విశ్వాసం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


విశ్వాసం!
ఆధ్యాత్మిక ఉపదేశాలను పొందిన వారు అపరాధులుగా ఎందుకు మారుతారు?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (67 – 70 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 67 నుండి 70 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Oros3M6b3gE ]


ఎందుకు కర్మ సన్యాసము కంటే, కర్మ యోగము ఉన్నతమైనదో ఈ శ్లోకాలలో చూద్దాము..

00:48 - ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన ।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ।। 67 ।।

ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికీ, లేదా భక్తి లేని వారికీ చెప్పకూడదు. ఆధ్యాత్మిక విషయములు వినటం పట్ల ఏవగింపుగలవారికి కూడా దీనిని చెప్పకూడదు. ముఖ్యంగా నా పట్ల అసూయగలవారికి దీనిని చెప్పకూడదు.

భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తిలో నిమగ్నమైన వారు, ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టినా పాపం లేదు. కానీ, ఈ ఉపదేశంలో ఒక సమస్య ఉన్నది. ఒకవేళ మనం ఇంకా భగవంతుని పట్ల ప్రేమలో స్థిరంగా లేకపోయినా, మరియు తొందరపడి ముందుగానే భౌతికప్రాపంచిక ధర్మములను విడిచి పెట్టినా, మనం అటూ ఇటూ కాకుండా పోతాము. అందుకే, కర్మ సన్న్యాసం అంటే, దానికి తగిన అర్హత ఉండాలి. మనకు దేనికి అర్హత ఉన్నదో, మన గురువు గారు నిర్ణయిస్తారు. ఆయనకే మన సామర్థ్యము, మరియు ఆయా మార్గాలలో ఉండే కాఠిన్యములూ తెలుస్తాయి. ఒకవేళ ఒక విద్యార్థి పట్టభద్రుడు కావాలనుకుంటే, నేరుగా వెళ్లి స్నాతకోత్సవంలో కూర్చుంటే కుదరదు. ఒకటో తరగతి నుండి క్రమక్రమంగా మొదలుపెట్టాలి. అదే విధంగా, అత్యధిక జనులకు కర్మ యోగమునకే అర్హత ఉంటుంది. తొందరపడి అకాలముగా కర్మ సన్యాసము తీసుకోవడం, పెద్ద తప్పే అవుతుంది. తమ శారీరక ధర్మములను నిర్వర్తిస్తూనే, దానితో పాటుగా భక్తిని అభ్యాస సాధన చేయమని చెప్పటమే మంచిది. అందుకే శ్రీ కృష్ణుడు, తాను చెప్పిన ఈ రహస్య జ్ఞానము అందరికోసం కాదని చెబుతున్నాడు. ఇతరులతో పంచుకునే ముందు, ఈ ఉపదేశం అందుకోవటానికి వారి యొక్క అర్హతను పరీక్షించాలి. ఈ హెచ్చరిక, భగవద్గీత మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఒకవేళ దీనిని, శ్రీ కృష్ణుడంటే అసూయ, ఈర్ష్య కలిగిన వారికి చెబితే, ఆ వ్యక్తి ఇలా అనవచ్చు.. ‘శ్రీ కృష్ణుడు చాలా దురహంకారముగలవాడు. అర్జునుడిని పదేపదే తనను కీర్తించమని చెబుతున్నాడు’ అని. ఈ ఉపదేశాలను తప్పుగా అర్థం చేసుకుని, విశ్వాసరహితుడు, ఈ దివ్య ఉపదేశం వలన ఇంకా హాని పొందుతాడు. పద్మ పురాణం కూడా ఇలా చెబుతున్నది: ‘విశ్వాసం లేనివారికీ, మరియు భగవంతుని పట్ల ఏవగింపుగలవారికీ, అలౌకిక ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇవ్వటం ద్వారా, వారిని అపరాధులుగా చేసినట్టు అవుతుంది.’

03:19 - య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ।। 68 ।।

ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, భగవద్గీతను సరియైన పద్ధతిలో బోధిస్తే కలిగే పరిణామాలను ప్రకటిస్తున్నాడు. అటువంటి బోధకులు, ప్రథమంగా ఆయన పరాభక్తిని పొందుతారు. ఆ తర్వాత ఆయననే పొందుతారు.

భక్తిలో నిమగ్నమవ్వటానికి లభించే అవకాశం అనేది, భగవంతుని యొక్క విశేషమైన కృప. అదే సమయంలో, ఇతరులను కూడా భక్తిలో నిమగ్నం చేసే అవకాశం అనేది, ఇంకా ఎక్కువ అనుగ్రహము. అది భగవంతుని యొక్క విశేష కృపను ఆకర్షిస్తుంది. మనం ఎప్పుడైనా ఇతరులతో ఒక మంచిదానిని పంచుకుంటే, మనం కూడా దాని నుండి ప్రయోజనాన్ని పొందుతాము. మన దగ్గరున్న ఏదేని జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే, భగవదనుగ్రహం వలన, మన జ్ఞానం కూడా ఎంతో పెంపొందుతుంది. ఇతరులకు అన్నం తరచుగా పెట్టడం వలన, మనమెప్పుడూ ఆకలితో ఉండే అవసరం రాదు. దానం ఇవ్వటం వలన, సంపద ఎప్పుడూ తరిగిపోదు; జనులు నీరు తీసుకున్నా, నది ఎన్నడూ తరిగిపోదు. ఈ విధంగా, భగవద్ గీత యొక్క ఆధ్యాత్మిక జ్ఞానమును ఇతరులకు పంచే వారు, తామే అత్యున్నత అనుగ్రహాన్ని పొందుతారు.

04:53 - న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః ।
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ।। 69 ।।

వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు; వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు.

ఇతరులకు మనం ఇచ్చే అన్ని బహుమతులకన్నా, ఆధ్యాత్మిక జ్ఞాన బహుమతి అనేది, అత్యంత ఉన్నతమైనది. ఎందుకంటే, ఆ జ్ఞానమును అందుకున్న వాడిని శాశ్వతంగా మార్చివేసే సామర్థ్యం, దానికి ఉన్నది. ఒకనాడు జనక మహారాజు తన గురువు అష్టావక్రుడిని ఇలా అడిగాడు. ‘ఈ అలౌకిక ఆధాత్మిక జ్ఞానమును నాకు ప్రసాదించినందుకు, మీకు ఏంతో రుణపడి ఉన్నాను. మీకు ప్రతిగా ఏమివ్వగలను?’ అని. అందుకు అష్టావక్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ఈ రుణాన్ని తీర్చగలిగినదేదీ నీవు ఇవ్వలేవు. నేనిచ్చిన జ్ఞానము దివ్యమైనది. నీ దగ్గరున్నదంతా భౌతికమైనది. భౌతిక వస్తువులు ఎప్పుడూ దివ్యమైన జ్ఞానమునకు వెలకట్టలేవు. కానీ, నీవు ఒక పని చేయవచ్చు. నీకు ఎవరైనా, ఈ జ్ఞానం కోసం పరితపిస్తున్నవారు తారసపడితే, దీనిని వారికి తెలియజేయుము.’ ‘భగవద్ గీత యొక్క జ్ఞానమును ఇతరులకు పంచటం అనేది, భగవంతునికి చేయగలిగే అత్యున్నత ప్రేమయుక్త సేవ’ అని, తన అభిప్రాయాన్ని భగవంతుడు వెల్లడిస్తున్నాడు. కానీ, భగవద్ గీత యొక్క జ్ఞానమును ప్రవచించేవారు, ఏదో గొప్ప పని చేస్తున్నట్టు గర్వపడకూడదు. నిజమైన ఉపాధ్యాయుని దృక్పథం ఏమిటంటే, తనను తాను భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగానే చూసుకోవాలి. గొప్పతనాన్నంతా ఆ భగవత్ కృపకే ఆపాదించాలి.

06:46 - అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః ।
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః ।। 70 ।।

మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే, అంటే, తమ బుద్ధిచే నన్ను ఆరాధించినట్టుని నేను ప్రకటిస్తున్నాను; ఇదే నా అభిప్రాయము.

అర్జునుడికి తన బుద్ధిని, ఆయనకు సమర్పించమని శ్రీ కృష్ణుడు పదేపదే చెప్పి ఉన్నాడు. దీని అర్థం, మన బుద్ధిని ఉపయోగించు కోవటం మానేయమని కాదు; మన బుద్ధిని మన చేతనయినంతవరకూ ఆయన సంకల్పమును పూర్తి చేయుటకు ఉపయోగించమని. భగవద్ గీత యొక్క ఉపదేశము ద్వారా, ఆయన సంకల్పమేమిటో మనకు అర్థం అవుతుంది. కాబట్టి, ఈ పవిత్రమైన సంవాదమును అధ్యయనం చేసేవారు, భగవంతుడిని తమ బుద్ధిచే ఆరాధించినట్టవుతుంది.

07:41 - ఇక మన తదుపరి వీడియోలో, పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకోవడానికి మార్గం ఏంటో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home