వ్యాధ గీత! Vyadha Gita - Dharmavyadha భగవద్గీత Bhagavad Gita Chapter 18
వ్యాధ గీత!
మహాభారతంలో ఓ కసాయివాడు చెప్పిన వ్యాధ గీత!
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (42 – 46 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 42 నుండి 46 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/rxo3TZCyXtQ ]
నాలుగు వర్ణాల వారిలో సహజంగా ఉన్న కర్మ లక్షణములు ఏంటో చూద్దాము..
00:47 - శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ।। 42 ।।
శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.
సాత్త్విక స్వభావము ప్రధానంగా కలవారు బ్రాహ్మణులు. వారి యొక్క ప్రధానమైన విధులు, తపస్సు ఆచరించటం, అంతఃకరణ శుద్ధి అభ్యాసం చేయటం, భక్తి మరియు ఇతరులకు తమ నడవడికచే స్పూర్తినివ్వటం. ఈ విధంగా, వారు సహనంతో, వినమ్రతతో, మరియు ఆధ్యాత్మిక చిత్తముతో ఉంటారని అందరూ ఆశిస్తారు. తమ కోసం, మరియు ఇతర వర్గాల కోసం కూడా, వైదిక కర్మకాండలను చేస్తారని, అందరూ ఆశిస్తారు. వారి సహజ స్వభావం వారికి జ్ఞాన-సముపార్జన పట్ల ఆసక్తిని కలుగజేస్తుంది. కాబట్టి, ఉపాధ్యాయ వృత్తి - జ్ఞానాన్ని పెంపొందించుకునీ, మరియు దానిని ఇతరులతో పంచుకునే వృత్తి కూడా వారికి అనుకూలంగా ఉండేది. వారు తామే స్వయంగా ప్రభుత్వ పరిపాలనలో పాలుపంచుకోకపోయినా, అధికారులకు దిశానిర్దేశం చేసేవారు. వారికి శాస్త్ర పరిజ్ఞానం ఉండేది కాబట్టి, సామాజిక మరియు రాజకీయ విషయాలపై వారి అభిప్రాయానికి చాలా విలువ ఉండేది.
02:18 - శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ ।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ।। 43 ।।
శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్ధ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు.
క్షత్రియులు ప్రధానంగా, రాజసిక లక్షణములతో ఉండి, కొద్దిగా సత్త్వగుణ మిశ్రమంతో ఉంటారు. అది వారిని రాజసంతో, వీరత్వంతో, ధైర్యంతో, నాయకత్వ లక్షణాలతో, మరియు దానగుణంతో ఉండేలా చేస్తుంది. వారి లక్షణములు వారికి సైనిక పరమైన, మరియు నాయకత్వ పనులకు అనుకూలంగా చేస్తాయి. వారు దేశాన్ని పాలించే పాలక వర్గముగా ఉంటారు. అయినా వారు బ్రాహ్మణులంత పవిత్రంగా, వారంత పాండిత్యంతో ఉండరని గ్రహించారు. అందుకే వారు బ్రాహ్మణులను గౌరవించేవారు, మరియు సైద్ధాంతిక, ఆధ్యాత్మిక, మరియు విధానపరమైన విషయాల్లో, బ్రాహ్మణుల నుండి సలహా తీసుకునేవారు.
03:26 - కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మస్వభావజమ్ ।
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ।। 44 ।।
వ్యవసాయం, పాడిపంటలు, మరియు వర్తకవాణిజ్యాలనేవి, వైశ్య గుణములున్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది, శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి.
రాజసిక స్వభావం ప్రధానంగా ఉండి, దానిలో తమోగుణ మిశ్రమంగా కలవారు, వైశ్యులు. కాబట్టి వారు వాణిజ్యం, మరియు వ్యవసాయం ద్వారా, ఆర్థిక సంపత్తిని వృద్ధిచేసి, దానిని కలిగివుండటం వైపు మొగ్గు చూపిస్తారు. వారు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తూ, ఇతర వర్గాల వారికి ఉద్యోగాలను కల్పించేవారు. పేదల కోసం ధార్మిక పనుల నిమిత్తం, వారు తమ యొక్క సంపదలో కొంత భాగాన్ని వెచ్చించాలని, అందరూ కోరుకునేవారు. శూద్రులు, అంటే తామసిక స్వభావం కలిగి ఉండేవారు. వారు చదువు, పాండిత్యం పట్ల, పరిపాలన పట్ల, లేదా వాణిజ్య కార్యకలాపాల పట్ల కానీ, ఆసక్తి చూపేవారు కాదు. వారి యొక్క పురోగతికి సరియైన మార్గమంటే, సమాజానికి, వారికి నచ్చిన రీతిలో సేవ చేయటమే. చేతిపనుల వారు, వృత్తిపనుల వారు, రోజు-కూలీలు, దర్జీలు, శిల్పులు, క్షురకుల వంటి వారు, ఈ వర్గంలో చేర్చబడ్డారు.
04:51 - స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః ।
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు।। 45 ।।
స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ, పరిపూర్ణతను ఎలా సాధించగలడో, ఇక ఇప్పుడు నా నుండి వినుము.
స్వ-ధర్మ అంటే, మన గుణములు, మరియు జీవిత స్థాయిని బట్టి విధింపబడిన కర్తవ్యములు. వాటిని నిర్వర్తించటం వలన, మన శారీరిక, మానసిక సామర్థ్యాన్ని నిర్మాణాత్మకంగా, ప్రయోజనకరంగా వాడుకోవటం జరుగుతుంది. ఇది పరిశుద్దికీ, పురోగతికీ దారి తీస్తుంది. ఇది మనకూ, సమాజానికి కూడా మంగళకరమైనది. విహిత కర్మలు మన సహజస్వభావానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి, వాటిని నిర్వర్తించటంలో మనం సుఖప్రదంగా, నిలకడగా ఉంటాము. ఆ తరువాత మన యోగ్యత, సమర్థతలను పెంచుకున్న కొద్దీ, స్వ-ధర్మం కూడా మారుతుంది. తద్వారా మనం తదుపరి ఉన్నత స్థాయిలోకి వెళతాము. ఈ రకంగా మన బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించటం వలన, మనం పురోగతి సాధిస్తూ ఉంటాము.
06:07 - యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ ।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ।। 46 ।।
తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి, సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో, ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో, వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా, వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు.
భగవంతుని సృష్టిలో ఏ ఒక్క జీవి కూడా, అనావశ్యకమైనది ఉండదు. సమస్త జీవుల యొక్క క్రమబద్ధమైన పురోగతి కోసమే, ఆయన యొక్క దివ్య ప్రణాళిక రచించబడినది. భారీ చక్రంలో చిన్ని పళ్ళచక్రంలా, మనమందరమూ ఆయన బృహత్ పథకంలో భాగాలమే. ఆయన మనకిచ్చిన సామర్థ్యము కంటే ఎక్కువ, మననుండి ఏమీ ఆశించడు. కాబట్టి, మనం కేవలం మన స్వభావం, మరియు స్థాయికి అనుగుణముగా, మన స్వధర్మాన్ని నిర్వర్తిస్తే, మనం ఆయన దివ్య ప్రణాళికలో, మన అంతఃకరణ శుద్ధి కోసం పాలుపంచుకున్నట్టే. ఎప్పుడైతే మనం భక్తి యుక్త దృక్పథంలో పని చేస్తామో, మన పనే ఒక ఈశ్వర-ఆరాధన అవుతుంది. ఏ విధి కూడా అసహ్యకరమైనది, మరియు అపవిత్రమైనది కాదు. దాన్ని ఏ దృక్పథంతో చేస్తున్నామనే దాని మీదనే, ఆ పని యొక్క విలువ ఉంటుందన్న విషయాన్ని వివరిస్తూ, మార్కండేయ ముని, యుధిష్టురుడికి మహాభారతంలోని వన-పర్వంలో, ఒక కథ చెప్పి ఉన్నాడు. ఒక యువ సన్యాసి అడవిలోకి వెళ్లి, అక్కడ చాలాకాలం ధ్యానము, మరియు తపస్సులు ఆచరించాడు. అలా కొద్ది సంవత్సరములు గడచిన తర్వాత ఒకరోజు, ఆయన పైనున్న చెట్టు నుండి ఒక కాకి రెట్ట, ఆయనపై పడింది. ఆయన కోపంతో ఆ పక్షి వంక చూశాడు. దాంతో అది చచ్చి పడిపోయింది. తనకు తపశ్చర్యల ద్వారా అతీంద్రియ శక్తులు ప్రాప్తించినట్టు, ఆ సన్యాసి తెలుసుకుని, చాలా గర్వపడ్డాడు. కొద్దికాలం తరువాత ఆయన ఒక ఇంటికి బిక్ష అడగటానికి వెళ్ళాడు. ఆ ఇంటావిడ తలుపు దగ్గరకు వచ్చి, అనారోగ్యంతో ఉన్న తన భర్తకు సపర్యలు చేస్తున్నందున, ఆ సన్యాసిని కొద్దిసేపు వేచి ఉండమని ప్రార్థించింది. దీనితో ఆ సన్యాసి కోపగ్రస్తుడై, ఆమె వంక కోపంగా చూస్తూ, ఇలా మనసులో అనుకున్నాడు.. ‘ఓ అధమురాలా, ఎంత ధైర్యం నన్ను వేచి ఉండమని చెప్పటానికి! నా శక్తులు ఏమిటో నీకు తెలియదు’ అని అన్నాడు. ఆయన మనస్సులో ఉన్నది గ్రహించి, ఆ స్త్రీ ఈ విధంగా అన్నది, ‘నా పట్ల అలా కోపముగా చూడకు, నేనేమి కాకిని కాదు నీవు కోపంతో చూసిన చూపుకు భస్మమై పోవటానికి’ అని అన్నది. ఆ సన్యాసి ఆశ్చర్యచకితుడై పోయాడు. ఆ సంఘటన గూర్చి ఆమెకెలా తెలుసని అడిగాడు. ఆ ఇంటి ఆవిడ తాను ఏమీ తపస్సులు చేయలేదు కానీ, తన విధులను భక్తి శ్రద్ధలతో చేశానని చెప్పింది. అందుచే ఆవిడకు తేజస్సు ప్రాప్తించి, ఆయన మనస్సులో ఉన్నది తెలుసుకో గలిగింది. ఆ తరువాత అతనిని మిథిలా నగరంలో ఉండే ఒక ధర్మాత్ముడైన కసాయివాడిని కలవమని చెప్పింది. ఆయన ఇతని ధర్మ సందేహాలకు జవాబు చెప్పగలడని సెలవిచ్చింది. ఆ సన్యాసి మొదట్లో ఆ తక్కువ స్థాయి కసాయి వాడితో మాట్లాడటానికి తనకు కలిగిన సంకోచాన్ని అధిగమించి, మిథిలా నగరానికి వెళ్ళాడు. ధర్మాత్ముడైన ఆ కసాయివాడప్పుడు, మనకందరికీ మన పూర్వజన్మ కర్మలు, మరియు సామర్థ్యమును అనుసరించి, స్వ-ధర్మములు ఉన్నాయని చెప్పాడు. అయినా మనం స్వార్థ చింతనను విడిచి, మనకొచ్చే సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటూ, మన సహజ స్వభావ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే, మనల్ని మనం పరిశుద్ధి చేసుకుని, పై మెట్టు ధర్మ స్థాయికి చేరుకుంటాము. ఈ విధంగా కర్తవ్య విధులను, వాటి నుండి పారిపోకుండా నిర్వర్తిస్తే, జీవాత్మ క్రమక్రమంగా తన ప్రస్తుత మొరటు దృక్పథం నుండి, దివ్యమైన ఆధ్యాత్మిక చైతన్యం వైపు పురోగమిస్తుంది. ఆ కసాయివాడు చెప్పిన ఉపదేశమే, మహాభారతంలో, వ్యాధ గీత అని అంటారు. ఈ ఉపదేశం, ప్రత్యేకంగా అర్జునుడికి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే, కష్టతరం మరియు బాధాకరం అని భావించి, అర్జునుడు తన స్వ-ధర్మం నుండి పారిపోదలచాడు. తన స్వధర్మాన్ని సరైన దృక్పథంలో చేయటం ద్వారా, అర్జునుడు ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టే అనీ, తద్వారా పరిపూర్ణ సిద్ధిని సునాయాసంగా సాధించవచ్చనీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.
10:42 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment