Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు
మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు
మనం పుట్టింది ఎందుకు? చేస్తున్నదేమిటి? అసలు చేయాల్సిందేమిటి?
పుట్టిన ప్రతి జీవీ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. భగవంతుడు నిర్ణయించిన జనన మరణ చక్రంలో, ఆత్మ నిరంతర ప్రయాణం అనివార్యం. ఇది ఎవ్వరూ విస్మరించకూడని సత్యం. మన పురాణాల ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, తన శరీరాన్నీ, కుటుంబ సభ్యులనూ చూసి విచారిస్తుంది. ఆ తరువాత ఇహలోక బంధాలను వీడి, తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరణించిన తర్వాత ఆత్మలు మళ్ళీ మరో జన్మ తీసుకునే దాకా, ఒక్కోసారి ఈ క్రమంలో, కొన్ని వందల సంవత్సరాల తరువాత మళ్ళీ జన్మనెత్తుతాయి. మరి అటువంటి ఆత్మలు ఆ సమయంలో ఏం చేస్తాయి, ఎక్కడ ఉంటాయి? అనేది, చాలా మందికి కలిగే సందేహం! ఇటువంటి విషయాలు కొంత భయాన్ని కలిగించడం సహజమే.. కానీ, ఇటువంటి విషయాలే, మన జీవితాలను స్వార్ధపూరితం కాకుండా కాపాడి, సన్మార్గంలో నడిపించడానికి దోహద పడతాయి. ఈ మధ్య కొంతమంది టైటిల్ ను మాత్రమే చూసి కామెంట్ చేయడం, చిన్న చిన్న పొరపట్లను ఎత్తి చూపడం గమనించాను. దీని వలన అందరూ సన్మార్గ జీవనాన్ని అవలంభించాలనే సదుద్దేశం మరుగునపడి, నా ప్రయాస వ్యర్ధమైపోతుంది. అందరికీ మనస్ఫూర్తిగా నేను చేసుకునే విన్నపం, ప్రార్ధన.. వీడియోలో దొర్లే అచ్చుతప్పులను మన్నించి, చివరిదాకా చూసి, విషయాన్ని ఆకళింపుచేసుకుని, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/18lDmSF9Z2M ]
ఈ భూమి మీది కాలగణనను అనుసరించి, 24 గంటలను ఒక రోజుగా పరిగణించే విషయం తెలిసిందే. చనిపోయిన వారు, అంటే పితరులు నివసించేది, పితృలోకం. వీరికి శుక్ల పక్షం అంటే, 15 రోజుల కాలం ఒక పగలు కాగా, కృష్ణ పక్షం అంటే, మరో 15 రోజులు ఒక రాత్రి. వెరసి మనుషులు గడిపే ఒక మాసం, పితరులకు ఒక రోజుతో సమానం. పుట్టిన ప్రతి ప్రాణీ, ముందుగా ఈ పితరుల లోకాన్ని చేరి, అక్కడ తమ వారసులు తమకు జరిపే కర్మకాండలనూ, వాటి ఫలితాలనూ అనుభవిస్తుంది. ఇక అటుపైన ఉండేది, దేవలోకం. భూమి మీద మనుష్యుల లెక్కన ఆరునెలలకు ఉత్తరాయణం, మరో ఆరునెలలకు దక్షిణాయనంగా చెప్పబడుతుంది. మనం గడిపే ఈ పన్నెండు నెలలు, దేవలోకంలో ఉండేవారికి ఒక రోజుతో సమానం. అంటే, ఒక పగలు, ఒక రాత్రి అన్నమాట. పుణ్య కర్మలు చేసిన వారికి మరణానంతరం, దేవలోకం దక్కుతుంది. వారు చేసుకున్న కర్మ ఫలితానుసారం, అక్కడ స్వేచ్ఛగా, సుఖ సంతోషాలతో, ఆట పాటలతో, విందు భోజనాలతో, విలాసవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవించి ఉండగా వారు సంపాదించుకున్న కర్మఫలాలు పరిపక్వం చెందగానే, అంటే, మన లెక్కలో, ఖర్చులకు మనం తెచ్చుకున్న పుణ్యఫలం అనే డబ్బు అయిపోగానే, తిరిగి భూలోకంలో మంచి స్థితిమంతులూ, ఆచారవంతుల ఇళ్ళలో పుట్టిస్తాడు, కర్మ, కాలంగా చెప్పుకునే విధాత. తిరిగి ఈ జన్మలో కూడా పుణ్య కార్యాలనూ, నిత్య దైవ నామ స్మరణనూ ఆచరిస్తే, దివ్యదేహధారులై, దివ్యలోకాలకు చేరుతాయి జీవాత్మలు. ప్రతి మనిషీ ప్రయత్నించవలసినది ఈ గమ్యం చెరడానికే..
ఇక పాపకర్మలచేత మూటగట్టుకున్న పాపధనంతో నరకలోక యాత్ర అయిపోగానే, వారిని క్రమికీటకాలుగానూ, కౄరజన్ములుగానూ, లేదా వారు ఇదివరకూ ఎవరినైతే హింసపెట్టారో, తిరిగి వారి చేతుల్లోనే, అంతకు పదిరెట్లు హింస పొందే విధంగా, కాలం, కాలపురుషుడిగా చెప్పుకునే యముడు, అత్యంత కఠోరమైన శిక్షలను విధింపజేస్తాడు. ఇక్కడ మనం గుర్తుంచుకో వలసిన విషయం, పుణ్యాత్ములకైనా, పాపాత్ములకైనా కర్మఫలాలను ఖరారు చేసేది, కేవలం వారి కర్మలే. వాటిని మనచేత అనుభవింపజేసిది, కాలమే. ఇది ఖచ్ఛితమైన విధానంలో ఉంటుందని, పురాణ విదితం.
ఇక కాలం తీరకుండా బలవన్మరణం పొందిన వారు, అంటే, ఆత్మ హత్యలవంటివి చేసుకున్న వారి ఆత్మలు పిశాచాలై, చెట్లనూ, గుహలనూ, శిధిలాలనూ ఆవాసంగా చేసుకుని, కాలం పిలుపు అందేవరకూ అలాగే, భూమి మీదే నకారాత్మక శక్తులుగా తిరుగుతుంటారు. మరికొన్ని ప్రేతాత్మలు, వారి ఆత్మీయుల శాప వచనాలతో, మరింత కాలం ఈ భూమి మీదే అదృశ్యరూపంలో తిరుగుతూ, భూత, రాక్షస రూపాలతో, రాత్రి రెండు ఝూములు దాటిన తర్వాత, కొన్ని ప్రాణులకూ, కొంతమంది మానవులకూ హాని కలిగిస్తూ మరి కొన్ని కర్మ ఫలాలను మూటగట్టుకుంటూ ఉంటాయి..
ఇక మరణం తరువాత ఏమిటనే విషయానికి వస్తే, మనం మనకు ఈ స్థూలశరీరం ఉన్నంతవరకూ, దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా, నేను ఇంకా బ్రతికే ఉంటానని అనుకుంటూ, కాలయాపన చేస్తూ ఉండిపోతాము. కొందరయితే, ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందనీ, మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకు వెళ్లి ఉంటారనీ, ఇలా ఎన్నెన్నో ఊహాగానాలు చేస్తూ ఉంటారు. కానీ, నిజంగా ఏం జరుగుతుందని మాత్రం, ఎవ్వరికీ తెలియదు. మరణం తరువాత ఏమిటన్న ఈ సందేహానికి జవాబు, "కఠోపనిషత్తు" లో స్పష్టంగా తెలియజేయబడింది.
కఠోపనిషత్తులో ప్రస్థావించబడిన నచికేతుడు, యమధర్మరాజును మూడు వరాలడిగాడు. వాటిలో ఒకటి, మరణం తరువాత ఏం జరుగుతుందనేది..! అప్పుడు యమధర్మరాజు నచికేతుడితో, అది చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి, అది కాక ఇంకేదైనా వరం కోరుకోమని అన్నాడు. కానీ, నచికేతుడు పట్టుబట్టి, తనకు మృత్యువు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందన్నాడు. అప్పుడు యమధర్మరాజు నచికేతుడికి, సనాతనమయిన బ్రహ్మాన్ని గురించీ, చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందనే విషయాలను గురించీ చెప్పడానికి అంగీకరించాడు. యమధర్మరాజు చెప్పినట్లు, ఇది చాలా సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుండీ, భౌతిక పరమైన పనులలో తలమునకలై, కాలం వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే, తను ఏం సాధించాలి? తానెందుకు పుట్టాడు? అని మాత్రం ఆలోచించడు. మంచి జీవితం, అందమైన భార్యా పిల్లలు, వారి పోషణ, ఆస్తిపాస్తుల సముపార్జన, వీటితోనే సతమతమవుతూ, తాను ఎందుకు పుట్టాడో తెలుసుకునేంత తీరిక కూడా లేకుండా గడిపేస్తాడు. కానీ, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతి జీవినీ ఎదో ఒక రోజు మృత్యువు పలుకరించక మానదు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా సంభవించే ఈ కఠోర సత్యాన్ని గమనించే పరిస్థితులలోనూ ఉండము.
తల్లి గర్భం నుండి బయట పడేటప్పుడు, వెంట తెచ్చుకున్న పాప పుణ్యాలను నిర్మూలించుకుంటే, ఆత్మ పరమాత్మునిలో ఐక్యమవుతుంది. లేకపోతే, కర్మల అనుసారంగా ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు చేసి వుంటే స్వర్గానికీ, లేక దుష్కర్మలు చేసి వుంటే నరకానికీ వెళుతుంది. ఈ ప్రక్రియ అనివార్యం. ఒకవేళ శరీరంతో ఉన్నప్పుడు, భగవద్ జ్ఞానాన్ని గ్రహించి, కొద్దోగొప్పో తెలుసుకుని వుంటే, మరల మనిషి జన్మ లభిస్తుందనే విషయంలో, ఎటువంటి సందేహం లేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జుడికి వివరించాడు. అట్లా కాక, సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి, మనస్సునూ బుద్దినీ అదుపులో వుంచుకుని, యోగాన్ని అవలంభించి, అన్ని కర్మలనూ తొలగించుకుని విముక్తుడయితే, అతడి ఆత్మ ఆ పరంధామునిలో ఐక్యమౌతుంది. కానీ, మన కర్మలన్నీ నశించిపోయాయో లేదో మనకు తెలియదు. కాబట్టి, మనం ఈ స్థూల శరీరాన్ని ధరించి ఉండగానే ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే, మనకు మరల జన్మలు రావని నిశ్చింతగా ఉండాలంటే, దానికి మనం చేయవలసిన పని, ధ్యాన సాధన. ధ్యానం చేసి, ఆ భగవంతుడిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మార్గము. అప్పుడు మనకు తెలియని విషయమంటూ, ఈ లోకంలో ఏదీ ఉండదు. మన గురించీ, దేవుడి గురించీ, ఈ ప్రకృతి గురించీ, అసలు మనుష్యులను ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సును గురించీ, మనకుండే ప్రతి సందేహమూ తీరిపోతుంది. మనస్సనేదే లేదనే విషయం తేటతెల్లమై, అది ఒక భ్రమ అని తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే, అందరూ చేయవలసిన పని, ఆ పరమాత్మను హృదయంలో దర్శించుకోవడమే. ఈ విధంగా మరణించిన తరువాత, వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి, మరు జన్మ అనేది, వారి మీదనే ఆధారపడి వుంటుంది.
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ।
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ।।
మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భమున శయనిస్తూ, ఈ సంసారమును దాటలేక, నానా బాధలకూ గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము.
ఈ సంసార సాగరంలో చిక్కి, మాయా మొహమనే అంధకార బద్ధులమైన మనకు, పుట్టడం, చనిపోవడం, మళ్ళీ తల్లి గర్భంలో తొమ్మిది నెలల వాసమనే సుడిగుండంలో, జన్మలకు జన్మలు గడుపుతున్నాము. ఈ అపార దుఃఖ సంసార సాగారంనుండి బయటపడే మార్గం కనిపించక, శోకచిత్తులమైన మనకు, శ్రీహరి పాదారవిందములు తప్ప, వేరే మార్గం లేదు. మన ప్రయత్నంగా, అపారమైన భక్తితో శ్రీహరిని ధ్యానిస్తూ, జ్ఞాన వైరాగ్య సాధనలతో, భక్తి తత్వము తెలుసుకుని, శరణాగతితో శ్రీహరి కరుణకు పాత్రులమవ్వాలి. అంతకు మించి ఈ మాయను ఛేదించి, జనన మరణ సుడిగుండం నుండి బయటపడే వేరే మార్గమే లేదు. జ్ఞాన వైరాగ్యములు తత్వ సాధనకు సరియైన మార్గాన్ని తెలుపుతాయి. కానీ, వాటి వలన మాత్రమే మోక్ష ప్రాప్తి చేకూరదు. మోక్ష ప్రాప్తికి అవి రెండు ఉపకరణములు మాత్రమే. దానికి అనువైన సాధనము, భక్తి. శరణాగతితో కూడిన భక్తితో, భగవంతుని కరుణను పొందవచ్చు. ఇలా పరమాత్మ దయను పొందగలిగితే, మోక్షం చాలా సులభసాధ్యమౌతుంది.
అందరూ భగవద్ తత్వాన్ని గ్రహించి, ఆయనను నిరంతరం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ, ఆ దేవదేవుడిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే, మనిషి పుట్టుక యొక్క అంతిమ లక్ష్యం.. ఇదే గమ్యం, ఇదే నిత్యం, ఇదే శాశ్వతం..
శుభం భూయాత్!
Comments
Post a Comment