శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 2 Coronation of Lord Rama in Ayodhya - Shri Rama Pattabhishekam
శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 2
ఆనాడు శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగింది? ఈనాడు ప్రాణ ప్రతిష్ట సమయంలో మనం ఏం చేయాలి?
యావత్ భారత దేశం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టానికి చేరుకున్నాం. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో ముగ్ధ మనోహరుడైన బాల రాముడు కొలువు దీరుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామాలయ విశిష్టతలేంటి? వేల ఏళ్ళ క్రితం నాటి రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది? రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున మనం చేయవలిసిన కార్యాలేంటి? అనేటటువంటి విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/WJxFJo2M8QU ]
రాముడు లంక నుండి సీతా దేవిని తీసుకుని పుష్పక విమానంలో, భల్లూక, వానరుల సమూహంతో అయోధ్యలోని నందిగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ నుండి రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, సూర్యమండల సన్నిభమైన రథాన్ని ఎక్కి పట్టాభిషేకానికి బయలుదేరాడు. ఆ రథం యొక్క పగ్గాలను భరతుడు పట్టుకుని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగును పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు, మరొకపక్క విభీషణుడు వింజామర వీస్తున్నారు. అలా రథంలో అయోధ్యకు వెళుతున్న రాముడు, కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. రాముడు అందరితో కలిసి ఊరేగింపుగా, నందిగ్రామం నుండి అయోధ్యకు వెళుతుంటే, అయోధ్యలో ప్రతి ఇంటిమీదా పతాకాలు ఎగురవేశారు. అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు. అందరూ సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ వెళుతున్నారు. అలా వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి. ఆ వెనుక వేద పండితులు నడిచారు. తరువాత పెద్దలు, వాళ్ళ వెనుక కన్నె పిల్లలు. కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ అక్కడికి వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు.
ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక, మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలూ, 500 నదుల జలాలనూ వానరులు తీసుకొచ్చారు. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలను రాముడికి బహూకరించాడు. వానరులు తీసుకొచ్చిన ఆ జలాలను రాముడి మీద పోసి, ఆయనకు పట్టాభిషేకం చేశారు. అప్పుడే కిరీటాన్ని తీసుకు వచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలూ, లక్షల ఆవులూ, వేల ఎద్దులనూ దానం చేశాడు.
తిరిగి ఇన్ని వేల సంవత్సరాల తరువాత, అయోధ్యలో బాల రాముడి పట్టాభిషేకం కన్నుల పండువుగా జరగుతోంది. ఆనాడు అయోధ్య ప్రజలు రాముడి రాక కోసం ఎదురుచూసిన విధంగా, నేడు భరత జాతి యావత్తూ రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తోంది. సర్వాంగ సుందరంగా, ఎన్నో ప్రత్యేకతలతో నిర్మింపబడిన రామ మందిరం, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా నిలువనుంది. ప్రస్తుతం కంబోడియా అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత స్థానంలో, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఉంది. ఇప్పుడు అయోధ్యలోని రామాలయం, మూడవ అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం, అయోధ్య రామ మందిరం. ఈ రామమందిరాన్ని సంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు. ఈ ఆలయం, 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది. మందిరాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు, 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రామాలయంలో మొత్తం 392 స్తంభాలూ, 44 గేట్లూ ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు, ఐదేళ్ల బాలరాముడిగా దర్శనమివ్వనున్నాడు.
ఆలయంలో మొత్తం 5 మండపాలున్నాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపం. రామాలయంలోని మొత్తం గోడలూ, స్తంభాలపై, అనేక రకాల దేవతామూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రీకరించారు. ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో, దీర్ఘచతురస్రాకారంలో ప్రహరీని నిర్మించారు. నాలుగు మూలల్లో నాలుగు దేవాలయాలను నిర్మించారు. వీటిలో సూర్యభగవానుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తర భుజంలో అన్నపూర్ణ ఆలయం, దక్షిణం వైపు ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి అయిన సీతా కూపం ఉంది. మందిర సముదాయంలో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరి మాత, అహల్య దేవిల మందిరాలను చూడొచ్చు. నైరుతి భాగంలో నవరత్న కుబేరు తిలపై, పురాతన శివాలయం పునరుద్ధరించబడింది. అక్కడ జటాయువు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇంత విశాలమైన ఈ ఆలయాన్ని, ఇనుము వాడకుండా, ప్రత్యేక శిలలతో అత్యంత సుందరంగా నిర్మించారు. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీటును వాడలేదు. భూమిలోని తేమతో, ఆలయానికి భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, 21 అడుగుల ఎత్తున గ్రానైట్‌తో పునాదిని నిర్మించారు.
దేశం నలు మూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. రిక్టర్ స్కేల్‌పై 10 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చినా, మరే విధమైన ప్రకృతి విపత్తులు వచ్చినా, కనీసం 2,500 సంవత్సరాల పాటు తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. ఆయోధ్య రామాలయ ప్రాంగణంలో, 27 నక్షత్రాలకు సూచికగా, 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్నీ, రాశినీ అనుసరించి, ఆయా చెట్ల కింద కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కోసమే, ఈ వాటికను ఏర్పాటు చేశారు.
నాడు వానరులు 500 నదులూ, 5 సముద్రాల నుండి తెచ్చిన జలాలతో, రాముడి పట్టాభిషేకాన్ని నిర్వహించారు. నేడు వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఏడు ఖండాలలోని 115 దేశాలలో ప్రవహించే నదులూ, సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాన్ని, 2,587 ప్రాంతాల నుంచి తెప్పించిన మట్టినీ, రామాలయ నిర్మాణంలో వినియోగించారు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలో, మూల విరాట్‌పై సూర్య కిరణాలు పడినట్లుగా, రామ మందిరంలోని బాల రాముడి విగ్రహం మీద, శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా, అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. ఇలా ఎన్నో విశిష్టతలతో నిర్మింపబడిన ఈ ఆలయంలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం, మేష లగ్నంలో అభిజిత్ ముహుర్తంలో జరగబోతోంది. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహుర్తం. అయితే ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే, ప్రపంచంలోనే మన దేశ కీర్తి మరింత పెరుగుతుంది. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో మనమందరం ప్రత్యక్షంగా పాల్గోనే అవకాశం లేకపోవచ్చు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు శ్రీ రాముడి అక్షతలను పంపిణీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్యలోని రామ మందిరంతో పాటు, ప్రతీ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిలో పాల్గోనే అవకాశం ఉన్నవారు, ఆలయంలో రామ నామ స్మరణ చేస్తూ రాముల వారి కృపకు పాత్రులు కావచ్చు. ఇన్నేళ్ళ మనందరి కల తీరబోతున్న వేళ సాయం సమయంలో, ప్రతీ ఇంట్లో దీప కాంతిలో దీపావళి శోభ కనువిందు చేయబోతోంది. ప్రతి ఇంట్లో 5 దీపాలను వెలిగించి, మన ఇంటికి కూడా రాముల వారిని ఆహ్వానిద్దాము.
జై శ్రీరామ!
Comments
Post a Comment