పాండ్యుల వీరవనిత ‘తడైతగై’ శక్తిగా ఎలా ఉద్భవించింది? Story of Madurai Meenakshi and Sundareshwara


పాండ్యుల వీరవనిత ‘తడైతగై’ శక్తిగా ఎలా ఉద్భవించింది?
భార్య భర్తల మధ్య అన్యోన్యత కోసం ఈ అమ్మవారిని పూజించాలి!

మన భారత ఇతిహాసాల ప్రకారం, శక్తి స్వరూపిణికి సంబంధించి, అష్టాదశ శక్తి పీఠాలున్నాయి. అవన్నీ అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలుగా, పరమ పవిత్రమైన పుణ్య స్థలాలుగా ప్రసిద్ధిచెందాయి. మన దక్షిణ భారతదేశంలోని ఒక గొప్ప పుణ్య క్షేత్రం, మధురై. తమిళ సంస్కృతికి పుట్టినిల్లు. పవిత్ర వైగైనదీ తీరాన ఉన్న ఈ ప్రాంతం.., మీనాక్షీ, సుందరేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సుందర నగరాన్ని కవీశ్వరులూ, గాయకులూ, దివ్యమైనదిగా గానం చేశారు. శక్తి స్వరూపిణి అయిన దేవి, మానవ రూపంలో అవతరించి, పాండ్య రాజు పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి, భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి, పరమ శివుని సతీమణి అయింది. అంతటి విశిష్ఠత గల మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర ప్రాశస్త్యం ఏమిటి? సుందరమూర్తి అయిన మీనాక్షి అమ్మవారు, మూడు స్తన్యాలతో ఎందుకు జన్మించారు? రాణిగా ఎన్నో రాజ్యాలపై విజయం సాధించిన మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుణ్ణి ఎలా వివాహం చేసుకున్నారు? మీనాక్షి అమ్మవారి వివాహానికీ, శ్రీ మహా విష్ణువుకూ సంబంధం ఏమిటి - వంటి పరమోత్కృష్ట విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Pq1-JyGP0uE ]


తమిళ గ్రంథం ‘తిరువవిలై యాతర’లోని కథనం ప్రకారం.. ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు, చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలసి, పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. అయితే, ఆయనకు ఆ అగ్నిహోత్రం నుండి, పార్వతీ దేవి అంశతో, మూడేళ్ల వయస్సున్న ఒక పుత్రిక జన్మించింది. ఆమె విచిత్రంగా మూడు స్తన్యాలతో ఉద్భవించింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాజ దంపతులకు, ఆకాశవాణి ప్రత్యక్షమై, ఆమెను కొడుకు మాదిరి పెంచమనీ, ఆమె తన భర్తను కలసిన మరుక్షణం, మూడవ స్థన్యం మాయమవుతుందని చెప్పింది. దాంతో మలయధ్వజ పాండ్యరాజూ, కాంచనమాలా, ఎంతో ప్రేమతో ఆమెను పెంచసాగారు. మీనముల వంటి చక్కని విశాలనేత్రములతో, ముద్దులొలికే ఆ పాపకు మీనాక్షిగా నామకరణం చేశారు. ఆమెను కొడుకు మాదిరిగా పెంచారు, రాజ దంపతులు. అన్ని విద్యలలో శిక్షణ పొంది, గొప్ప వీరవనితగా పేరుగడించిందామె.

కొంతకాలానికి మలయధ్వజుడు కాలంచెయ్యగా, మీనాక్షి రాణి అయ్యింది. ఉత్తరాది రాజ్యాలను జయిస్తూ, విజయ పరంపరను కొనసాగించింది. తన సైన్యానికి నాయకత్వం వహిస్తూ, అనేక రాజ్యాలను ఓడించి, చివరకు హిమాలయాలను చేరుకుంది. అక్కడ ముగ్ధమనోహర రూపంలో, తపో ధనుడైన పరమశివుడిని చూసింది. ఆ సుందరేశ్వరుడిని చూడగానే, మీనాక్షి అమ్మవారి మూడవ స్తన్యం మాయమయ్యింది. వెంటనే మీనాక్షి అమ్మవారు, తనను పెళ్లి చేసుకోమని కోరారు. అందుకు సుందరేశ్వరుడు అంగీకరించగా, మధురైలో మీనాక్షి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. వారి వివాహం కొరకు, వైకుంఠం నుండి శ్రీ మహా విష్ణువు, బంగారు గుర్రంపై బయలుదేరాడు. కానీ, దేవతల నాటకం కారణంగా, ఇంద్రుడి వంచనకు గురై, రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా తిరుప్పరాంకుండ్రంకి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్‌ పెరుమాళ్‌, ఆ వివాహం జరిపించాడు. ఆ వివాహాన్నే, ప్రతి ఏటా ‘చిత్తిరై తిరువళ్’ వేడుకగా నిర్వహిస్తుంటారు.

మీనాక్షీ సుందరేశ్వరులు ఎంతో సంతోషంగా జీవించి, ఒక కుమారునికి జన్మనిచ్చారు. అతడే ఉగ్రపాండ్యుడు. అతను సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామి అవతారమని అంటారు. ఉగ్రపాండ్యుడు యుక్తవయస్సుకు రాగా, సింహసనాన్ని అధిష్ఠింపజేసి,  వారు సుందరేశ్వర మీనాక్షులుగా మధురైలో కొలువుదీరారు. పంచ శక్తి పీఠాలలో ఒకటిగా, ఎంతో ప్రాముఖ్యతను పొందింది ఈ ఆలయం. దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన మధురై మీనాక్షి ఆలయం ప్రస్తావన, 6వ శతాబ్దానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రస్తావన ప్రాచీన గ్రంథాలలో ఉన్నా, 14వ శతాబ్దం అనంతరమే, ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. ఈ ఆలయంలో ఒకే ఒక్క మరకత శిలతో, అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఆకుపచ్చ, నీలము కలగలిపిన మరకత మణి శరీరకాంతి, ఆ తల్లి ప్రత్యేకత. అమ్మవారి విగ్రహంలో చిలుక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అక్కడి సాంప్రదాయం ప్రకారం, తొలుత మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తరువాతే, సుందరేశ్వరుడైన పరమ శివుడిని దర్శించుకోవాలి. అందుచేత తూర్పు వైపున ఉన్న అష్టశక్తి మండపం గుండా ఆలయంలోకి ప్రవేశించాలి. ఆ ఆలయంలో మరొక ప్రాశస్త్యం, అక్కడున్న నటరాజస్వామి దేవాలయం. దానిని కేవెళ్లియంబళం అని అంటారు. అక్కడ కుడికాలు పైకెత్తి తాండవ నృత్యం చేస్తున్న భంగిమలో ఉన్న స్వామివారి రూపం, విశేషం. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం, పాండ్య రాజుల కాలం నుంచే, పూజలందుకుంది. ఆ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలున్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వాటిని పిలుస్తారని, పురాణ విదితం.

మీనాక్షి దేవి ఆలయంలో పరమశివుడి ఆవిర్భావానికి సంబంధించి, మరొక గాథ ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలో, దివ్యలోకానికి అధిపతి అయిన ఇంద్రుడికి, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. పాప పరిహారార్థం, ఇంద్రుడు ఎన్నెన్నో క్షేత్రాలలో తపస్సు చేశాడు. మధురై వద్ద కదంబవనం దాటుతూవుంటే, తలవని తలంపుగా అతడికి పరిహారం జరిగింది. విషయం పరిశీలించిన తర్వాత, ఆ కదంబ వృక్షం కింద స్వయంభూ లింగం ఉందని తెలిసింది. అప్పుడు ఇంద్రుడు స్వర్ణ కమలాలతో ఆ లింగాన్ని పూజించాడు.  పూజ అయిన తరువాత దివ్య విమానం ఎక్కి, తన దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి, ధనంజయుడనే వ్యాపారి ఆ దారిలో నడుస్తుండగా, చీకటి పడేసరికి, విశ్రాంతి తీసుకోవడం కోసం కదంబ వృక్షం దగ్గర ఆగాడు. ఆ వ్యాపారికి తెల్లవారుజామున నిద్రలో, శివార్చన జరుగుతున్నట్లు కల వచ్చింది. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. ఆయన విశ్రాంతి తీసుకున్న కదంబవృక్షం క్రింద శివలింగం ఉందని గ్రహించాడు. వెనువెంటనే ఆ విషయాన్ని, వారి ప్రభువు కులశేఖర పాండ్యులకు తెలియజేశాడు. ఆ రాజు అరణ్యానికి వచ్చి, ఆ శివలింగాన్ని పూజించి, ఆలయాన్ని ఏర్పాటు చేయించాడు. తదుపరి పాండ్యరాజులకు ముఖ్య పట్టణమైన మధురై నగరాన్ని తీర్చిదిద్దిన ప్రభువు, ఆ కుల శేఖరుడే. అతని తరువాత గద్దెనెక్కిన రాజు, మలయధ్వజ పాండ్యుడు. ఆయనకు అగ్ని హోత్రంలో ఉద్భవించిన తడాతగై అనే బాలికే, మీనాక్షి అమ్మవారుగా, ఆ ఆలయంలో కొలువుదీరారు.

ఎంతో మహిమాన్వితమైన మీనాక్షి దేవి ఆలయం, దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందింది. కాలగమనంలో, మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధ పూరిత ఆలోచనలతో, తామే సర్వలోకాలకూ అధిపతులు కావాలనే కోరికతో, అమ్మవారి పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రత్వం సంతరించుకునేలా పూజలూ, యజ్ఞాలూ, హోమాలూ, బలులూ నిర్వహించి, ఆ తల్లిలో తామసిక శక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. అలా శాంత మూర్తి అయిన అమ్మవారు, ఉగ్రరూపాన్ని దాల్చి, రాజ్యాన్ని బలిగొన్నది. అలాంటి విపత్కర పరిస్థితులలో, ఆది శంకరుల వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఏమిటి? అమ్మవారి లోని తామసిక శక్తిని ఆయన ఎలా పారద్రోలారు? అమ్మవారితో పాచికలాడి, ఆదిశంకరులు ఎలా గెలవగలిగారు? మీనాక్షీ దేవి ఉగ్రరూపాన్ని ఎలా కట్టడి చేయగలిగారు? మధుర మీనాక్షీ అమ్మవారి ఆలయంలో జరిగిన ఆనాటి సంఘటనలను తెలుసుకోవాలంటే, మన తదుపరి భాగం కోసం వేచి చూడండి. మధుర మీనాక్షి అమ్మవారి వృత్తాంతాన్ని తెలసుకున్న వారికి, సకల శుభాలు కలుగుతాయి. మీనాక్షి దేవిని పూజిస్తే, అనేక శుభాలు కలుగుతాయి. పెళ్లికాని అమ్మాయిలు మీనాక్షీ దేవిని పూజించినట్లయితే, ఆకర్షణీయమైన రూపాన్ని పొందడమే కాక, మంచి భర్తను పొందుతారు. ఈ పూజ చేయడం వలన, దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు. అసాధ్యాలను సుసాధ్యంగా మార్చగల శక్తి, మీనాక్షి దేవి సొంతం. అమ్మవారిని పూజించే వారి జీవితంలో, ఆమె సంతోషాన్ని నింపుతుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి బాధలనైనా, అడ్డంకులనైనా ఎదుర్కునే శక్తిని ప్రసాదిస్తుంది.

ఓం శ్రీ మాత్రే నమః

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home