Story of Shanta and Rishyasringa (The Man with Horn) | ఋష్యశృంగుడు!


ఋష్యశృంగుడు!
లేడి గర్భంలో జన్మించిన ఋష్యశృంగ మహర్షి ఎవరు?

మన పురాణాలలో వివరించబడ్డ గొప్ప మహర్షులలో ఋష్యశృంగుడు ఒకడు. ఆయన అమోఘమైన విద్వత్తు కలిగినవాడు, మహనీయుడు, పూజనీయుడు. ప్రకృతి ప్రకాశకుడు, ఋష్యశృంగుడు. స్వయంగా శివుని అంశగా పురాణాలు వ్యక్తం చేస్తున్నాయి. రాముని అవతరణకు ఇతోధికంగా సహాయపడిన వాడు. ఆయన గురించి తలుచుకోవడం కూడా మన సుకృతమే.  అటువంటి పావన మూర్తి, ఋష్యశృంగుడు. ఈయన కాలు మోపిన ప్రదేశం, సుభిక్షంగా వర్థిల్లుతుంది. యవ్వనం వచ్చినా, ఆడ మగ తేడా తెలియకుండా, తండ్రి సంరక్షణలో పెరిగిన వాడు, ఋష్యశృంగుడు. ఈయన జననం, యాదృచ్ఛికంగా జరిగింది. ఋష్యశృంగుడు, తలపై కొమ్ముతో జన్మించడానికి గల కారణం ఏంటి? ఋష్యశృంగుడి తల్లి పూర్వాశ్రమ వృత్తాంతం ఏంటి? రోమపాద మహారాజు, ఋష్యశృంగ మహర్షిని ఎందుకు వంచన చేయాల్సి వచ్చింది? దశరథుని కుమార్తె, రాముడి సోదరి అయిన శాంతతో, ఋష్యశృంగ మహర్షి వివాహం ఎలా జరిగింది? అనేటటువంటి ఉత్సుకతను కలిగించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/s8PJAlHrf48 ]


కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడనే మహర్షి పుత్రుడే, ఋష్యశృంగ మహర్షి. విభాండకమహర్షి, అస్ఖలిత బ్రహ్మచారి, తపస్సంపన్నుడు. ఒకనాడాయన ఒక సరస్సులో స్నానమాచరించి, సంధ్యావందనం చేస్తున్న సమయంలో, దేవలోక అప్సరస, అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి అటుగా వెళుతూ, ఆయన కంట పడింది. ఆమె సౌందర్యానికి మనస్సు చెలించి, ఆ సరస్సులోనే స్ఖలించాడాయన. అప్పుడే ఆ నదిలో నీళ్లు తాగేందుకు వచ్చిన జింక, నీటితో పాటు, ఆయన విడిచిన వీర్యాన్ని కూడా గ్రహించింది. దాంతో గర్భవతి అయ్యింది. అయితే, ఆ జింక పూర్వాశ్రమంలో, ‘చిత్రరేఖ’ అనే అప్సరస. ఆమె నాట్యానికి వన్యమృగాలు సైతం పరవశించిపోతాయి. అలా ఒక నాడామె దేవేంద్రుని ఎదుట నాట్యం చేస్తోంది. దేవేంద్రుని మనస్సూ, చూపూ ఆమెమీదే నిలిచింది. కానీ, ఆమె మాత్రం అతన్ని చూడకుండా, ఆమె నాట్యాన్ని చూసి పరవశిస్తోన్న లేడిని చూడసాగింది. దాంతో కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు, ‘నువ్వు జింకవై, ఒక మానవ పుత్రుడికి జన్మనిచ్చెదవు గాక!’ అని శపించాడు.

అలా ఇంద్రుడి శాపం పొందిన అప్సరసే, ఈ సరస్సులో నీరు తాగిన జింక. తల్లి పోలిక పుణికి పుచ్చుకుని, ఆ జింక కడుపున ఒక శృంగము, అంటే కొమ్మును కలిగి జన్మించిన వాడు, ఋష్యశృంగుడు. దివ్యదృష్టిచేత ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్న విభాండకుడు, ఆ బాలుని తన ఆశ్రమానికి తీసుకువచ్చి, ఋష్యశృంగుడని పేరు పెట్టి, అతనికి సకల విద్యలూ, వేదవేదాంగాలూ, యజ్ఞయాగాది క్రతువులూ నేర్పాడు, తానే గురువై. అతనికి తండ్రే దైవం, ఆ ఆశ్రమమే ప్రపంచం. ఇంద్రియ విషయలోలత్వం తెలియనివాడు. కనీసం, స్త్రీ పురుషుల తారతమ్యం కూడా యెరుగనివాడు. జ్ఞాననిష్ఠ, తపస్సంపదతో జ్వలిస్తున్న అగ్ని వంటి తేజస్సుతో, ప్రకాశించేవాడు. అరికాలిలో అదృష్ట రేఖలున్నవాడు. ఆయన ఎక్కడుంటే, అక్కడ ప్రకృతి పరవశిస్తుంది. చక్కగా వర్షాలు పడతాయి. పంటలు పండి, దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది.  ఇది ఆయనకున్న వరం.

ఇదిలా ఉండగా, దశరథునికి రాములవారు జన్మించక ముందే, ‘శాంత’ అనే కుమార్తె జన్మించింది. కానీ, ఆమెను అంగదేశాధీశుడైన రోమపాదుడనే రాజుకు దత్తతగా ఇచ్చాడు, దశరథుడు. రోమపాదుడు దశరథుని స్నేహితుడు. పైగా, రోమపాదుని భార్య, కౌసల్య సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకు, తన కూతురిని దత్తత ఇచ్చారు వారు. శాంత అంగరాజ్యంలో, అపురూపమైన రాజకుమారిగా పెరగసాగింది. అస్త్ర విద్యలలోనూ, వేద వేదాంగాలలోనూ, అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి ధీటైన అందం, ఆమె సొంతం. ఒక రోజు శాంత, రోమపాదునితో కలిసి ఏదో చర్చలో మునిగిపోయి ఉండగా, ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. తను వ్యవసాయం చేయదల్చుకున్నాననీ, ఆ వ్యవసాయానికి ఏదైనా సహాయం అందించమనీ, ఆ బ్రాహ్మణుడు రోమపాదుని వేడుకున్నాడు. కానీ, కూతురితో కలసి శాస్త్ర చర్చలలో మునిగిపోయిన రోమపాదుడు, ఆ బ్రాహ్మణుని అభ్యర్థనను ఆలకించ లేదు. తన భక్తునికి జరిగిన అవమానాన్ని, దేవలోకాధిపతి ఇంద్రుడు సహించ లేక పోయాడు. అంగ రాజ్యం కరవుకాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించాడు.

ఏళ్లు గడుస్తున్నా, తగిన వర్షాలు కురవకపోవడంతో, ఏం చేయాలో అంగ వాసులకు పాలుపోలేదు. రోమపాదుడికి, ఋష్యశృంగుడిని రాజ్యం లోకి రప్పిస్తే, రాజ్యంలో వర్షాలు పడతాయని సలహా ఇచ్చారు, రాజగురువులు. కానీ, అది అంత సులువైన విషయం కాదు. ఋష్యశృంగుడు విషయలోలత్వం తెలియనివాడు. అతన్ని తండ్రి విభాండకుడు, ఆశ్రమం నుండి బయటికి పంపేందుకు ఇష్టపడడు. కాబట్టి, అది అసాధ్యమైన విషయం. దానికి తరుణోపాయం ఆలోచించి, అందమైన స్త్రీలను ఋష్యశృంగుడుండే ఆశ్రమానికి పంపించాడు, రోమపాద మహారాజు. వారు వెళ్ళిన సమయానికి, విభాండక మహర్షి అక్కడ లేడు. అదే మంచి అవకాశమని, వారందరిలోకీ అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక విలాసవతి, ఆశ్రమంలో వున్న ఋషి కమారుడి దగ్గరకు వెళ్ళింది. "మునివరా! క్షేమమా? మీకు కావలసిన కందమూలాలు లభ్యమవుతున్నాయా? మీ తపస్సు నిరాఘాటంగా కొనసాగుతోందా? వేదాధ్యయనం సక్రమంగా కొనసాగుతోందా? తండ్రిగారు ఎలా ఉన్నారు?" అని ప్రశ్నలు వేసింది.

అటువంటి సుందరాకారంలో ఉన్న మనిషిని గానీ, అలాంటి మధురస్వరం కానీ, పాపం ఋష్యశృంగుడు అంతకుమునుపెన్నడూ కనలేదు, వినలేదు. మెరుపులా మెరిసిన ఆ సుందరిని చూడగానే, ఋషి కుమారుడి మనస్సులో కలవరం మొదలైంది. అతనికి స్త్రీ పురుష భేదం తెలీదు కనుక, ఆ వచ్చింది మునికుమారుడే అనుకున్నాడు. ఆర్ఝ్యపాద్యాదులు ఇచ్చి, "మీ ఆశ్రమం ఎక్కడ? మీ వ్రత నియమాలేమిటి?" అని అడిగాడు. "మా ఆశ్రమం ఇక్కడికి మూడామడల దూరంలో వున్నది" అంటూ ఆమె తెచ్చిన భక్ష్యాలూ, పండ్లూ స్వయంగా తినిపించింది. సువాసనలు వెదజల్లే పూలహారాలు మెడలో వేసింది. అలా కొంతసేపు గడిపి, విభాండక మహాముని వచ్చేవేళకు, "అగ్నిహోత్రానికి వేళ అయింది" అని సాకు చెప్పి, తప్పించుకున్నది.

విభాండకుడు వచ్చేసరికి, ఆశ్రమం అంతా చెల్లాచెదురుగా వుంది. పూలూ, పండ్లతొనలూ, చిందర వందరగా పడి ఉన్నాయి. ఇదంతా పరికించి, "అబ్బాయీ! నేను లేని సమయంలో నీ దగ్గరకెవరైనా వచ్చారా? ఎందుకలా అన్యమనస్కంగా కనిపిస్తున్నావు?" అని అడిగాడు. "నాన్నగారూ! మీరు లేని సమయంలో, అద్భుతరూపంలో వున్న ఒక మహనీయుడు ఇక్కడకు వచ్చాడు. ఆ మాట, ఆ ఆకారం, నా మనస్సున నాటుకుపోయాయి. ఆ మూర్తిని చూడకుండా ఉండలేను. అతడితో స్నేహం చేయాలని ఉంది" అని చెప్పడు. విభాండకుడికి విషయం తెలిసిపోయింది. తమ తపస్సును భంగం చెయ్యడానికి ఎవరో రాక్షసులు వచ్చారనుకుని, "నేను లేనప్పుడు ఎవ్వరినీ ఆశ్రమానికి రానివ్వకు!" అని గట్టిగా చెప్పాడు.

ఒకనాడు మళ్ళీ విభాండకుడు లేని సమయం చూసి, ఆ సుందరి మెల్లగా ఋష్యశృంగుడిని సమీపించింది. ఆమెను చూడగానే, భరింపరాని మోహంతో, ఋషికుమారుడు ఆమె దగ్గరకు పరుగెత్తాడు. ఆ జవ్వని, మాటలతో ఋష్యశృంగుడిని మైమరపిస్తూ, మెల్లగా అడవి దాటించి, తన సఖులను కలిసింది. వారంతా కలిసి ఋష్యశృంగుడిని అంగదేశానికి తీసుకుపోయారు. ఋష్యశృంగుడు అంగదేశంలో ఆడుగు పెట్టగానే, వానలు కురిశాయి. ప్రాణికోటి సేదతీరింది. నేల పచ్చబారింది. రోమపాదుడు సంతోషించి, తన కమార్తె శాంతను ఋష్యశృంగుడికిచ్చి పెళ్ళి చేశాడు. అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ, విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డాడు రాజు. అందుకని, మునిని శాంతపరచటం కోసం, రాజధానికి వచ్చే మార్గాలలో చక్కని కర్రి ఆవులనూ, ఎద్దులనూ నిలిపి, పరిజనాన్ని కాపు ఉంచాడు."

ఈ ఆవులూ, ఎడ్లూ, మేకలూ, భూములూ, మీ కుమారుడివి. మేము మీ సేవకులము" అని వినయంగా మాట్లాడమని, భటులను హెచ్చరించాడు. అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ, మహాముని రానే వచ్చాడు. రాజాజ్ఞ ప్రకారం, పరిచారకులు మునీంద్రునికి స్వాగతం పలికి, చేయవలసిన సపర్యలన్నీ చేశారు. కోపం చాలా వరకూ చల్లార్చి, ఆయనను పట్టణంలో ప్రవేశ పెట్టారు. రాజాంతఃపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూన్న కొడుకునూ, పక్కనే వినయంగా తలవంచుకుని నిలబడ్డ కోడలినీ చూసిన విభాండక మునికి, ఆనందం కలిగింది. "నాయనా ఋష్యశృంగా! ఈ రాజుకు ప్రియమైనదంతా చెయ్యి. ఒక కుమారుడు కలిగిన తరువాత, మీరు అరణ్యాలకు రావచ్చు" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తండ్రి ఆనతి ప్రకారం ఋష్యశృంగుడు సంతానవంతుడై, ఆ వెనుక వానప్రస్థాన్ని స్వీకరించాడు. ఒకరకంగా రాములవారు అవతారం దాల్చేందుకు కూడా, శాంతే కారణం. ఎందుకంటే, అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరచుకున్న సమయంలోనే, రుష్యశృంగుడు దశరథుని చేత పుత్రకామేష్టియాగాన్ని చేయించాడు. ఆ యాగ ఫలంగానే, రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు జన్మించారు. ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని, రామాయణం లోని బాల కాండంలో, దశరథుని మంత్రి అయిన సుమంతుడు వివరించాడు.

జై శ్రీరామ!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home