బ్రహ్మానందము - భగవద్గీత Bhagavad Gita Chapter 18


బ్రహ్మానందము!
నిస్వార్థ ప్రేమయుక్త భక్తితో మనం ఆరాధించిన భగవత్ స్వరూప ధామానికి చేరుకుంటామా?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (55 – 58 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 55 నుండి 58 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/LwZBQ8gvBAk ]


భగవానుడి కృపచే ఎటువంటి వారు నిత్యశాశ్వతమైన, మరియు అనశ్వరమైన ధామమును పొందుతారో చూద్దాము..

00:50 - భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః ।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ।। 55 ।।

కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో, ఎంతటి వాడినో తెలుసుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.

అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానములో స్థితుడై ఉన్న పిదప, వ్యక్తి భక్తిని పొందుతాడు. ఇక ఇప్పుడు, కేవలం భక్తి చేత మాత్రమే భగవంతుని యొక్క యధార్థ స్వరూపమును తెలుసుకోవచ్చని అంటున్నాడు. ఇంతకు క్రితం, జ్ఞాని భగవంతుడిని నిర్గుణ, నిర్విశేష, నిరాకార బ్రహ్మముగా ఆచరణలో తెలుసుకుని ఉన్నాడు. కానీ, జ్ఞాని భగవంతుని యొక్క సాకార రూపమును అనుభవించలేదు. ఆ సాకార రూప రహస్యము - కర్మ, జ్ఞానము, అష్టాంగ యోగము, మొదలైన ప్రక్రియల ద్వారా తెలుసుకోబడలేదు. కేవలం ప్రేమ మాత్రమే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది, మరియు అందని దానిని అందిస్తుంది. భగవంతుని యొక్క రూపమూ, గుణములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారముల యొక్క నిగూఢత, ఆయన పట్ల అనన్య భక్తి ద్వారానే తెలుసుకోబడతాయి. ప్రేమ దృష్టి ఉండటం చేతనే, భక్తులు భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి, పద్మ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. జాబాలి అనే ఋషి ఒకసారి, అడవిలో ధ్యానం చేస్తున్న ఒక అత్యంత తేజోవంతమయిన, మరియు ప్రశాంతమైన కన్యను చూశాడు. తానెవరో, తానెందుకు ధ్యానం చేస్తున్నదో తెలియ చేయమని, ఆ ఋషి ఆమెను ప్రార్థించాడు. ఆమె ఇలా సమాధానం ఇచ్చింది: ‘నేను బ్రహ్మ విద్యను, అంటే ఆత్మ గురించి తెలుసుకునే శాస్త్రము. అది అంతిమంగా భగవంతుని అంటే, బ్రహ్మము యొక్క అస్తిత్వమును ఎఱుకలోకి తెస్తుంది. గొప్ప గొప్ప యోగులూ, సాధువులూ నన్ను తెలుసుకొనుటకు, తపస్సులు చేస్తుంటారు. కానీ, సాకార రూప భగవంతుని పాదారవిందముల పట్ల భక్తిని పెంపొందించుకోవటానికి, నేనే స్వయంగా కఠినమైన తపస్సు ఆచరిస్తున్నాను. నేను బ్రహ్మానందములో తృప్తిగా, మరియు నిండుగా ఉన్నాను. అయినా, శ్రీ కృష్ణుడి పట్ల ప్రేమానుబంధం లేకపోతే, వెలితిగా, శూన్యంగా అనిపిస్తుంది.’ అని జాబాలికి తెలియజేసింది. ఈ విధంగా, కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే, అది భగవంతుని సాకార రూప ఆనందాన్ని ఆస్వాదించటానికి సరిపోదు. భక్తి ద్వారా మాత్రమే ఎవరైనా ఆ రహస్యం తెలుసుకోవచ్చు, సంపూర్ణ భగవత్ భావనను పొందవచ్చు.

03:34 - సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః ।
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ।। 56 ।।

సర్వ కార్యములూ చేస్తూనే ఉన్నా, నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన, మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.

భక్తి ద్వారా భక్తులు తన యొక్క సంపూర్ణ ఏకీభావ స్థితిలోకి వస్తారు. ఈ దృక్పథంలో, వారు ప్రతిదానినీ ఈశ్వర సంబంధముగా చూస్తారు. తమ శరీర, మనోబుద్ధులను భగవంతుని శక్తిగా పరిగణిస్తారు. వారి భౌతిక సంపత్తిని భగవంతుని సొత్తుగా చూస్తారు. వారు సర్వ భూతములనూ, భగవంతుని అంశలుగానే పరిగణిస్తారు, తమను తాము భగవత్ సేవకులుగా పరిగణించుకుంటారు. ఆ దివ్య దృక్పథంలో, వారు పనిని విడిచిపెట్టరు. కానీ, కర్తృత్వ భావననూ, మరియు కర్మఫలభోక్తలమనే భావననూ విడిచిపెడతారు. అన్ని పనులనూ ఈశ్వర సేవగా చూస్తూ, వాటిని చేయటానికి ఆయన మీదనే ఆధార పడతారు.

ఆ తర్వాత, దేహమును విడిచిపెట్టిన పిదప, భగవంతుని దివ్య ధామమును చేరుకుంటారు. ఏ విధంగానైతే ఈ భౌతిక జగత్తు, భౌతిక శక్తితో తయారు చేయబడినదో, దివ్య లోకాలు, ఆధ్యాత్మిక దివ్య శక్తిచే తయారుచేయబడినవి. కాబట్టి, అది భౌతిక స్వభావం యొక్క దోషములకు అతీతమయినది, మరియు సంపూర్ణ దోషరహితమైనది. అది సత్-చిత్-ఆనందం.. అంటే, నిత్యశాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందములచే నిండి ఉన్నది. భగవంతుని యొక్క వివిధమైన స్వరూపాలకు, ఆధ్యాత్మిక జగత్తులో వారి వారి స్వీయ ధామములున్నాయి; అక్కడ వారు తమ భక్తులతో నిత్య ప్రేమయుక్త లీలలలో నిమగ్నమై ఉంటారు. ఎవరైతే ఆయన పట్ల నిస్వార్థ ప్రేమయుక్త భక్తి సేవలో పరిపూర్ణత సాధిస్తారో, వారు ఆయొక్క ఆరాధించిన భగవత్ స్వరూప ధామమునకు చేరుకుంటారు. ఈ విధంగా, శ్రీ కృష్ణుడి భక్తులు గోలోకమునకూ, విష్ణుభక్తులు వైకుంఠమునకూ, రామ భక్తులు సాకేతలోకమునకూ, శివ భక్తులు శివలోకమునకూ, దుర్గామాత భక్తులు దేవీలోకమునకూ చేరుకుంటారు. ఈ దివ్య ధామములకు చేరుకున్న భక్తులు, ఆయనను చేరిన తరువాత, ఆధ్యాత్మిక శక్తితో పరిపూర్ణమైన ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటారు.

06:02 - చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః ।
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ।। 57 ।।

నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మనూ నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నము చేయుము.

‘యోగము’ అంటే ఏకమైపోవుట, మరియూ, బుద్ధి యోగము అంటే, ‘బుద్ధిని భగవంతునితో ఏకం చేయుట’ అని. సమస్త పదార్థములూ, జీవులూ, భగవంతుని నుండే జనించాయి, ఆయనతో అనుసంధానమై ఉన్నాయి, మరియు ఆయన ప్రీతికోసమే ఉన్నాయని ఎప్పుడైతే బుద్ధి దృఢ నిశ్చయంతో ఉంటుందో, అప్పుడు బుద్ధి భగవంతునితో ఏకమై పోతుంది. మనలో ఉన్న అంతర్గత వ్యవస్థలో, బుద్ధి యొక్క స్థాయిని ఒకసారి అర్థం చేసుకుందాము. మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణ ఉంటుంది. మనం దానినే సామాన్యంగా, 'హృదయము' అంటుంటాము. దానికి నాలుగు అస్తిత్వాలు ఉంటాయి. అది ఆలోచనలను సృష్టిస్తే, దానిని మనం 'మనస్సు' అంటాము. అది విశ్లేషించి, నిర్ణయం తీసుకుంటే, దానిని 'బుద్ధి' అంటాము. అది ఒక వస్తువుకు, లేదా వ్యక్తి పట్ల మమకారానురాగంతో ఉంటే, దానిని 'చిత్తము' అంటాము. అది తనను తాను దేహ సంబంధ గుణములతో అనుసంధానం చేసుకునీ, మరియు గర్వంతో ఉంటే, దానిని మనం 'అహంకారము' అంటాము. ఈ యొక్క అంతర్గత వ్యవస్థలో, బుద్ధి యొక్క స్థాయి ఉన్నతమైనది. అది నిర్ణయం తీసుకుంటే, మనస్సు ఆ నిర్ణయాల ప్రకారం తన కోరికలను కోరుతుంది, మరియు చిత్తము ఆయా వస్తువిషయముల పట్ల మమకారాసక్తితో ఉంటుంది. ఉదాహరణకి, బుద్ధి గనుక మనకు భద్రతయే చాలా ప్రధానమైనదని నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ, జీవితంలో భద్రత కోసమే ప్రాకులాడుతుంది. హోదా, ప్రతిష్ఠలే జీవితంలో ఆనందానికి మూలమని గనుక బుద్ధి నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ, ‘ప్రతిష్ఠ... ప్రతిష్ఠ...’ అని ప్రాకులాడుతుంది. మనుష్యులమైన మనం, రోజంతా మనస్సును బుద్ధిచే నియంత్రిస్తుంటాము. మనం బుద్ధిని సరియైన జ్ఞానంచే పెంపొందించుకోవాలి, దానిని మనస్సును సరియైన దిశలో పెట్టడానికి ఉపయోగించుకోవాలి. శ్రీ కృష్ణుడు చెప్పే బుద్ధి యోగమంటే ఇదే - అన్ని వస్తువులూ, మరియు పనులూ, భగవంతుని ప్రీతికోసమే, ఆయన సంతోషం కొరకే ఉన్నాయనే దృఢ సంకల్పము, బుద్ధి యందు పెంపొందించుకోవటం అన్నమాట. దృఢ సంకల్పబుద్ధి ఉన్న ఇటువంటి వ్యక్తి యొక్క చిత్తము, సునాయాసముగానే, భగవంతుని పట్ల అనుసంధానమైపోతుంది.

08:45 - మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి ।
అథ చేత్ త్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి ।। 58 ।।

నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులనూ, మరియు కష్టాలనూ అధిగమించగలవు. కానీ, ఒకవేళ అహంకారముచే నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు.

ఏం చెయ్యాలో ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు తన ఉపదేశాన్ని పాటిస్తే వచ్చే లాభాన్ని చెబుతున్నాడు, మరియు పాటించకపోతే కలిగే పరిణామాలనూ వివరిస్తున్నాడు. జీవాత్మ ఎన్నటికీ, తాను భగవంతుని కంటే స్వతంత్రుడనన్న భావనలో ఉండకూడదు. మనస్సును పూర్తిగా భగవంతుని యందే నిమగ్నం చేసి, మనం భగవంతుడినే సంపూర్ణంగా ఆశ్రయిస్తే, ఆయన కృపచేత అన్ని అవరోధాలూ, మరియు కష్టాలూ తీరిపోతాయి. కానీ, గర్వముచే, సనాతన భగవత్ జ్ఞానము, మరియు శాస్త్రముల కంటే మనకే ఎక్కువ తెలుసనుకుని, ఆయన ఉపదేశాన్ని పెడచెవిన పెడితే, మనం మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యాన్ని సాధించటంలో విఫలం అవుతాము. ఎందుకంటే, భగవంతుని కంటే ఉన్నతమైదేమీ లేదు, మరియు ఆయన ఉపదేశాన్ని మించిన సందేశమూ లేదు.

10:03 - ఇక మన తదుపరి వీడియోలో, జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణంగా భగవంతుడు ఏ విధంగా నిర్దేశిస్తూ ఉంటాడో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home