కులవ్యవస్థ! Casteism భగవద్గీత Bhagavad Gita Chapter 18


కులవ్యవస్థ!
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రుల గురించి శ్రీకృష్ణుడేం చెప్పాడు?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (37 – 41 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 37 నుండి 41 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/uyfTaY-i77Q ]


సత్వ గుణ ఆనందం, రజో గుణ ఆనందం, తామసిక ఆనందం ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము..

00:49 - యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ ।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ।। 37 ।।

మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే, సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానము యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.

ఉసిరికాయ, ఆరోగ్యానికి లాభకారియైన అత్యుత్తమ ఆహారపదార్ధాలలో ఒకటి. దానిలో, 10 నారింజ పళ్ళకన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కానీ, అది పుల్లగా ఉంటుంది కాబట్టి, పిల్లలకు అది ఇష్టం ఉండదు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఉసిరికాయ తిన్న తరువాత, రెండు నిమిషాల వ్యవధిలోనే, పుల్లని రుచి పోయి, తియ్యని రుచి అనుభవంలోకి వస్తుంది. సత్త్వ గుణ సుఖము, సరిగ్గా ఇటువంటిదే. అది ప్రస్తుతానికి చేదుగా అనిపించినా, అంతిమంగా అమృతంలాగా ఉంటుంది. వేదములు ఈ యొక్క సత్త్వ గుణ సుఖాన్ని, 'శ్రేయస్సు' అని చెప్పాయి. అంటే, ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్నా, అంతిమంగా అది చాలా మంచిది. దీనికి వ్యతిరేకం 'ప్రేయస్సు'. అది ప్రస్తుతానికి సుఖంగా ఉన్నా, అంతిమంగా హానికారకమే. ఈ శ్రేయస్సు మరియు ప్రేయస్సు గురించి, కఠోపనిషత్తు ఈ విధంగా పేర్కొన్నది.. రెండు మార్గాలు ఉన్నాయి - ఒకటి “మేలుకలిగించేది”, ఇంకొకటి “సుఖంగా” ఉండేది. ఈ రెండూ మనుష్యులను రెండు భిన్నమైన గమ్యాలకు చేరుస్తాయి. సుఖంగా ఉండేది, మొదట్లో హాయిగా అనిపిస్తుంది. కానీ, అది బాధతో ముగుస్తుంది. అజ్ఞానులు ఈ సుఖాలలో చిక్కుకుపోయి, చివరకు నశించిపోతారు. కానీ, వివేకవంతులు ఈ ఆకర్షణలచే మోసపోరు. అందుకే వారు ప్రయోజనకరమైన దానిని ఎంచుకుని, సుఖానందాన్ని పొందుతారు.’

02:41 - విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్ ।
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ।। 38 ।।

ఇంద్రియములతో, ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేతా కలిగిన సుఖమును, రాజసిక సుఖమని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా, చివరకు విషంలా ఉంటుంది.

రాజసిక సుఖమనేది, ఇంద్రియములకు ఇంద్రయవస్తువిషయ సంపర్కము కలిగినప్పుడు అనుభవించే అనుభూతి. కానీ, ఆ కలయిక మాదిరిగానే, సుఖానందము కూడా తాత్కాలికమే. ఈ ప్రక్రియలో అది దురాశ, ఆందోళన, అపరాధభావన, మరియు మరింత భౌతిక భ్రాంతిని కలుగచేస్తుంది. భౌతిక జగత్తులో కూడా, అర్థవంతమైన పురోగతి సాధించాలంటే, రాజసిక సుఖాన్ని త్యజించవలసి ఉంటుంది. నిత్య శాశ్వతమైన దివ్య ఆనందం కోసం ఉన్న మార్గము - భోగాలను అనుభవించటంలో లేదు. అది త్యాగము, తపస్సు, మరియు క్రమశిక్షణ లోనే ఉన్నది.

03:44 - యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః ।
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ।। 39 ।।

ఏదైతే ఆనందము - ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో - అది తామసిక ఆనందమని చెప్పబడును.

తామసిక సుఖము, అన్నింటికన్నా నిమ్న స్థాయికి చెందినది. అది మొదటినుండీ చివర వరకూ మూర్ఖమయినది. అది ఆత్మను అజ్ఞానపు చీకటిలో విసిరివేస్తుంది. అయినా సరే, దానిలో ఒక స్వల్పమాత్ర సుఖము ఉండటం చేత, జనులు దానికి బానిసై పోతారు. అందుకే సిగరెట్టు త్రాగేవారు, అది తమకు చాలా హానికారి అనితెలిసి కూడా, ఆ అలవాటును వదిలిపెట్టటానికి కష్టతరంగా భావిస్తారు. ఆ దురలవాటు నుండి లభించే సుఖాన్ని త్యజించలేకపోతారు. నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యం ద్వారా జనించిన ఇటువంటి సుఖానందాలు, తమోగుణములో ఉన్నట్లని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.

04:50 - న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ।। 40 ।।

ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.

భౌతిక శక్తి అయిన మాయ, మూడు వర్ణములలో ఉంటుంది. తెలుపు, ఎరుపు, మరియు నలుపు.. అంటే, దానికి మూడు గుణములు ఉంటాయి.. సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. విశ్వములోని అసంఖ్యాకమైన జీవులకు, అది మాతృ-గర్భము వంటిది. పుట్టుకలేని, సంపూర్ణ జ్ఞాన స్వరూపుడైన ఆ భగవంతునిచే, అది అస్థిత్వములోనికి తేబడి, ఆయనచే నిర్వహించబడుతున్నది. కానీ, భగవంతునికి ఈ భౌతిక శక్తి అంటదు. ఆయన తనకుతాను వేరుగా, అలౌకిక లీలానందమును రమిస్తుంటాడు. కానీ, జీవుడు దానిని భోగిస్తూ, తద్వారా బద్ధుడై పోతాడు. నరక లోకాల నుండి బ్రహ్మ లోకం వరకూ, మాయ యొక్క పరిధి ఉంటుంది. ప్రకృతి త్రిగుణములు - సత్త్వము, రజస్సు, మరియు తమస్సులు, మాయ యొక్క అంతర్లీన గుణములు కాబట్టి, అవి అన్ని భౌతిక లోకాలలో ఉంటాయి. అందుకే, ఈ లోకాలలో ఉండే సమస్త జీవ రాశులూ, వారు మానవులైనా లేదా దేవతలైనా, ఈ త్రి-గుణముల ప్రభావంలోనే ఉంటారు. ఉన్న తేడా అంతా, ఈ గుణములు ఉండే పాళ్ళు వేర్వేరుగా ఉండటమే. నిమ్న లోకాలలో నివసించేవారు, తమోగుణము ప్రధానంగా కలిగి ఉంటారు. భూలోకంలో ఉండేవారు, రజోగుణ ప్రధానంగా ఉంటారు. ఇక స్వర్గాది లోకాలలో ఉండేవారు, సత్త్వ గుణ ప్రధానంగా ఉంటారు.

06:39 - బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప ।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ।। 41 ।।

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు, వీరి యొక్క విధులు, వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి.

జనులకు వారి వారి గుణముల ప్రకారంగా, వారి వ్యక్తిత్వాన్ని ఏర్పరిచే విభిన్నమైన స్వభావాలు ఉంటాయి. అందుకే విభిన్న వృత్తిపరమైన విధులు, వారికి అనుగుణముగా ఉంటాయి. ఈ యొక్క 'వర్ణాశ్రమ ధర్మములు' అనేవి, 'స్వభావ-ప్రభావైర్ గుణైః'.. అంటే, వ్యక్తి యొక్క స్వభావ గుణముల ఆధారంగా, పనిని అనుసరించి ఉన్న ఒక శాస్త్రీయమైన సామాజిక ఏర్పాటు. ఈ వర్గీకరణ పద్ధతిలో, నాలుగు ఆశ్రమాలూ,  మరియు నాలుగు వృత్తులూ ఉంటాయి.

1) బ్రహ్మచర్య ఆశ్రమం అంటే విద్యార్థి జీవితం, ఇది పుట్టుక నుండి 25 సంవత్సరాల వయస్సు వరకు ఉండేది.
2) గృహస్థ ఆశ్రమం అంటే కుటుంబపర జీవనం లేక సాధారణ వైవాహిక జీవితం, ఇది 25 సంవత్సరాల వయస్సు నుండి 50 సంవత్సరాల వరకు.
3) వానప్రస్థ ఆశ్రమం అంటే పాక్షిక సన్న్యాస జీవనం, ఇది 50 సంవత్సరాల వయస్సు నుండి, 75 సంవత్సరాల వయస్సు వరకు.. ఈ స్థితిలో, కుటుంబంలో ఉంటూనే, సన్న్యాసమును అభ్యాసం చేయటం.
4) సన్యాస ఆశ్రమం అంటే, 75 ఏళ్ల వయస్సు నుండి, ఆ పైకి.. ఇందులో వ్యక్తి అన్ని కుటుంబపర విధులనూ త్యజించి, ఒక పవిత్ర ప్రదేశంలో నివసిస్తూ, మనస్సును భగవంతుని యందే నిమగ్నం చేస్తాడు.

ఇక బ్రాహ్మణ పురోహితులు అంటే, పౌరోహిత్యం చేసేవారూ, క్షత్రియులు అంటే యోధులు మరియు పరిపాలన చేసేవారూ, వైశ్యులు అంటే వ్యాపారం, మరియు వ్యవసాయం చేసేవారూ, శూద్రులు కాయకష్టం చేసేవారూ.. ఈ నాలుగు వర్ణములవారికి, నాలుగు వృత్తి ధర్మములు నిర్దేశించబడినవి. వర్ణములనేవి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎప్పుడూ పరిగణింపబడలేదు. సమాజం మొత్తం భగవంతుని చుట్టూ, ఆయన సేవార్థమే ఉండేది కాబట్టి, అందరూ తమనూ, మరియు సమాజాన్ని పోషించేందుకు, తమ స్వాభావిక సహజ గుణముల ప్రకారంగా పని చేసేవారు; తద్వారా భగవత్ ప్రాప్తి దిశగా ముందుకెళ్లి, జీవితాన్ని సఫలం చేసుకునేవారు. ఈ విధంగా వర్ణాశ్రమ వ్యవస్థలో, భిన్నత్వంలో ఏకత్వం ఉండేది. ప్రకృతిలో భిన్నత్వం అనేది, అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉండేదే.. దానిని పూర్తిగా నిర్మూలించలేము. మన శరీరంలోనే విభిన్నమైన అంగములు ఉన్నాయి. అవన్నీ వేర్వేరు పనులు చేస్తుంటాయి. అన్ని అంగములూ ఒకే పని చేయాలని ఆశించటం, అవివేకం. వాటన్నిటినీ భిన్నంగా చూడటం అజ్ఞానం కాదు.. అది వాటి యొక్క యదార్థ ప్రయోజనాన్ని చూడటమే. అదే విధంగా, మానవులలో ఉండే వైవిధ్యాన్ని కూడా మనం విస్మరించలేము. సమత్వమే ప్రధాన సూత్రంగా ఉన్న కమ్యూనిస్ట్ దేశాలలో కూడా – సిద్ధాంతాలనూ, చట్టాలనూ ప్రతిపాదించే పార్టీ నాయకులు ఉంటారు. ఆయుధాలు ధరించి దేశాన్ని కాపాడే సైనికులూ, సైన్య బలం ఉంటుంది. వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటారు. శారీరక పనిచేసే ప్రారిశ్రామిక కార్మికులు ఉంటారు. ఎంత సమానంగా ఉంచాలని చూసినా, ఈ నాలుగు రకాల వృతుల వారు, అక్కడ కూడా ఉంటారు. వర్ణాశ్రమ వ్యవస్థ, మనుష్యులలో ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి, వారివారి స్వభావాల అనుగుణంగా, వారికి సరిపోయే వృత్తులను శాస్త్రీయంగా సిఫారసు చేసింది. కానీ, కాలక్రమంలో, వర్ణాశ్రమ వ్యవస్థ భ్రష్టుబట్టిపోయింది. వర్ణమనేది వ్యక్తి యొక్క గుణ-స్వభావంపై కాక, వాని యొక్క పుట్టుకపై ఆధారమైపోయింది. ఉన్నత కులము, తక్కువ కులము అన్న భావము ప్రబలిపోయింది. తక్కువ కులం వారిని చిన్నచూపు చూడటం మొదలయ్యింది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ బిరుసుగా, పుట్టుక ఆధారంగా అయిపోయిందో, అది అస్తవ్యస్థమై పోయింది. ఈ సామాజిక దోషం, కలికాలంలో ప్రబలిందే కానీ, వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క అసలు ఉద్దేశ్యం కాదు.

10:58 - ఇక మన తదుపరి వీడియోలో, నాలుగు వర్ణాల వారిలో సహజంగా ఉన్న కర్మ లక్షణములు ఏంటో, శ్రీ కృష్ణుడి వివరణను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home