ఈ రోజు '26/11/2023' కార్తీక పూర్ణిమ - అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. Kartika Pournami
ఈ రోజు '26/11/2023' కార్తీక పూర్ణిమ - అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
కార్తీక పూర్ణిమను 'త్రిపుర పూర్ణిమ', 'రాస పూర్ణిమ', 'దేవ దీపావళి' అని కూడా అంటారు. ఈ రోజును మనువులలో పద్నాలుగోవాడైన భౌత్యుని పేరున భౌత్యమన్వంతరాది, ఇంద్ర సావర్ణిక మన్వంతరమని కూడా అంటారు. త్రిపురాసుర సంహారం జరిగింది కూడా ఈ రోజే.
[ ముచికుందుడు ఎవరు? https://youtu.be/bVirKu3kTVI ]
జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణుల పాపాలూ పరిహరించబడి, సద్గతి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక జ్వాలా తోరణం చేసినందు వలన, జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం, సర్వపాపహరం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని, విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన గాధ ప్రచారంలో ఉంది.
కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనం చేయటం, సాలగ్రామాన్ని దానం చేయటం, ఉసిరి కాయలు దక్షిణతో దానం చేయటం వలన, వెనుక జన్మలలో చేసిన సమస్త పాపములనూ నశింప జేసుకోవచ్చు.
కార్తీకంలో ఆధ్యాత్మిక, ఆరోగ్య పరమైన ఉపయోగాలు..
కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది. నెలరోజుల పాటు తులసి కోట, లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా, అంతర్గత శక్తి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది.
కార్తీకంలో శరదృతువు పవిత్ర జలం హంసోదకంగా పిలవబడుతుంది. మానసిక, శారీరక, రుగ్మతలను తొలగించి, ఆయుష్షునూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించే ఉషోదయ స్నానం, కార్తీకంలో ప్రముఖ స్థానం పొందింది.
పైత్య ప్రకోపాలను తగ్గించేందుకే, ఈ హంసోదక స్నానం. ఇది అమృత తుల్యంగా మానవాళికి ఉపయుక్తంగా ఉంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల, దోష రహితమైనది. శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అంటాము.
తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావనీ ౹
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా ౹౹
సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, గంగాదేవి అన్ని ప్రదేశాలలో ద్రవరూపంలో ఉంటుంది. తులా మాసంలో గోవు పాదమంత జల ప్రదేశంలో కూడా శ్రీమహావిష్ణువు ఉంటాడనేది, పురాణ వచనం. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కార్తీకమాసంలో, నిత్యం ప్రాతః కాలం నదీ స్నానం చేసే వారికి, మహాపాతకాలు సైతం హరించ బడతాయని ప్రతీతి. కొండలు, కోనలు, అడవుల గుండా నదులు ప్రవహిస్తూ ఉండటం వల్ల, ఆయుర్వేద గుణాలున్న నదీ నీటిలో స్నానం ఆచరించడం వల్ల, ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. నదిలో అనిర్వచనీయమైన విద్యుత్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం, మరో యోగం. కొందరు ఉపవాసాన్ని, రోజు మొత్తంలో ఒకసారి ఫలాహారాన్ని స్వీకరించి, ఏక భుక్తంగా నిర్వహిస్తారు. మరి కొందరు, నక్తం చేస్తుంటారు. అంటే, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం. ఇలా కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలు, ఏకాదశులు, కార్తీక పౌర్ణమి వంటి రోజులలో ఉపవాస దీక్ష చేయటం, శరీరానికి మేలు చేస్తుంది.
ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపాలను వెలిగించటం వలన, ఆనేక దీపాల వల్ల, వాటినుంచి వచ్చే వాయువుల వల్ల, వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణ శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలుగజేస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి, దీనికా పేరు ప్రసిద్ధమైనది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి వారు హరిహరులను సేవించి, వారి కారుణా కటాక్షాలను పొందుతారు. వీటిని ఎంత నిష్ఠతో ఆచరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి.
హరహర మహాదేవ!
లోకా సమస్తా సుఖినోభవన్తు!
Comments
Post a Comment