Realization of the Absolute (Naishkarmya Siddhi) నైష్కర్మ్య సిద్ధి! భగవద్గీత Bhagavad Gita Chapter 18
నైష్కర్మ్య సిద్ధి!
మనకు విధింపబడిన వృత్తి ధర్మములను ఎప్పటివరకు నిర్వర్తించాలి?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (47 – 50 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 47 నుండి 50 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/rb5QUdAqXQ8 ]
ఎటువంటి వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారో చూద్దాము..
00:46 - శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ।। 47 ।।
పర ధర్మమును సరిగ్గా చేయుటకంటే, సరిగా చేయలేకపోయినా సరే, స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.
మనం మన స్వ-ధర్మమును అంటే, విధింపబడిన వృత్తి ధర్మములు పాటిస్తున్నప్పుడు, రెండు విధాల ప్రయోజనం ఉంటుంది. అది మన స్వభావానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి, పక్షికి ఎగరటంలా, లేదా చేపకు ఈదటంలా, అది మన వ్యక్తిత్వానికి సహజంగా ఉంటుంది. రెండవది ఏమిటంటే, మనస్సుకు సౌకర్యముగా ఉంటుంది కాబట్టి, అప్రయత్నంగానే మనం దానిని నిర్వర్తించవచ్చు. దానితో భక్తిలో నిమగ్నమవ్వటానికి, అంతఃకరణ స్వేచ్ఛగా ఉంటుంది. బదులుగా, అవి దోషపూరితముగా ఉన్నాయని మనం మన ధర్మములను విడిచిపెట్టి, మన స్వభావానికి అనుకూలంగా లేని ఇంకొకరి ధర్మములు పాటిస్తే, మనం మన సహజ సిద్ధ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రయాసపడవలసి ఉంటుంది. అర్జునుడి పరిస్థితి సరిగ్గా ఇదే. అతని క్షత్రియ స్వభావము, సైనిక మరియు పరిపాలనా కార్యకలాపాల పట్ల మొగ్గు చూపుతుంది. పరిస్థితులు ఆయనను ధర్మయుద్ధంలో పాలుపంచుకునే అవసరం వైపుకు తీసుకువచ్చాయి. తన కర్తవ్యం నుండి తప్పించుకుని, అడవిలో తపస్సు కోసం యుద్ధభూమి నుండి వెనుతిరిగితే, అది అతని ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడదు. ఎందుకంటే, అడవిలో కూడా తన సహజ స్వభావం తన వెంటే ఉంటుంది. అక్కడ కూడా బహుశా, తను అడవిలో ఆటవికులను కూడగట్టుకుని, వారికి నాయకుడిగా అయిపోవచ్చేమో. బదులుగా, తన స్వభావ సిద్ధంగా జనించిన విధులను నిర్వర్తిస్తూ ఉండి, తన కర్మ ఫలాలను అర్పించటం ద్వారా, భగవదారాధన చేయటమే మేలు. ఎప్పుడైతే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో, అప్పుడు స్వ-ధర్మం మారుతుంది. అది ఇక శారీరక స్థాయిలోనే ఉండిపోదు. అది ఆత్మ స్థాయి ధర్మముగా మారిపోతుంది. అంటే, భగవత్ భక్తి. ఆ స్థాయిలో, వ్యక్తి తన వృత్తి ధర్మములను త్యజించి, పూర్తిగా భక్తిలోనే నిమగ్నమవ్వటం తప్పు కాదు. ఎందుకంటే, అదే అప్పుడు అతని సహజ స్వ-ధర్మమమవుతుంది. శ్రవణం, కీర్తనం, మరియు భగవత్ లీలలపై ధ్యానముచే, భక్తి అంటే, అభిరుచి వృద్ధి చెందనంత వరకూ, మనం మనకు విధింపబడిన వృత్తి ధర్మములను నిర్వర్తిస్తూనే ఉండాలి.
03:24 - సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ ।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ।। 48 ।।
ఓ కుంతీ పుత్రా, తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలున్నా సరే, వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచి పెట్టరాదు. అగ్ని పొగచే కప్పివేయబడినట్లు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.
ఏదో దోషము చూడటం వలన జనులు కొన్నిసార్లు, తమ కర్తవ్యము నుండి వెనుతిరుగుతారు. అగ్నిపై సహజంగానే పొగ ఆవరింపబడి ఉన్నట్టు, ఏ పని కూడా సంపూర్ణ దోషరహితముగా ఉండదని, ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. ఉదాహరణకి, కోట్లాది సూక్ష్మ క్రిములను చంపకుండా, మనం శ్వాస కూడా తీసుకోలేము. ఒకవేళ నేల దున్ని వ్యవసాయం చేస్తే, అసంఖ్యాకమైన సూక్ష్మ జీవులను నాశనం చేస్తాము. వ్యాపారంలో పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తే, ఇతరులకు సంపద లేకుండా చేస్తాము. ఒకవేళ మనం భుజిస్తే, ఇంకొకరికి ఆహరం లేకుండా చేసినట్టవుతుంది. స్వ-ధర్మము అంటే, కార్యకలాపాలు చేయటం కాబట్టి, అది సంపూర్ణ దోషరహితముగా ఉండజాలదు. కానీ, స్వ-ధర్మ పాలన యొక్క ప్రయోజనాలు, దాని దోషములకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అన్నింటికన్నా ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, అది మనుష్యులకు, తమ పరిశుద్ధికీ, మరియు ఉన్నతికీ ఒక సహజమైన అనాయాస మార్గమును అందిస్తుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడితో - తన స్వభావానికి బాగా సరిపోయే పనిని విడిచి పెట్టవద్దని అంటున్నాడు. దానిలో దోషములున్నాసరే, తన సహజమైన స్వభావానికి అనుగుణంగా కర్మలు చేయమంటున్నాడు.
05:14 - అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః ।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ।। 49 ।।
ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సును జయించారో, మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.
శ్రీ కృష్ణుడు గతంలో, కేవలం జీవిత బాధ్యతల నుండి పారిపోవటం సన్న్యాసము కాదు, అది త్యాగము కూడా కాదని, అర్జునుడికి చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు కర్మ రహిత స్థితి, అంటే, నైష్కర్మ్య-సిద్ధి స్థితిని వివరిస్తున్నాడు. నిరంతరం మారుతున్న ప్రపంచం యొక్క స్థితి గతుల మధ్యకూడా, మనలను మనమే ప్రపంచ సంఘటనలు, పరిణామాలకు దూరంగా, ఆసక్తి రహితముగా ఉంచుకుని, కేవలం మన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే ధ్యాస ఉంచటం ద్వారా, ఈ నైష్కర్మ్య -సిద్ధి స్థితిని సాధించవచ్చు. ఇది ఎలాగంటే, ఒక వంతెన క్రింది నుండి, నీరు ఒకవైపునుండి వచ్చి, ఇంకొక వైపు నుండి వెళ్ళిపోవటం లాంటిది. ఆ వంతెన ఆ నీటిని తీసుకోదు, లేదా నీటిని సరఫరా చేయదు; ఆ నీటి ప్రవాహంచే ఏమాత్రం ప్రభావితం కాదు. అదే విధంగా, కర్మయోగులు తమ కర్తవ్యాన్ని చేస్తుంటారు.. కానీ, నిరంతరం జరిగే పరిణామాల పట్ల ఉదాసీనంగా ఉంటారు. భగవదారాధన లాగా, వారు తమ కర్తవ్య నిర్వహణలో చక్కటి పరిశ్రమ చేస్తారు. కానీ, అంతిమ ఫలితాన్ని ఆ భగవంతునికే వదిలేస్తారు. తద్వారా వారు ఎల్లప్పుడూ తృప్తితో, మరియు ఏది జరిగినా ప్రశాంతంగానే ఉంటారు. దీనిని వివరించటానికి, ఒక చక్కటి కథ ఉంది. ఒకాయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మొదటి అమ్మాయికి ఒక రైతుతో వివాహమయ్యింది. రెండవ అమ్మాయికి, ఒక ఇటుకబట్టి యజమానితో వివాహమయ్యింది. ఒకరోజు ఆ తండ్రి మొదటి అమ్మాయికి ఫోన్ చేసి, ఎలా ఉందో కనుక్కున్నాడు. ‘నాన్నా, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. మంచి వర్షాలు పడాలని మాకోసం దేవుణ్ణి ప్రార్ధించు.’ అని అన్నదామె. తరువాత ఆయన రెండవ అమ్మాయికి ఫోన్ చేశాడు.. ‘నాన్నా, మాకు వ్యాపారం బాగాలేదు, ఈ సంవత్సరం వానలు పడొద్దని దయచేసి దేవుణ్ణి ప్రార్థించు. బాగా ఎండ కాస్తే, మాకు మంచి ఇటుకల ఉత్పత్తి జరుగుతుంది.’ అని అన్నదామె. తండ్రి తన కూతుర్ల నుండి విరుద్ధమైన విన్నపాలు విని, ‘ఏది మంచో, ఏది సరియైనదో, ఆ భగవంతునికే తెలుసు.. ఆయననే చేయనీ" అని అనుకున్నాడు. ఈశ్వర సంకల్పానికి ఇటువంటి శరణాగతి అనేది, ప్రపంచంలో నిరంతరం జరిగే వ్యవహారములలో తలమునకలై ఉన్నా, వాటివాటి ఫలితములపట్ల అనాసక్తిని కలుగచేస్తుంది.
08:06 - సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే ।
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ।। 50 ।।
ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని పొందిన వ్యక్తి ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మమును కూడా ఎలా పొందగలడో వివరిస్తాను. నా నుండి క్లుప్తముగా వినుము.
పుస్తక జ్ఞానాన్ని చదవటం ఒక ఎత్తయితే, ఆ జ్ఞానాన్ని ఆచరణలో, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం మరో ఎత్తు. మంచి ఆలోచనలు ఎన్ని ఉన్నా, వాటిని ఆచరణలో పెట్టకపోతే, అన్నీ వ్యర్థమే. పుస్తక జ్ఞానం ఉన్న పండితులకు బుర్రలో సర్వ శాస్త్రముల జ్ఞానం ఉంటుంది కానీ, వాటి విజ్ఞానం అవగతం కాకపోవచ్చు. మరోపక్క, కర్మ యోగులకు ప్రతినిత్యం, శాస్త్ర సత్యాలను ఆచరణలో అభ్యాసం చేసే అవకాశాలు వస్తుంటాయి. అందుకే, కర్మ యోగము యొక్క నిరంతర అభ్యాసము, మనకు ఆధ్యాత్మిక జ్ఞానమును హృదయములో విజ్ఞానముగా వికసింపచేస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి నైష్కర్మ్య సిద్ధితో, అంటే పని చేస్తూ కూడా కర్మ రహితముగా ఉండగలడో, అప్పుడు అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము, నిజమైన అనుభవంగా తెలుస్తుంది. ఆ జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, కర్మ యోగి భగవత్ ప్రాప్తిలో పరిపూర్ణతను సాధిస్తాడు.
09:31 - ఇక మన తదుపరి వీడియోలో, పరమ సత్యమును బ్రహ్మము రూపంలో, అనుభవపూర్వకంగా నేర్చుకోవటం ఎలాగో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment