‘గరుడ పురాణం’ - గర్భస్థ శిశువు! Garuda Puranam
గర్భస్థ శిశువు! జీవిత సత్యాలు..
‘గరుడ పురాణం’ ప్రకారం తల్లి గర్భంలో శిశువు పడే ‘నరక యాతన’ తెలుసా?
మన సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తన కర్మలను అనుభవించి, తిరిగి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక ప్రాణికి జన్మనిచ్చే క్రమంలో, స్త్రీ మృత్యువు అంచులవరకూ చేరుకుని, ప్రాణికి జీవం పోస్తుంది. అందుకే మన పురాణాలు స్త్రీమూర్తికి ఎంతో ప్రాముఖ్యతనూ, వెలకట్టలేని గౌరవాన్నీ ఆపాదించాయి. కానీ, గర్భంలో ఉన్న శిశువు గురించి మనం ఏనాడైనా ఆలోచించామా! నెలలు నిండిన శిశువు గర్భంలో ఏం చేస్తుంది? చీకటి కుహరం వంటి తల్లి గర్భంలో ఆ శిశువు ఎలాంటి బాధలను అనుభవిస్తుందనే విషయాల గురించి, మనలో చాలామందికి అవగాహన లేదనే చెప్పవచ్చు. వేల ఏళ్ళ క్రితం రచించబడిన గరుడ పురాణంలో, గర్భస్థ శిశువు గురించీ, ఆ సమయంలో అది పడే బాధల గురించీ, స్పష్టంగా వివరించబడివుంది. గర్భస్థ శిశువు యొక్క అనుభవాలేంటి? చీకటి ఆగాధంలో బందీ అయిన శిశువు అనుభవించే బాధలేంటి? ప్రసూతి సమయంలో శిశువు శరీరోత్పత్తి ఎలా జరుగుతుంది? గరుడ పురాణంలో శ్రీ మహా విష్ణువు గరుడుడికి వివరించిన గర్భస్థ శిశువుకు సంబంధించిన, మనలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన నిగూఢ సత్యాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Ds4YszMGDug ]
‘పరంధామా! జీవుడు నరకం నుంచి తిరిగి జన్మఎత్తటానికి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు కదా! ఆ గర్భంలో అతడు ఎలాంటి నరక యాతనను అనుభవిస్తాడో, దయచేసి తెలియజేయండి!’ అని గరుత్మంతుడు శ్రీ హరిని ప్రార్థించాడు. అందుకు శ్రీ మహా విష్ణువు, "వైనతేయా! స్త్రీ పురుషుల సంయోగం వల్ల శుక్లశోణితాలు ఏకమై, జీవుడు ప్రాణం పోసుకుంటాడు. పాపం చేసిన జీవుడికి, ప్రసవసమయానికి మూడు రోజుల ముందే, శరీరోత్పత్తి జరుగుతుంది. ఎలాగంటే! ఇంద్రుడికి ఉన్న బ్రహ్మహత్యాదోషం, గర్భిణీ స్త్రీకి మొదటి మూడు రోజులు ఆవరించి ఉంటుంది. ఆ రోజుల్లో మొదటి రోజు స్త్రీని ఛండాలినిగా, రెండవ రోజు బ్రహ్మఘాతిగా, మూడవ రోజు, రజకి అని వ్యవహరించబడుతుంది. కాబట్టి, ఈ మూడు రోజుల్లోనే పాపాత్ములైన వారు జన్మిస్తారు.
ప్రతిజీవీ తాను చేసిన కర్మానుసారం, శరీరాన్ని పొందుతాడు. పురుషుడి వీర్యం ద్వారా స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. శుక్ల శోణితాలు రెండూ, ఒక్క రోజులో కలిసిపోతాయి. అవి అయిదు రోజులకు, నురగగా మారుతాయి. పది రోజులు గడిచేసరికి, మాంసాకారాన్ని పొంది, రేగుపండంత కఠినత్వాన్ని పొందుతాయి. తరువాత అది అండంగా మారుతుంది. గర్భంలో ఉన్న జీవికి ఒక నెలలో తల, రెండవ నెలలో చేతులూ మొదలైన అవయవాలు, మూడవ నెలలో గోళ్ళు, వెంట్రుకలు, చర్మం, మర్మావయవాలు, రంధ్రస్థానాలూ ఏర్పడతాయి. నాలుగవ నెల వచ్చేసరికి సప్తధాతువులూ, అయిదవ నెలలో ఆకలి దప్పికలూ, ఆరవ మాసంలో మావి చేత చుట్టుకోబడి, కుడిడొక్క తిరుగుతుంటుంది. ఆ విధంగా ఆకలి దప్పికలు పొందిన జీవి తల్లి గర్భంలోనే ఉండి, తల్లి తినే పదార్ధాలనే తనూ తింటూ, వృద్ధి చెందుతాడు.
మలమూత్రాలతో, దుర్వాసనలతో నిండి ఉండే తల్లి గర్భంలో శయనించి వుంటాడు. గర్భంలో ఉండే పురుగులు, శిశువును కుడుతూ ఉంటాయి. శిశువు శరీరం చాలా సుకుమారంగా ఉండటంతో, వాటి బాధను తట్టుకో లేక పోతాడు. తల్లి తినే ఉప్పుకారం, వేడి, పులుపు లాంటి పదార్ధాల వల్ల, తన అన్ని అంగాలూ ఎంతో బాధ పడతాయి. మావిచే చుట్టుకోబడ్డ శిశువు ప్రేగులతో వెలుపలి భాగమంతా ఆవరించబడి, నడుము, తల వంచుకుని, తల్లిగర్భంలో శయనిస్తాడు. పంజరంలో పక్షి వున్నట్టుగానే, జీవుడు మాతృ గర్భంలో కొలువుంటాడు. అలా గర్భంలోకి ప్రవేశించి రూపం పొందిన జీవుడు, పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి, ఎన్నో జన్మల నుంచీ తాను చేసిన పాపాలను తలచుకుని, చింతిస్తూ ఉంటాడు. సప్త ధాతువులతో పుట్టిన జీవుడు, గర్భంలోని నరక యాతన నుంచి విముక్తి కలగటం కోసం, ఒక మునిలాగా, తనను తల్లి గర్భంలోకి ప్రవేశ పెట్టిన భగవంతుడిని, దీనంగా ఇలా ప్రార్ధిస్తూ ఉంటాడు.
"విశ్వానికి ఆధారమైనవాడూ, లక్ష్మీ వల్లభుడూ, సకలజీవుల పాపాలనూ నశింపచేసేవాడూ, శరణన్న వారికి ఆపన్న హస్తాన్నందించే శ్రీహరిని శరణువేడుకుంటున్నాను. ఈ శరీరం మీదా, భార్యా పుత్రుల మీదా మాయా మోహంతో, అజ్ఞానంతో, ఇది నాది, ఇది నేనే అన్న అభిమానాన్నీ, అహంకారాన్నీ పొందాను ప్రభూ! నా కుటుంబ పోషణ కోసం, నా భార్యా బిడ్డలను సుఖపెట్టడం కోసం, ఎన్నో పాపకార్యాలను చేసి, ఎంతో సంపాదించాను. అయితే, నేను చేసిన పాప ఫలాలను నేను మాత్రమే అనుభవిస్తున్నాను కానీ, నా భార్యా బిడ్డలు నా పాపంలో భాగం పంచుకోవటం లేదు. స్వామీ! ఈ గర్భవాస నరకాన్ని భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ నరకకూపం నుంచి బైటపడెయ్యండి. మీ పాదకమలాలనే నిత్యం ధ్యానం చేసుకుంటాను. మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందే మార్గాన్ని ఆలోచించుకుంటాను. ప్రభూ! మలమూత్రాలతో నిండిన గర్భంలో చేరి, ఆకలిదప్పికలతో మలమల మాడిపోతున్నాను. గర్భంలోని ఈ యాతన నుంచి బైటపడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు బైటికి వస్తానో నాకు తెలియటంలేదు.
దీనుల మీద దయచూపే ఏ పరమాత్మ నాకీ పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ పరమాత్మనే తిరిగి ఈ సంసార కూపంలో పడవేయవద్దని వేడుకుంటాను. స్వామీ! ఒక్కోసారి నాకు ఈ గర్భం నుంచి బైటికి రాకూడదని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే! ఇప్పటికే ఈ గర్భంలోకి ప్రవేశించి, నరకాన్ని అనుభవిస్తున్నాను. జన్మించాక మళ్ళీ పాపాలు చేసి, నీ యందు భక్తి ప్రపత్తులు లేకుండా ఉండేకన్నా, ఈ గర్భవాసనరకం ఎంత బాధపెట్టినప్పటికీ నేనిక్కడే ఉండి, నీ పాదపద్మాలను నమ్ముకుని, ఎలాంటి కష్టాలూ లేకుండా గడిపేస్తాను. తిరిగి సంసార బంధనంలో చిక్కుకోకుండా, నా ఆత్మను ముక్తిపథం వైపు పయనించేలా చేసుకుంటాను." అని గర్భస్థ జీవుడు భగవంతుడిని వేడుకుంటాడు. ఈ విధంగా నవమాసాల పాటు గర్భంలో ఉన్న ఆ జీవుడు, ఒక మునీశ్వరుడిలాగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, అతడి బాధలు పోగొట్టటానికీ, తిరిగి కర్మఫలాన్ని అనుభవింపచేయటానికీ, ప్రసూతిగాలి వీచి, అతడు బైటికి రావటానికి వీలుగా, అధోముఖుడవుతాడు. ప్రసూతి ఘడియలు సమీపించగానే జీవుడు తల్లి గర్భం నుంచి యోనిమార్గం ద్వారా, అధోముఖంగా బయటికి వస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఎంతోబాధతో, తెలివి తప్పి, అతికష్టంగా బైటికి చేరతాడు. మలంలో ఉండే పురుగులా భూమిమీద పడ్డ జీవుడు, అప్పటిదాకా వున్న పూర్వజన్మ జ్ఞానం నశించగా, అటు ఇటు కొట్టుకుంటూ ఏడుస్తాడు.
గరుత్మంతా! గర్భంలో ఉన్నప్పుడూ, అనారోగ్యం కలిగినప్పుడూ, శ్మశానంలో ఉన్నప్పుడూ, పురాణ కథనాలు విన్నప్పుడూ కలిగిన వైరాగ్యం గనుక మానవులకు స్థిరంగా ఉంటే, వారికి మరలమరల సంసార బంధనాలలో చిక్కుకునే దుర్గతి కలుగదు. కర్మ ఫలాలను అనుభవించిన తరువాత గర్భం నుంచి బైటికి వచ్చిన వెంటనే, ఆ జీవుణ్ణి విష్ణుమాయ మోహింపచేస్తుంది. విష్ణుమాయతో ఆవరించబడిన జీవి భూమి మీదకు రాగానే, ఏ విధమైన జ్ఞానమూ లేకుండా, అలా నిశ్చలంగా ఉంటాడు. అతడికి ఏమీ చెప్పగలిగే సామర్థ్యం ఉండదు. అలా పుట్టిన తరువాత ఊహ వచ్చేంత వరకూ, నరకాన్నే అనుభవిస్తాడు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే, కడుపునొప్పి వచ్చిందేమో అనుకుని మందు వేస్తారు. నిజంగా కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంటే, ఆకలేసిందేమోనని పాలు తాగిస్తారు. ఇలా విరుద్ధంగా జరుగుతున్నప్పటికీ, శిశువుగా వున్నజీవుడు తానేదీ చెప్పగలిగే స్థితిలో ఉండడు. ఆ విధంగా జీవుడు నాలుగైదు సంవత్సరాలు వచ్చేవరకూ, బాల్య సంబంధిత దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. తరువాత కౌమార వయసులో విద్యాభ్యాసం లాంటి బాధలు పడతాడు. యౌవనదశలో దర్పాన్నీ, అహంకారాన్నీ పొంది, రాక్షస గుణాలు కలిగినవాడౌతాడు. యౌవన ప్రాయంలోకి చేరిన మానవుడు, జూదం, సురాపానం లాంటి వ్యసనాల చేత మోహింపబడి, ఇంద్రియనిగ్రహాన్ని కోల్పోయి, నిప్పులలో పడ్డ మిడతలాగా, మోహంలో పడి కొట్టుకుంటాడు.
గరుత్మంతా! లోకంలో లేడి, ఏనుగు, పక్షి, తుమ్మెద, చేప అనే ఈ అయిదు జంతువులూ, ఒక్కొక్కటీ ఒక్కో విషయం మీద తీవ్రమైన కోరిక ఉండటంతో, చెడిపోతున్నాయి. అయితే, మానవుడొక్కడే, వివేకశూన్యుడై, చర్మం, చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు అనే అయిదు ఇంద్రియాలకు వశమైపోయాక, ఇక చెడిపోకుండా ఎలా ఉంటాడు? ఇలా అత్యంత దుర్లభమైన మానవజన్మను పొందికూడా, ఎలాంటి సత్కర్మలూ ఆచరించకుండా, విషయ వ్యామోహంలో చిక్కి, తన జీవితాన్ని నశింపచేసుకునే మూర్ఖుడికన్నా పాపాత్ముడు, మరొకడుండడు. గరుత్మంతా! ఈవిధంగా పాపాత్ములు కర్మ అనే పాశంతో చుట్టబడి, నా విష్ణుమాయలో చిక్కుకుని, జన్మ తరింపచేసుకునే మార్గం తెలుసుకోలేక, వైరాగ్య భావం కలగక సంచరిస్తూ ఉంటారు. విషయాల మీద మమకారాన్ని పెంచుకుని సంచరిస్తే, తన చేతిలో ఉన్న అమృత కలశాన్ని జారవిడిచినవారే అవుతారు. ఈ విషయాన్ని గ్రహించక జీవితాన్ని వ్యర్ధంగా, దుర్వ్యసనాలతో, వ్యామోహాలతో గడిపిన మానవుడు, శ్లేష్మవ్యాధులతో కూడిన వార్ధక్యాన్ని పొంది, ఎన్నో బాధలు పడుతూ, చివరికి మరణించి, మళ్ళీ పూర్వంలాగానే నరకానికి చేరుకుంటాడు." అని శ్రీ మహా విష్ణువు గర్భంలో జీవి అనుభవించే బాధలను గరుడుడికి వివరించాడు.
జీవి గర్భంలో పడినది మొదలు, జీవంలేని శరీరం మన్నులో కలిసిపోయేదాకా, ఏదో ఒక రూపంలో బాధను అనుభవించాల్సిందే. ఈ నలభైనాలుగు లక్షల జీవరాశులలో, మానవ జన్మ మరీ దుర్లభం. అందుకే ఈ నరజన్మను అందరూ సార్ధకం చేసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలు చేపట్టి, జీవితాన్ని తరింప చేసుకోవాలి.
సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!
Comments
Post a Comment