పూరూరవుడు ఎవరు? King Pururava


పూరూరవుడు ఎవరు?
ఊర్వశీ పురూరవుల ప్రణయ కావ్యం మీకు తెలుసా?

మన పురాణాలలో ఎన్నో ప్రేమకథలు చోటుచేసుకున్నాయి. వాటిలో విచిత్రమైన ప్రేమకథలు, స్వర్గలోక వాసులైన సౌందర్యరాశుల సొంతం. అప్సరసల గురించి హిందూ పురాణాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. వీరిలో రంభ, ఊర్వసి, మేనక, తిలోత్తమలతో పాటు, అనేక మంది ఇతర అప్సరసలు కూడా ఉన్నారు. అయితే, ఊర్వసి పుట్టుక గురించి ప్రత్యేకమైన కథ ప్రచారంలో ఉంది. నరనారాయణులకూ, ఊర్వశికీ గల సంబంధం ఏమిటో మన గత వీడియోలో వివరించాను. చూడని వారి కోసం, దాని లింక్ ను  i Cards లో పొందుపరిచాను. అనన్య సామాన్యమైన అందాల రాశి ఊర్వశి ఎందుకు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది? ఆమెకున్న శాపం ఏమిటి? పూరూరవ చక్రవర్తి ఎవరు? ఊర్వశి పూరురవుడితో ప్రేమలో ఎలా పడింది? పూరురవుడిని ఊర్వశి ఎందుకు వదిలి వెళ్లింది? తిరిగి ఊర్వశీ పూరురవులు కలుసుకున్నారా? వీరి ప్రేమకావ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/oXHEBpbKZmM ]


ప్రజాపతి బ్రహ్మకు, అత్రిమహర్షి సంతానంగా కలిగాడు. ఆయనకు చంద్రుడు ఉదయించాడు. ఈయన తారా మండలానికి రాజుగా, ఓషధులకు అధీశుడిగా ప్రఖ్యాతుడయ్యాడు. ఈయన రాజసూయం చేసి, ముల్లోకాలూ గెలిచాడు. చంద్రుడు దేవగురువు భార్య తారను కామించాడు. ఆమె గర్భవతి అయి, కుమారుని కన్నది. ఆ సుందరాకారుని చూచి, బృహస్పతి తన కుమారునిగా స్వీకరిస్తాననగా, వివాదం చెలరేగింది. బ్రహ్మ విషయం గ్రహించి, వానిని చంద్రుని పుత్రుడిగా పంపించాడు. ఆ కుమారుడే, బుధుడు. బుధుని భార్య ఇల. వీరి కుమారుడు, పురూరవుడు. అతి పరాక్రమవంతుడైన పురూరవుడు, దేవతలకు సన్నిహితుడిగా పేరుగాంచి, ఎన్నో యుద్ధాలలో పాల్గోన్నాడు. పురు అనే పర్వతం పై జన్మించాడు కాబట్టి, పురూరవుడు అనే పేరొచ్చింది. ప్రతిష్టాన పురాన్ని పాలించే పురూరవుడు, తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి, భూమండలానికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత పురూరవుడు కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేశాడు.

పురూరవునితో దేవతలు స్నేహితులుగాను, రాక్షసులు అనుచరులుగాను మెలిగేవారు. మహాభారతం ప్రకారం, పురూరవుడు గంధర్వ లోకంనుండి, మూడు రకాల అగ్నులను యజ్ఞయాగాదుల కోసం తెచ్చాడు. ఆ సందర్భంలోనే, అక్కడ ఊర్వశిని చూసి మోహించాడు. ఊర్వశి మహా సౌందర్యవతి. నారాయణుడి ఊరువు నుండి ఉద్భవించిన ఆమె ముగ్ధమోహన లావణ్యానికి, ఎంతటివారైనా దాసోహం అవ్వాల్సిందే. రంభాది అప్సరసలకంటే రెట్టింపు అందం, ముఖవర్ఛస్సుతో, ఆమె దేవలోకంలో అగ్ర నర్తకిగా పేరుగాంచింది. ఊర్వశి ఒకనాడు సూర్యుని చేత శాపగ్రస్థురాలై, మానవజన్మ యెత్తి భూలోకానికి వచ్చింది. పూరురవ మహారాజును ఏకాంతంలో దర్శించింది. అప్పటికే ఊర్వశి సౌందర్యానికి మోహితుడైన పురూరవుడు ఆమెను చేరి, తన కోరికను తెలిపాడు.

ఊర్వశి కూడా పురూరవుడి యందు కామ కోరికను కలిగి నవ్వుతూ, "రాజేంద్రా! నాకు రెండు నియమాలున్నాయి. అవి నీవు పాటిస్తే, నిన్ను వరిస్తాను. నియమం తప్పిన క్షణంలో నిన్ను విడిచి పోతాను. ఒకటి, నాకు రెండు గొర్రెలున్నాయి. వాటిని నిరంతరం నువ్వు రక్షిస్తూండాలి. రెండవది - ఎన్నడూ నా ముందు నువ్వు దిగంబరంగా కనపడ కూడదు" అని అన్నది. మోహమత్తుడైన పురూరవుడు ఆమె నియమాలను ఆమోదించి, ఆమెతో కలసి జీవించనారంభించాడు. అక్కడ అమరావతిలో దేవేంద్రుడు, తన సభలో ఊర్వశి లేకపోవడం లోటుగా వున్నదని భావించాడు. ఎలాగైనా ఆమెను స్వర్గలోకానికి తీసుకురావాలని, గంధర్వులను భూలోకానికి పంపించాడు. ఊర్వశీ పూరూరవల ప్రణయాన్ని చూసిన గంధర్వులు, ఆమె తిరిగి అమరావతి రావడం అసాధ్యం అని భావించి, ఒక పన్నాగం పన్నారు.

ఒకనాటి రాత్రి అత్యంత రహస్యంగా, ఊర్వశి పెంచుకునే గొర్రెలను అపహరించబోగా, అవి రోదన చేశాయి. వాటి అరుపు సాగుతున్నా, పురూరవుడు ఏమాత్రం చలించక, గాఢనిద్రలో వుండిపోయాడు. ఆ అరుపులకు ఊర్వశి లేచి, "నా కన్నబిడ్డల వంటి పొట్టేళ్ళను దొంగలు అపహరిస్తున్నా, మొద్దు నిద్రపోయే నీవు మగవాడివేనా! నోరులేని పశువులను రక్షించలేవు. ప్రియురాలి కౌగిలి తప్ప మరేమీ యెరగని మగవాడై పుట్టడం కంటే, ఆడజన్మ మేలు". అని అనేక విధాలా నిందించగా భరించలేని పూరురవుడు, శయ్యదిగి పోయి, ఆ దొంగల నుండి గొర్రెలను తోలుకు వచ్చాడు. గాఢ నిద్ర నుండి లేచిన ఆ మైకంలో, శరీరం మీద వస్త్రం వున్నదీ లేనిదీ చూసుకోకుండా, గొర్రెల కోసం పోయి వాటిని తీసుకువచ్చి, ఊర్వశి ముందు దిగంబరంగా నిలబడ్డాడు. తక్షణం ఊర్వశి తన నియమానుసారం, అంతర్ధానం అయ్యింది.

ప్రియురాలు కనిపించక దీనంగా విలపిస్తూ, ఆమె కోసం ఎదురు చూశాడు పూరురవుడు. ఆమె జాడ కోసం ముల్లోకాలూ సంచరిస్తూ, సరస్వతీ నదీ తీరాన చెలికత్తెలతో వున్న ఊర్వశిని చూశాడు. ఆనందభరితుడైన పురూరవుడు, తనతో పాటు రమ్మని పరి పరివిధాలా ఊర్వశిని వేడుకున్నాడు. అందుకు ఊర్వశి, "మహారాజా! తియ్య తియ్యని మాటలతో వంచించడమే తప్ప, మన్మథుణ్ణి కూడా మనసారా ప్రేమించని వేశ్యలతో నీకెందుకయ్యా? సరే, ఒక్క సంవత్సరం ఆగి నా దగ్గరకు రా. అప్పుడు నీకు యోగ్యులయిన పుత్రులను అందిస్తాను" అని చెప్పింది. అప్పుడు పురూరవుడు ఆమె గర్భవతియని గ్రహించి, అక్కడి నుండి వెళ్ళి పోయాడు.

ఊర్వశి మాట ప్రకారమే, సంవత్సరం గడిచాక ఆమె దగ్గరకు పోయాడు. ఊర్వశి, పూరూరవుడితో గంధర్వులను వేడుకోమ్మని చెప్పింది. పూరూరవుడు ఆమె మాటకు లోబడి వారిని అభ్యర్థించగా, వారు ఊర్వశి వంటి రూపం కలిగిన అగ్నిస్థలిని యిచ్చారు. ఆమెను ఊర్వశిగా భావించి, అగ్నిస్థలితో జీవనం కొనసాగించాడు, పూరూరవుడు. అయితే, కొంత కాలం గడిచిన తరువాత, ఆమె ఊర్వశి కాదని తెలియగా, ఆమెను విడిచిపెట్టాడు. ఎంతకాలమైనా పురూరవుడి మనస్సు ఊర్వశి యందే లగ్నమై ఉంది.

అంతలో కృతయుగం గడచి, త్రేతాయుగం ప్రవేశించింది. ఆయన మనస్సులో వేద ధర్మం మూడు విధాలుగా గోచరించగా, జమ్మిచెట్టులో పుట్టిన రావిచెట్టు కొమ్మలతో, రెండు అరణులు చేశాడు. మొదటి అరణి తానుగా, రెండవది ఊర్వశిగా, నడుమనున్న కర్ర కుమారుడుగా మథనం చేయగా, జాత వేద రూపంతో అగ్ని సంభవించి, ఆహవనీయాగ్నిగా ప్రఖ్యాతమయింది. ఆ అగ్నితో పురూరవుడు, శ్రీహరిని ఆరాధించాడు. ఆ శ్రీహరి సంతోషించి, ఊర్వశితో జీవితాన్ని సంతోషంగా గడపమని చెప్పి, ఊర్వశీ పురూరవుల సంతానం చంద్ర వంశంగా ప్రఖ్యాతి గడిస్తుందని వరమిచ్చాడు. అనంతరం పురూరవుడు, గంధర్వ లోకంలో ఊర్వశిని చేరి, ఆయువు, శ్రుతాయువు ఆదిగా, ఆరుగురు కుమారులను కన్నాడు.

ఓం నమో నారాయణాయ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home