష్టం. ఎందుకంటే, నా చావును మా ఇంట్లో ఏ ఒక్కరూ భరించలేరు. వారందరికీ ఏదో ఒకలాగా ఉపశమనం కలుగజెయ్యాలి. అందుకు తగిన ఆదేశాలిస్తాను. నా మాట శిలాక్షరం కాబట్టి, వాళ్లు నా మాట పాటిస్తారు" అని అన్నది.

భావిదర్శనుడామెతో, "కుటుంబ శ్రేయస్సే తప్ప, ప్రాణాల మీద కూడా మమకారం లేని నువ్వు, ధన్యురాలివి" అని మెచ్చుకున్నాడు. తర్వాత ఆయన, ఇంట్లోని మిగతావారందరికీ, "ఈ ఇంట్లో భారతి వంటి పుణ్యాత్మురాలు ఉండడం, మీ అదృష్టం. ఆమె ఆదేశాలు పాటిస్తూ, సుఖంగా ఉండండి" అని చెప్పి వెళ్లిపోయాడు. భారతికి రానున్న మరణం గురించి మాత్రం, ఆయన ఎవరికీ చెప్పలేదు. మర్నాడు భారతి శుక్రుణ్ణి పిలిచి, "నాకు చావు ఎప్పుడు రాసి పెట్టి ఉందో, అప్పుడే వస్తుంది. నీ పెళ్ళికీ దానికీ ఏ సంబంధమూ లేదు. నువ్వు తారను ఈ రోజే పెళ్ళిచేసుకో. లేకుంటే ఇవ్పుడే నేను విషంమింగి చస్తాను" అని అన్నది. తన ప్రేమ ఫలించడమేకాక, తల్లి ప్రాణాలు కాపాడినట్లు కూడా అవుతుందని, శుక్రుడు ఆ రోజే తారను గుడిలో పెళ్ళి చేసుకున్నాడు. తండ్రికి ఆ పెళ్ళి ఇష్టంలేదు కాబట్టి, శుక్రుడు ఇల్లు వదిలి వేరు కాపురం పెట్టాడు. ఉదర పోషణకు వెంటనే ఆ ఊరి జమీందారు కొలువులో చేరాడు.

తర్వాత భారతి భర్తతో, ఏకాంతంలో మాట్లాడాలని చెప్పింది. ఆయన వెంటనే, "యోగి చెప్పాడని నేను నీ ప్రతి ఉపదేశాన్నీ వింటాననుకోకు. నీ కొడుకు పెళ్ళి నీకు సంతోషంగా ఉండొచ్చు. కానీ నాకు సంతోషంగా లేదు. వాణ్ణి ఇంటికి పిలవమని చెప్పకు. తర్వాత మాట వినలేదని బాధ పడతావు" అని తేల్చి చెప్పాడు. "శుక్రుడికి తారను పెళ్ళి చేసుకోవాలనుంది. వాడి జీవితం వాడి ఇష్టం. కాదనడానికి మనం ఎవరము? అందుకే వాడికి అలా చెప్పాను. ఐతే, వాడు మనింట్లో ఉండాలా, కూడదా అన్నది మీ ఇష్టం. ఈ ఇంట్లో మీ ఇష్టమే నా ఇష్టం. నేను చెప్పాలనుకుంటున్నది, వాడి గురించి కాదు. మీరు ఏక పత్నీ వ్రతులు. ఏక పత్నీ వ్రతమంటే, భార్య బ్రతికుండగా మాత్రమే, ఇంకో భార్య ఉండ కూడదని అర్థం. అనుకోకుండా కొద్ది రోజులలోనే నా ప్రాణాలు పోయాయనుకోండి.. అప్పుడు మీరు వాణిని పెళ్ళిచేసుకోండి. లేదంటే, నా ఆత్మకి శాంతి ఉండదు" అన్నది భారతి. భార్య తనకు అలాంటి ఉపదేశమిస్తుందని ఊహించని విద్యానాథుడు తెల్లబోయాడు.

తర్వాత భారతి కూతురు సుచిత్రకు కబురంపి రప్పించింది.  "ఇప్పుడు అధిక మాసం నడుస్తోంది. అధిక మాసంలో చేసే పూజలు చెల్లవు. కాబట్టి, నీ పూజకు గడువు మరికాస్త పెరిగింది. ఆలోగా నీకు నూరుకాసులహారం లభించే ఏర్పాటు నేను చేస్తాను. ఎట్టి పరిస్థితులలోనూ, పూజ మాననని నాకు మాట ఇవ్వు" అని చెప్పింది. ఆ తర్వాత భార్గవుణ్ణి పిలిచి, "నేను బ్రతికి ఉండగా నాన్న గారిని విడచి వెళ్లనని మాట ఇవ్వు" అని అడిగి వాగ్దానం తీసుకుంది. మనుమడు సమీరుణ్ణి చాటుగా పిలిచి, "రెండు రోజులలో నేను నా బామ్మ దగ్గరకు వెళుతున్నాను. అక్కడ నేను ఎన్నాళ్లున్నా, నువ్వు ఏడవ కూడదు. అన్న మాట నిలబెట్టుకోవాలి" అని బుర్రకెక్కేలా చెప్పింది.  ఇందరితో ఇన్ని చెప్పిన భారతి, కోడలితో మాత్రం, "భావిదర్శనుడి ధర్మమా అని, నా బుద్ధి వికసించింది. ఆయన ఎవరినీ నమ్మవద్దనీ, జాగ్రత్తగా పరిశీలించి, నిజం తెలుసుకొమ్మనీ చెప్పాడు. ఆ మాటలను బట్టి నీ గురించి ఆలోచిస్తే, నీది వక్రబుద్ధి అనీ, మా అందరి మీదా కపట ప్రేమ నటిస్తున్నావనీ అర్థమైంది. నా చిన్నకొడుకు శుక్రుడు తారను ప్రేమించడానికి, నీ ప్రోత్సాహమే కారణమని నేను గ్రహించాను. భార్గవుడికి బోలెడు జీతంతో ఉద్యోగం లభిస్తే వెళ్లనివ్వక, ఇక్కడే తిష్ట వేశావు. ఈ ఇంట్లోనే ఉంటే, మొత్తం ఆస్తి నీకే దక్కుతుందని నీ ఆశ. పరాయి ఇంటి పిల్ల పరాయిదే కానీ, ఇంటి మనిషి కాలేదని నిరూపించావు.

నీకు తెలియనిదేమిటంటే, ఇల్లొదిలి వెళ్లినా, శుక్రుడికి చెందాల్సిన ఆస్తివాటా వాడికే వెళ్ళేట్టు చేస్తాను. నేను పోతే, నా నగలు నా కూతురికే తప్ప, నీకు రావు. నువ్వూ భార్గవుడూ, పట్టనానికి వెళ్లినా, న్యాయంగా మీ కుటుంబానికి రావలసిన ఆస్తిని పంచియిచ్చే విశాల హృదయం మాకున్నదని, నీ అల్పబుద్ధికి తోచలేదు" అని ఏకాంతంలో నిష్ఠూరంగా మాట్లాడింది. ఆ మాటలకు రేవతి నొచ్చుకోలేదు. "మీరు నన్నేమన్నా సరే కానీ, చావు గురించి మాత్రం మాట్లాడవద్దు. మీరు లేని ఈ ఇంటిని, ఊహలో కూడా భరించలేను. మీరు మరింత కాలం బ్రతకాలి" అని కన్నీళ్ళద్దుకున్నది. ఐనా భారతి ఛలించక, "ఇదివరలో ఇలాంటి మాటలే నమ్మి, నీ మీద ప్రేమ పెంచుకున్నాను. నీ నిజస్వరూపం తెలిసిన తర్వాత, ఈ దొంగ కన్నీళ్ళకు నేను మోసపోను. నటనలు కట్టిపెట్టి, మంచి బుద్ధి అలవరుచుకో" అని మందలించింది. భావిదర్శన యోగి చెప్పినట్లే, ఆ తర్వాత మూడవ రోజు భారతి మరణించింది. ఓ పుణ్యాత్ముర్యాలు కన్నుమూసిందని అంతా చెప్పుకున్నారు.

బేతాళుడీ కథను విక్రమారకుడికి చెప్పి,‘‘రాజా! మరణించే ముందు, స్వార్థ పరులైన తన వాళ్లందరికీ ఉపయోగ పడే మాటలు చెప్పిన భారతి, నిస్వార్థ పరురాలైన కోడలి వద్ద మాత్రం భిన్నంగా ప్రవర్తించి, అందరు అత్తగార్ల లాగానే, తనూ కోడలి విషయంలో మాత్రం, చెడ్డ దానిగా మిగిలింది. కానీ, ఆ కోడలితో సహా, అంతా ఆమెను వుణ్యాత్మురాలని ఎందుకన్నారు? నిజానిజాలు అంచనా వెయ్యగల భావిదర్శన యోగి కూడా, ఆమెను మంచిదనీ, పుణ్యాత్మురాలనీ ఎందుకు పేర్కొన్నాడు? అత్తగారు తనను అన్ని మాటలన్నా గానీ నొచ్చుకోకుండా, ‘మీరు మరింత కాలం బ్రతకాలి’ అని రేవతి ఎందుకు కోరింది? అసలు భారతి నిజంగా పుణ్యాత్మురాలేనా? ఆమె కనుక పుణ్యాత్మురాలైతే, ఎలా పుణ్యాత్మురాలైంది? నా ఈ సందేహాలకు సమాధానం చెప్పు” అని అడిగాడు. దానికి విక్రమార్కుడు, "ఎవరి మంచితనమైనా, వాళ్లతో మసిలిన వారికే తెలుస్తుంది. అందుకే ఇంట్లోని వారికీ, ఊరిలోని వారికీ, ఆమె పుణ్యాత్మురాలు. ఇక స్వార్థ పరులైన తన వాళ్ల సంతోషం కోసం, ఆరోగ్యవంతమైన తన శరీరాన్ని కూడా వదులు కోవాలని అనుకున్నదామె. ఆ విషయం తెలుసు కాబట్టే, భావిదర్శనుడు ఆమెను పుణ్యాత్మురాలన్నాడు.

ఇంట్లో స్వార్థపరుల విషయానికొస్తే, భారతి శుక్రుడి పెళ్ళి, ముందే జరిగేలా చేసింది. కూతురికి నగ ఇస్తానంది. భర్తను మరో పెళ్ళి చేనుకోమంది. ఆయన మరో పె‍ళ్ళి చేసుకుంటే, పిల్లలు ఆయనతో ఎలాగూ తెగదెంపులు చేనుకుంటారు. అప్పుడు వయస్సులో చిన్నదైన వాణి, ఆయనకు సేవలు చేయ గలుగుతుంది. పోయిన భార్యను తలచుకుని దిగులుపడే అవసరంలేకుండా, సాహిత్య చర్చలతో ఆయనను మరిపించ గలదు వాణి. మనుమడు చిన్నపిల్లవాడు కాబట్టి, తాత్కాలికంగా మరిపిస్తే, ఆ తర్వాత వాడే అర్థం చేసుకోగలడు. ఇక మిగిలిందల్లా, కోడలు రేవతి. తన ఇంట్లో ఏ స్వార్థమూ లేకుండా ఉన్నది ఆమె మాత్రమేనని భారతికి తెలుసు. అందుకు కారణం, ఆమె తనను కన్నతల్లిలా ప్రేమించడమేననీ, ఆమెకు తెలుసు. ఏ స్వార్థమూలేని ఆమెను, దుఃఖం నుంచి దూరం చెయ్యడానికి వేరే దారి లేక, ఆమెకు తనపై విరక్తి కలగించాలనుకున్నది, భారతి. విరక్తి కలిగితే, కోడలికి అత్తగారు పోయిన దుఃఖం అంతగా ఉండక పోవచ్చనుకున్నది. ఆమె తనను మనస్సులో తిట్టుకున్నా సరే ననుకుని, ఇల్లొదిలిపోయే మాటలతో రెచ్చ గొట్టింది. రేవతి ఆమెను నిజంగా కన్న తల్లిలా భావించింది కాబట్టే, ఆ మాటలకు నొచ్చుకోలేదు. అందుకే భారతి నిజంగా మహా పుణ్యాత్మురాలని బదులిచ్చాడు, విక్రమార్క చక్రవర్తి.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home