భూమండలాన్ని గడగడలాడించిన రాముడి ఆగ్రహం! Ramayana


భూమండలాన్ని గడగడలాడించిన రాముడి ఆగ్రహం!
రాముడు లంకకు ప్రయాణమై సముద్రం దగ్గరకు చేరుకున్న తరువాత ఏం జరిగింది?

రాముడు లేని రామాయణం లేదు. మనుష్యరూపంలో సంచరించిన దైవం ఆ రామచంద్ర ప్రభువు. అవతారపురుషుడు అయ్యివుండి కూడా, సామాన్య మనుష్యులు అనుభవించే కర్మఫలాలను చిరునవ్వుతో స్వీకరించాడు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యంలో గమనిస్తే, రాముడి పాత్రకు ఎంత ప్రత్యేకత ఉంటుందో, రావణుడు సీతమ్మను అపహరించిన సమయంలో ఆయనకు సహయం చేసిన వానర వీరుల పాత్రలకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ఆ సమయంలో రాముడికి సహయం చేసిన హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మాత్రమే మనలో చాలామందికి తెలిసి వుంటుంది. కానీ, రామసేతును నిర్మించడంలో అతి ముఖ్యుడైన నీలుడి గురించి, రామాయణాన్ని పఠించిన అతి కొద్ది మందికి మత్రమే తెలుసని చెప్పవచ్చు. నీలుడు రామసేతు నిర్మాణంలో ముఖ్యుడు ఎలా అయ్యాడు? రాముడి కోసం సముద్రుడి సహకారం ఏమిటి? రాముడి ఆగ్రహానికి సముద్రుడు ఎలా కారణమయ్యాడు? రాముడు లంకను చేరడానికి సముద్రం వద్దకు చేరుకున్న తరువాత, అక్కడ ఎటువంటి పరాణామాలు చోటుచేసుకున్నాయి? రావణుడు పంపిన దూతలేమయ్యారు? వంటి అద్భుత ఘట్టాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gAelx7i7X24 ]


హనుమ వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చాక, రాముడు వానర సైన్యం సహాయంతో, రావణుడిపై యుద్ధానికి పూనుకున్నాడు. వారందరూ సముద్రపు ఒడ్డుకు చేరుకోగా, అక్కడకు విభీషణుడు కూడా వచ్చి, రాముడికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. అయితే, రామ సైన్యం అంతా లంకను చేరుకోవాలంటే, సముద్రాన్ని దాటాలి. దానికి తగిన పరిష్కారం కోసం ఆలోచిస్తుండగా విభీషణుడు, "సముద్రుడు రాముడి పూర్వీకుడైన సగరుడికి ఋణపడి ఉన్నాడు. అందు చేత రామకార్యం తీరుస్తాడు." అని మార్గం చెప్పాడు. ఆ మాటలకు రాముడు సముద్రతీరాన దర్భలు పరచి వాటి పైన కూర్చుని, సముద్రుడిని ధ్యానించాడు. ఈలోపు రావణుడి వేగైన శార్దూలుడనే రాక్షసుడు వానరసేన ఉన్న చోటికి వచ్చి, అక్కడి పరిస్థితులన్నీ చూసి రావణుడి వద్దకు తిరిగివెళ్ళి, “వానర, భల్లూక సేన అపరసముద్రంలాగా లంక పైకి వస్తున్నది. ఉత్తమ ఆయుధాలను ధరించిన రామలక్ష్మణులు సీత కోసం, సేనతో సహా సముద్రతీరాన ఉన్నారు. ఆ సేన యొక్క విస్తీర్ణం ఎటు చూసినా పది యోజనాలున్నది. నేనీ విషయాలు స్థూలంగా చూసి వచ్చాను. వివరంగా చూసి రావటానికి మరెవరినైనా పంపటం మంచిది” అని అన్నాడు. అప్పుడు రావణుడు శుకుడనే రాక్షసుడితో, “నీవు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి, మంచిగా ఈ మాటలు చెప్పు” అని, ఏం చెప్పాలో చెప్పి పంపాడు.

శుకుడు పక్షి రూపం ధరించి లంక నుంచి బయలుదేరి, సముద్రం దాటి వానరసేన దగ్గిరకు ఎగురుతూ వెళ్ళి, సుగ్రీవుడు మొదలైన వారి మీదుగా గాలిలోనే ఉండి ఇలా చెప్పాడు. “వానర రాజైన సుగ్రీవుడా! రావణుడు ఇలా అన్నాడు. ఉన్నత వంశంలో పుట్టిన వాడవు, మహాబలుడవు. జన్మతః నాకు బంధువువంటి వాడవు. అకారణంగా నాతో విరోధ మెందుకు? ఇందువల్ల నీకు ఒరిగేదీ, తరిగేదీ లేదు. వాలి నా స్నేహితుడు. నీవు నా తమ్ముడిలాంటి వాడవు. నేను రాముడి భార్యను తెస్తే నీకేమిటి? బుద్ధి మంతుడవు. బాగా ఆలోచించుకుని కిష్కింధకు తిరిగి వెళ్ళు. ఈ విషయంలో నీ ప్రమేయమేమీ లేదు. లంకలోకి దేవతలే ప్రవేశించలేరు గదా! నరుల మాటా, వానరుల మాటా చెప్పే దేముంది?”

ఈ మాటలు వింటూనే వానరులు ఆకాశాని కెగిరి, శుకుణ్ణి పట్టుకుని నేల మీదికి పడద్రోశారు. శుకుడు ఎలుగెత్తి, “ఓ రామా, నన్నీ వానరులు చంపేస్తున్నారు. దూతను చంపరాదు. నా ప్రభువు అనమన్న మాటలే అన్నాను గానీ, నేను సొంతాన ఏమీ అనలేదు.” అని వాపోయాడు. రాముడు జాలిపడి, దూతగా వచ్చిన వారిని అగౌరవపరచకూడదని చెప్పి, వదిలేయమన్నాడు. శుకుడు దెబ్బతిన్న రెక్కలతో ఆకాశంలోకి లేచి, “సుగ్రీవుడా, రావణుడితో ఏం చెప్పమంటావు?” అని అడిగాడు. “రావణుడితో ఇలా అన్నానని చెప్పు. ‘రాక్షసరాజా, నీవు నాకు స్నేహితుడవూ కావు, మేలుచేసిన వాడవూ కావు. నా మిత్రుడైన శ్రీ రాముడికి శత్రువువు, నా శత్రువైన వాలికి మిత్రుడవు. అందుచేత తప్పక చంపదగిన వాడవు. మేము నిన్ను సకుటుంబంగా చంపి, లంకను భస్మీపటలం చేస్తాము. అన్ని దివ్యాస్త్రాలూ తన అధీనంలో ఉన్న రాముడి బారి నుండి దేవతలు కూడా నిన్ను రక్షించలేరు. ముసలి జటాయువును చంపినట్లో, రామలక్ష్మణులు లేనప్పుడు దొంగతనంగా సీతమ్మను ఎత్తుకు పోయినట్లో కాదు. రాముడి ప్రతాపం నీకు త్వరలో తెలుస్తుంది.”అని చెప్పమని, సుగ్రీవుడు శుకుడితో అన్నాడు. అంతలో అంగదుడు సుగ్రీవుడితో, "వీడు దూతలాగా లేడు. వేగుల వాడని తోస్తున్నది. మనతో మాట్లాడుతూనే శిబిరమంతా చూశాడు. వీడిని వదలకుండా పట్టుకోండి. లంకకు పోనివ్వకండి" అని అన్నాడు. సుగ్రీవుడి ఆజ్ఞానుసారం, వానరులు శుకుణ్ణి మళ్ళీ పట్టుకున్నారు. శుకుడు మళ్ళీ ఆక్రోశిస్తూ, "ఓ రామా, దూతనైన నా రెక్కలను ఈ వానరులు విరుస్తున్నారు. కళ్ళు పీకేస్తున్నారు" అని పెద్దగా మొర పెట్టుకున్నాడు. రాముడు వానరులకు చెప్పి, శుకుణ్ణి విడిపించాడు.

తరువాత రాముడు సముద్రుడికి నమస్కరించి, చెయ్యి తల క్రింద పెట్టుకుని, సముద్రుడికి ఎదురుగా పడుకున్నాడు. రాముడలా మూడు అహోరాత్రాలు ఉపవసిస్తూ గడిపాడు. అంతకాలమూ సముద్రుణ్ణి ధ్యానించాడు. కానీ, సముద్రుడు సాక్షాత్కరించకపోయేసరికి, రాముడికి కోపం వచ్చింది. లోకంలో మంచితనం అసమర్థతగా పరిగణించబడుతుంది. సముద్రుడు తనను అలాగే భావించినట్లున్నాడు. అందుచేత రాముడు సముద్రుడికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. రాముడు దివ్యధనుస్సు తీసుకుని శరసంధానానికి ఉద్యుక్తుడవుతుండగా, లక్ష్మణుడు అన్న కోపాన్ని ఉపశమింపచేసే ప్రయత్నం చేశాడు. కోపంతోసముద్రుడిని శోషింపజేస్తే నిరపరాధులైన కోటానుకోట్ల జలజీవులు ఏమైపోతాయోనని భయపడ్డాడు. కానీ, రాముడు సముద్రుడికి గుణపాఠం నేర్పాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటానికి ధనుస్సుకు నారి బిగించి శరసంధానం చేశాడు. అప్పుడు లోకాలు సంక్షోభంలో కూరుకునిపోయాయి. సూర్యచంద్రులు గతులు తప్పారు. ఆకాశం నుంచి పిడుగుల వర్షం కురిసింది. ఉల్కలు రాలాయి. ప్రచండవాయువు వీచింది. భూమ్యాకాశాల నడుమ జ్వాలలు వ్యాపించాయి. అప్పటికే రాముడు ప్రయోగించి వదిలిపెట్టిన దివ్యాస్త్రాలతో, సముద్రం మైళ్ళ పర్యంతం వెనక్కు వెళ్లి క్షీణించి పోయింది.

రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్ర మధ్యంలోని బ్రహ్మాండమైన అలల మధ్య నుంచి సముద్రుడు, సమస్త నదులు వెంటరాగా బయటకు వచ్చాడు. సముద్రుడి దేహం వైఢూర్య వర్ణంగా ఉంది. ఎర్రని మాలలూ, బట్టలూ ధరించి, రంగురంగుల పుష్పమాలికలూ, అనేకమైన బంగారు నగలూ ధరించివున్నాడు. అతని మెడలోని ముత్యాల హారాల మధ్య, కౌస్తుభమణి యొక్క తోబుట్టువు ప్రకాశిస్తున్నది. సముద్రుడు రాముణ్ణి సమీపించి, ముందుగా తానే రాముడి పేరు స్మరించి నమస్కరించాడు. "శ్రీరామా, పంచభూతాలూ ఎలాగైతే సహజ ధర్మాలను అతిక్రమించలేవో, అలా నేనూ నా కట్టుబాటుకు బద్ధుడనై ఉన్నాను. అంతేకానీ, నీ పట్ల అగౌరవం చూపటానికో, అపరాధం చేయటానికో కాదు. అగ్నిహోత్రం చల్లగా ఉండటం ఎంత విరుద్ధమో, నేను నా అగాధత్వాన్ని పరిత్యజించటం కూడా స్వభావవిరుద్ధం కదా! నీవు లోకధర్మాన్ని స్థిరంగా అనుశాసించాలి, అనుపాలించాలి. నేను గడ్డకట్టుకుని పోవడమో, చీలిపోవడమో అనూహ్యం. అలాచేస్తే, జలచరాలన్నీ నశించిపోతాయి. అయితే రామా! నేను నీకు నా చేతనైనంతగా తోడ్పడతాను. నీ ఆజ్ఞానువర్తినై, నీ అనుగ్రహం కోరి ప్రవర్తిస్తాను. వానరులు వారధి కట్టేటప్పుడు వారికి సముద్ర ప్రాణుల భయం లేకుండా చెయ్యగలను. స్వభావ సిద్ధంగా ఎగసిపడే అలలను అణచగలను. మీరు ఈ సముద్రాన్ని దాటడంలో సహాయపడగలను. నీ సేనలో గల నలుడనే వానరోత్తముడు, విశ్వకర్మ కొడుకు. శిల్ప విద్యలో తండ్రికి ఏమాత్రమూ తీసిపోడు. అతని చేత సేతువును నిర్మింపజెయ్యి. అలాగే, వానరుల్లో నీలుడుకి ఒక శాపం ఉంది. పూర్వం మునులు నది ఒడ్డున తపస్సు చేసుకుంటుండగా, వారి వస్తువులను నీటిలో పడవేశాడు. దానితో వారు, నీలుడు నీటిలో వేసిన ఏ వస్తువైనా మునగదని శపించారు. ఇప్పుడు అదే శాపాన్ని వినియోగించుకుని, నీలుడు వారధి నిర్మాణానికి తోడ్పడగలడు." అని సముద్రుడు చెప్పి, రాముడికి వినయంగా నమస్కరించి, అంతర్ధానమయ్యాడు.

నలుడి నేతృత్వంలో కోట్లాదిమంది వానరులు అయిదు రోజులలో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. మహాకాయులైన వానరులు మొదటిరోజు పధ్నాలుగు యోజనాలు, రెండవ రోజు ఇరవై, మూడవ రోజు ఇరవైఒకటి, ఆ తరువాత రోజు ఇంకో యోజనం అదనంగా, అలా సువేలాద్రి హద్దుగా సేతువును నిర్మించారు. మహా ప్రజ్ఞాశాలి నలుడు నిర్మించిన సేతువు ఆకాశంలో స్వాతిపథంలా విరాజిల్లింది. తన తండ్రి విశ్వకర్మ కీర్తిని సార్థకంజేశాడు నలుడు. ఈ వారధిని రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటి నుంచి, శ్రీలంక దగ్గరున్న మన్నార్‌ తీరం వరకూ నిర్మించారు. సముద్రుడు ఆనాడు రాముడికిచ్చిన మాట ప్రకారమే, నేటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో అలల ఉధృతి లేకుండా, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికీ సేతువు చాలావరకూ సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంటుంది. అది రాముని స్పర్శ సోకిన నిర్మాణమే అన్న పులకింతను, మనకు నిలువెల్లా కలుగజేస్తుంది.

జై శ్రీరామ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home