కంసుడు చంపిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు? 6 Elder Brothers of Lord Krishna - Karma Siddhantam


కంసుడు చంపిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు?
ఉచ్ఛిష్టీకృత దోషం వలన కలిగే పరిణామం మీకు తెలుసా?

మనం చేసే ప్రతి పాపానికీ ప్రాయశ్చిత్తం తప్పక చేసుకోవాలి. ఎన్ని జన్మలెత్తైనా సరే, మన కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. కర్మఫలం ఏ విధంగా ఉంటుందనేది, మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. దేవకీ వసుదేవల సంతానాన్ని కంసుడు సంహరించాడు. కంసుడినీ, అతని సోదరులనూ బలరామకృష్ణులు తుదముట్టించారు. కృష్ణ భగవానుడికి సోదరులుగా జన్మించి, మరణించిన వారి వెనుక ఒక గాధ ఉంది. అదే విధంగా, బలరాముడి చేతిలో మరణించిన కంస సహోదరుల వెనుకా, ఒక గాధ ఉంది. దేవకీ సుతులుగా పుట్టి, కంసుని చేతిలో మరణించిన వారి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? రాక్షస జాతిలో జన్మించి, బలరాముడి చేతిలో మరణించి, పుణ్య ప్రాప్తి నొందిన కంసుని సోదరులు, గత జన్మలో చేసిన తప్పిదం ఏంటి? మరణించిన తన సంతానం కోసం, దేవకీ దేవి కోరిన కోరికను శ్రీ కృష్ణుడు తీర్చాడా? పాతాళానికి వెళ్లి, బలి చక్రవర్తిని ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? కంసుడి చేతిలో మరణించిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు? వంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-uZSFX1vDhM ]


ముందు జన్మలో మారీచుడి కొడుకైన కాలనేమి, కంసుడిగా పుట్టాడు. కంసుని తండ్రి పేరు, ఉగ్రసేనుడు. అతని భార్యకు దేవదాది న్యాయము వలన, ద్రవిళుడనే వాడికి పుట్టినవాడు. అంటే, క్షేత్రజ పుత్రుడన్న మాట. ఉగ్రసేనుని భార్య పద్మావతి, కొందరు గొల్ల స్త్రీలతో కలసి యమునా నదికి స్నానానికి వెళ్ళి, పుష్పవతి అయింది. ఆమె తన భర్తను తలచుకుంది. రాక్షసుడైన ద్రవిళుడు చూసి, ఉగ్రసేనుని రూపంలో వెళ్ళాడు. అంతా జరిగిన తరువాత, తను మోసపోయానని గ్రహించి, నిలదీసింది పద్మావతి. నీ వలన పుట్టిన వాడు హరివంశమున పుట్టినవాడి చేతిలో మరణిస్తాడని శపించింది. రాక్షస రాజు వలన పుట్టిన కంసునికి రాక్షస లక్షణాలు వచ్చాయి. కంసుడు పెరిగి పెద్దవాడవుతూనే, తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించి, తాను రాజయ్యాడు. జరాసంధుని కూతుళ్ళయిన ఆస్తి, ప్రాస్తి, ఇద్దరినీ పెళ్ళాడాడు. శిశుపాలునితో స్నేహం చేశాడు. తన పిన తండ్రి కూతురైన దేవకీ దేవిని, చెరసాలలో బంధించాడు. ఆమెకు పుట్టిన సంతానాన్ని సంహరించాడు. కానీ, దేవకీ దేవి గర్భంలో జన్మించిన అష్టమ సంతానమైన శ్రీ కృష్ణుడు పెరిగి పెద్దవాడై, తన మామ కంసుడి గురించి తెలుసుకున్నాడు. అతడిని సంహరించి, తల్లి దండ్రులను బంధవిముక్తుల్ని చేయడానికి మధురకు వెళ్ళాడు.

బలరామకృష్ణులను సంహరించడానికి కంసుడు పంపిన వారందరూ, మృత్యువు ఒడికి చేరుకున్నారు. కృష్ణుడిని ఎదురించడం అసంభవమని తెలిసిన కంసుడు, పులి నుండి తప్పించుకున్న మేకపిల్లలా, సభామందిరంలో సింహాసనం మీద ఒదిగొదిగి కూర్చుని వున్నాడు. అతని చుట్టూ మంత్రులూ, సైనికులూ వున్నారు. నిలువెల్లా కంపిస్తున్న తన అనుచరులనూ, మృత్యువు రూపంలో ఎదుట నిలిచిన నల్లనయ్యనూ చూసి కంసుడు, ఇక తెగించక తప్పదనుకున్నాడు. చావు ధైర్యం తెచ్చుకుని, 'పిచ్చెక్కిన ఏనుగునూ, తాగి తూలుతున్న యోధులనూ సంహరించడం గొప్ప కాదు. నాతో యుద్ధానికి రా. బలాబలాలు తేల్చుకుందాం' అన్నాడు శౌరివైపు తిరిగి. దాంతో కన్నయ్యకు  కోపం వచ్చింది.  కంసుడి మీదకు ఉరికాడు. మృత్యువు మాదిరి తన మీదకు వస్తున్న అచ్యుతుడిని చూసి, కంసుడు తటాలున సింహాసనం మీద నుంచి కిందకు దూకాడు. ఒర నుంచి ఖడ్గాన్ని తీసి, కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడు అంతెత్తుకు ఎగిరి అక్కడి నుంచి కొదమసింహంలా కంసుడి పైకి లంఘించాడు. ఆ దెబ్బతో కంసుడి కిరీటం బండి చక్రంలా దొర్లుకుంటూ వెళ్ళి, దూరంగా పడింది. కృష్ణుడు కంసుడి జట్టు పట్టుకు లాగి, విసురుగా తోశాడు. కంసుడు వెల్లకిలా పడ్డాడు. అతని పక్కటెముకలు నుజ్జు నుజ్జయ్యాయి. లేవలేక కూలబడిపోయాడు. మాధవుడు ఎగిరి అతని ఎదురు రొమ్ముమీద కూర్చుని, పిడికిళ్ళతో మర్దించాడు. కంసుడు నురగలు కక్కాడు.

'మామా! నిన్ను నేను ఈవేళ చంపడం కాదు. కొన్నేళ్ళుగా చంపుతున్నాను. రాత్రింబవళ్ళు, అనుక్షణం, తింటూ, తాగుతూ, విహరిస్తూ కూడా, నన్నే తలుచుకుని భయపడ్డావు. నేను గుర్తుకు వచ్చినప్పుడల్లా, నీకు కంటిమీద నిద్ర వుండేది కాదు. ప్రతి కదలికలో, ప్రతి ఒక్కరి నీడలో నన్నే చూసి, నరక యాతన పడ్డావు. ఎందుకొచ్చిన దిగులు చెప్పు? క్షణక్షణం చస్తూ బతికే కన్నా, ఒకేసారి చావడం మంచిది' అని ఒక్కపోటు పొడిచాడు. కంసుడి కళ్ళు మూతపడ్డాయి. అతనిలోంచి ఒక దివ్యతేజం వచ్చి, కృష్ణుడిలో లీనమైంది. సభ అంతా చేతులు జోడించి, ఆ కిశోర వీరుడికి నమస్కరించింది. కంసుడి మరణ వార్త విని ఉగ్రులై అతని తమ్ములు కంకుడు, న్యగ్రోధుడు, గహ్వుడు మొదలైనవారు, మూకుమ్మడిగా బలరామకృష్ణులమీద విరుచుకుపడ్డారు. బలరాముడొక్కడే, వాళ్ళందర్నీ హతమార్చాడు. బలరాముడి చేతిలో మరణించిన కంసుడి సొదరులకు సంబంధించి, ఒక కథ ఉంది.

కంసుడి సోదరులు, పూర్వం అలకాపురంలో వుండే దేవయక్షుని కుమారులు. దేవకూట, మహాగిరి, గండ, చండ, ప్రచండ, ఖండ, అఖండ, పృధువులని, వాళ్ళకు పేర్లుండేవి. ఆ అన్నదమ్ములొకసారి, తండ్రి ఆజ్ఞ మేరకు, మానస సరోవరానికి వెళ్ళి, మహేశ్వరుడిని పూజించేందుకు, అరవిందాలు కోసుకువచ్చారు. కానీ, దారిలో వాటి సుగంధాలకు ముగ్ధులై, వాసన చూశారు. దానివల్ల వారికి ఉచ్ఛిష్టీకృత దోషం, అంటే, ఎంగిలి చేసిన పదార్థాలను నివేదన చెయ్యడం, వాసన చూసిన పూలతో పూజించడం వల్ల కలిగే దోషం సంభవించింది. ఆ కారణంగా వారు ఎనిమిది మందీ, వరుసగా మూడు జన్మలలో రాక్షసులై పుట్టారు. మూడవసారి చివరగా, ఉగ్రసేనుని కుమారులుగా జన్మించారు. శ్రీకృష్ణుని చేతిలో మరణించి, పాపవిమోచనం పొందారు. కంసుని మరణవార్త వినగానే, ప్రజలంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. చెరసాలలో మగ్గుతున్న దేవకీవసుదేవులకు నల్లనయ్య విముక్తి కలిగించాడు. వారు కారాగారం నుంచి బయటకు రాగానే, బలరామకృష్ణులు వారికి పాదాభివందనం చేశారు. ఆనందంతో దేవకీవసుదేవులు పరవశించారు. దేవకీదేవి తటాలున వంగి, బిడ్డలను లేవదీసి, గుండెలకు హత్తుకున్నది.

బలరామకృష్ణులు చంటిబిడ్డల్లా తల్లిని చుట్టుకుపోయారు. 'అమ్మా! పుట్టటమైతే నీ కడుపున పుట్టాను కానీ, పసితనం నుంచే నీ ప్రేమానురాగాలకు దూరమయ్యాను. ఆ దురదృష్టమంతా నాదే. నువ్వేం బాధపడకు. కంసుడి చేతిలో మీరు పడుతున్న కష్టాలు తెలిసి కూడా, మిమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యమైనందుకు మన్నించండి' అని కృష్ణుడు తల్లిని వేడుకున్నాడు. దేవకీ వసుదేవులు నల్లనయ్యను దగ్గరకు తీసుకుని, పరవశులయ్యారు. తరువాత కృష్ణుడు తాతైన ఉగ్రసేనుడ్ని పిలిచి, 'మహారాజా! యయాతి శాపం వల్ల, యాదవులకు సింహాసనం ఎక్కే అధికారం లేకుండా పోయింది. కనుక మీరే ఈ భూమికి అధిపతి కావాలి. సింహాసనం స్వీకరించండి. ధర్మం తప్పకుండా పాలన చేయండి' అని అన్నాడు. బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి తల్లిదండ్రులు, బలరామకృష్ణులను దగ్గరకు పిలిచి, 'నాయనలారా! మిమ్మల్ని పొగడాలో, పొగడకుండా నా ఆనందాన్నంతా ఈ గుప్పెడు గుండెలో ప్రోది చేసుకోవాలో, మీకు నమస్కరించవచ్చో, లేక బిడ్డలకి చెయ్యకూడదో, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో, లేక దూరం నుంచి దర్శించి, కన్నులపండుగ చేసుకోవాలో తెలియటంలేదు. 'మీరు ఏమీ అనుకోకపోతే, ఒకే ఒక కోరిక కోరుతాను. మీరిద్దరూ, మరణించిన మీ గురుపుత్రుని తీసుకువచ్చిన విధంగానే, కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డలను కూడా ఒక్కసారి తెచ్చి చూపండి' అని భోరున ఏడ్చింది.

బలరామకృష్ణులు ఆమెను ఓదార్చి, యోగమాయా ప్రభావంతో, వెంటనే సుతలానికి వెళ్ళారు. రాక్షసేశ్వరుడు బలి వాళ్ళకు ఘనంగా స్వాగతం చెప్పాడు. భక్తిపూర్వకంగా వాళ్ళను అర్చించి, కానుకలు సమర్పించాడు. బలరామకృష్ణులు అమితానందం పొందారు. 'బలీ! పూర్వం స్వాయంభువ మన్వంతరంలో మరీచికి, 'ఊర్ణ' అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు స్మరుడు, ఉద్గదుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభువు, ఘృణి అనే ఆరుగురు కుమారులుండేవారు. వారందరూ దేవతలే. వాళ్ళు ఒకసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి, పరిహాసంగా మాట్లాడారు. అందువల్ల వాళ్ళను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు. అలా శపించబడ్డ ఆ ఆరుగురూ, హిరణ్యకశిపుడికి జన్మించాల్సింది. కానీ, యోగమాయా ప్రభావం వలన, వాళ్ళు దేవకీదేవికి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్ళను కంసుడు సంహరించాడు. ఆ ఆరుగురూ ఇప్పుడు నీ దగ్గర వున్నారు. మా తల్లి దేవకీదేవి వాళ్ళను చూడాలనుకుంటోంది. ఆమె కోరికను తీర్చటంకోసమే, మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు మా వెంట వస్తే, వాళ్ళకు శాపవిముక్తి కలుగుతుంది. వాళ్ళు తిరిగి వాళ్ళ నిజ వాసం చేరుకుంటారు' అని చెప్పారు. బలి వెంటనే వాళ్ళను బలరామకృష్ణులకు అప్పగించాడు. వాళ్ళను బలరామకృష్ణులు తమ తల్లికి చూపించి, ఆమెకు ఆనందం కలిగించారు. ఆ ఆరుగురూ శ్రీకృష్ణుని స్పృశించి, తమ పాపాలను తొలగించుకున్నారు. చతుర్ముఖుని శాపం నుంచి విముక్తి పొందారు. ఏనాడో మరణించిన కుమారులు తన సముఖానికి రావడం, వెంటనే తిరిగి వెళ్ళిపోవడం, దేవకీ దేవికి ఆశ్చర్యం కలిగించింది. అదంతా శ్రీకృష్ణుని లీల అని గ్రహించి, పరవశించిపోయిందామె.

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home