ఆనందం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


ఆనందం!
కర్మల వెనుక ఉన్న అంతిమలక్ష్యం ‘ఆనందం’ కోసం అన్వేషణ అంటే?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (32 – 36 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 32 నుండి 36 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/QaT8M3tArJw ]


చీకటితో ఆవృత్తమై ఉండే తమోగుణ బుద్ధిని గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

00:47 - అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ।। 32 ।।

ఓ పార్థా! చీకటితో ఆవృత్తమై ఉండి, అధర్మమునే ధర్మమనుకుంటూ, అసత్యమును సత్యమని భావిస్తూ ఉండే బుద్ధి, తమోగుణ బుద్ధి.

తామసిక బుద్ధి అనేది, పవిత్రమైన జ్ఞానముచే ప్రకాశితమై ఉండదు. కాబట్టి, అది అధర్మమునే తప్పుగా, ధర్మమని అనుకుంటుంది. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు ఆ మద్యం యొక్క మత్తు పట్ల ఆసక్తితో ఉంటాడు. కాబట్టి, అతని యొక్క అల్పబుద్ధి, అంధకారముచే కప్పివేయబడినదై, తనకు తానే స్వయంగా చేసుకునే తీవ్ర హానిని కూడా గ్రహించలేడు. ఇది ఎంత బలీయంగా ఉంటుందంటే, ఇంకొక మద్యంసీసా కోసం తన ఆస్తిని కూడా అమ్మటానికి వెనుకాడడు. తామసిక బుద్ధిలో, విచక్షణా జ్ఞానము, మరియు తర్కబద్ధ వివేచన అనేవి కోల్పోబడతాయి.

01:49 - ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః ।
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ।। 33 ।।

యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పమూ, మనస్సూ, ప్రాణ వాయువులూ, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్నీ, సత్త్వ గుణ దృఢ మనస్కత అంటారు.

దృఢ సంకల్పము అనేది, కష్టాలు-అవరోధాలు ఎదురైనా, మన మార్గంలోనే పట్టువిడువకుండా ఉంచగలిగే మన మనోబుద్ధుల యొక్క అంతర్గత సామర్థ్యము. మనం మన లక్ష్యంపై చూపును కేంద్రీకరిస్తూ, శరీరమనోబుద్ధులలో దాగి ఉన్న శక్తిని వెలికితీసి, కష్టసాధ్యమైన అవరోధాలను కూడా అధిగమించే సామర్థ్యాన్ని - ధృతియే కలుగచేస్తుంది. యోగాభ్యాసము ద్వారా, మనస్సు క్రమశిక్షణతో ఉండి, శరీరేంద్రియములపై ఆధిపత్యంతో ఉండగలిగే సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటుంది. ప్రాణవాయువులను నియంత్రించి, ఇంద్రియములను అధీనము లోనికి తెచ్చుకుని, మనస్సును నియంత్రించగలిగినప్పుడు కలిగే దృఢ చిత్తమునే, సత్త్వ గుణములో ఉన్న దృఢ సంకల్పమని అంటారు.

03:01 - యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున ।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ।। 34 ।।

ఫలాపేక్షచే ప్రేరితమై, విధులు, సుఖములు, మరియు సంపద పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము, రాజసిక ధృతి అని చెప్పబడును.

ధృతి అనేది కేవలం యోగులలోనే ఉండదు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్న జనులు కూడా, తమతమ ఆశయసాధనలో అత్యంత ధృడ సంకల్పముతో ఉంటారు. కానీ, వారి సంకల్పమనేది, వారి పరిశ్రమ యొక్క ఫలములను భోగించాలనే కోరికచే, ప్రేరేపితమై ఉంటుంది. ఇంద్రియ సుఖాలను భోగించాలి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి - వంటి విషయాలపై వారి మనస్సు కేంద్రీకృతమై ఉంటుంది. అలాగే, డబ్బు అనేది వీటన్నిటినీ పొందటానికి సాధనం కాబట్టి, ఇటువంటి మనుష్యులు జీవితాంతం డబ్బునే పట్టుకుని వ్రేళ్ళాడతారు. కర్మఫలములను భోగించాలనే కోరికచే ప్రేరేపితమైన సంకల్పము, రజో గుణములో ఉన్న సంకల్పముగా చెప్పబడినది.

04:08 - యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ ।
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ।। 35 ।।

విడువకుండా పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనౌతూ, మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే, తమోగుణ ధృతి అంటారు.

సంకల్పము, ధృడ చిత్తమనేవి, అవివేకులూ మరియు అజ్ఞానులలో కూడా కనిపిస్తాయి. కానీ, ఆ మూర్ఖత్వము - మొండితనము, భయము, నిరాశ, మరియు దురహంకారముచే జనిస్తుంది. ఉదాహరణకి, కొంతమంది అస్తమానం భయపడే లక్షణంతో ఉంటారు. అదేదో తమ వ్యక్తిత్వములో భాగమన్నట్టుగా, వారు దానినే పట్టుకుని ఉండటం ఒక ఆసక్తికరమైన, గమనించదగ్గ విషయం. మరికొందరు, ఏదో గతంలో జరిగిన నిరాశా సంఘటననే అస్తమానం పట్టుకుని ఉండి, దానిని విడిచి పెట్టక, తమ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. అది వారిపై ఎంత దుష్ప్రభావం కలుగచేస్తుందో గమనించి కూడా, అలాగే ఉంటారు. కొందరు తమ అహంభావమును దెబ్బ తీసిన వారందరితో, తగవు పెట్టుకోకుండా ఉండలేరు. ఇటువంటి నిరర్థకమైన తలపుల పట్ల ఉన్న మూర్ఖపు పట్టుపై ఆధారపడి ఉన్న ధృతి, తమోగుణములో ఉన్న సంకల్పంగా చెప్పబడుతుంది.

05:31 - సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ ।
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ।। 36 ।।

ఓ అర్జునా, ఇక ఇప్పుడు దేహముయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించీ, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించీ వినుము.

ఇంతకు క్రితం శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు కర్మ యొక్క అంగములను వివరించి ఉన్నాడు. ఆ తరువాత కర్మలను ప్రేరేపించి, నియంత్రించే కారకములను వివరించి ఉన్నాడు. ఇక ఇప్పుడు కర్మ యొక్క లక్ష్యము గురించి చెబుతున్నాడు. జనుల కర్మల వెనుక ఉన్న అంతిమలక్ష్యం, ఆనందం కోసం అన్వేషణే. ప్రతిఒక్కరూ ఆనందంగా, సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. వారి పనులచే వారు తుష్టిని, శాంతిని, మరియు సంతృప్తిని పొందటానికి ప్రయత్నిస్తారు. కానీ, ప్రతి ఒక్కరి కర్మలూ, వాటి వాటి అంతర్గత కారక స్వభాములచే భిన్నముగా ఉండటం వలన, వాటి ద్వారా వచ్చే సుఖము కూడా వేర్వేరుగా ఉంటుంది.

ఇక మన తదుపరి వీడియోలో, సత్వ గుణ ఆనందం, రజో గుణ ఆనందం, తామసిక ఆనందం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home