భౌతిక జ్ఞానం! భగవద్గీత Bhagavad Gita Chapter 18
భౌతిక జ్ఞానం!
భగవత్ కృపతో పొందవలసిన ‘ఆధ్యాత్మిక జ్ఞానము’ను కొని, అమ్మగలమా?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (71 – 74 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 71 నుండి 74 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/PfGzGGEorXI ]
పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకాలకు చేరుకోవడానికి మార్గం ఏంటో చూద్దాము..
00:49 - శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః ।
సోఽపి ముక్తః శుభాల్లోకాన్ ప్ర్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ।। 71 ।।
శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.
శ్రీ కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగిన ఈ సంభాషణను అర్థం చేసుకునే వివేక సామర్థ్యము అందరికీ ఉండకపోవచ్చు. అటువంటి వారు కేవలం శ్రద్ధావిశ్వాసముతో దీనిని కేవలం విన్నా సరే, వారు కూడా లాభపడతారని, శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు. వారిలోనే స్థితమై ఉన్న భగవంతుడు, వారి నిష్కపటమైన ప్రయాస గమనించి, వారిని తగిన రీతిలో సత్కరిస్తాడు. జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యుడు, సనందుడి గురించిన ఒక కథ, ఈ విషయాన్ని చక్కగా వివరిస్తుంది. సనందుడు అంతగా చదువు రాని వాడు. గురువు గారి ఉపదేశాన్ని, ఇతర శిష్యులలా అర్థం చేసుకోలేక పోయేవాడు. కానీ, శంకరాచార్యుల వారు ప్రవచనం చెపుతుంటే, అత్యంత శ్రద్ధతో, మరియు గొప్ప విశ్వాసంతో వినేవాడు. ఒక రోజు అతను, గురువు గారి బట్టలను నదికి ఆవలి ఒడ్డున ఉతుకుతున్నాడు. ఉపదేశం చెప్పే సమయం అయింది. ఇతర శిష్యులు గురువుగారిని, ఉపదేశం ప్రారంభించమని అభ్యర్థించారు. శంకరాచార్యులు, ‘కాసేపు ఆగుదాము. సనందుడు ఇక్కడ లేడు.’ అని బదులిచ్చారు. ‘కానీ గురువుగారూ, అతనికేమీ అర్థం కాదు’ అని అభ్యర్థించారు మిగతా శిష్యులు. ‘అది నిజమే; కానీ అతను అత్యంత శ్రద్ధావిశ్వాసంతో వింటాడు. కాబట్టి అతనిని నిరాశ పరచదలుచుకోలేదు’, అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత శ్రద్ధ యొక్క మహిమను చూపించటానికి శంకరాచార్యుల వారు, ‘సనందా! దయచేసి ఇలా రా.’ అని పిలిచారు. గురువు గారి మాటలు విన్న సనందుడు ఏమాత్రం సంకోచించలేదు. నీటిపైనే పరిగెత్తాడు. ఆయన పాదాలు పెట్టిన చోటల్లా, తామర పూవులు పైకొచ్చి ఆయనకు ఆధారంగా నిలబడ్డాయి. అలా, ఆవలి ఒడ్డుకి వెళ్లి, గురువు గారికి నమస్కరించాడు. అదే సమయంలో, చక్కటి సంస్కృతంలో, ఒక గురు స్తుతి ఆయన నోటినుండి వెలువడింది. మిగతా శిష్యులు దీనిని వింటూ ఆశ్చర్యానికి గురయ్యారు. తామర పూవులు ఆయన పాదాల క్రిందకు వచ్చాయి కాబట్టి, ఆయన పేరు ‘పద్మపాదుడు’ అయింది. అంటే, పాదముల క్రింద తామర పూవులుగలవాడని అర్థం. ఆయన శంకరాచార్యుల వారి నలుగురు ప్రధాన శిష్యులలో ఒకడయ్యాడు. మిగతా వారు - సురేశ్వరాచార్య, హస్తామలక, మరియు త్రోటకాచార్య. ఈ విధంగానే, శ్రద్ధగా ఈ పవిత్ర సంభాషణను కేవలం విన్న వారు కూడా, క్రమక్రమంగా పరిశుద్ధి అవుతారని, ఈ పై శ్లోకములో శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు.
03:47 - కచ్చిదేతఛ్చ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ ।। 72 ।।
ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?
శ్రీ కృష్ణుడు అర్జునుడి గురువు స్థానములో ఉన్నాడు. గురువు గారు సహజంగానే, తన శిష్యుడు విషయాన్నంతా బాగా అర్థం చేసుకున్నాడా లేదా అని అడుగుతాడు. ఇలా అడగటం వెనుక ఉన్న కృష్ణుడి ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ అర్జునుడు గనక అర్థం చేసుకోలేకపోతే, తను మళ్ళీ చెప్పటానికి, లేదా ఇంకా అర్థ వివరణ చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలియచేయటమే. ఆ ఉద్దేశ్యంతోనే, అర్జునుడిని శ్రీ కృష్ణుడడుగుతున్నాడు. నేను చెప్పిన విషయాలను ఏకాగ్రతతో విన్నావా? నీ మనస్సును అలుముకున్న చీకటి తొలగిపోయిందా? అని..
04:44 - అర్జున ఉవాచ ।
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ।। 73 ।।
అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ అచ్యుతా, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది. నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు. నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
ప్రారంభంలో, అర్జునుడు ఒక విస్మయ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితిలో తన కర్తవ్యము పట్ల అయోమయానికి గురయ్యాడు. అతనిలో దుఃఖము, శోకముచే నిండిపోయి, ఆయుధాలు విడిచి, తన రథంలో కూలబడిపోయాడు. తన శరీర ఇంద్రియములపై దాడి చేసిన శోకానికి, ఎటువంటి ప్రత్యుపాయం దొరకడంలేదని ఒప్పుకున్నాడు. కానీ, ఇప్పుడు తనకు తానే పూర్తిగా మారిపోయినట్లుగా తెలుసుకున్నాడు. తనకు జ్ఞానోదయమయినదనీ, ఇక ఏమాత్రమూ గందరగోళమైన చిత్తము లేదనీ, ప్రకటిస్తున్నాడు. భగవత్ సంకల్పానికి తనను తాను అర్పించుకుని, ఇక శ్రీ కృష్ణుడు చెప్పిన విధంగా చేస్తానని ప్రకటిస్తున్నాడు. ఇదే అతనిపై భగవత్ గీత ఉపదేశం చూపిన ప్రభావము. కానీ, త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత, అంటున్నాడు. అంటే, ‘ఓ శ్రీ కృష్ణా, కేవలం నీ ఉపదేశం కాదు. నిజానికి నీ కృపయే నా అజ్ఞానమును తొలగించినది.’ అని వక్కాణిస్తున్నాడు. భౌతిక జ్ఞాన సముపార్జనకు, కృప అవసరం లేదు. మనం ఓ విద్యాలయానికి కానీ, ఉపాధ్యాయునికి కానీ డబ్బు కట్టి, ఆ జ్ఞానమును తెలుసుకోవచ్చు. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానమును కొనలేము, అమ్మలేము. అది కృప ద్వారా ఇవ్వబడుతుంది, విశ్వాసము, వినమ్రత ద్వారా అందుకోబడుతుంది. కాబట్టి, మనం భగవద్గీతను అహంకార దృక్పథంతో చేరి, నేను చాలా తెలివిగలవాడిని, ఈ ఉపదేశం యొక్క విలువ ఏమిటో వెలకడతానని అనుకుంటే, భగవద్గీతను ఎన్నటికీ అర్థం చేసుకోలేము. అలాంటి దృక్పథంలో ఉంటే, మన బుద్ధి ఆ శాస్త్రములో ఏదో తప్పు అనిపించే దానిని పట్టుకుని, దాని మీదే అలోచించి, దాని వల్ల ఆ మొత్తం శాస్త్రాన్నే తప్పని తిరస్కరిస్తుంది. భగవద్ గీతపై ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి. గత ఐదు వేల సంవత్సరాలలో, ఈ దివ్య ఉపదేశం యొక్క అసంఖ్యాకమైన పాఠకులు కూడా ఉన్నారు. కానీ, వీరిలో ఎంతమందికి అర్జునుడిలా జ్ఞానోదయమయింది? ఒకవేళ మనం నిజంగా ఈ జ్ఞానాన్ని అందుకోదలిస్తే, మనం కేవలం చదవటమే కాదు, విశ్వాసము మరియు ప్రేమయుక్త శరణాగతి ద్వారా, శ్రీ కృష్ణుడి కృపను ఆకర్షించాలి. ఆ తరువాత మనకు భగవత్ గీత యొక్క సారాంశము, ఆయన కృపచే అర్థమవుతుంది.
07:35 - సంజయ ఉవాచ ।
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః ।
సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్ ।। 74 ।।
సంజయుడు ఇలా అంటున్నాడు: ఈ విధంగా నేను, వాసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికీ, మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే, నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
ఈ విధంగా సంజయుడు, ధృతరాష్ర్ట మహారాజుకు భగవద్గీత అనే దివ్య ఉపదేశమును విన్నవించుటను ముగిస్తున్నాడు. అర్జునుడిని మహాత్ముడని అంటున్నాడు. ఎందుకంటే, అతను శ్రీ కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని, మరియు సలహానూ పాటించాడు. దానిచే మిక్కిలి వివేకవంతుడయినాడు. సంజయుడు ఇక ఇప్పుడు, ఆ దివ్య సంవాదమును వింటూ, తాను ఎంత ఆశ్చర్యానికీ, మరియు సంభ్రమానికీ గురయ్యాడో చెబుతున్నాడు. రోమాలు నిక్కబొడుచు కోవటం అనేది, గాఢమైన భక్తికి ఉన్న ఒక లక్షణం. భక్తిరసామృత సింధు, ఇలా పేర్కొంటున్నది: ‘భక్తి తన్మయత్వంలో వచ్చే ఎనిమిది లక్షణాలు ఏమిటంటే: కదలిక లేకుండా స్థంభించిపోవటం, చెమట పట్టడం, రోమములు నిక్కబొడుచు కోవటం, స్వరం గద్గదమై పోవటం, వణకటం, మొఖం రంగు పీలగా అయిపోవటం, కన్నీరు కారటం, మరియు మూర్ఛ పోవటం.’ సంజయుడు ఇటువంటి గాఢమైన భక్తి యుక్త భావములను అనుభూతి చెందుతున్నాడు. అందుకే ఆయన రోమములు దివ్య ఆనందముచే నిక్కబొడుచుకున్నాయి.
09:13 - ఇక మన తదుపరి వీడియోలో, రాజ్యంలో ఉన్న సంజయుడికి, రణరంగంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోగలిగే రహస్య యోగము ఎలా లభ్యమయిందో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment