సంక్రాంతి పండుగ Sankranti 2024
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏
[ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి?: https://youtu.be/itjUnux5PEE ]
ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లతో, గ్రామాలలో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే, పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. పట్టణాల నుంచి వచ్చే బంధువులకు పల్లె జనం స్వాగతం పలుకుతూ, ఆనందోత్సాహాలలో మునిగిపోతారు. చిన్ననాడు స్వగ్రామంలో తిరిగిన తీపి గురుతులను నెమరువేసుకుంటూ, అంతా పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇల్లలికి సున్నాలు వేసి, సుందరంగా అలంకరిస్తారు.
లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ, ఇంటి ముందు ఆడవారు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీ కృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జెకట్టి తంబురను మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో, హరిదాసులు చేసే సంకీర్తనలు, సంక్రాంతి పండుగవేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. హరిదాసులు శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. ఇంటి వారు ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను తీసుకుని ఇంటింటికీ తిరుగుతూ, "హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి" అంటూ ఇంటి ముందు నర్తిస్తూ, అందరినీ చల్లగా ఉండమని దీవిస్తూ గ్రామంలో తిరిగే హరిదాసులు, నేటికీ గ్రామాలలో కనిపిస్తారు. హరిదాసులు తమ తలపై ఉన్న అక్షయపాత్రను గ్రామ సంచారం సమయంలో ఎక్కడా తీసి కింద పెట్టరు. కేవలం ఇంటికి వెళ్లాక అతని భార్య మాత్రమే అక్షయపాత్రను కిందకు దించుతుంది.
ఏడాది పొడవునా ఎప్పడూ కనపడని హరిదాసులు, సంక్రాంతి పండుగ సమయంలో ధనుర్మాసం నెల రోజులపాటు మాత్రమే కనిపిస్తారు. గ్రామాలలో హరిదాసుల సందడి సూర్యోదయం తోటే మొదలవుతుంది. ఇలా నెలరోజులపాటు తిరిగి, సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని సంపాదించుకుంటారు హరిదాసులు. వీరంతా ఊరి బయటనుంచే వస్తారు. ఏడాదిలో ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో, వారు తప్ప ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో, విష్ణు భక్తులైన సాతానులు, దాసరులు, రాజులు మొదలైన వారు, ఇలా జీవిస్తూ వుంటారు.
గ్రామ వీధుల్లో హరిదాసులు ఇలా హరి భజన చేయడం కోలాహలంగా వుంటుంది. హరిదాసుడి అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి బాలబాలికలు పోటీలు పడతారు. హరిదాసులు ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని. అయినా భక్తి భావంతో అదంతా మరచిపోతారు.
హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వదినాలలో గంగిరెద్దుల వారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే రైతు కుంటుంబాలు అందరినీ ఆదరిస్తూ, సంక్రాంతి పర్వదినాలను ఆనందంగా ముగిస్తారు.
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ।
ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే ॥
Comments
Post a Comment