లలాట లిఖితం! ..మంచి కథ If Death Occurs in 7 days - Real Incident of Sant Eknath
లలాట లిఖితం! ..మంచి కథ
ఇంకో వారంలో చనిపోతాడని తెలిసిన ఆ మనిషి ఏం చేశాడు? ..జీవిత సత్యాలు!
మన హిందూ పురాణాలలోనూ, చరిత్ర పుటలలోనూ మంచి కథలు అసంఖ్యాకం. వాటిలో కొన్ని మనోల్లాసానికీ, ఇంకొన్ని మనో వికాసానికీ ఉద్దేశింపబడినవయితే, మరికొన్ని సన్మార్గ జీవనానికి తోడ్పడతాయి. కారుణ్యం, దయ, పరోపకారం, త్యాగం, సత్యనిష్ఠ, నిస్వార్థత వంటి సద్గుణాలు, మానవుణ్ణి ధర్మపథం వైపుకు నడిపించి, అంతిమంగా భగవంతునికి చేరువ చేస్తాయి. అటువంటి సద్గుణాలను పెంపొందించే స్ఫూర్తిదాయక కథలలో ఒకదానిని, ఈ రోజుటి మన వీడియోలో చెప్పుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C-3v8R8fZQQ ]
మహారాష్ట్ర ప్రాంతంలో జీవించిన మహాత్ముడూ, భక్తాగ్రగణ్యులలో ఒకరు, సంత్ ఏక్‌నాథ్ గా ప్రసిద్ధి చెందిన ఏకనాథుడు. ఆయన ఘనతను గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఒక వ్యక్తి, ఒక రోజు ఆయనను దర్శించుకోవడానికి వచ్చాడు. ఏకనాథుడు గడుపుతున్న నిరాడంబర జీవితాన్ని చూసి, అతడు ఆశ్చర్య చకితుడయ్యాడు. ఏకనాథుడి ముఖారవిందాన ద్యోతకమవుతున్న దివ్యత్వం, తేజస్సునూ గమనించి, ఆయన పట్ల అమితంగా ఆకర్షితుడయిన అతను ఆయనతో, “స్వామీ! మీ జీవితంలో ఎంతో ప్రశాంతతను చూస్తున్నాను. ఎటువంటి ఆరాటమూ, ఆందోళనా లేకుండా, నిర్మలమైన నీటిప్రవాహంలా మీరు ఎలా మనగలుగుతున్నారో అర్ధం కావడం లేదు! నిరాడంబరతకూ, పావనతకూ మీ జీవితం అద్దంపడుతోంది. కానీ, ప్రాపంచికులమైన మేము, జీవితంలో సదా అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్నాము. ప్రశాంతత మూర్తీభవించిన మీ జీవితం ఎక్కడ? సదా అల్లకల్లోలాలతో నిండిన మా జీవితం ఎక్కడ? మన జీవన విధానాలలో హస్తిమశకాంతర వ్యత్యాసం ఉంది. సమస్యలతో మీ మనస్సు ఎన్నడూ గురయినట్లు తెలియడం లేదు. కానీ, మమ్మల్ని గందరగోళంలో ముంచెత్తే పగ, విసుగు, అహంకారం వంటి దుర్గుణాలు, సదా పట్టి పీడిస్తున్నాయి. మీలాంటి ప్రశాంతమయమైన జీవితం మాకు లభించడం సాధ్యమా? నేనూ మీలా జీవించాలని అభిలషిస్తున్నాను. అందుకు ఏమైనా తరుణోపాయం ఉంటే సెలవివ్వండి స్వామీ!” అని విన్నవించుకున్నాడు.
అతడు చెప్పినది సావధానంగా విన్న ఏకనాథుడు, క్షణం ఆలోచించి ఇలా జవాబిచ్చాడు.. “నాయనా! నువ్వు ఇప్పుడు చెప్పినదంతా అలా ఉంచు. నీ లలాట లిఖితం ఇప్పుడే గమనించాను. వెంటనే నీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. నీకు మరణ కాలం సమీపిస్తోంది. ఇంకో వారం రోజులలో నువ్వు మరణిస్తావు!” ఏకనాథుడి వంటి మహనీయుడి నోటివెంట వచ్చిన ఆ మాట వినగానే, అతడి గుండె ఝల్లుమన్నది. మరణానికి చేరువలో ఉన్నాననే చింతన అతడి మనస్సును సంపూర్ణంగా ఆక్రమించింది. ఆ కారణంగా ఆతడి మనోస్థితిలో అసాధారణమైన పెను మార్పు చోటుచేసుకుంది. ఆ పైన అతడిక ఏకనాథుడితో ఏమీ మాట్లాడలేకపోయాడు. 'అయ్యో! వారం రోజులే మిగిలి ఉన్నాయి. ఏడు రోజుల్లో నేను మరణించబోతును? అని తనలో తను గొణుక్కుంటూ, ఇంటిముఖం పట్టాడతను.
ఇంటికి వెళ్ళగానే, అనురాగం ఉట్టిపడుతుండగా, భార్యను చేరబిలిచి, ఆమెతో ఇలా అన్నాడు.. “నేను నిన్ను ఎన్నో రకాలుగా కష్టపెట్టాను. అవన్నీ తలచుకుని ఎంతగానో విచారిస్తున్నాను. నన్ను క్షమించు. ఇంకో వారం రోజులలో, నా జీవితం ముగియబోతోంది. ఇంతవరకూ అనవసరమైనవన్నీ మాట్లాడి నీ మనస్సును నొప్పించినందుకు పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నా తప్పులను మన్నించు.” అని కన్నీటి పర్యంతం భార్యతో చెప్పుకుని, తరువాత తన పిల్లలను పిలిచి, వారిని గుండెలకు హత్తుకున్నాడు. “నాయనలారా! ఇప్పటికైనా మిమ్మల్ని అక్కున చేర్చుకున్నాను. మీపై అనవసరంగా కోపించి, ఎన్నోసార్లు కొట్టాను, తిట్టాను. నా కథ ఇక వారం రోజులలో ముగిసిపోతుంది. మీ పట్ల నేను వ్యవహరించిన తీరును తలచుకుని కుమిలిపోతున్నాను. నన్ను మీరందరూ మన్నించండి” అని అన్నాడు గద్గద స్వరంతో.
తరువాతి పనిగా అతడు ఇరుగుపొరుగు, మిత్రులు, బంధువుల వద్దకు వెళ్ళి, తన మరణకాలం సమీపించినదని నిర్లిప్తంగా తెలిపి, ఇదివరలో తను ఎవరెవరితో దెబ్బలాడి గొడవపడ్డాడో, వారందరినీ కలుసుకుని, “అయ్యా! గతంలో మీ పట్ల నేను ప్రవర్తించిన తీరుతెన్నులను తలచుకుని సిగ్గుతో కుంచించుకుపోతున్నాను. ఇక వారం రోజులే నేను బతికి ఉంటాను. ఇంకో ఏడు రోజులలో నా జీవితం అస్తమించబోతోంది. మీతో గొడవ పడినందుకు నన్ను మనస్పూర్తిగా క్షమించండి” అని వారితో చెప్పాడు. ఈ విధంగా, తన అనుచిత చర్యల మూలంగా ఇబ్బందులకు గురైన వారిని కూడా పని కట్టుకుని కలుసుకుని, తన మరణకాలం గూర్చి తెలిపి, తనను క్షమించమని వారిని వేడుకున్నాడు. ఇలా రోజులు గడిచి, ఏడవ రోజు రానే వచ్చింది.
ఆశ్చర్యం! ఆ రోజు అతడి ఇంటికి ఏకనాథుడు విచ్చేశాడు. ఆయనను చూడగానే, అతడు సాష్టాంగ నమస్కారం చేసి, “స్వామీ! నా మరణకాలం వచ్చేసిందా?” అని అడిగాడు ఆతృతగా. ఆ ప్రశ్నకు ఏకనాథుడు ఇలా స్పందించాడు.. “దానిని గూర్చిన నిజం ఆ భగవంతునికే ఎరుక. అది సరే.. నిన్నొక ప్రశ్న అడగాలి. ఈ ఏడు రోజులనూ నువ్వు ఎలా గడిపావో నాకు చెప్పు. ఎందరిని తిట్టావు? ఎందరితో గొడవపడ్డావు? ఎందరి మనస్సులను నొప్పించావు? ఎందరిని అవమానించావు?” అని అడిగాడు. ఆ ప్రశ్నలు విని తెల్లమొహం వేస్తూ, అతడు ఇలా జవాబిచ్చాడు.. “స్వామీ! ఈ ఏడు రోజులూ మరణమే నా కళ్ళ ముందు తాండవించింది. ఈ స్థితిలో ఒకరిని తిట్టడమూ, మరొకరితో గొడవ పడటమా? అందుకు నాకు సమయం ఎక్కడిది? నేను గతంలో గొడవపడ్డ అందరి వద్దకూ వెళ్ళి, నా తప్పిదాన్ని పెద్ద మనస్సుతో మన్నించమని వేడుకున్నాను. మిమ్మల్ని కలుసుకుని మాట్లాడిన క్షణం నుండీ, ఈ క్షణం దాకా ఏ విధమైన గొడవల జోలికీ పోలేదు. ఈ ఏడు రోజులూ మంచిగా, ప్రయోజనకరంగా గడిపాను.” అని చెప్పాడు.
అతడు చెప్పినది విన్న తరువాత, ఏకనాథుడు ఇలా చెప్పసాగాడు.. “నాయనా! ఈ విచిత్రాన్ని గమనించావా? గత ఏడు రోజులుగా నువ్వు మరణాన్నే తలచుకుంటూ ఉండిపోయావు. ఆ కారణంగానే, మంచిగా, ఇతరులకు ప్రయోజనకరంగా జీవించావని తెలుస్తోంది. మా వంటి వారి స్థితి ఏమిటో తెలుసా? మేము మా జీవిత పర్యంతం, ప్రతి క్షణమూ, సదా, సర్వవేళలా మరణాన్నే జ్ఞప్తిలో ఉంచుకుని జీవితం గడుపుతాము. అందుకే మేము ప్రశాంతంగా జీవించగలుగుతాము. మనం ఈ దేహంలో ఎంత కాలం జీవిస్తాము? జీవితంలో ఏం జరుగబోతుందో నిశ్చయంగా తెలియదు. కానీ, మన ఈ దేహం త్వరలోనో, లేక కొంతకాలం గడిచిన తరువాతనో, ఏదో ఒక రోజు నశించి మట్టిలో కలిసి పోవడం మాత్రం తథ్యం. కనుక మనం, నశించిపోయే దేహం పట్ల అనురక్తీ, లేక అనుబంధం కలిగి ఉండకుండా, నాశ రహితమైన భగవంతుని పట్ల అనురక్తి వహించి జీవించాలి. అంటే, ఏ స్థితిలోనూ, మనం దేహానికి బానిస కాకుండా, భగవంతునికే దాసునిగా మనగలగాలి. పరుల పట్ల పగ వహించకుండా, వారి పట్ల ప్రేమను పెంచుకుని జీవించాలి. మనసా, వాచా, కర్మణల యందు ధార్మికత భాసించాలి. ఇతరుల మనస్సు నొచ్చుకునే రీతిలో ససేమిరా మాట్లాడకూడదు. మనసా, వాచా, కర్మణా, ఏ ఒక్కరినీ నొప్పించని రీతిలో, మధురంగా మాట్లాడి, నిస్స్వార్ధతతో, ప్రేమతో సేవలందించాలి.
మన వద్ద ఉన్న దానిని, ముఖం చిట్లించుకోకుండా, వికసిత వదనంతో, అవసరం ఉన్న వారికి ఇవ్వాలి. దీనిని గురించి బాగా ఆలోచించు. మన ప్రతిభా, మన దగ్గరున్న వస్తువులూ మనవి కావు. అవన్నీ భగవంతునికే సొంతం. భగవంతుడు మనలను ఒక ఉపకరణగా ఉపయోగించి, ఇతరులకు అందించడానికే, వాటిని మనకు ఇచ్చాడని తెలుసుకుని, ఇతరులకు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. భగవంతుడు, తనకు సొంతమైన వస్తువులను మన వద్ద ఉంచినప్పుడు, వాటిలో ఒక పాలు, మన వద్దకు వచ్చే ఆయన బిడ్డలకు లేదని చెప్పడానికి, మనకు ఎలాంటి హక్కూ లేదు. భగవంతునికి చెందిన వస్తువును, ఆయన బిడ్డలకే ఇవ్వ నిరాకరించడం న్యాయమా? భగవంతుని పట్ల భక్తిప్రపత్తులు చెల్లించే మనం, ఆయన బిడ్డల యెడ అభిమానం చూపక, ద్వేషించటం సబబు అనిపించుకుంటుందా? నశించిపోయే ఈ దేహాన్ని, ఇతరులకు ఉపయోగపడే కార్యకలాపాలలో వినియోగించాలి. మెరుపులా మన దేహంలోనుంచి జీవం మాయమయ్యే లోపుగా, భగవంతుని ప్రాప్తించుకోగోరిన ఏ కొద్దిమందికో, ఏ విధంగానైనా దోహదపడగలిగితే, అది ఎంత ఘనతరం! నీటి బుడగ వంటి దేహంతో కూడిన జీవితం అంతరించే లోపుగా, ఏ కొద్దిమందికైనా, ఏ కించిత్తయినా ఉపయోగ పడగలిగితే, ప్రశాంతతనూ, సాంత్వననూ అందివ్వగలిగితే, అదే స్తుతినీయం. జన్మించినప్పుడే మరణమూ నిశ్చయమై వుంటుంది. కనుక అది సంభవించే లోగా, భగవంతునికీ, లోకానికీ సేవలు చేస్తూ జీవించటమే, మన జన్మకు సార్థకత.”
ఏకనాథుడు చేసిన ఉపదేశాన్ని అతడు అమిత శద్ధగా విని, చక్కగా ఆకళింపు చేసుకుని, తన శేష జీవితంలో తు.చ. తప్పక ఆచరించి, జీవితాన్ని సార్ధకం చేసుకుని, తరించాడు.
ధర్మో రక్షతి రక్షితః
Comments
Post a Comment