విశ్వరూపం! భగవద్గీత Bhagavad Gita Chapter 18
విశ్వరూపం!
యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా పొందబడిన ‘సర్వోన్నత యోగ శాస్త్రము’!
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (75 – 78 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 75 నుండి 78 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/jh-LR5NbMvk ]
పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకోవడానికి మార్గం ఏంటో సంజయుడి మాటలలో విందాము..
00:50 - వ్యాసప్రసాదాఛ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ।। 75 ।।
వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.
శ్రీ కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడినే మహర్షి వేద వ్యాసుడని కూడా అంటారు; ఆయన సంజయుని యొక్క ఆధ్యాత్మిక గురువు. తన గురువు గారి అనుగ్రహం చేత, సంజయుడు హస్తినాపుర రాజమందిరంలోనే కూర్చుని, కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగేదంతా తెలుసుకోవటానికి, ఆయనకు దివ్యదృష్టి ప్రసాదించబడింది. తన గురువు గారి కృప వలననే, తనకు సర్వోన్నత యోగ శాస్త్రమును స్వయంగా, యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా వినే అవకాశం లభించిందని, ఇక్కడ సంజయుడు ఒప్పుకుంటున్నాడు. బ్రహ్మ సూత్రాలూ, పద్దెనిమిది పురాణాలూ, మహాభారతము, ఇంకా ఇతర గ్రంథాలను వ్రాసిన వేద వ్యాసుడు, ఒక భగవత్ అవతారము. ఆయనకు దివ్యదృష్టి వంటి శక్తులున్నాయి. ఈ విధంగా ఆయన, కేవలం శ్రీ కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగిన సంభాషణనే కాక, సంజయుడికీ, ధృతరాష్ట్రుడికీ మధ్య జరిగిన సంభాషణను కూడా విన్నాడు. అందువలన, ఆయన భగవద్గీత లో ఈ రెండు సంభాషణలనూ పేర్కొన్నాడు.
02:14 - రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ।। 76 ।।
సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకూ, మరియు అర్జునుడికీ మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును, పదేపదే గుర్తుచేసుకుంటూ ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.
ఆధ్యాత్మిక అనుభవమనేది, సమస్త భౌతిక ఆనందాలనూ ఒక్కచోట కూర్చిన దానికన్నా ఎక్కువ హర్షమునూ, తృప్తిని కలిగించే ఆనందమునూ ఇస్తుంది. సంజయుడు అటువంటి ఆనందమును అనుభవిస్తూ, తన అనుభవాన్ని అంధుడైన ధృతరాష్ట్రునితో పంచుకుంటున్నాడు. ఈ అద్భుతమైన సంవాదమును గుర్తుచేసుకుంటూ, ఆయన దివ్య ఆనందమును అనుభవిస్తున్నాడు. ఈ గీతా శాస్త్రములో ఉన్న జ్ఞానము యొక్క మహనీయతనూ, మరియు సంజయుడు చూసిన లీలల యొక్క దైవత్వమునూ ఇది సూచిస్తున్నది.
03:11 - తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ।। 77 ।।
అలాగే, ఆ శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన, ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడనై, మహదానందముతో, పదేపదే పులకించి పోతున్నాను.
మహోన్నత యోగులకు కూడా అరుదుగా కనిపించే భగవంతుని విశ్వ రూప దర్శన భాగ్యము, అర్జునుడికి కలిగింది. అర్జునుడు, ఆయన యొక్క భక్తుడు, మరియు స్నేహితుడు. ఆయనకు చాలా ప్రియమైన వాడు కావున, తన విశ్వరూపమును చూపిస్తున్నానని, శ్రీ కృష్ణుడు చెప్పాడు. సంజయుడు కూడా ఆ విశ్వ రూపమును చూశాడు. ఎందుకంటే, భగవంతుని దివ్యలీలలలో పాలు పంచుకునే భాగ్యము, ఆయనకు కథకుడిగా లభించింది. ఊహించని భగవదనుగ్రహము, ఒక్కోసారి మన దారిలో వస్తుంటుంది. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం సాధనలో అత్యంత వేగంతో ముందుకెళ్లవచ్చు. సంజయుడు పదేపదే తాను చూసిన దానిని గుర్తుచేసుకుంటూ, భక్తి ప్రవాహంలో ఓలలాడి పోతున్నాడు.
04:20 - యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ।। 78 ।।
ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడూ, మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడూ ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యమూ, సర్వ విజయమూ, సకల-సమృద్ధీ, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.
ఈ శ్లోకంతో, ఒక గంభీరమైన ప్రకటన ఇస్తూ, భగవద్గీతను ముగించాడు. ధృతరాష్ట్రుడు యుద్ధం యొక్క ఫలితం పట్ల ఆందోళనతో ఉన్నాడు. రెండు సైన్యముల పరస్పర భౌతిక పరమైన సామర్థ్యముల లెక్కలు వ్యర్థమని, సంజయుడు అతనికి చెబుతున్నాడు. ఈ యుద్ధంలో ఒక్కటే తీర్పు ఉంటుంది - విజయం ఎల్లప్పుడూ భగవంతుడు, మరియు ఆయన శుద్ధ భక్తుడున్న పక్షానే ఉంటుంది; అదే పక్షాన, మంచితనమూ, ఆధిపత్యము, మరియు సమృద్ధి కూడా ఉంటాయి. భగవంతుడు సర్వ స్వతంత్రుడు, స్వయం సమృద్ధిగల జగదీశ్వరుడు, మరియు అర్చన-ఆరాధనలకు అత్యంత యోగ్యుడు. ఆయనకు సరితూగేవారు ఎవరూ లేరు; ఆయనకంటే గొప్పవారూ ఉండరు; తన అసమానమైన మహిమను ప్రకటించటానికి తగిన వాహకం, ఆయనకు కావాలి. ఆయనకు శరణాగతి చేసిన జీవాత్మ, భగవంతుని యశస్సును ప్రకాశింపచేయటానికి, అటువంటి ఒక చక్కటి వాహకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎక్కడైతే సర్వోత్కృష్ట పరమేశ్వరుడూ, మరియు ఆయన యొక్క పరిపూర్ణ భక్తుడూ ఉంటారో, పరమ సత్యము యొక్క తేజస్సు ఎల్లపుడూ అసత్యపు చీకటిని జయిస్తుంది. ఇంకే ఇతర ఫలితమూ ఉండజాలదు.
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే మోక్ష సన్యాస యోగోనామ అష్టాదశోధ్యాయ:
06:17 - శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పద్దెనిమదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగంలోని, 78 శ్లోకాలూ సంపూర్ణం. భగవద్గీతలోని 18 అధ్యాయాలూ, 18 యోగాలలో ఉన్న మొత్తం 701 శ్లోకాలు పూర్తయ్యాయి. స్వయానా భగవంతుడు వివరించిన ఆత్మజ్ఞానం, కర్మజ్ఞానం గురించీ, భగవద్గీతలోని అంతరార్థం గురించీ, ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలనే కోరికతో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించినందుకు, కృతజ్ఞతాభివందనాలు..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment