ఏది ధర్మం? భగవద్గీత What is Dharma? Bhagavad Gita Chapter 18
ఏది ధర్మం?
భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే ఏం జరుగుతుంది?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (63 – 66 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 63 నుండి 66 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/s7bUig5PKaM ]
జనులు ఏ విధంగా చేయడం వలన భగవంతుడిని పొందగలరో చూద్దాము..
00:47 - ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా ।
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ।। 63 ।।
ఈ విధంగా, నేను నీకు అన్ని రహస్యాలకంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము.
రహస్యము అంటే, అందరికీ సామాన్యముగా అందుబాటులో లేని జ్ఞానమని అర్థం. ఆధ్యాత్మిక జ్ఞానమనేది చాలా నిగూఢమయినది. అది ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకోబడలేనిది. దానిని గురువు, మరియు శాస్త్రముల ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి, అది రహస్యమని చెప్పబడినది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఆత్మ జ్ఞానమును తెలియచేశాడు. 7వ మరియు 8వ అధ్యాయాలలో, తన శక్తిసామర్థ్యాల యొక్క జ్ఞానమును తెలియచేశాడు. 9వ మరియు తదుపరి అధ్యాయాలలో, తన భక్తి గురించి తెలియచేశాడు. ప్రస్తుత అధ్యాయంలో, తనను తన సాకార రూపంలో తెలుసుకోవటం కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమని తెలియచెప్పాడు. అత్యంత రహస్యములతో కూడిన జ్ఞానాన్ని అర్జునుడికి తెలియ చేస్తూ, ఇక ఇప్పుడు ఏం చేయాలనే నిర్ణయాన్ని, అర్జునుడికే వదిలేస్తున్నాడు. ‘నేను నీకు గంభీరమైన, మరియు గోప్యమైన జ్ఞానాన్ని అందించాను. ఇక ఇప్పుడు నీ ఇష్టం.’ అని భగవంతుడు, తుది నిర్ణయాన్ని అర్జునుడికే వదిలివేశాడు. అయోధ్యావాసులకు శ్రీ రామచంద్ర ప్రభువు, సుమారుగా ఇటువంటి మాటలే చెప్పాడు. ఒకసారి ఆయన వారందరినీ తన ప్రవచనానికి పిలిచాడు. ఆ ఉపదేశంలో, రాముడు వారందరికీ, మానవ జీవిత లక్ష్యం ఏమిటో, దానిని ఎలా సాధించాలో చెప్పాడు. చివరికి ఇలా ముగించాడు. ‘నేను మీకు చెప్పిన ఉపదేశంలో తప్పు లేదు. అలాగే, నిర్బంధంగా దానిని పాటించాల్సిన అవసరమూ లేదు. దానిని జాగ్రత్తగా విని, ఆలోచించి, ఆ తరువాత మీకు నచ్చిన రీతిలో చేయండి.’ అందుబాటులో ఉన్న వాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలనే ఈ యొక్క స్వేచ్ఛాచిత్తమును, భగవంతుడు జీవుడికిచ్చాడు. ఈ స్వేచ్ఛాచిత్తమునకు పరిమితులున్నాయి. ఎవరైనా, ‘తాను ప్రపంచంలో అత్యంత తెలివిగల వ్యక్తిగా ఉందామనుకుంటున్నాన’ని, వారికి వారే నిర్ణయించుకోలేరు. మన పూర్వ మరియు ప్రస్తుత కర్మలచే, మనకున్న ఎంపిక పరిధి లోనివి, పరిమితంగా ఉంటాయి. కానీ, మనకు ఖచ్చితంగా కొంతమేర ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే, మనం భగవంతుని చేతిలో యంత్రాలము కాము. కొన్నిసార్లు జనులు, ‘భగవంతుడు మనకు స్వేచ్ఛాచిత్తమును ఇచ్చి ఉండకపోతే, మనం చెడుపనులు చేసి ఉండేవాళ్ళం కాదుకదా’ అంటారు. అలా ఐతే, మనం మంచి కూడా చేసి ఉండేవాళ్ళం కాదు. మంచి చేసే అవకాశం ఎప్పుడూ, చెడు చేసే ప్రమాదంతోనే కూడి ఉంటుంది. మరీ ముఖ్యంగా, భగవంతుడు, మనం ఆయనను ప్రేమించాలనే కోరుకుంటాడు. స్వేచ్ఛాచిత్త ఎంపిక ఉన్నప్పుడే, ప్రేమ సాధ్యమవుతుంది. ఒక యంత్రము ఎప్పుడూ ప్రేమించలేదు. ఎందుకంటే, దానికి స్వేచ్ఛాచిత్తము ఉండదు గనుక. భగవంతుడు మనలను స్వేచ్ఛాచిత్తము తోటే సృష్టించి, ఎన్నో విషయాలనూ, పద్ధతులనూ ఎంచుకునే అవకాశాలను కలిగించాడు. ఇదంతా మనం ఆయననే ఎంచుకుని, ఆయన పట్ల మన ప్రేమను తెలియపరుచుకోవటానికే. సర్వ శక్తిమంతుడయిన భగవానుడు కూడా, జీవుడు తనను ప్రేమించి, శరణువేడుకునే విధంగా బలవంతం చేయలేడు. ఆ నిర్ణయం, జీవుడే స్వయంగా తీసుకోవాలి. ఇక్కడ శ్రీ కృష్ణుడు, అర్జునుడికి అతని యొక్క స్వేచ్ఛాచిత్తమును గుర్తుచేస్తూ, అతనినే ఎంచుకోమని చెబుతున్నాడు.
04:34 - సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ।। 64 ।।
నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము. అది సమస్త జ్ఞానములలో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి, దీనిని తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.
ఒక ఉపాధ్యాయుడికి నిగూఢమైన రహస్యం తెలిసి ఉండవచ్చు. కానీ, ఆయన దానిని విద్యార్థికి తప్పకుండా చెబుతాడనే నమ్మకం లేదు. దానిని చెప్పేముందు, ఆయన చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. అంటే, విద్యార్థి యొక్క యోగ్యత, దానిని అర్థం చేసుకునే సామర్థ్యం, మరియు దాని నుండి ప్రయోజనం పొందగలగటం, మొదలైనవి. భగవద్గీత ప్రారంభంలో, అర్జునుడు తన ముందున్న సమస్యచే ఆందోళన చెంది, శ్రీ కృష్ణ పరమాత్మను దారిచూపమన్నాడు. భగవంతుడు చాలా జాగ్రత్తగా, సావధానంగా, అతని యొక్క జ్ఞానాన్ని క్రమక్రమంగా, పద్దెనిమిది అధ్యాయాల ద్వారా వృద్ధి చేశాడు. అర్జునుడు ఆ ఉపదేశాన్ని చక్కగా నేర్చుకోవటం చూసి, శ్రీ కృష్ణుడికి ఇక ఇప్పుడు, తన యొక్క అంతిమ, అత్యంత నిగూఢమైన జ్ఞానమును అర్జునుడు అర్థంచేసుకోగలడన్న ధైర్యం వచ్చింది. ‘నీవు నా ప్రియమిత్రుడవు. నీ క్షేమాన్ని కోరుకుంటున్నాను. నీకు ఎప్పుడూ మంచి జరగాలనే ఆశిస్తాను కావున, దీనిని నేను నీకు చెబుతున్నాను.’ అని వెల్లడించాడు.
06:07 - మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ।। 65 ।।
ఎప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము, మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది. ఎందుకంటే, నీవు నాకు చాలా ప్రియమైనవాడవు.
శ్రీ కృష్ణుడు అర్జునుడికి అత్యంత రహస్యమైన జ్ఞానమును తెలియజేశాడు. ఆ తర్వాత భక్తి యొక్క ప్రాశస్త్యమును చెప్పాడు. ఇక్కడ, తన పట్ల భక్తితో నిమగ్నమవ్వమని చెబుతున్నాడు. భగవంతుడి పట్ల గాఢమైన ప్రేమను పెంపొందించుకుని, తన యొక్క మనస్సు సతతమూ అనన్య భక్తితో, ఆయన యందే నిమగ్నం చేయటం వలన, అర్జునుడు ఖచ్చితంగా సర్వోన్నత గమ్యమును చేరుకోగలడు. సంపూర్ణముగా భక్తిలో నిమగ్నమైన వానికి ఉన్న ఒక చక్కటి ఉదాహరణ, అంబరీష మహారాజు. ‘అంబరీషుడు తన మనస్సును శ్రీ కృష్ణుడి పాదారవిందముల మీదనే నిమగ్నం చేశాడు. తన వాక్కును భగవంతుని గుణములను కీర్తించటానికే వాడాడు. తన చేతులను, దేవాలయమును శుభ్రం చేయటానికే వాడాడు. తన చెవులను, భగవత్ దివ్య లీలలను వినటానికే వాడాడు. తన కన్నులను, దివ్యమంగళ విగ్రహాలను దర్శించటంలోనే నిమగ్నం చేశాడు. తన శరీర అంగములను భక్తుల సేవకే వాడాడు. తన ముక్కును, భగవంతుని పాదార విందముల వద్ద అర్పించిన తులసీ దళములను ఆఘ్రాణించటానికే వాడాడు. తన నాలుకను భగవత్ ప్రసాదమును రుచి చూడటానికే వాడాడు. తన కాళ్ళను పుణ్య ప్రదేశాలకు వెళ్ళటానికీ, తన శిరస్సును భగవత్ పాదార విందముల వద్ద ప్రణమిల్లటానికీ ఉపయోగించాడు. పూల దండలూ, చందనము వంటి సరంజామా అంతటినీ, భగవత్ సేవకే వాడాడు. ఇవన్నీ ఏదో స్వార్థ ప్రయోజనం కోరి కాకుండా, చిత్తశుద్ధి ద్వారా, కేవలం, శ్రీ కృష్ణుడి నిస్వార్థ ప్రేమ పొందటానికే చేశాడు. ఇంతటి సేవాతత్పరుడైన అంబరీషుడి వృత్తాంతాన్ని, గతంలో వివరించాను. హృదయ పూర్వకముగా భక్తిలో నిమగ్నమవ్వమని చెప్పే ఉపదేశమే, సమస్త శాస్త్రముల యొక్క సారాంశము, మరియు సమస్త జ్ఞానము యొక్క సారము. అయినా, శ్రీ కృష్ణుడు పేర్కొన్న అత్యంత గోప్యమైన జ్ఞానము ఇది కాదు. ఎందుకంటే, దీనిని కృష్ణుడు ఇంతకు పూర్వమే చెప్పి ఉన్నాడు.
08:37 - సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ।। 66 ।।
అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను; భయపడకుము.
ఇప్పటివరకూ, శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఒకే సమయంలో, రెండు పనులు చేయమన్నాడు – మనస్సును భక్తిలో నిమగ్నం చేయాలి, మరియు శరీరాన్ని, తన ప్రాపంచిక క్షత్రియ ధర్మమును నిర్వర్తించటంలో వాడాలి. ఈ విధంగా అర్జునుడిని, తన క్షత్రియ ధర్మమును విడిచిపెట్టమని చెప్పలేదు. దానితో పాటుగా, భక్తిని పెంపొందించుకోమన్నాడు. ఇదే 'కర్మయోగ' సిద్ధాంతము. ఇక ఇప్పుడు శ్రీ కృష్ణుడు, ఈ ఉపదేశానికి విరుద్ధంగా చెబుతూ, ప్రాపంచిక ధర్మములను నిర్వర్తించుట కూడా, అవసరంలేదని అంటున్నాడు. అర్జునుడు సమస్త ప్రాపంచిక ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం భగవంతునికి శరణాగతి చేయవచ్చన్నాడు. ఇది కర్మ సన్న్యాస సిద్ధాంతము. యధార్థముగా, మనకు రెండు రకాల ధర్మములున్నాయి - భౌతిక ధర్మములు, మరియు ఆధ్యాత్మిక ధర్మములు. ఈ రెండు రకాల ధర్మములు, ‘నేను’ అంటే ఏమిటన్న రెండు వేర్వేరు విధములైన అవగాహన నుండి జనించాయి. మనం మనలను ఈ శరీరమే అనుకుంటే, మన ధర్మం అనేది, మన శారీరక హోదా, కర్తవ్యాలు, విధులు, మరియు ఆచారాల వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి, శారీరక తల్లిదండ్రుల సేవ, సమాజ పర బాధ్యతలు, దేశం పట్ల కర్తవ్యాలు, మొదలైనవన్నీ, శారీరక ధర్మములంటారు. దీనినే 'అపర ధర్మం' లేదా ప్రాపంచిక ధర్మమని అంటారు. దీని పరిధిలోనే, బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం మొదలైనవన్నీ ఉంటాయి. కానీ, ఎప్పుడైతే మనం మనలను ఆత్మ అనుకుంటామో, మనకు ఇక భౌతికమైన వర్ణాశ్రమ గుర్తింపులు ఉండవు. ఆత్మ యొక్క తండ్రి, తల్లి, మిత్రుడు, సఖి, సఖుడు, మరియు ఆశ్రయము, అన్నీ భగవంతుడే. కాబట్టి, మనకున్న ఏకైక ధర్మం, ప్రేమయుక్త భగవత్ సేవయే అవుతుంది. దీనినే పర-ధర్మం, లేదా ఆధ్యాత్మిక ధర్మమని అంటారు. ఒకవేళ వ్యక్తి తన భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే, కర్తవ్య ఉపేక్ష చేత, అది పాపముగా పరిగణించ బడుతుంది. కానీ, ఎవరైనా భౌతిక ధర్మమును విడిచిపెట్టి, ఆధ్యాత్మిక ధర్మమును ఆశ్రయిస్తే, అది పాపము కాదు. భగవంతునికి శరణాగతి చేయని వారికి, ఐదు రకాల రుణాలు ఉంటాయి: దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర మానవులకు, మరియు ఇతర ప్రాణులకు, వర్ణాశ్రమ వ్యవస్థ, మనలను మనం ఈ ఐదు రుణముల నుండి విడిపించుకోవటానికి, వివిధ పద్ధతులను కలిగి ఉంది. కానీ, మనం భగవంతునికి శరణాగతి చేస్తే, మనం అప్రయత్న పూర్వకంగానే, ఈ అన్ని ఋణాల నుండి విముక్తి చేయబడతాము; ఇది ఎలాగంటే, ఒక చెట్టు వేరులో నీరు పోస్తే, దాని యొక్క అన్ని శాఖలు, చిగుర్లు, ఆకులు, పుష్పాలు, మరియు కాయలు, అన్నిటికీ నీరు అందుతుంది. అదే విధముగా, భగవంతుని పట్ల మన కర్తవ్యమును నిర్వర్తిస్తే, మనం అప్రయత్నంగానే, అందరి పట్ల మన విధిని నిర్వర్తించినట్టే. కాబట్టి, మనం సముచితంగా, ఆధ్యాత్మిక ధర్మంలో స్థితమై ఉంటే, భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెట్టినా, పాపం అంటదు. నిజానికి, అత్యున్నత లక్ష్యమేమిటంటే, మనం సంపూర్ణముగా, మరియు మనసారా, ఆధ్యాత్మిక ధర్మంలో నిమగ్నమవ్వటమే. భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి క్రమక్రమంగా, ఉన్నతమైన ఉపదేశాలను ఇచ్చాడు. ప్రారంభంలో అర్జునుడికి కర్మ చేయమని చెప్పాడు. అదే క్షత్రియ యోధుడిగా, తన భౌతికప్రాపంచిక ధర్మము. కానీ, భౌతిక ధర్మమనేది, భగవత్ ప్రాప్తిని కలుగచేయలేదు; అది స్వర్గాది లోకములనే ఇవ్వగలదు. పుణ్యక్షయం అయిపోయినప్పుడు, జీవుడు మరల తిరిగి రావలసినదే. కాబట్టి శ్రీ కృష్ణుడు, తదుపరి అర్జునుడికి కర్మ యోగమును చేయమని చెప్పాడు. అంటే, శరీరముతో భౌతిక ధర్మము, మరియు మనస్సుతో ఆధ్యాత్మిక ధర్మము. శరీరంతో యుద్ధం చేస్తూ, మనస్సుతో భగవంతుడిని స్మరిస్తూ ఉండమన్నాడు. ఈ కర్మయోగ ఉపదేశమే, భగవత్ గీత యొక్క అతిపెద్ద భాగము. ఇక చిట్ట చివరికి, శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ సన్యాసము చేయమని చెప్పాడు. అంటే, సమస్త భౌతిక ధర్మములనూ విడిచి, కేవలం ఆధ్యాత్మిక ధర్మం, అంటే భగవత్ ప్రేమను పాటించమన్నాడు. అందుకే యుద్ధం చేయాలి కానీ, అది తన క్షత్రియ ధర్మమని కాదు. భగవంతుడు తనను అలా చేయమంటున్నాడు కాబట్టి.
13:26 - ఇక మన తదుపరి వీడియోలో, ఎందుకు కర్మ సన్యాసము కంటే కర్మ యోగము ఉన్నతమైనదో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment