భోగి పండుగ 2024


అందరికీ 'భోగి పండుగ' శుభాకాంక్షలు 🙏

[ భోగి రోజు ఇలా చేస్తే ఇంటి నిండా సిరులే: https://youtu.be/jkmkEU3i8yg ]


సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది. భోగి రోజున ఇంటి ముందు మంట వేస్తే, ఇంట్లో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు జామున భోగి మంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో, పిల్లలు హుషారుగా ఉంటారు. 'భగ' అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం.

భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ, చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రేగి పళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగి పళ్ళలో చేమంతి, బంతి పూరేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు కలిపి, పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ రంగనధాస్వామిలో గోదా దేవి లీనమై, భొగాన్ని పొందిందనీ, దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనీ పురాణ గాధ. అయితే, చాలా మంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యం కోసం కూడా.

ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన, గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మ క్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి, అతి శక్తివంతమైనది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి, శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఇక ఆధ్యాత్మిక పరంగా, ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి  భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు. మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలను. అప్పుడే మనకున్న పీడ పోయి, మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది. భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు, నువ్వుల లడ్లు, జంతికలు, చక్కలతో పాటు, రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో, మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది.

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home