Brahmastra on a crow | కాకి మీద బ్రహ్మాస్త్రం!
కాకి మీద బ్రహ్మాస్త్రం!
లంకలో సీతమ్మ హనుమకు చెప్పిన కాకాసుర వృత్తాంతం!
రామాయణం గురించి మనలో చాలామందికి తెలుసు. శ్రీ రామ చంద్రమూర్తికి సతి అయిన సీతా దేవిని, మాయావి రావణాసురుడు అపహరించి లంకలో బంధించడం, రామ దూతగా హనుమ వెళ్లి సీతమ్మను కనుగొనడం, తరువాత రాముడు వానర సైన్యంతో వారధిని నిర్మింపజేసి, రావణాసురుడితో యుద్ధం చేసి, సీతమ్మను తిరిగి తీసుకురావడం.. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసిన రామాయణ ఘట్టాలే. హనుమ సప్త సముద్రాలనూ దాటి, సీతమ్మను చేరుకున్న తరువాత జరిగిన సంభాషణ, రామాయణంలో రసరమ్యభరితం. వాటిలో, సీతా దేవి హనుమకు వివరించిన కాకాసుర వృత్తాంత సంఘటనను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Vgn-qemaUEA ]
రాముడి గుణగణాల గురించీ, రాముడి రూపం గురించీ ఎంతో గొప్పగా చెప్పి, రాముడు సీతమ్మకు ఇవ్వమన్న ఉంగరాన్ని, హనుమంతుడు ఆ తల్లికి ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే, సీతమ్మ ఎంతో సంతోషపడింది. సాక్షాత్తూ రాముడిని చూసినంత ఆనందం పొందింది. తరువాత హనుమంతుడు సీతమ్మతో, "యజ్ఞములో వేసిన హవిస్సును హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పవిత్రంగా తీసుకెళతాడో, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో" అని అన్నాడు. హనుమంతుడు సీతమ్మను వీపు మీద కూర్చోమని అడిగేసరికి, "నన్ను క్షేమంగా రాముడి దగ్గరికి నువ్వు తీసుకువెళ్ళగలవు. కానీ నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప, వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి, నా చెయ్యి పట్టుకుని, ఈ సముద్రాన్ని దాటించాలి" అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, "ఒక మనుష్య స్త్రీగా ఉండి, ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా 'నేను రాను' అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా! పోనీ రాముడి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడానికి, ఏదైనా ఒక విషయం చెప్పు తల్లి" అని అన్నాడు.
అప్పుడు సీతమ్మ, "ఒకనాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని, అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో, ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద, మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకుని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, నా పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో నేను కొన్ని ఒరుగులను అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు, సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి, ఆ ఒరుగులను తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డను తీసి, ఆ కాకి మీదకు విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో పొడిచి, నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన, నా వడ్డాణం జారింది. నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకు విసరబోతే, రాముడు నన్ను చూసి నవ్వి, 'సీత! కాకి మీదకు బంగారు వడ్డాణం విసురుతావా' అని అన్నాడు.
తరువాత నేను ఆ బాధను ఓర్చుకుని, రాముడి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకుని ఉన్నంతసేపు, ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి, రాముడి నుదిటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిదని చూసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది.. "ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు?" అని గద్దించాడు. దానికి అర్థం, సీతమ్మను పంచముఖ గాయత్రిగా రాముడు అభివర్ణించాడు. అప్పుడాయన చుట్టూ చూసేసరికి, ముక్కున నెత్తురంటిన మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో, ఒక కాకి కనపడింది.
రాముడు అక్కడ ఉన్న ఒక గడ్డిపోచను తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి మూడు లోకములు తిరిగి, అందరి దగ్గరికీ వెళ్ళింది. కానీ, అందరూ రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే, మేము రక్షించలేము. నువ్వు వెళ్ళిపో అని అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకీ తిరిగి తిరిగి, రాముడున్న చోటకి వచ్చి, నమస్కారం చేస్తూ పడిపోయింది. రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక, నువ్వు నాకు శరణాగతి చేసినట్టే. అందుకు నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ, ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత, ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చేయ్యాలి. మరి నువ్వు ఏమిస్తావు?' అని రాముడు ఆ కాకసురుడిని అడిగాడు. అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నును బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి, రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు, ఇవేళ ఎందుకూరుకున్నాడో ఆలోచించమని, ఒకసారి రాముడికి చెప్పు" అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకు చెప్పింది.
సీతమ్మ హనుమంతుడితో కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన తరువాత, "శత్రువులను సంహరించే సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వలన చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్యా దేవి, లోకమునంతటినీ రక్షించే కొడుకును కన్నది. ఆ రాముడి పాదాలకు తలవంచి, భక్తిగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా, రాముడు ఆ బాధను పొందలేదంటే, లక్ష్మణుడు పక్కన ఉండడమే అందుకు కారణం. వదినను తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు, లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు. ఆ లక్ష్మణుడిని కుశలం అడిగానని చెప్పు. సుగ్రీవుడినీ కుశలమడిగానని చెప్పు. హనుమా! నువ్వు రాముడి దగ్గర చెప్పే మాటలను బట్టి, రాముడికి నామీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. కాబట్టి, నువ్వు రాముడి దగ్గర ఇక్కడ జరిగింది మొత్తం వివరంగా చెప్పి, రాముడు నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి" అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, "అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు. దీనితో పాటుగా, ఇంకొక జ్ఞాపకం ఏదైనా ఇస్తావా? తీసుకువెళతాను! దానిని చూపించి, రాముడికి జరిగింది మొత్తం వివరంగా చెబుతాను" అని అన్నాడు.
అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకు కట్టి ఉన్న మూటను విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు మీద, మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు. అప్పుడు రాముడికి ఒకే సమయంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు. ఒకరు మా అమ్మ, రెండు దశరథుడు, మూడు నేను. ఇలా రాముడికి ముగ్గురం జ్ఞాపకం వస్తాము" అని అన్నది. హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకు అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకు విశేషమైన శక్తీ, ధైర్యం వచ్చాయి. ఆ తరువాత సీతమ్మ హనుమంతుడితో, "హనుమా! నీకు ఇంకొక విషయం చెబుతాను విను. ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో, నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలను అరగదీసి, నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి" అని చెప్పింది సీతమ్మ. రామాయణంలోని ఈ ఘట్టంలో, సీతా దేవి తన శ్రీరాముడి కోసం ఎదురుచూస్తూ పడిన వేదన, ప్రతి సందర్భంలోనూ ప్రస్ఫుటిస్తుంది.
జై శ్రీరామ!
Comments
Post a Comment