ముచికుందుడు King Muchukunda


ముచికుందుడు ఎవరు?
యాదవులచేతిలో మరణం లేని వరాన్ని పొందిన కాలయవనుడిని కృష్ణుడు ఎలా చంపాడు?

సూర్యవంశానికి చెందిన ముచికుందుడు, మహాపరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచికుందుడిని యుద్ధంలో గెలవడం అసాధ్యం. వందలాది సైన్యాన్ని మట్టుపెట్టగల సమర్థుడు. కదనరంగాన మహా మహావీరులు సైతం ఆయనకు ఎదురు నిలువలేరు, ఆయన ధాటికి తట్టుకోలేరు. అందువల్లనే దేవతలు సైతం ఆయన సహాయాన్ని కోరేవారు. దీనిని బట్టే ఆయన ఏ స్థాయి పరాక్రమవంతుడనేది అర్ధం చేసుకోవచ్చు. త్రేతాయుగంలో జన్మించిన ముచికుందుడు ఇంకా జీవించే ఉన్నాడా? ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడికీ, ముచికుందుడుకీ సంబంధం ఏమిటీ? ముచికుందుడు దేవతల నుండి పొందిన వరం ఏమిటి? అది కృష్ణుడికి ఎలా ఉపయోగపడింది? ముచికుందుడి వృత్తాంతానికి సంబంధించిన ఉత్సుకతను కలిగించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bVirKu3kTVI ]


ఒకసారి దేవదానవుల మధ్య పోరు భీకరంగా సాగింది. దేవతలను జయించే పరిస్థితికి, దానవులు చేరుకున్నారు. అలాంటి సమయంలోనే, వాళ్లంతా ముచికుందుడి సహాయాన్ని కోరారు. దాంతో ఆయన దేవతల పక్షాన, అసురులతో పోరాడాడు. ముచికుందుడు యుద్ధరంగాన నిలిచిన తొలిరోజునే, ఆయన ఎంతటి పరాక్రమవంతుడనేది, దానవులకు అర్థమయ్యింది. అసురులు ఆయన ధాటికి నిలువలేక, తమ ప్రాణాలను కొల్పోయారు. అలా దేవతలు విజయం సాధించడంలో, ముచికుందుడి పాత్ర ప్రధానమైనది. యుద్ధం పూర్తయిన తరువాత, విజయానికి కారకుడైన ముచికుందుడిని దేవతలు అభినందించారు. తమకు చేసిన సాహాయానికిగాను, ఏదైనా వరం కోరుకోమని అన్నారు. ఎడతెరపి లేని యుద్ధంలో పోరాడి అలసిన తనకు, కొన్నేళ్లపాటు హాయిగా నిద్రించే వరం ప్రసాదించమని, ముచికుందుడు కోరుకున్నాడు. ఆ సమయంలో ఎవరైతే తనకి నిద్రా భంగం కలిగిస్తారో, వాళ్లు తన కంటిచూపు సోకగానే భస్మం అయ్యేలా, వరాన్ని ప్రసాదించమన్నాడు. అందుకు దేవతలు తథాస్తు పలికి, ఆయన కోరికను మన్నించారు. దాంతో ముచికుందుడు, సామాన్యుల కంటబడని ఒక గుహను ఎంపిక చేసుకుని, అందులో నిద్రకు ఉపక్రమించాడు.

యుగాల తరబడి ఆయన అలా నిద్రావస్థలోనే ఉన్నాడు. ముచికుందుడు దేవతల నుండి పొందిన వరం, ద్వాపర యుగంలో ఒక అసురుడి మరణానికి కారణమయ్యింది. బలరామకృష్ణుల చేతిలో ఓడిపోయిన జరాసంధుడు, ఎప్పటికప్పుడు ఇతర రాజులతో మైత్రి చేసుకుని, వాళ్లతో కలిసి మధురపై దండెత్తేవాడు. అలా జరాసంధుడు వరుసగా దండయాత్రలు చేయడం, కృష్ణుడు అతనిని తప్ప, మిగతావారిని కడతేర్చడం జరుగుతూ వచ్చింది. ఇలా తరచూ జరుగుతుండడంతో, యాదవ సైన్యం కూడా పెద్ద సంఖ్యలో నశించసాగింది. దాంతో సముద్ర మధ్య ప్రాంతంలో "ద్వారకా నగరం" నిర్మించాలని, శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. అక్కడైతే జరాసంధుడి దాడుల కారణంగా, ప్రజల ప్రాణాలకు ముప్పుండదని భావించాడు. అనుకున్నదే తడవుగా, "విశ్వకర్మ"ను రప్పించి, ద్వారకా నగర నిర్మాణ పనులను, ఆయనకు అప్పగించాడు.

అత్యంత సుందరంగా ద్వారకా నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో, విశ్వకర్మ రంగంలోకి దిగాడు. మంచి ముహూర్తం చూసుకుని, ఆయన ద్వారకా నగర నిర్మాణ పనులను ఆరంభించాడు. అలా చకచకా పనులు సాగిపోతున్నాయి. ఒక వైపున ద్వారకా నగర నిర్మాణం జరుగుతూ ఉన్న సమయంలో కూడా, జరాసంధుడు యుద్ధానికి రావడం, ఓడిపోయి ఒంటరిగా తిరిగి వెళ్లడం జరుగుతూనే ఉంది. ఆ మరుసటి రోజు నుంచే, మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకోవడం మొదలు పెట్టే వాడు. అలా కృష్ణుడి వీరత్వం గురించి, "కాలయవనుడి" కి తెలిసింది. తనను మించిన వీరుడు లేడనే అహంభావంతో ఉన్న కాలయవనుడు, కృష్ణుడి ధైర్యసాహసాలను గురించి విన్నాడు. కృష్ణుడిని చూడాలనీ, ఆయనతో యుద్ధం చేయాలనీ భావించాడు. "కంసుడిని హతమార్చి, జరాసంధుడిని పలుమార్లు ఎదుర్కున్న కృష్ణుడు, నిజంగానే మహావీరుడయ్యే ఉంటాడు. అలాంటి వీరుడు సహజంగా మిడిసిపడుతుండటం జరుగుతూ ఉంటుంది. తాను ఉండగా అలా జరగకూడదు. అలాంటివాళ్లకు తాను ఉన్నాననే ఒక భయం ఉండాలి" అని తనలో తాననుకున్నాడు. అలాంటి ఆలోచన రాగానే, కృష్ణుడిని ఎదిరించడమే ధ్యేయంగా కదలమని, తన సైనిక బలగాలను ఆదేశించాడు కాలయవనుడు.

అతడి సైనిక బలగాలు మధుర పొలిమేరలను చేరుకున్నాయి. యాదవుల చేతిలో మరణం లేకుండా వరాన్ని పొందిన కాలయవనుడిని, తెలివిగా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు. మరుక్షణమే, కాలయవనుడు తన సైన్యంతో విడిది చేసిన ప్రదేశానికి ఒంటరిగా చేరుకున్నాడు. కృష్ణుడు ఎలాంటి ఆయుధాలూ చేతపట్టక, ఒంటరిగా తనవైపుకు రావటం చూసిన కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని చూడగానే, "కాలయవనుడు" ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. తన వరబలం, భుజబలం సంగతి తెలియక, కృష్ణుడు ఒంటరిగా రావడం చూసి నవ్వుకున్నాడు. ఇతర అసురులను సంహరించినంత తేలికగా తనను మట్టుపెట్టగలననే నమ్మకంతో, అతను వస్తుండవచ్చని భావించాడు. ఒక్కసారి తన శౌర్య పరాక్రమాలను రుచి చూపిస్తే, ఇకపై తనను తలచుకోవడానికి కూడా భయపడతాడని అనుకున్నాడు. కృష్ణుడు తన సమీపానికి వస్తుండగానే, ఒక్కసారిగా ఖడ్గాన్ని దూశాడు. అది చూసిన కృష్ణుడు ఉలిక్కిపడినట్టుగా నటించి, అక్కడి నుంచి పరుగందుకున్నాడు.

భయంతో కృష్ణుడు అలా పారిపోవటం చూసి కాలయవనుడు పకపకా నవ్వుతూ, "కృష్ణుడు మహావీరుడు, ఎంతోమంది అసురులను సంహరించాడని తెలిసి, అతనితో యుద్ధం చేయాలని తాను ముచ్చటపడి వస్తే, అతను ఇలా పారిపోతుండటం హస్యాస్పదం" అని ప్రగల్భాలు పలికాడు. ఎంతో దూరం నుంచి వచ్చిన తను, కృష్ణుడిని ఓడించకుండా వెనుతిరగకూడదని నిశ్చయించుకుని, ఆయనను అనుసరించాడు. కాలయవనుడు తన వెంటపడుతుండటంతో, మరింత భయాన్ని నటిస్తూ, కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయన ఎంతగా భయపడుతుంటే, అంతగా కాలయవనుడు ఆనందంతో పొంగిపోతున్నాడు. ఒక్కసారి తనతో యుద్ధం చేయమనీ, తనని వీరుడిగా అంగీకరించమనీ కోరుతూ, కృష్ణుడి వెంటే కాలయవనుడు కూడా పరిగెత్తాడు. అయినా ఆగకుండా కృష్ణుడు పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడక్కడా ఆగి వెనక్కి తిరిగి చూస్తూ, కాలయవనుడు కాస్త దగ్గరికి రాగానే, మళ్లీ పరిగెడుతూ ఉన్నాడు కృష్ణుడు.

ఆయనను పట్టుకోవడం చేతకాక పరుగెత్తలేక ఆయాసంతో, "ఇంత పిరికివాడినా, అంతటి మహా వీరుడంటూ ఆకాశానికి ఎత్తేశారు! ఇంత భయస్థుడి చేతిలోనా, అసురులు అసువులు బాసినది! ఏది ఏమైనా, కృష్ణుడిని పట్టుకుని, ఒక్కసారైనా కత్తి కలిపి ఆయనను ఓడించాననే సంతృప్తితోనే తాను వెనుదిరగాలి. లేదంటే, జీవితాంతం ఆ అసంతృప్తి అలా వెంటాడుతూనే ఉంటుంది" అనుకుంటూ, మళ్లీ పరుగు వేగాన్ని పెంచాడు కాలయవనుడు. అతనికి అందినట్టుగానే అంది, తప్పించుకుని మళ్లీ పరుగందుకుంటున్నాడు కృష్ణుడు. ఇలా వాళ్లు చాలాదూరం వెళ్ళారు. కాలయవనుడిని తప్పించుకోవడం కోసం, కృష్ణుడు గుహలోకి ప్రవేశించాడు. అది చూసిన కాలయవనుడు, ఆయన వెనుకే గుహలోకి ప్రవేశించాడు. పొడవైన, విశాలమైన ఆ గుహలో అంతా చీకటిమయం. అందులో కృష్ణుడి కోసం అంగుళం అంగుళం వెతకసాగాడు కాలయవనుడు. అయితే, ఒక చోట ఎవరో పడుకుని ఉన్నట్టనిపించడంతో, అది కృష్ణుడని భావించిన కాలయవనుడు, అతనికి దగ్గరగా వెళ్లి, "ఎక్కడ ఉన్నా, ఎన్ని వేషాలు వేసినా, నా నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. కృష్ణుడు నా చేతికి చిక్కడం అసంభవమనీ, అసాధ్యమనీ చాలామంది చెప్పారు. అలాంటి వారందరికీ, తానేమిటనేది ఇప్పుడు తెలుస్తుంది." అని గర్వంతో పలుకుతూ, "ముసుగు తొలగించి బయటికి వస్తే, బలాబలాలు తేల్చుకుందాం" అని సవాలు చేశాడు.

అయినా అవతలి వ్యక్తి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, లేవమంటూ కాలయవనుడు తన కాలితో ఒక్క తన్ను తన్నాడు. కాలయవనుడు అలా తన్నడంతో, అప్పటివరకూ ముసుగుపెట్టి పడుకున్న "ముచికుందుడు", నెమ్మదిగా ముసుగు తొలగించాడు. కృష్ణుడికి బదులుగా అక్కడ ఎవరో ఉండటం చూసి, కాలయవనుడు బిత్తరపోయాడు. కృష్ణుడు ఎక్కడికి పోయాడు? ఏమైపోయాడన్నట్టుగా, ఆయన కోసం చుట్టూ చూశాడు. తనకు నిద్రాభంగం కలిగించిందెవరని అనుకుంటూ, ముచికుందుడు కళ్లు నలుపుకుంటూ లేచాడు. ఆయన కళ్లు తెరిచి చూడగానే, తీక్షణమైన ఆ శక్తికి కాలయవనుడు ఒక్కసారిగా భస్మమైపోయాడు. వందల ఏళ్లపాటు నిద్రలో ఉండి లేచిన కారణంగా, ఏం జరిగిందనేది ముచికుందుడికి అర్థం కాలేదు.  తన కళ్ల ఎదురుగా పోగుపడిన భస్మ రాశిని చూశాడు. తన గుహలోకి ప్రవేశించిందెవరు? తనను నిద్రలో నుంచి లేపిందెవరు? తనతో వాళ్లకి గల పనేమిటి? అని పరిపరివిధాల ఆలోచించసాగాడు ముచికుందుడు. అప్పటివరకూ చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న కృష్ణుడు బయటికి వచ్చి, జరిగిందంతా ముచికుందుడికి వివరించగా, కృష్ణ దర్శనభాగ్యం లభించినందుకు ముచికుందుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పరి పరి విధాలా భగవానుడిని స్తుతించాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home