వసంత పంచమి 2024
అందరికీ 'వసంత పంచమి' శుభాకాంక్షలు 🙏
చదవుల తల్లి సరస్వతీ దేవి పుట్టిన రోజు కాబట్టి వసంత పంచమిని సరస్వతీ పంచమి అని అంటారు. ఫిబ్రవరి 14వ తేదీ 2024, మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి (Vasant Panchami), శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి, స్మరించి, పూజించే రోజే వసంత పంచమి. ఆ తల్లి కటాక్షం కోసం అందరూ పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి. ఈ రోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమి అని కూడా పేర్కొంటారు.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ।।
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।।
సరస్వతీ కటాక్షం:
* బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.
* గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో, సూర్యుని ఆరాధించగా, ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహా విద్వాంసుడయ్యాడు.
* వాల్మీకి సరస్వతీ దేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేశాడని మన పురాణాలు చెబుతున్నాయి.
* అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీ దేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడనీ ప్రతీతి.
* తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్ట కూటి కోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెబుతారు.
🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏
Comments
Post a Comment