తండ్రి గర్భంలో జన్మించిన అతడు ఎవరు? Mandhata – The legendary King
తండ్రి గర్భంలో జన్మించిన అతడు ఎవరు?
హిందూ పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచిపోతుంది. షోడశ మహారాజులలో ఓకడిగా కీర్తిగడించిన, ఇక్ష్వాకు వంశస్థుడు మాంధాతకు సంబంధించిన ప్రస్తావన, మహాభారతంలోని శాంతి పర్వము, వన పర్వములో కనిపిస్తుంది. ఈ షోడశమహారాజులకు సంబంధించిన వీడియోని గతంలో మన చానెల్ లో పుబ్లిష్ చేశాను. చూడని వారికోసం దాని లింక్ ను క్రింద డిస్క్రిప్షన్ లో పొందు పరిచాను. ఎంతో విచిత్రమైన మాంధాత జననం ఎలా జరిగింది? అతి బలవంతుడైన రావణుడితో మాంధాత యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంద్ర సింహాసనాన్ని అధిష్టించాలనుకున్న మాంధాత కోరిక నెరవేరిందా? భూమండలాన్ని ఏకచ్ఛాత్రిధిపతిగా ఏలిన మాంధాతకు మరణం ఎలా సంభవించింది - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bAds8CIzcuw ]
అరణ్యవాసంలో ఉన్న పాండవులు, సైంధవారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ ప్రవహిస్తున్న యమునా నదిని చూసి, వారితో ఉన్న రోమశుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఇది యమునా నది. గంగా నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేశాడు. ఆయన చరిత్ర చెపుతాను విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడూ, కీర్తివంతుడూ, ధర్మశీలుడూ, బలవంతుడూ అయిన యవనాశ్వుడనే రాజు ఉండేవాడు. అతనికి వంద మంది భార్యలు ఉన్నా, సంతానం మాత్రం కలుగలేదు. ఆ కారణంతో ఎంతో చింతించిన యవనాశ్వుడు, భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి, సంతానం కోసం అర్ధించాడు. అతని కోరిక మన్నించిన భృగుమహర్షి, పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం అనంతరం మంత్రజలం నిండిన పాత్రను పక్కన ఉంచాడు. యాగ నిమిత్తం, ఆ రోజు మొత్తం ఉపవాసం ఉన్న యవనాశ్వుడు, అర్ధరాత్రి సమయంలో దాహంవేసి, తెలియక ఆ మంత్రజలాన్ని త్రాగాడు. ఇది భృగుమహర్షికి తెలిసి యవనాశ్వునితో, "రాజా! విధి అనుల్లంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని, నీవు త్రాగావు. కనుక నీవు గర్భం ధరిస్తావు. నీ భార్య ఈ మంత్ర జలాన్ని తాగినట్లయితే, దేవేంద్రుడికి సమానమైన కుమారుడు జన్మించేవాడు. ఈ జలాన్ని నీవు తాగడం వలన, నువ్వు కుమారుడికి జన్మనిస్తావు" అని చెప్పాడు.
ఆ విధంగానే, యవనాశ్వుడు గర్భం ధరించాడు. అతని ఉదరం ఎడమభాగాన్ని చీల్చుకుని, కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడటానికి ఇంద్రుడితో సహా, దేవతలందరూ వచ్చాడు. ఆ బాలుడు ఇంద్రుడి చూపుడు వ్రేలిని నోటిలో పెట్టుకుని, అమృతాన్ని సేవించాడు. అందువలన అతనికి మాంధాతృడు అని నామకరణం చేశాడు. చిన్నతనం నుంచే ఎన్నో సాహసాలు చేసేవాడు. యుద్ధాల్లో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుని, అందరిలోనూ మేటిగా నిలిచాడు. మాంధాతను 12వ ఏట రాజ్యభిషిక్తుడిని చేసి, తపస్సుకు వెళ్ళిపోయాడు యవనాశ్వుడు. ఎంతో శక్తివంతమైన రాజుగా ఎదిగాడు మాంధాత. ప్రజలకు పన్నుల భారం లేకుండా, వారిని సుఖంగా చూసుకున్నాడు. కొంతకాలం రాజ్యభారం మోసిన తరువాత, సైంధవారణ్యానికి వెళ్ళి, మాంధాత విష్ణువును గురించి తపస్సు చేశాడు. దాంతో ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి, తనకు నమస్కరించిన మాంధతతో, "మాంధాతా! నువ్వు విష్ణువును ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకని నేను ప్రత్యక్షం అయ్యాను. నీ కోరిక ఏమిటో నేను నెరవేరుస్తాను" అని అన్నాడు. దాంతో మాంధాత, "మహేంద్రా! నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగించి, బిక్షుకవృత్తి మీద ఆసక్తి కలిగించు" అని కోరాడు.
అప్పుడు ఇంద్రుడు మాంధాతతో, "ఓ మహారాజా! అన్ని ధర్మములలోకి రాజధర్మం గొప్పది. రాజు కామక్రోధములు విడిచి, దండనీతిని అమలు చేస్తూ రాజ్య పాలన చేయాలి. అప్పుడు రాజుకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. అలాంటి మహారాజైన నీకు, భిక్షుక వృత్తి, ఆచరణ యోగ్యం కాదు. ప్రజలను రక్షించడం, యుద్ధంలో మరణించడం, క్షత్రియధర్మం. భిక్షుకవృత్తి రాజధర్మం కాదు. మానవులలో రాజు శ్రేష్టుడని, వేదములు ఘోషిస్తున్నాయి” అని అన్నాడు. “ధర్మబద్ధమైన దండనీతికి సాటి అయినది వేరే లేదని పెద్దలు చెప్పారు కదా! కనుక ఓ మహారాజా! నీవు కామక్రోధములు విడిచి పెట్టి, దండనీతిని అమలు చేస్తూ రాజ్యం చెయ్యి. అంతే కానీ, భిక్షుకవృత్తి నీకు సరికాదు" అని మాంధాతతో ఇంద్రుడు చెప్పాడు. ఆ తరువాత మాంధాత ముల్లోకాలనూ జయించడానికి పూనుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న లంకాధిపతి రావణుడు, మాంధాతను ఎలాగైనా ఓడించాలనుకున్నాడు. తనకంటే బలమైనవాడు లేడని నిరూపించడం కోసం, అతనితో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధం అయ్యాడు. లాంకాధీశుడైన రావణాసురుడు కూడా, బలవంతుడు, శక్తివంతుడైన రాజు. బ్రహ్మ చేత వరాలను పొంది, అహంభావంతో సాధుజనులనూ, ముని పుంగవులనూ హింసించేవాడు. మాంధాత పైకి యుద్ధానికి వెళ్ళాడు రావణుడు. ఇద్దరి మధ్య భీకర పోరు సాగింది. మాంధాత రావణుని సైన్యములోని అకంపనుడు, మహెూదరుడు, విరుపాక్షుడి వంటి అనేక మంది యోధులను సంహరించగా, రావణుడే నేరుగా మాంధాతతో తలపడ్డాడు. ఇద్దరూ దివ్యాస్త్రాలతో యుద్ధం సాగించారు.
రావణుడు మాంధాతపై ఆధిపత్యము సాధించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా, మాంధాత పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ విధంగా ఇద్దరూ శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించగా, ముల్లోకాలను వీటి నుండి రక్షించటానికి, ఋషులు పులస్త్యుడు, గాలవ్యుడు కల్పించుకుని, ఇద్దరినీ యుద్ధమును విరమించుకొమ్మని, సంధి చేశారు. ఆ ఋషులు, భవిష్యత్తులో మాంధాత వంశములో జన్మించే కారణజన్ముడూ, సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారమైన శ్రీరాముని చేతిలో రావణాసురుడు మరణించవలసి ఉన్నదని, మాంధాతతో చెప్పి యుద్ధం నుండి విరమింపజేశారు. విషయము తెలియక పోయినా, మాంధాత పరాక్రమానికి వెరచి, రావణుడు కూడా యుద్ధం నుండి విరమించాడు. రావణాసురుడిని సైతం ఓడించిన రాజుగా, మాంధాత ప్రఖ్యాతి గడించాడు. చంద్ర వంశానికి చెందిన యాదవ రాజైన శసవిందు కుమార్తె బిందుమతిని వివాహమాడాడు, మాంధాత. వీరికి ముగ్గురు కుమారులూ, యాభై మంది కుమార్తెలూ కలిగారు. కుమారులైన పురుకుత్స, అంబరీష, ముచికుందులు కూడా, మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు.
మాంధాత తన పరిపాలనా కాలంలో, కరువు వచ్చినప్పుడు సహజంగా కురవలసిన వర్షాలు కురువపోతే, తన బాణాలను ప్రయోగించి వర్షాలను కురిపించాడు. వరుణ విద్యలో మాంధాత ఆరితేరినవాడు. కొన్ని వందల అశ్వమేధ యాగాలనూ, రాజసూయ యాగాలను చేశాడు. అంతేకాదు, అనేక ఆలయాలను తన రాజ్యంలో నిర్మింపజేశాడు. భూలోకాన్నీ, పాతాళాన్నీ, సగం స్వర్గాన్నీ జయించిన మాంధాత, ఇంద్రుడి అర్థ సింహాసనాన్ని అధిష్టించాలనే తన కోరికను ఇంద్రుడికి చెప్పాడు. అందుకు ఇంద్రుడు, "ముందు భూలోకాన్ని జయించి, ఆ తర్వాత ఇంద్రలోకాన్ని నువ్వు జయించవచ్చు" అని చెప్పాడు. "భూలోకంలో నేను ఓడించని రాజెవరు" అని ఇంద్రుడిని అడిగాడు మాంధాత. అందుకు ఇంద్రుడు, "మధువు కుమారుడైన లవణుడిని ఓడించి, తరువాత ఇంద్రలోకంలోని సింహాసనాన్ని అధిష్ఠించు" అని చెప్పాడు. ఇండ్రుడి మాట ప్రకారం భూమ్మీదకు వచ్చిన మాంధాత ముందుగా, తన ఆధిపత్యం శిరసా వహించాలని, లవణుడి వద్దకు దూతను పంపించాడు. లవణుడు అతని మాట లక్ష్యపెట్టక, వచ్చిన దూతను కూడా చంపేశాడు. అప్పుడు లవణుడితో మాంధాత, యుద్ధానికి తలపడ్డాడు. ఆ ఘోర యుద్ధంలో, లవణుడు తనకు పరమశివుడు ప్రసాదించిన శూలంతో, మాంధాతను సంహరించాడు. మాంధాతను సంహరించిన లవణుడు, రావణాసురుడి వంశస్థుడు కావడం, గమనార్హం. భూమండలాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా అనుభవించి, బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసి, అశ్వమేధ యాగాలు చేసిన మాంధాత చక్రవర్తి, షోడశ రాజులలో ప్రముఖుడిగా కీర్తిగడించాడు. ఇక్ష్వాకు వంశంలోని సాటిలేని మేటి మహారాజుగా మన ఇతిహాసాలలో పేర్కోనబడ్డాడు మాంధాత.
Comments
Post a Comment