999 ఏళ్ళ యుద్ధం! Sahasrakavacha


999 ఏళ్ళు యుద్ధం చేసిన రాక్షసుడికీ దాన వీర శూర కర్ణుడికీ సంబంధం ఏంటి?

ఈ లోకంలో బ్రహ్మ చేస్తున్న సృష్టికి సహకరించేందుకు, కొందరు ప్రజాపతులు తోడ్పడ్డారు. వారిలో ఒకరు, ధర్మ ప్రజాపతి. ఆ ధర్మ ప్రజాపతికి నరుడు, నారాయణుడనే కవల పిల్లలు జన్మించారు. నరుడు, నారాయణుడు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమేనని, మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ హరి అవతారాలుగా, పురాణ ప్రాశస్త్యాన్ని పొందిన నరనారాయణులు ఎవరు? వారి ఆవిర్భావం ఎలా జరిగింది? వారి తపో శక్తి ముందు, శివుడు కూడా ఓడిపోయాడా? తపోధనులైన నరనారాయణులు, ఊర్వశిని ఎందుకు సృష్టించారు? మహాభారత సంగ్రామంలో కర్ణుడి మరణానికీ, నరనారాయణులకూ సంబంధం ఏమిటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tlNzC7ZYgwE ]


మన ఇతిహాసాలలో, తపోధనులుగా, దైవాంశ సంభూతులుగా పేరుగడించిన నరనారాయణులు, సనాతన మహర్షులు. శాంత సంయమనాలకు నెలవులు. నిజమైన, నిర్మలమైన ఆచారశీలతకూ, ఆధ్యాత్మిక నీతికీ, ధార్మిక రీతికీ, తపో నియతికీ, మంత్రానుష్టాన అనుభూతికీ, నిలువెత్తు సాక్ష్యాలు. నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం, నర నారాయణులు. ఒకప్పుడు వీరు సోదరులు. ఇంకొకప్పుడు మిత్రులు. మరొకప్పుడు గురుశిష్యులు. అన్ని యుగాలలో అవతరించిన దైవాంశ సంభూతులు. "పరమాత్మ ఇందుగలడందు లేడను సందేహము వలదు. శ్రీ హరి సర్వోపగతుడు. ఎందెందు వెదకూచిన అందందే గలడు" అంటూ తండ్రికి చెప్పి, స్థంభం నుండి నరసింహావతారమూర్తి ఆవిర్భావానికి, ప్రహ్లాదుడు తెరదీశాడు. అహంకారంతో, తనను ఎదిరించే వారులేరనే క్రోధంతో విర్రవీగుతూ, తన భక్తుణ్ణి సదా హింసిస్తున్న హిరణ్యకశిపుని సంహరించడానికి, ఆ ఆది దేవుడైన విష్ణువు, నృసింహమూర్తిగా ఒక స్తంభం నుండి పుట్టి, దుష్ట దానవుడైన హిరణ్యకశిపుని సంహరించాడు. అవతార లక్ష్యం నెరవేరింది.

కానీ, స్వామి భయంకరాకృతి, లోకాలకు భయానకంగా తయారైంది. అప్పుడు సదాశివుడు అతి భయంకర రూపమైన శరభసాళువుగా అవతరించి, నృసింహస్వామితో యుద్ధం చేసి, నరుడు – సింహములను రెండుగా, నరసింహ రూపాన్ని వేరు చేశాడు. ఈ నర - సింహములనే రెండు రూపాలే, అనంతర జన్మలో, ధర్మ ప్రజాపతికి నర నారాయణులుగా జన్మించారు. హిమాలయాల సమీపంలోని ఒక వనంలో, తపస్సు సాగించారు నరనారాయణులు. ఆ వనమంతా రేగుచెట్లతో నిండిపోయి ఉంది. ఆ రేగుపళ్లనే ఆహారంగా తీసుకుంటూ, వారు తమ తపస్సును కొనసాగించారు. రేగుపండుకు, బదరీఫలం అన్న పేరుంది కాబట్టి, అక్కడ తపస్సునాచరించిన నరనారాయణులకి, బదరీనాథుడన్న పేరు స్థిరపడింది. నరనారాయణుల ఘోరతపస్సు గురించి, అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.

వారి తపస్సు తీవ్రతను లోకానికి తెలియచేయడానికి, ఒకసారి ఆ పరమేశ్వరుడు, తన పాశుపతాస్త్రాన్ని వారి మీదకు సంధించాడు. కానీ, నిర్వికల్ప సమాధిలో మునిగిపోయిన నరనారాయణుల ముందు, ఆ అస్త్రం సైతం తలవంచక తప్పలేదు. ఇది తెలిసిన ఇంద్రుడు, నరనారాయణుల తపోభంగానికి, మన్మథుణ్ణీ, అప్సరసలనూ పంపాడు. కానీ, మన్మథ బాణాలు ఆ మునుల యెడల నిర్వీర్యమైనాయి. అప్సరసల శృంగార చేష్టలు, చెల్లని నాణేలయ్యాయి. నరనారాయణులకు ఇంద్రుని కుతంత్రం తెలిసింది. నారాయణుడు తన ఊరువును లీలగా గీరాడు. అతని తొడ నుండి మరొక సుందరాంగి ప్రత్యక్షమైంది. అది చూసిన అప్సరసల మోములు చిన్నబోయాయి. నరనారాయణులు మందస్మితంగా కనిపించారు. వారి ధైర్యం, ఆత్మౌన్నత్యం, తపోనిష్ఠ, శమదమాదుల నిగ్రహం గమనించిన అప్సరసలకు, బుద్ది వికసించింది.

"స్వామీ! మీరు సామాన్యులు కారు. మహనీయులు. సాక్షాత్తు వైష్ణవ తేజోవిరాజితులు. ఆ నరసింహదేవుని ఆకృతియే, ఇలా మీ ఇద్దరి రూపంలో కన్పిస్తోంది. దివ్యమూర్తులైన మీ దర్శనభాగ్యం కలగడం, మా పురాతన సుకృతం. దేవేంద్రుని స్వార్థ బుద్ధికి ఇలా దిగబడ్డాము. అయినా ఆగ్రహించక, నిగ్రహంతో మా అపరాధాన్ని మన్నించి అనుగ్రహించారు" అంటూ అంజలి ఘటించారు. నరనారాయణులు కూడా దివ్యకాంతల వినయ విధేయతలకూ, బుద్ధి కుశలతకూ ముచ్చటపడ్డారు. "కాంతలారా! నా ఊరువుల నుండి పుట్టిన ఈ దివ్యకాంత, ఊర్వశిగా పిలువబడుతుంది. ఈమెను మీతో స్వర్గానికి కొనిపోండి. ఇది స్వర్గానికి మా కానుక. దేవేంద్రునకు ఉపహారం. దివ్యులకు మేలు కలుగుగాక. ఎన్నడూ తపోధనుల యెడల అనుచితంగ ప్రవర్తించకండి" అని చెప్పారు. దివిజకాంతలు నరనారాయణుల పాదపద్మాలకు నమస్కరించి, దివిజలోకం చేరుకున్నారు.

అలాగే, నరనారాయణుల వేల సంవత్సరాల తపస్సుకు కూడా, ఒక లక్ష్యం ఉంది. అదే, సహస్ర కవచుని సంహారం. సహస్ర కవచుడు, ఒక రాక్షసుడు. పుట్టుకతోనే వేయి కవచములను శరీరంలో కలిగి ఉన్నటువంటి వాడు. వానితో పోరు సలపాలంటే, వేయి సంవత్సరాల తపోబలం కావాలి. వాడి సంహారం కానట్లయితే, దివిజులకూ, మానవులకూ, మహర్షులకూ కంటకమవుతుంది. ధర్మం నశిస్తుంది. జన జీవన విధానానికి విఘాతం ఏర్పడుతుంది. అందుకే, నర నారాయణులుగా వైష్ణవతేజం ఆవిర్భవించింది. నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడూ, నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడూ, ఇలా సహస్ర కవచునితో తలపడ్డారు. ఒక్కొక్కమారు ఒక్కో కవచం చొప్పున, నర నారాయణులు ఆ రాక్షసుని 999 కవచాలు ఛేదించారు. ఇక ఒక్క కవచం మాత్రమే ఉంది. కానీ, వాడు ఆ కవచంతోనే తన జన్మను చాలించాడు. వాని ఆత్మ మాత్రం, రాక్షస భావంతో రగిలిపోతూ, మరలా జన్మించాడు. వాడే కర్ణుడు.

పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు. అలాగే, నర నారాయణులు మరలా, వాని సంహారం కోసమే కృష్ణార్జునులుగా జన్మించారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మహాయుద్ధంలో, ఒకరు రథి, అంటే వీరుడిగా, మరొకరు సారథిగా, ధర్మయుద్ధం నిర్వహించారు. కృష్ణుడు మాయోపాయం పన్ని, ఇంద్రుని బ్రాహ్మణ రూపంలో పంపి, దానకర్ణుడైన ఆ సహస్రకవచుని కవచకుండలాలను స్వీకరించడంతో, కర్ణుడు ఓటమి పాలయ్యాడు. చివరి క్షణాలలో కర్ణుడు అర్జునునితో, "అర్జునా! ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మం మనలను కాపాడుతుందంటారు. మేము కూడా నిరంతరం, యథాశక్తి, యథాశ్రుతం, ధర్మాన్నే అనుసరించాము. కానీ, ఆ ధర్మం తన భక్తులమైన మమ్ము రక్షింపజాలకున్నది" అంటూ, ఎదురైన శాపాలకు తాపం చెందుతూ, కొద్దిసేపు యుద్ధం ఆపమని కోరుతూ చెప్పాడు. అప్పుడు పరమాత్మ, "కర్ణా! ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చిందా? లక్క గృహదహనం, ద్రౌపదీ వస్త్రాపహరణం, బాలుడైన అభిమన్యుని వధ, మొదలైన సంఘటనలలో, ఎక్కడా ధర్మాధర్మ విచక్షణ లేదే" అంటూ "నీచులు కష్టాలలో దైవ నింద చేస్తారు కానీ, తాము గతంలో చేసిన దుష్కృతాల వలననే, దుష్పలితాలను పొందుతున్నామని భావించరు" అని తెలియజెప్పి, నరుని ప్రోత్సహించగా, అర్జునుని అస్త్రాలకు కర్ణుడు వీర మరణం పొందడం జరిగింది.

మన దేశంలో నరనారాయణులకు సంబంధించిన అనేక క్షేత్రాలున్నాయి. వాటిలో బదరీక్షేత్రం ప్రముఖమైనది. ఈ క్షేత్రంలోనే నరనారాయణులు తపస్సు సాగించారనీ, ఇప్పటికీ నర, నారాయణ అనే పర్వతాల రూపంలో తపస్సు చేసుకుంటున్నారనీ, పురాణ విదితం. ఈ రెండు పర్వతాల నడుమ నుంచి, అలకనందా నది ప్రవహిస్తూ ఉంటుంది. గంగానది భూమి మీదకు అవతరించినప్పుడు, ఈ భూమి ఆ గంగ తీవ్రతను తట్టుకోలేకపోయింది. అప్పుడే గంగానదిలోని ఒక పాయ, అలకనందగా మారిందని చెబుతారు. నరనారాయణ క్షేత్రాలు కొన్నింటిలో వీరిరువురూ ఒకే రూపంలో ఉంటే, మరికొన్ని క్షేత్రాలలో, వేర్వేరుగా దర్శనమిస్తారు. తర్వాతి కాలంలో ఈ నరనారాయణులే, కృష్ణార్జునులుగా జన్మించినట్లు, భాగవత పురాణం పేర్కొంటుంది. మహాభారతంలో, శ్రీకృష్ణుడే స్వయంగా, తాను నారాయణుడిననీ, అర్జునుడే నరుడనీ చెప్పాడు. ఇంతటి ప్రశస్తి కలిగిన నరనారాయణలు, కర్క సంక్రమణం తర్వాత వచ్చే హస్తా నక్షత్రం రోజున జన్మించారని చెబుతారు. ఆ పుణ్యదినాన నరనారాయణులను కొలుచుకుంటే మంచిదని అంటారు.

నరనారాయణుల రూపాన్ని కృష్ణుడిగా, బదరీనాథుడిగా, విష్ణుమూర్తిగా, నరసింహస్వామిగా, భక్తులు పూజిస్తుంటారు. నరనారాయణ జననం, జగతికి మోదం, ప్రమోదం, ఆమోదం, ప్రబోధం, సత్య సందేశాత్మకం, నిత్య జ్ఞానానందమయమే కాదు.. ‘జగద్దితం’ అనగా, లోక కళ్యాణ కారకం. ఒక సహస్రకవచుని సంహరించడానికి భగవానునికే రెండు జన్మలు అవసరమైనాయి. మానవునిగా భువికి వచ్చినవారు దివ్యులైనా, మానవాతీతమైన శక్తి సామర్థ్యాల సాధనకు ప్రయత్నం చేయాల్సిందే. అందుకే వేల సంవత్సరాల తపోబలం సాధించడం, అలాగే, కర్ణుని కవచ కుండలాలను అపహరించడానికి, ఇంద్రుడిని మాయా బ్రాహ్మణునిగా పంపడం. ఇదంతా విధిలీల. నిజానికి కర్ణుడు దానశీలుడు, శౌర్యవంతుడే కానీ, అతడనుసరించిన సేవాధర్మం, రాక్షస ప్రవృత్తికీ, అధర్మ వర్తనకూ బలాన్ని సమకూర్చుతోంది. అందునా, సహజంగా అతనిలో ఉన్న రాక్షసావేశం, అందుకు ప్రోత్సహించింది. ఆవేశం, ఆలోచనా రాహిత్యం , అహంకారం, కామ క్రోధాదులు, రాక్షస ప్రవృత్తికి సంకేతం.

మనం చేసే లోభం, పాపం శాపాలై, మానుష ప్రయత్నాన్ని పతనం చేస్తాయి. శేషకవచంతో కర్ణునిగా జన్మించిన సహస్ర కవచుడు, అలాంటి శాపాల తాపాలకు గురియైనాడు. అతడి పౌరుష ప్రతాపాలు, అవసరమైనప్పుడు అక్కరకు రాలేదు. నరనారాయణులూ, వరం తీసుకున్న కుంతీ, కవచకుండలాలు గ్రహించిన ఇంద్రుడూ, అనుచిత వ్యాఖ్యలతో నిరుత్సాహ పరచిన శల్యుడూ, భూమాత శాపం, గురువు శాపంతో అక్కరకురాని విద్య, మొదలగు ఆరు కారణాల వలన కర్ణుడు మరణించాడనేది సత్యం. జగత్తుకూ, జగత్తులో జీవించే ప్రాణులకూ, హితం కలగాలి. సనాతన వైదిక ధర్మం నిరాటంకంగా కొనసాగాలి. అందుకు పరమాత్మ ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. ఎన్ని ఎత్తులకైనా తెరదీస్తాడు. అందుకు నిదర్శనమే, నర నారాయణ జననం.

జై శ్రీమన్నారాయణాయ!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home