సన్మార్గ జీవనం! Sanmarga Jeevanam
సన్మార్గ జీవనం!
మనిషి జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి, సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటు పడటమే సన్మార్గం. స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడం, దుర్మార్గమవుతుంది. సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటూ వుంటాడు. అనునిత్యం ఆత్మవిమర్శ చేసుకుంటూ, ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తుంటాడు.
ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఈ సమాజంలో మిగతావారు ఎలా ఉన్నా, మనవరుకూ మనం ఎలా ఉన్నామన్నదీ, మనం ఏం చేస్తున్నామన్నదీ మాత్రమే ముఖ్యం. పవిత్రమైన కమలం పుట్టేది బురదలోనే అయినా, తన తేజస్సును కోల్పోదు, కోమలత్వాన్ని వీడదు. మనిషి కమలాన్ని చూసి ప్రేరణ పొందాలి. సన్మార్గంలో సాగే మనిషి, సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందగలడు. మానవత్వం వల్లనే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే మనిషి, భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మను సద్వినియోగ పరచుకుని, అందరికీ సహాయం చేసే స్థాయికి ఎదగాలని పెద్దలంటారు.
మరుజన్మ ఉన్నదో లేదో, గత జన్మ ఎలాంటిదో తెలియనప్పుడు, ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను, ప్రతి మనిషి సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. కనీసం తనచుట్టూ ఉన్నవారిని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మనిషి సన్మార్గం వైపు ప్రయాణించడం మొదలుపెడితే, చెడుమార్గం వైపు కన్నెత్తి కూడా చూడడు. సత్ కార్యాలు చేస్తూ ముందుకు సాగిపోతుంటాడు.
అలనాడు దారి దోపిడీలు చేసి బ్రతికిన రత్నాకరుడనే బోయవాడు, నారద మహర్షి ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ఎదిగాడు. సర్వలోకాలకూ మార్గదర్శకం, ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు. రాజభోగాలను అనుభవించిన సిద్ధార్థుడు, అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంభించి, జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. మహా బోధకుడిగా మారి, అమరుడయ్యాడు.
శ్రేష్ఠులైనవారు దేనిని ధర్మంగా భావించి ఆచరిస్తారో, సజ్జనులూ దానినే ఆచరిస్తారని బోధించాడు, శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానులూ, మహాత్ములూ, సన్మార్గాన్ని అనుసరించి చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించి, కీర్తి శిఖరాలను చేరుకోవాలి. ఉదాహరణకి, పరమ శివభక్తుడైన రావణ బ్రహ్మ, స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి అధోగతిపాలయ్యాడు. అలాగే, వివేకం కోల్పోయి, బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల, కురువంశ నాశనానికి కారకుడయ్యాడు, దుర్యోధన సార్వభౌముడు.
మనిషి దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం అవసరంలేదు. కానీ మంచివాడిగా, ఉత్తముడిగా గుర్తింపు పొందడానికి మాత్రం చాలా కాలం పడుతుంది. అయినా, తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. సన్మార్గమే మనిషికి నిజమైన సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా, అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి ఎంత సంపద ఉన్నా, అవి ఎందుకూ కొరవడవన్నది, నీతికోవిదుల మాట.
చూసిన ప్రతిదానినీ ఆశించడం, ఆశించినదానికోసం ప్రాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం.. ఇవన్నీ మనిషిలోని అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపించి, అతడి పతనానికి కారణమవుతాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుంటూ, స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి. సన్మార్గం మనిషికి సుఖశాంతులను ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనస్సులు కడిగిన ముత్యాలలా నిర్మలంగా ఉంటాయి. వారు అందరితోనూ మృదు మధురంగా మాట్లాడతారు. కలిమిలోనూ, లేమిలోనూ నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించే మనిషి, మనీషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి, ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మంచి బాటలో నడిచే మనిషికి, ఒక్కోసారి ఆలస్యమైనా, దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం.
ధర్మో రక్షతి రక్షితః
Comments
Post a Comment