Getting rid of sins - Karma Siddhanta పాప భారం - చిట్టి కథ!
పాప భారం - చిట్టి కథ!
తీర్థ స్నానాలతో, చేసిన పాపాలను వదిలించుకోవచ్చా?
తీర్థము అంటే, నది రేవు జలస్థానము, పవిత్ర స్థానము, యాత్రా స్థలము అనే అర్థాలున్నాయి. తీర్థ కాకము అంటే, నీటి కాకి. కాకి ఎన్ని తీర్థాలలో మునిగినా, పుణ్య ఫలం పొందలేదనే అర్థంతో, ఈ తీర్థ కాక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. ఇక్కడ పేరు కాకిదే అయినా, అసలు ఉద్దేశించి చెప్పింది, మనుషుల గురించేనని అర్థం చేసుకోవాలి. పవిత్రమైన నదుల్లో మునిగి స్నానాలు చేస్తే, అప్పటివరకు చేసిన పాపాలు హరించి పోతాయని భక్తుల విశ్వాసం. తెలిసీతెలియక ఏం పాపాలు చేశామో, అవి పోగొట్టుకుందామని నిష్టగా, భక్తితో తీర్థయాత్రలు చేసే వారు కొందరైతే, నిత్యం అనేక తప్పులూ, చెడు పనులూ చేస్తూ, ‘దాసుని తప్పు దండంతో సరి’ అన్నట్లుగా, తీర్థయాత్రలకు వెళ్ళి, తీర్థ స్నానాలు చేస్తూ ఉంటారు, మరికొందరు. అలా పాపాలు పోగొట్టుకోవాలని ప్రయత్నించే దుష్టుల గురించి, వేమన నిరసనగా ఇలా అంటాడు..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nAcsHmMF2vs ]
”ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాల గడుగ బోవునా నైల్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ!”
దీని అర్ధం, ఎంత చదివినా, ఎన్ని మంచి మాటలు విన్నా, నీచుడు, చెడు గుణం కలిగిన వ్యక్తి మారడు. నల్లని బొగ్గును పాలతో కడిగినా, ఆ నలుపు పోయి తెల్లగా మారదు కదా! అలా కొందరు తప్పులు కప్పి పుచ్చుకోవడానికి చేసే తీర్థయాత్రలూ, స్నానాల వల్ల, వారికి ఎలాంటి పుణ్యమూ రాదనే అర్థంతో, ఈ తీర్థ కాక న్యాయమును చెబుతుంటారు. ఇక మరో కోణం చూద్దాము..
ఒక నాడు గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి, ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగానదినే అడిగాడు.. 'తల్లీ! ఎందరో, ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి పాపాలు వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావమ్మా?' అని అడిగాడు.. అందుకా తల్లి, 'నాయనా, ఆ పాప భారం నేనెక్కడ మోస్తున్నాను? అవన్నీ తీసుకెళ్ళి, ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపి వేస్తుంటాను కదా!' అని బదులిచ్చింది..
అయ్యో, అన్ని పుణ్య నదులూ ఇంతే కదా..! పాపాలన్నీ సముద్రంలో కలిపేస్తే, ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో..! అని అనుకుని వెళ్ళి, సముద్రుడినే అడిగాడు.. 'ఎలా మోస్తున్నావు తండ్రీ ఈ పాప భారాన్ని?' అని.. దానికి సముద్రుడు.. 'నేనెక్కడ భరిస్తున్నానయ్యా? ఆ పాపాలను వెను వెంటనే ఆవిరిగా మార్చి, పైన మేఘాల లోకి పంపించేస్తుంటాను' అని బదులిచ్చాడు..
అరే! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చిందని అనుకుంటూ.. 'ఓ మేఘ మాలికల్లారా.. ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని?' అని అడుగగా అవి పకపకా నవ్వి.. 'మేమెక్కడ భరిస్తున్నాము? ఎప్పటి కప్పుడు వర్ష రూపేణా మీ మీదే కురిపించేస్తున్నాము కదా!' అని బదులిచ్చాయి..
ఓహో! ఆ పాపాలన్నీ మన మీద పడి, మనమే అనుభవిస్తున్నామన్న మాట! అయితే ఎట్టి పరిస్థితులలోనూ, ఎవ్వరూ కర్మ ఫలితాలను వదిలించు కోలేరని గ్రహించాడు, ఋషి..
ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ।
ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే ।।
ఈ తీర్ధంలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుంది, ఆ తీర్ధంలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందని, తీర్ధ స్నానాలకై పరుగులు పెడుతున్న మానవులు, ‘భ్రమకు లోబడిన వారు’! ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెలా కలుగుతుంది? అని ఈ శ్లోకం యొక్క అర్థం.
కర్మ కర్మణా నశ్యతి కర్మ ।। అంటే.. కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది..
సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం ।
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం ।।
ఈ చోటి కర్మ ఈ చోటే. ఈ నాటి కర్మ మరునాడే. అనుభవంచి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే..
ధర్మో రక్షతి రక్షితః!
Comments
Post a Comment