శ్రీరామ పట్టాభిషేకం! భాగం - 1 Coronation of Lord Rama in Ayodhya - Shri Rama Pattabhishekam


శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 1  @mplanetleaf  
రాముడు పట్టాభిషిక్తుడవ్వడం భరతుడికి ఇష్టమేనా?

రామాయణంలోని ప్రతి ఘట్టం ఒక మధుర కావ్యంలానే ఉంటుంది. ఒక్కో కాండం, అద్భుతమైన భావోద్వేగాలను జనింపజేస్తుంది. రామాయణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం, శ్రీ రామ పట్టాభిషేకం. రాముడికి రాజుగా పట్టాభిక్తుడవ్వడం ఇష్టమేనా? రాముడి దూతగా హనుమ భరతుడి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు? పుష్పక విమానంలో లంక నుండి బయలుదేరిన రాముడు, సీతతో పంచుకున్న విషయాలేంటి? పుష్పక విమానంలో ఎవరెవరు అయోధ్యకు చేరుకున్నారు - వంటి మధురమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6D9Vuf63rNc ]


తాము అయోధ్యకు పయనమవ్వడానికి ప్రయాణ సాధనం ఏదైనా ఉన్నదా? అని రాముడు విభీషణుడిని అడగగా, విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు ఆ విమానాన్ని ఎక్కిన తరువాత వానరులతో, "మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను" అని చెప్పగా వారందరూ, "మిమ్మల్ని విడిచి మేము ఉండలేము. మేము కూడా మీతో అయోధ్యకు వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. మిమ్మల్ని కన్న కౌసల్యా మాతను ఒకసారి దర్శించుకోవాలని ఉంది. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది" అని అన్నారు. విశాల హృదయుడైన రాముడు సరే అనేసరికి, అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది.

రాముడు సీతమ్మకు పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ, "సీతా, ఇదిగో ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం. అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం. ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువును మేము వానరులతో కలసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని, ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని ఎంతో ఆలోచించాము. ఇదే కిష్కింధ. ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకూ నీ జాడను కనిపెట్టడానికి బయలుదేరారు" అని చెప్తుంటే, సుగ్రీవుడు గబగబా వచ్చి, "రామ! మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తారా, రుమా చూస్తుంటారు. వాళ్ళని కూడా ఎక్కించుకుందాము" అన్నాడు. రాముడు సరేనని ఒప్పుకోవడంతో, పుష్పకవిమానాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి, తార, రుమలకు విషయాన్ని చెప్పి, రమ్మన్నాడు.

అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్ళి "రండి, రండి. సుగ్రీవుడు జయాన్ని సాధించి, రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి" అని చెప్పింది. అప్పుడు అక్కడున్న ఆడ వానరులందరూ మానవ కాంతలలాగా  కామరూపాలను పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసి లోపలికి ఎక్కి, "సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ?" అని అడిగారు. "ఆవిడే సీతమ్మ" అని చూపిస్తే, అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకుని, పలకరించింది.

మళ్ళి రాముడు సీతతో "సీత, అదే ఋష్యమూక పర్వతం. అక్కడే నేను, సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావా సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం.  అక్కడే రావణుడు నిన్ను అపహరించాడు" అని రాముడు చెబుతుంటే, సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది. ఇంకా కొంత ముందుకు వెళ్ళాక, అదే అగస్త్య మహర్షి ఆశ్రమం. అక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. ఆ పక్కన కనపడుతున్నది చిత్రకూట పర్వతం. అక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము" అన్నాడు. అలా రాముడు పుష్పకవిమానంలో ప్రయాణం చేస్తున్నంత సేపు, సీతమ్మకు దారి పొడవునా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ, అక్కడ జరిగిన సంఘటనలు వివరించాడు.

అలా ఆ పుష్పక విమానం కొంత ముందుకు వెళ్ళాక, వాళ్ళకి భరద్వాజ మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పక విమానాన్ని అక్కడ దింపి, భరద్వాజుడికి నమస్కరించారు వాళ్ళు అందరూ. భరద్వాజ మహర్షి రాముడిని చూసి సంతోషిస్తూ, "రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలాలలో నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం నాకు తెలుసు. ఈ ఒక్క రాత్రి నా ఆశ్రమంలో ఉండి విశ్రాంతి తీసుకుని, నా ఆతిధ్యం స్వీకరించిన తరువాత నువ్వు బయలుదేరు" అని అన్నాడు. అప్పుడు రాముడు భరద్వాజుడి మాట కాదనలేక, అక్కడ ఉండటానికి నిర్ణయించుకున్నాడు. తరువాత  హనుమంతుడిని పిలిచి, 'హనుమ! నువ్వు ఇక్కడినుండి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు. అతను నాకు మిక్కిలి స్నేహితుడు. గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. ఆ పని అయిపోయిన తరువాత అక్కడినుండి బయలుదేరి, అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా లేదా? అని కనుకకుని, నందిగ్రామానికి వెళ్ళు. అక్కడ అందరితో నేను తిరిగి వస్తున్నానని చెప్పు. ముఖ్యంగా భరతుడికి అదే మాట చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు.

భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే, వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను. భరతుడు అయోధ్యను పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా" అన్నాడు. వెంటనే హనుమంతుడు అక్కడి నుండి బయలుదేరి గుహుడిని కలుసుకుని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుండి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకుని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలను వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.

మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భరద్వాజుడు రాముడితో, "రామా!! నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో" అని అన్నాడు. అప్పుడు రాముడు, "వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుండి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకు ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా, చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి. ఇలా నాకు వరం ఇవ్వండి" అని అడిగాడు. భరద్వాజుడు రాముడు అడిగినట్టు వరం ఇవ్వగానే, భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని, కోలాహలంతో నందిగ్రామానికి చేరుకున్నాడు రాముడు. అప్పుడు భరతుడు తన సైనికులతో "రాముడు వచ్చేస్తున్నాడు. అయోధ్యలో ఉన్న తల్లులను తీసుకురండి. రథాలని తీసుకురండి. పెద్దవాళ్ళని తీసుకురండి. అందరినీ అయోధ్యకు రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుండి అయోధ్యకు పట్టాభిషేకానికి తీసుకువెళదాము" అని భరతుడు ఆజ్ఞాపించాడు.

రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు, పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. అలా రాముడి రాక అయోధ్యకు కొత్త కాంతి తీసుకొచ్చింది. రాముడు పుష్పక విమానం నుండి కిందకి దిగగానే, భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అన్నగారి పాదాలకు పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల నుండి నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకుని, "ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుండి, మనం అయిదుగురన్నదమ్ములము సుగ్రీవ" అని అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదనుడూ, మైందుడూ మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలతో, "మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు. మీకు ఋణపడి ఉన్నాం" అని అందరినీ కౌగలించుకున్నాడు. పుష్పకం నుండి కిందకి దిగిన వానరకాంతలు, అక్కడున్న ఆడవారి రూపాలనూ, వారి అలంకారాలనూ చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు వారందరితో, "ఈ వానర కాంతలందరికీ మేమే తలస్నానాలు చేయిస్తాము" అని వాళ్ళందరికీ చెప్పి తలస్నానాలు చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది.

భరతుడు తలవంచి నమస్కారం చేసి రాముడితో, "అమ్మ కైకేయి ఆనాడు రెండు వరాలడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయావు. నీ పాదుకలను వ్యాసంగా ఇచ్చి, నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకువచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు. ఇవ్వాళ నేను దానిని నీకు అప్పగించేస్తున్నాను" అని అన్నాడు. భరతుడి మాటలకు సంతోషించిన రాముడు, తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి, "అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను. నీ జుట్టు జటలు పట్టేసింది కదా, అందుకని క్షుర కర్మ చేయించుకో" అని అన్నాడు. అప్పుడు రాముడు, "నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని, నా అంతట నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కానీ, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నా మీద ఉన్న  ప్రేమ చేత, స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలను తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యము మీద  మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు, ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప, నేను దీక్షని విరమించను" అని అన్నాడు.

భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక, రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకుని, దివ్యాభరణములను ధరించి బయటకు వచ్చాడు. తన కొడుకు ఇన్నాళ్ళకు తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి, సీతమ్మకు అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి, చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయిల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు, 9000 ఏనుగులను ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగును తీసుకు వచ్చి, దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకు బయలుదేరారు. మరి అయోధ్యలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది? ఎవరెవరు పాల్గోన్నారనేటటువంటి రసరమ్య ఘట్టాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందము..

జై శ్రీరామ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home