Science Behind Mangalsutra | మంగళసూత్రం - నూరేళ్ళ పంట!
మంగళసూత్రం! - నూరేళ్ళ పంట!
స్త్రీలు ధరించే మంగళసూత్రం వెనుకవున్న సైన్స్ మీకు తెలుసా?
హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అత్యంత ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోపాటు, ప్రాంతాలవారీగా వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం కూడా పలురూపాలలో ఉంటాయి. మనిషికి పెళ్లి ఎంత ముఖ్యమో, ఆ పెళ్లికి మంగళసూత్రమూ అంతే ముఖ్యం. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఏనాటినుంచో వస్తోంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనదనే అర్ధాలు వస్తాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని దారపు పోగులు కలిపి, దానికి పసుపు రాసి తయారు చేస్తారు. పెళ్లినాడు ఇచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులూ, ఆభరణాలన్నీ రూపాంతరం చెందినా, చివరి వరకూ వెంట ఉండేది మంగళసూత్రం మాత్రమే. అటువంటి మంగళసూత్రం గురించి మనలో చాలామందికి తెలియని, విస్మరిస్తున్న వాస్తవాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lNINMJMMhJc ]
పోతనామాత్యుల వివరణ ప్రకారం, క్షీరసాగరమధన సందర్భంలో మాంగల్య ప్రస్థావన ఇలా ఉంది.. “మ్రింగెడివాడు విభుండని, మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్, మ్రింగుమనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! హాలాహలం పొంగుకొచ్చి, లోకాలు నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడినప్పుడు, దేవతలందరూ కలసి మహేశ్వరుడికి మొర పెట్టుకున్నారు. భోళాశంకరుడు ఆ విషాన్ని మొత్తం మింగి ప్రపంచాన్ని కాపాడడానికి పూనుకుని, తన అర్థాంగి పార్వతి యేమంటుందో అని ఆమె వైపు చూశాడు. ఆమె చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలిపింది! ఇదీ సంస్కృత భాగవతంలో ఉన్న సన్నివేశం. "ఎంత దేవుళ్ళైనా, చూస్తూ చూస్తూ తన భర్త విషం తాగడానికి ఏ భార్యయినా అంగీకరిస్తుందా?" పరీక్షిత్తుకు కలిగిన సందేహానికి శుకమహర్షిచ్చిన జవాబు ఈ పద్యం. "మంగళసూత్రాన్ని నమ్మడ"మంటే తమ భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మడం! ఒకరినొకరు విడిచిపెట్టమని చేసిన ప్రమాణాలలోని సత్యాన్ని నమ్మడం! ఇక్కడ పార్వతి, "సర్వమంగళ". అంటే, పరిపూర్ణమైన శుభానికి ప్రతిరూపమే ఆవిడ. తన మాంగల్యమ్మీద అంత నమ్మకం ఉండబట్టే, ఆవిడ సర్వమంగళ అయింది. అందుకే, మింగుతున్నది తన భర్తని తెలిసీ, మింగేది విషమని తెలిసీ, ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి, మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని చెప్పగలిగింది.
“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా !
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం”
ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. దీనిని ధరించిన నువ్వు నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు. అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువగా సకల సౌభాగ్యాలతో జీవించమనే భావం స్పష్టంగా తెలుస్తుంది. దాని ఉద్దేశ్యం, నీవు దీనిని ధరించి, నా జీవితంలో అన్నింటా సగ భాగమై, నాకు తోడుగా, నీడగా ఉంటూ, మనమిద్దరమూ కలిసి, నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిద్దామని.
పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు, ఎటువంటి ఆచారాలూ, కట్టుబాట్లూ ఉండేవి కావు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలూ, థగ్గుల వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను, మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకు పోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు.. ఏ హానీ చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడింది ఈ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ, ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి, మాంగల్యం వేసే వారు.
ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన ‘సౌందర్యలహరి’లో కూడా, మంగళ సూత్రానికి విశేష విశిష్టతను కల్పించారు. అటువంటి మంగళసూత్రంలో, ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. స్త్రీ శారీరక, మానసిక రక్షణ కోరకు, మంగళ సూత్రంలో ముత్యం, పగడం వాడతారు. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండి ఎరుపు - కుజుడు, తెలుపు - చంద్రుడు స్వీకరించడం జరుగుతుంది. ఆ జంట గ్రహాలు, స్త్రీ శరీరంలోని అన్ని నాడీ కేంద్రములనూ ఉత్తేజ పరచి, శారీరకంగా, భౌతికంగా, ఆరోగ్య పరంగా స్త్రీలలో వచ్చే నష్టాలనూ, దోషాలనూ తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. చంద్ర, కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో, అలాగే ముత్యం, పగడం కలిపిన మంగళసూత్రం, స్త్రీకి అత్యంత శుభఫలితాలను అందిస్తుంది. వీటి ప్రయోజనాలను పరిశీలిస్తే, ముత్యం, పగడం ధరించిన పాత తరం స్త్రీలు, ప్రసవ సమయంలో, ఆపరేషన్ లేకుండా, సహజ సిద్ధంగా పిల్లలను కనేవారు. ఆపరేషన్ అనేది అప్పట్లో అరుదైన విషయం. కానీ, ప్రస్తుత కాలంలో కాన్పులు, సిజేరియన్ ఆపరేన్ ద్వారా జరగటం అనేది సర్వ సాధారణమై పోయింది.
ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకూ కారకుడు. శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్థనములు, స్త్రీల గుహ్యావయవములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు. పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషం వలన కలిగే ప్రభావాలు, అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యరాహిత్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘ సౌమాంగల్యలోపం, దృష్టి దోషము యిత్యాదులు, శారీకంగా ఉదరసంబంధిత ఇబ్బందులు, రక్త స్రావము, గర్భ స్రావము, ఋతు దోషములు మొదలైనవి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యాన్ని మించిన విలువగలది వేరే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించమని మన మహర్షులు చెప్పటంలో విశేష గూఢార్ధాన్ని గమనించవచ్చు.
శాస్త్ర, సాంప్రదాయ పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిష్య పరంగా, మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులనేవి, అలంకరణ కోసం మాత్రమే కాక, స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ, చక్కటి దేహ కాంతితో, ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి. ఏ విధంగా చూసినా, విలువలు తెలియని వివాహాలు శుభకరం కాకపోగా, విడాకుల వరకూ తీసుకు వెళతాయి. సాంప్రదాయ సంస్కారం లేని బంధాలలో కలతలు చోటు చేసుకుంటాయి. అలాగే, పాశ్చాత్య అనుకరణ వెర్రిలో పెడ దారి పడుతున్న మన ఆడ కూతుర్లకు మన ధర్మం గొప్పదనం, విశిష్టత అర్ధం అయ్యేలా తెలియ పరుద్దాము. సంప్రదాయాలను కాపాడుకుంటూ సంతృప్తిగా జీవిద్దాము..
Comments
Post a Comment